వనబోజనం
భద్రకాళి చెరువు కట్ట చిన్నప్పుడు అది చాల దట్టమైన ముళ్ళ పొదళ్లతో భద్రకాళి దేవాలయానికి ఆనుకొని చెరువుని కాపాడుతూ ఉన్న కట్ట. ఆ కట్టకు మా ఇల్లు ఐదు నిమిషాల నడక దూరం లో ఉంటుంది. విశాలమైన చెరువు కాపాడుతున్న కట్ట చివరన అవాలి వైపు ఉన్న గుట్టల కింద ఓ హనుమంతుని గుడి. దాని కింది బాగాన కుడి వైపుకు ఓ మంచి నీటి బావి దాన్నే రాచ్చాల (రావిచెర్ల) బావి అని పిలుచుకునే వాళ్ళం. బావి కి ఆనుకొని ఉన్న మరో గుట్ట పైకి ఎక్కడానికి వీలుగా చెక్కిన మెట్ల ను ఎక్కుతూ పైకేల్తే పూర్వకాలం లో రాళ్ళతో పేర్చిన ఒక చిన్న కళ్యాణ మండపం దాని వెనకాల ఓ పెద్ద వేప చెట్టు విశాలమైన లక్ష్మి నరసింహస్వామి ఆలయం. ఆలయం గర్బగుడి లో ఓ ములన ఎప్పుడు నీరు ధారల పడుతుంటే ఆ నీటిని నిలువ ఉంచే అతి చిన్న(ఇంట్లల్లో ఉండే వాటర్ ట్యాంక్ సైజు) కోనేరు. ఆ ఆలయాన్ని చూడగానే తెలుస్తుంది అది పెద్ద పెద్ద రాళ్ళను పేర్చి కట్టారని. ఆ ఆలయం నుండి చూస్తే భద్రకాళి దేవాలయం, కట్ట, బావి, చెరువు (ఈ చివరి నుండి ఆ చివరి వరకు) అంత కంటిగి ఇంపుగా (ఓ landscape దృశ్యం) కనిపిస్తుంది.
శీతాకాలం పొద్దున నాలుగు ఐదు గంటల ప్రాంతాన దట్టమైన మంచు పొగలతో చూడ్డానికి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది.
నా గతంతో ముడి పడి ఉన్న ఎన్నో ఆనంద క్షణాలు ఇక్కడ ఉన్నాయి. చిన్నప్పుడు మా బాపు మా అన్నయ్యకు ఈత నేర్పించాలని ఈ చెరువు కి తీసుకెళ్ళేవాడు. నన్ను తీసుకెళ్ళు అని అడగడం తో పట్టుకెల్లేవాడు కానీ ఎప్పుడు నీళ్ళ లోకి అడుగు పెట్టనిచ్చేవాడు కాదు. అప్పటి నుండి మొదలు పెడితే ఇప్పటి వరకు ఈత నేర్చుకోవడం అనేది ఓ కలగా తీరని కోరిగ్గా మిగిలిపోయింది. మా అన్నయ వాళ్ళ దోస్తుల్తో నేను లేవక ముందే వెళ్ళేవాడు. నన్ను మాత్రం అస్సలు తీసుకెళ్ళేవాడు కాదు.
నాకు ఊహ తెలిసినప్పటి నుండి వంటలకి (వన భోజనం) ఆ గుట్ట మీదికే వెళ్ళేవాళ్ళం. పొద్దునే వెళ్లి ఆ రోజు మొత్తం వంట వార్పూ చేసుకొని గడిపేందుకు ఓ చోటును వెతికి మేము వెళ్ళే వరకు అక్కడే ఉండేవాడు మా అన్నయ (ఎందుకంటే వంటలకి మేమే కాదు వాడలో వేరే వాళ్ళు కూడా వెళ్ళేవారు ఆలస్యం చేస్తే సరైన చోటు దొరకదేమోనని).
ఇక ఆ రోజు స్కూల్ కి డుమ్మా కొట్టడం తప్పనిసరి. అంతకు ముందురోజు నుండే అమ్మ ఆ రోజు కు కావలిసిన వస్తువులు (బోళ్ళు, పల్లాలు, చిన్న గిన్నెలు, వంటనూనె ఇతరత్రా సరుకులు) అన్ని ఓ గోనే సంచి లో మూట కట్టి పెట్టేది. రాత్రి పన్నెండు గంటలవరకు అక్క అమ్మ కూర్చొని కిరసనాయిలు పొయ్యి మీద మూకుడ్లో పూరీలు చేసే వాళ్ళు. ఇక నా పనిలో నేనుండే వాణ్ణి. పొద్దున్నే లైబ్రరీ నుండి మామయ్య పట్టుకొచ్చిన కొత్త పుస్తకం, ఒక వార పత్రిక, బొమ్మలు గీయడానికి తెల్ల పేపర్లు, ఒత్తుడుకు అట్ట (stiff pad), స్కేచ్చు పెన్నులు, కాంపాక్స్ బాక్సు పెద్ద సేల్లులతో పనిచేసే రేడియో తో నా సంచిని సిద్ధం చేసుకొనే వాణ్ణి.
బాపు పెద్ద సైకిల్ వెనక క్యారేల్కు రాత్రి మూట కట్టి పెట్టిన సంచిని పోట్టేల్ (వైరు లాంటి తాడు) తో కట్టే వాడు. అమ్మ చేతిలో బింద, తాళం వేసి తాళంచెవి ని చేతులో పట్టుకొని అక్కయ సిద్ధం చేసుకున్న సంచిని బుజాన వేసుకొని టప్పు టప్పు మని పారగన్ స్లిప్పర్లని శబ్దం చేస్తూ నడిపించుకు పోతున్న బాపు పెద్ద సైకిల్ వెనకాల నేను. ఐదు గంటల ప్రాంతాన మంచు పోగలను చీల్చుకుంటూ ఎదురు వచ్చే గాలుల్ని నా చెంపలతో డీ కొడుతూ అప్పుడే బయటికొచ్చి రోడ్లపై నీళ్ళు చల్లుతున్న వాడ పాలోల్ల( relatives )ను చూస్తూ డబ్బా కాడ మూల మలుపులో పెద్ద కోడిపుంజు కూత కూస్తుండగా ఐదు ఆరు నిమిషాల్లో గుట్ట కాడికి చేరుకొనే వాళ్ళం. గుట్ట మెట్లు ఎక్కుతూ పైకి చేరుకునే సరికి ఆయాసం తన్నుకోచ్చేది. మా కోసం ఎదురు చూస్తున్న అన్నయ ఉన్న చోటుని గడపడానికి అనువుగా సిద్ధం చేయడం లో అమ్మ బిజీ అయిపోయేది.
నేను విశాలమైన ఒక పెద్ద బండపై నిల్చొని పచ్చిగా వచ్చే మట్టి సువాసనని గట్టిగా పీలుస్తూ, దూరంగా కనిపించే బాద్రకాళి గుడిని, పక్కనే నిద్రిస్తున్న ఒక యోధుడి తలల కనిపించే పెద్ద గుట్ట ని, కట్టని, చెరువుని, వీటిని కమ్ముకొని ఉన్న దట్టమైన మంచుని, గుంపులు గుంపులుగా మెల్లగా పయనమవుతున్న పక్షుల్ని, నన్ను కౌగిలించుకునేందుకు వీచే ఈదురుగాలులను ఎదిరిస్తూ, చిన్నగా చలి కి వణుకుతూ, క్షణ క్షణానికి రంగు మారుతున్న ఆకాశాన్ని చూస్తూ, కమ్ముకున్న పొగ మంచుల్ని చీల్చుకుంటూ ప్రశాంతంగా పుట్టుకొస్తున్న సూర్య తేజాన్ని కళ్ళు పెద్దవిగ చేసుకొని, ఆ సమ్మోహన దృశ్యాన్ని, మౌనంగా, మనసులో పదిలంగా దాచుకునే వాణ్ని..
అలా తెలవరాక, గుట్ట కింద రాచ్చాల బావినుండి అన్నయ, బాపు బిందెల్లో నీళ్ళు తెచ్చే వారు, చూస్తుండగానే మా ఇంటి కాడ ఉండేవోల్లు, గుండం వాడ, మచిలిబజార్, మూడు డబ్బాలకడ ఉండేవోల్లు అందరు చేరుకునేవాళ్ళు. ఇప్పుడు విశాలమైన గుట్ట ప్రాంతం జనాలతో, నా ఈడు పిల్లలతో వాళ్ళ వాళ్ళ చుట్టాలతో నిండిపోయేది. మేము ఎంచుకున్న చోటు రెండు అతి పెద్ద రాళ్ల సందులో ఓ గుహలా తలపించేది. అమ్మ మేము ఉన్న జాగా (చోటు) ని చీపురుతో ఊడిచి నీళ్ళు చల్లి, పెద్ద సంచులతో కుట్టి తాయారు చేసిన దాదాపు పది మంది కుర్చేనే వీలు గల ఒక పెద్ద పరదా ఒకటి కింద పరిచి తెచ్చిన మూటలోని సామాన్లని ఒక వైపుకు పేర్చి మమ్మల్ని పిలిచేది, నేను అక్కయ బాపు అన్నయ కూర్చుంటే, రాత్రి చేసిన పూరీలు, చిన్న చిన్న రికాబు (steel plates) లో పెట్టి నిన్న పొద్దున రోట్లో ఉడికించిన టమాటో, పచ్చి మిరపకయాలని కలిపి నూరిన పచ్చడి చెంచ తో వేసి ఒక్కొక్కరికి ఇచ్చి తను కూడా ఓక రికాబు లో పెట్టుకొని అందరం కలిసి తినే వాళ్ళం. అబ్బో అమ్మ చేత్తో రోట్లో దంచి చేసిన పచ్చడి గురించి ఎంత చెప్పిన తక్కువే ఎప్పుడు తలచుకున్న నోట్లో నీళ్ళురుతాయి. పూరీలు లాగించడం పూర్తయ్యాక బాపు, ఇంకా బాపుకు తెలిసిన వాడలోని కొందరు కలిసి పెద్ద సైకిల్ల మీద కోళ్ళు కొనుక్కురావడానికి అలంకార్ దగ్గర ఉన్న చికెన్ షాపు కు బయలుదేరేవారు.
అమ్మ నన్ను మా అన్నాయని కొబ్బరికాయ, ఊది బస్తీలు, థమ్స్ అప్ బాటిలు, రెండు పెద్ద పాల పాకిట్లు, బంబినో సేమియా పాకిటు, చిన్న డాల్డా పాకిటు, సేమియలో వేసుకొనే పప్పులు, బెల్లం, చికెను మసాల పొడి, మిల్ మేకరు, కొత్తి మీరా, పుదిన, పచ్చిమెరపకాయలు తెమ్మని పంపేది, ఇవ్వన్ని తీసుకురావడానికి, రెండు కర్రల సహాయంతో పట్టుకునే వీలు గల సంచిని మా చేతికి ఇచ్చేది. అది నేను పట్టుకుంటే కింద నేలకు రాసుకుంటూ పోయేవాణ్ణి ఎందుకంటే ఆ సంచి నాకు సగానికి ఉండేది. అది చూసి అన్నయ లాకున్ని తను పట్టుకునే వాడు. మెల్లిగ మేము గుట్ట దిగి అల నడుచుకుంటూ డబ్బా కాడి నుండి మూల తీరుగుతూ గుండం వాడలో నుండి కుడి వైపుకి తీరుగుతూ జెండా కాడికి చేరుకొనే వాళ్ళం అక్కడే ఉంది ఇద్దరు అన్నదమ్ములు నడిపిస్తున్న రాజన్న దుకాణం. గబా గబా తీసుకొని అన్నయ పాయింటు జేబులోనుండి డబ్బులు తీసిచ్చి మళ్లీ గుట్టకాడికి చేరుకునే వాళ్ళం.
బాపు తో వెళ్ళిన వారంతా కోళ్ళతో తిరిగోచ్చేవారు. బాపు వచ్చేలోపు అమ్మ కిరసనాయిలు బర్నాల్ పొయ్యిమీద గిన్నె పెట్టి పాలు వేడి చేసి కొన్ని పాలతో చాయ్ చేసి మరి కొన్ని పాలతో సేమియా చేసేది. బాపు రాగానే మా అందరికి చాయ్ ఇచ్చి తను చాయ్ తాగేది (నాకు ఊహ తెలిసాక గత పన్నెండు సంవత్సరాల నుండి టీ కాఫీ మాంసం తీనడం మానేసాను నా ప్రవర్తనకి ఇంట్లో పెద్ద రాద్ధాంతమే జరిగింది కానీ నన్ను మార్చలేక పోయారు ఇప్పటికిను) తర్వాత పొయ్యి మీద పెద్ద గిన్నెలో వేడి నీళ్ళు పెట్టి, అమ్మ బాపు మేము ఉంటున్న చోటుకి కాస్త దూరంగ వెళ్లి కోడిని ఊరి దేవతకు బలి ఇచ్చేవారు. ఆ రకంగా ఆ రోజు వంటలకోచ్చిన వారంతా కోళ్ళను బలిచ్చేవారు. వేడి చేసిన నీళ్ళతో కోడిని శుబ్రం చేసి వండడానికి వీలుగా సిద్ధం చేయడం లో బాపు. మరో పక్క అమ్మ పోయి మీద బియ్యం కడిగి అన్నం పెట్టి అది ఉడుకుతుంటే పొంగ కుండ చూడామణి అక్కయను కూర్చో బెట్టేది.
ఇక నేను అక్కడినుండి బయటికొచ్చి మా ఇంటికాడ రాజు, మహేశు, శీను, మేమంతా, ఇంకా మిగతా పిల్లలమంతా నరసింహస్వామి గుడి వెనకనుండి సందు లో ఎత్తు రాళ్ళని పట్టుకుంటూ గుడి పైకి ఎక్కి కూర్చునే వాళ్ళం. అన్నయ ఇంకా వాళ్ళ దోస్తులు చెరువులో ఈత కొట్టడానికి ఎల్లెవాల్లు. ఇక గుడి పైన రేడియో పెట్టి వచ్చే ప్రోగ్రాములు వింటూ నేను ఓ పక్కన కూర్చుంటే, కొంచెం ఎగిరితే అందే ఎత్తులో ఉన్న వేప కొమ్మలని పట్టుకొని ఊగే ప్రయత్నం చేస్తూ మిగాతవాల్లంత, ఆ గుట్ట కాడికి వంటకోచ్చిన వాళ్ళలో దాదాపు పాతిక మందికి పైగా పిల్లలం అందరం కలిసి ఒకటే అల్లరి. రక రకాల ఆటలతో సందడి సందడి చేసే వాళ్ళం. పదకొండున్నార ప్రాంతాన ఆడింది చాలు అంటూ మమ్మల్నంధర్ని పిలిచేవారు. నేను వెళ్లేసరికి అమ్మ బాపు మేమున్న చోటుకి కొంచెం దూరంగా వెళ్లి ఒక విస్తారాకు చుట్టూ నీళ్ళు జల్లి, అన్నం, కోడి కూర, సేమియా, ఉడికించిన గుడ్డు, పసుపు కుంకుమ, ఇంకేవేవో మా కుల దేవతకి నైవేద్యంగ పెట్టి కళ్ళు మూసుకొని దండం పెట్టి వచ్చేవారు. ఇదంతా మామ్మల్ని (పిల్లల్ని) చూడనిచ్చేవారు కాదు.
కాసేపటి తర్వాత పన్నెండు గంటల ప్రాంతాన, పెద్ద పళ్ళాలని ( plate ) కడిగి అందరిని కూర్చోమని, ముందు బాపు కి వడ్డించి తను తినడం మొదలు పెట్టాక, అన్నయకు, అక్కయకు, నాకు వడ్డించేది నా చిన్న పళ్ళెం లో (నాకు ఒక చిన్న పళ్ళెం ఉండేది అది మా అన్నయ్య పుట్టాక మా అన్నయకోసం కొన్న పళ్ళెం తను పెద్దవాడయ్యాక, అది అక్కయ సొంతమయ్యింది, అదే వరుసలో నా దగ్గరికొచ్చింది, ఆ తర్వాత మా చిన్నమ్మ కొడుకులు ఇద్దరు వాడారు. ఆ పళ్ళెం అంటే అందరికి ఇష్టమే ముఖ్యంగా అమ్మకి చిన్నమ్మకి ఇప్పుడది చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది.) ముందు పూరీలు, పచ్చడి, ఒక చిన్న గ్లాస్ లో థమ్స్ అప్ తర్వాత నిన్న సాయంత్రం చేసిన పప్పుచారు తో కలిపినా అన్నం ఆ తర్వాత మాంసం తో పూర్తి చేసేవాళ్ళం. చేతులు కడుక్కోన్నాక మూతిని తుడుచుకుంటూ వస్తుంటే మా ముగ్గిరికి చిన్న చిన్న గిన్నెల్లో సేమియా పోసి ఇచ్చేది. అల రెండు సార్లు వేసుకొని తినే వరకు త్రుప్తి కలగక పోయేది.
బాపు కొంచెం ఎత్తు తక్కువున్న బండపై చెట్టుకొమ్మ నీడ పడుతుండగా సంచి చేద్దరు తల కింద పెట్టుకోవడానికి ఓ దిండుని అమ్మ సిద్ధం చేస్తే మెల్లిగా కునుకి తీసేవోడు. అక్కయ అమ్మకి భోజనం వడ్డిస్తూ ముచ్చట్లు పెడుతుంటే, అన్నయ వాళ్ళ దోస్తులతో కలిసి ముళ్ళ ఫొదల్లతో నిండిన భద్రకాళి కట్ట (ఇప్పుడది అందమైన గార్డెన్ లాగ, పర్యాటకులు సేదే తీరేవిధంగా, పిల్లలకు ఆడుకునే ఆటస్థలం లాగ, ప్రేమ జంటలకు మనసువిప్పి మాట్లాడుకునే ఓ చక్కటి ప్రదేశంగా రూపాంతరం చెందింది) మీదికి వెళ్ళేవారు.
నేను నా సంచిని బుజాన వేసుకొని లక్ష్మి నరసింహస్వామి గుడి పైకి ఎక్కి చెట్టు కొమ్మ నీడలో కూర్చొని, వారపత్రికని, పుస్తకాన్ని, తిరగేసి, కాసేపటి తర్వాత సంచిలో నుండి రేడియో ని బయటికి తీసి చిన్న శబ్దం తో హిందీ వివిద్ భారతి ప్రోగ్రాము వింటూ, అట్టను బయటికి తీసి దాని పై తెల్ల పేపరు పెట్టి, కంపాస్ బాక్స్ లో నుండి పెన్సిల్ తీసి, చుట్టూ ఓ సారి చూసి, కళ్ళు మూసుకొని పొద్దున చూసిన సుందర దృశ్యాన్ని గుర్తుకు తెచ్చుకొని, రేడియో లో వస్తున్న జో బాత్ తుజ్ మే హే తేరి తస్వీర్ మే నహి అంటూ వినిపిస్తున్న మొహమ్మద్ రఫీ గారి గీతాన్ని వింటూ పెన్సిల్ తో గీయడం మొదలు పెట్టి స్కేచ్చులతో రంగులు అద్దటం తో పూర్తయ్యేది. ఒక్కొక్కరితో మొదలై మా వాడ దోస్తులంత నా చుట్టూ చేరి చూస్తుండేవారు. ఆ తర్వాత ఒక్కో కాగితం మీద ఒక్కొక్కరికి వారి పేర్లను గీసివ్వడంతో బిజీగా గడిస్తున్న సమయంలో దూరంగా ఎక్కడో పుట్టిన చిన్న మేఘం మెల్లి మెల్లిగ పెరుగుతూ చూస్తుండగానే సూర్యున్ని మింగేస్తూ మా మిదికొచ్చి మమ్మల్ని తొంగి చూసేది. మేమంతా తలల్ని ఆకాశం వైపుకు ఎత్తి చూస్తుండగా, వీస్తున్న ఈదురు గాలులకు చిన్న చిన్న నీటి తుంపర్లు నా నుదురు, కన్నులు, బుగ్గలను, తగులుతుంటే, ఒక్కసారిగా జీవ్వుమంటూ ఉలిక్కి పడేవాణ్ణి, పులకరింతల ఆ హాయికి గుర్తుగ నా చేతిపై రోమాలు నిక్కపోడుచుకునేవి. కొద్ది కొద్దిగా పెరుగుతూ ఒక జల్లు లాగా పడుతున్న వర్షానికి అందరం గూళ్ళల్లో పిచ్చుకల్లాగా కొండ చీరుకల్లో పెద్ద రాళ్ల సందుల్లో తడవకుండా తల దాచుకునే వాళ్ళం. బోరున కురుస్తున్న వర్షానికి ఎదురుగా ఎవరో కుంచేతో తెల్ల రంగులని చిలుకుతూ గీసిన వర్ణచిత్రం లాగ ఆకాశం మరియు పచ్చని తుమ్మ పోధల్లని ఎకంచేస్తున్నట్టుగా కురుస్తున్న వర్షంకు పాలిపోయి ఉన్న గుట్ట రాల్లన్ని నల్లగా మారి, పచ్చని చెట్ల ఆకులు మరింత నిగ నిగ లాడుతూ, గుట్టపై ఉండే మేకల గుంపు ఒల్లుని జలదరిస్తూ తల దాచుకోవడానికి పరుగులు పెట్టె ఆ తీరు, పిల్లల కేరింతలు, వర్షంలో మమ్మల్ని తడవనీయకుండా పెద్ధవాల్లంత అడ్డుకోవడాలు, అయినా తప్పించుకొని పరుగు పెట్టె ఆకతాయిలతో వేగ లేక చీర కొంగును తల మీదేసుకొని వారి వెంట పరుగులు పెట్టె అమ్మ వాళ్ళతో ఆ వాతవరనమంత వర్ణించడానికి వీలు లేని ఓ మధుర దృశ్యంలాగ అక్కడ ఏర్పడేది.
మెల్లిగా వాన తగ్గడంతో గూళ్ళల్లో నుండి బయటికొచ్చే పక్షుల్లాగా మేము బయటికొచ్చి, గుట్టలపై నుండి ధారలాగా పడుతున్న నీటి మత్తడని చూస్తూ నీళ్ళు ఆగి ఉన్న చోట రాళ్ళ మూలల్లో నుండి జారుకు వచ్చిన చిన్న చిన్న రంగు రంగు రాళ్ళను సేకరించడం లో నిమగ్నమయ్యేవాళ్ళం. అటు నుండి కిందికి దిగి రావిచెర్ల బావి లో తాబేలును చూస్తూ ఆ పక్కనే ఉన్న హనుమంతుడి గుడిని, దానికి ఆనుకొని ఉన్న చెరువు గట్టు లో తడిచి ముద్దై ఉన్న తామరాకుల మధ్యనుంది చీల్చుకొని పైకి తలెత్తుకొని గల గల నవ్వుతున్న పూవుల్లో దాగిన నీటి చుక్కలని చూస్తూ, విరబూయడానికి సిద్ధంగా ఉన్న మొగ్గలని కర్రలతో మా వైపుకు లాగే ప్రయత్నం చేసేవాళ్ళం.
మచిలిబాజార్ వాడోల్లు మొత్తం బెస్తోల్లె ఆ వాడోల్లందరికీ ఈ చెరువే ఆధారం. పిల్ల చేపల్ని ఈ చెరువులో పోసి అవి పెద్దయ్యాక తెప్పల ( థర్మకోలును పెద్ద పెద్ద ప్లాస్టికు సంచుల్లో పెట్టి కుట్టి తయారుచేసుకున్న పడవ) తో వెళ్లి వలని పేర్చి తెప్పలపై కూర్చొని వలలో పడే చేపల కోసం ఎదురు చూస్తుండేవోళ్ళు. ఇక మేము చిన్న చిన్న సాపుగ ఉండే బిచ్చలను సేకరించి ఓ కుప్పగా పోసి. బొటన వేలు చూపుడు వేలుకు మధ్య రాయి ని పట్టుకొని మోచేతిని వంచి వెనక్కి జరుపుతూ గురిచుస్తూ బలంగ నీళ్ళలోకి విసరగ ఆ బిచ్చ నీటి పై పల్టీలు కొడుతూ పరుగు పెట్టి వేగం తగ్గాక నీటిలో మునిగేది ఆ రకంగా ఎవరు ఎక్కువ పల్టీలు కొట్టిస్తే వాళ్ళు హీరోలు. మేమంతా అరపులు కేరింతలతో ఒకరిని మించి ఒకరం వేగంగా విసిరే వాళ్ళం. కాసేపటికి నేను ఓ పక్కన కూర్చొని పల్టీలు కొడుతున్న రాళ్ళను చూస్తుండగా. వలలు పెట్టి తెప్పలపై కూర్చున్న బెస్తాయన ఓయ్ ఓయ్ ఎవర్ర రాళ్ళు ఇసురుతున్నది అంటూ అరవగానే. నేను మెల్లిగా లేస్తూ నా రెండు అరచేతులని వెనక్కి పెట్టి నిక్కరుకు అంటిన పచ్చి మట్టిని దులుపుకుంటూ అందరితో పాటు ఉరుకేవాన్ని.
అల పరుగెడుతూ మేమున్న చోటుకి వెళ్ళగానే అమ్మ చేతులుకడుక్కోమని నీల్లిచ్చేది. చేతులు కడుక్కోగానే మల్లి పూరీలు, కూర, పచ్చడి, పెట్టి ఇచ్చి, అన్నం పెట్టన అని అడిగితే వద్దని చెప్పి పూరీలు తినే వాణ్ని, ఇక అక్కడ వండిన వంటలు ఏవి ఇంటికి తిరిగి తీసుకేల్లకూడదని ఇక్కడే తినల్సిందేనని పట్టు బట్టి మరి అందరికి వడ్డించేది అమ్మ. తినడం పూర్తయ్యాక కొబ్బరిపీచు బూడిదతో అన్ని బోళ్ళు అమ్మ తోముతుంటే అక్కయ కడుతుండేది. మల్లి అమ్మ నేను అక్కయ అన్ని సదిరి మూట కట్టి ఇంతకు ముందు మిగిలిన అన్నం కూర పూరీలు ఒక పెద్ద విస్తర్లో వేసి కుక్కలకోసమని అక్కడే వొదిలి వెలుతురు పలుచబడుతుండగా మెల్లిగా గుట్ట కిందికి దిగుతుంటే మాతో పాటే మిగితవాళ్ళు కూడా ఇక పయనమయ్యే వారు.
ఇక ఇంట్లో కొచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని కూచునే సరికి ఆరున్నర అయ్యేది. దీపం వెలుతుర్లో ఓ పోస్ట్ కార్డు తీసుకొని ఆ రోజు జరిగిన సంగటనలన్ని అందులో రాసి నా సంచిలో పెట్టుకొని అమ్మ సిద్ధం చేసిన పక్క (పరుపు) లో నిద్ర పోయెవాన్ని..
మళ్లీ అలంటి వనబోజనాలకి వెళ్లక దాదాపు పదేల్లయ్యింది ఇదంతా తలచుకుంటే ఒక సారి ఆఫీసు కు డుమ్మా కొట్టి, ఈ రణగొణ ధ్వనులకు, కంప్యూటర్, ఫెసుబూక్, ఫ్లిక్కర్, వర్డ్ ప్రెస్, ఆర్కుట్, బ్లాగ్స్, గ్రూప్స్, ఐ పాడ్, చివరాకరికి మొబైల్ వీటన్నిటిని వొదిలి. కెమరాని మేడలో వేసుకొని ఒక్కరోజంత గడపాలనుంది.
ఎప్పుడు వీలవుతుందో….