ఎంత బావుంటుందో కదా జీవితం లో కూడా రివైండ్ బటన్ ఉంటె…!
చివరి శివరాత్రి కి ఇంటికి(హన్మకొండ) కి వెళ్ళినప్పుడు చాల రోజులవుతుందని మెడలో కెమెరా తగిలించుకొని వేయిస్థంబాల దేవాలయానికి వెళ్ళాను.
చిన్నప్పుడు అంటే పదో తరగతి టైం లో ఒక రోల్ కెమరా ఉండేది ఇప్పటి లాగే ఎప్పుడు నా చేతిలో..
ఒకసారి మెదడులో చిన్న ఆలోచన పుట్టింది అంతే మరో నిమిషంలో దాన్ని విప్పి పక్కన పెట్టాను.
కానీ తర్వత తెలియలేదు మళ్లీ ఎలా సరి చేయాలో.. ఆ తర్వత అన్నయ్య తో గొడవ తర్వత కెమెరా రిపైర్ అవడం చక చక జరిగిపోయాయి. అప్పటి జ్ఞాపకమే మళ్లీ మన వేయి స్థంభాలా దేవాలయం లో కళ్యాణ మండపానికి బదులు ఇసుకను చూస్తే గుర్తోచింది..
అప్పుడనిపించింది అమాయకమైన చిలిపి పనులు పిల్లలే కాదు పెద్దలు కూడా చేస్తారని.
ఎంతో అద్వితీయమైన శీలా నైపుణ్యం కళ్ళ ముందే నెల మట్టం చేయడం లో శస్త్రవెత్తలు సఫిలిక్రుతులయ్యారు..
కానీ ఎం లాభం ? ఎంతో చరిత్ర కలిగిన చారిత్రాత్మకమైన కట్టడం ఇక స్కూల్ పుస్తకాలలో చరిత్రలాగా మిగిలింది..
చిన్నపుడు అప్పుడు నేను ఐదో తరగతి. వారం లో నాలుగు సాయంకాలాలు ఈ గుళ్ళోనే. ఎందుకంటే మా ఇంటికి, గుడికి మధ్య దారిలో స్కూల్ ఉండేది. గుడి వెనకాల వీధి కాపువాడ లో బాధ్రకాలి చెరువు కి దగ్గరలో ఉండేది. శనివారాలు స్కూల్ ఒక పూటే, మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతాన బెల్లు మోగేది.
త్వరగా ఇంటికొచ్చి అమ్మ కారం, అల్లం రసం, ఉప్పు, నునే తో అన్నం ముద్దలుగా కలిపి సాయంత్రం పప్పు చారు చేసుకుందాం అంటూ ఇంటి వెనకాల బావికి దగ్గరక అనుకోని ఉన్న వేపచెట్టు కింద ఊరిస్తూ తినిపించేది. నా కోసం ముధపప్పు తీసి పెట్టని ఆర్డర్లుఇచ్చేవాన్ని. అప్పట్లో చాల రోజులవరకు నాకు తెలిసి నేను మెచ్చిన భోజనం అదే. ఇది 1995 నాటి మాట. భయటి వారు మాత్రం మేమొక కడు భిధరికాన్ని అనుబవిస్తున్న కుటుంబం అని లెక్క కట్టేసారు. అప్పటికి ఇంట్లో కరెంటు లేదు కానీ విధి లో ప్రతి ఇంట్లో బ్లాకు & వైట్ టీవీ ల సందడి మొదలవుతున్న రోజులు.
నాకు మాత్రం ఏ లోటు లేదు నేను ధనవంతున్నే అనే ఫీలింగ్ మా అమ్మ నాపై చూపించే గరబాన్నిచూస్తున్నపుడు అనిపించేది. తను చదువుకోలేదు కానీ మానవత్వ విలువలని ప్రేమ అనురాగాలని మంచి బుద్ధులని అన్నిటికి మించిన తెలివిని స్కూల్ కి వెళ్ళకుండానే ఎలా నేర్చుకుందో అని ఆశ్చర్యం వేసేది.
ఇంట్లో రెండు పెద్ద సెల్లులతో పని చేసే రేడియో ఉండేది అది మరియు నా పుస్తకాల సంచిని బుజాన వేసుకొని సాబిర్ కొడుకు ఆరిఫ్ (ఇప్పటికి మేము ప్రాణ మిత్రులం), నేను పాత అంగి(షర్టు) మోకాళ్ళు కనిపించే నిక్కర్లతో ముప్పై రూపాయల పారగాన్ స్లిప్పర్లు వేసుకొని 2 గంటల ప్రాంతం లో గుడికి చేరుకునే వాళ్ళం. చెప్పులు కోనేటికి దగ్గర ఇసుకలో వదిలేసి లోపలి వెళ్ళేవాళ్ళం.
కళ్యాణ మండపం మధ్యలో బయట ఎంత ఎండగా ఉన్న లోపల మాత్రం చాల చల్లగ ఉండేది. సంగీతం నేర్పించే ఓ పెద్దాయన అతని శిష్యుడుతో ఎత్తు బండపై నీడ ఉన్న చోటు చూసుకొని సంగీతం నేర్పించేవాడు. చూడడానికి చాల గంబిరంగా ఉండే అతని రూపాన్ని చూసి తానెవరో తెలుసుకోవాలని ఎప్పుడు ప్రయత్నించలేదు. స్కూల్ home work పూర్తి చేసుకుందామని కళ్యాణ మండపం లో ఓ మూలా కూర్చొని అతి తక్కువ సౌండ్ లో రేడియో లో ఆకాశవాణి బలవినోధిని కార్యక్రం వింటూ అప్పుడప్పుడు వీచే చల్లని గాలిని ఆస్వాదిస్తూ పూర్తి చేసేవాళ్ళం.
నాకు చాల బాగా గుర్తు అతిపెద్ద స్థంభం కింద కాగితం ఒక వైపునుండి ఇంకో వైపుకు తీసే వీలుగా ఉండే అతి సన్నని సందును ఆ సంధుని వదులుతూ చెక్కిన పూలగుత్తులని చూస్తూ, చూసిన ప్రతిసారి వింతగా తోచేది మా నాయనమ్మ పాతకాలంలో రాత్రిపూట రాళ్ళూ మెత్తగా అవుతాయి అప్పుడు వాటిని చెక్కుతారు తెల్లరిన తర్వాత అవి గట్టిపడుతాయి అని ఇంటి ఎదురుగ సిమెంట్ తో కడుతున్న హబీబు వాళ్ళ ఇల్లు చూపిస్తూ చెప్పేది. అది నేను నమ్మేవాడిని.
ఎవరైనా గుడి గురించి అడిగితే మాత్రం నేను, అరీఫ్ ఒకరి మొహాలు ఒకరం చూసుకొనే వాళ్ళం. నాకు అనిపించేది గుడికి మనశ్శాంతి కోసం కానీ చరిత్ర గురించే ఎందుకొస్తార అని..
నిజంగా గుడిలో ఏముందో తెలియదుకాని తెలియని ఒక గమ్మత్తు మాత్రం కలిగేది. అక్కడ కంకులు అమ్మే అవ్వ చెట్టు మీదుండే పిచుకలకు మెరిగలు (వరి గింజలు) పెద్ద బండపై కూర్చొని విసిరేది దాదాపు పాతిక పిచుకలు గుమిగూడి పోటి పడి ఎతుబండపై వేసిన మేరిగల్ని గబా గబా తినేవి. కోయిల కూయడం మొదలు పెట్టగానే ఎతుస్తంబం అనుకోని రెండు సింహం గుర్తు శిల్పాలపై ఎక్కి వింటూ కోయిలను చూసేందుకు ప్రయత్నిచేవాళ్ళం. సూర్యాస్తమయం లో స్థంభాలా వెనుకన దోభూచులాడే సూర్యున్ని అ సమయంలో తన చుట్టూ ఏర్పడి క్షణ క్షణానికి మారే రంగుల్ని చూస్తూ గడిపేవాళ్ళం అ క్షణాలు అధ్బుతం. చల్ల గల్లులు చెంపలని తగులుతుండగా చుట్టూ చీకట్లు ముసురుకొనే సమయానికి ఇంటి ముఖం పట్టేవాళ్ళం.
ఆ చిన్న నాటి జ్ఞాపకాలు ఓ చరిత్ర లాగా చరిత్ర తోటే చరిత్రలో కలిసిపోయాయి..
ఎంత బావుంటుందో కదా జీవితం లో కూడా రివైండ్ బటన్ ఉంటె…!
**
ఆ రోజు తీసిన ఫొటోస్ లింక్ : http://www.facebook.com/media/set/?set=a.192895697400453.47388.167218626634827
Ur thought was really superb.
Thank you