“సాయం”సంధ్యలు…
ఇప్పటికి హైదరాబాద్ వదిలి నూట అరవై కిలోమీటర్లు దాటాము కాసేపట్లో తెలవారబోతోంది అంటూ అర్ధం కాని ఊరి పేరేదో చెప్పాడు. మరో సారి అడగాలన్న తాపత్రయం కూడా నాకు లేదు. ఛీకట్లతో జత కూడిన నీలం రంగును నెమ్మదిగా దులిపేసుకుంటూ నిటారుగా గాలిసవ్వళ్ళకు ఊగిసలాడుతున్న, ఆకాశాన్ని తాకుతున్నట్టుగా నిల్చున్న పెద్ద పెద్ద చెట్ల గుంపులు వేగంగా నెట్టుకుంటూ పోతున్న మా వెహికల్ కిటికీ గుండా లీనమై చూస్తున్న నాకు వాడి మాటలు పెద్దగా వినిపించట్లేదు.
ఆ ఎదవ కిటికీ మూసేయ్ ర బాబు చలికి చచ్చిపోతున్న… అంటుంటే తప్పదన్నట్టు కిటికీ మూసా.
నెమ్మదిగా కళ్ళుమూసుకొని వెనక్కి తల వాల్చి ఊగుతున్న వెహికల్ తో పాటే నా తల ఊపుతూ కాసేపు కూర్చున్నానో లేదో. కొత్తగా వచ్చిన హైదరాబాద్ రూల్ మహత్యమా అని కూలింగ్ కవర్ తీసేసిన కిటికీ అద్దం గుండా సూర్యుడు సురుక్కుమనిపించాడు. ఈసారి కిటికీ దింపి చూసా.. చుట్టూ అరటి చెట్ల తోటలు, పొలాలు, టేకు చెట్ల గుండా ప్రయాణం సాగుతున్నదని అర్ధమైంది. మేము కర్నాటక రాష్ట్రంలో ఉన్నామని నాకు అర్ధం కాని బాషలో ఊరి పేరుతో కూడిన బోర్డు. ఆ బోర్డు లో ఏడూ కిలోమీటర్ల దూరంలో అని కనిపించడంతో.. ఆ బోర్డ్ వెనకాల ఓ గుడి గోపురం. నా కెమరాతో క్లిక్ మనిపించ. రాత్రంతా ఈ కెమరా పట్టుకొని వీడు ఏం చేసాడో ఏమో.. అప్పటికే ఛార్జింగ్ లేక కొట్టుకుంటోంది. మరో రెండు ఫోటోలు తీసానో లేదో చప్పున చల్లారిపోయింది. విసుగుతో కెమరా బాగ్ లో పెట్టేసి. అదే కిటికీ గుండా అలా చూస్తున్న.
అంతకు రెండు రోజుల ముందు రాత్రులు కూడా నిద్ర లేదు అందుకేనేమో శరీరం, మనసు, గొంతు, కళ్ళు అన్ని మత్తును వాటేసుకున్నాయి.
కంటికి కనిపిస్తున్న దృశ్యం తప్ప దేని మీద మనసు లగ్నం చేసే కుతూహలం ఇసుక రేణువంత కూడా లేదు. దానికి తోడు కడుపులో ఆకలి. సినిమా షూటింగ్ ల పుణ్యమా అని కొద్ది నెలలుగా టంచనుగా టైం ప్రకారం తినడం దేహానికి అలవాటైంది. అలవాటులో పొరపాటుగా ఏమి దొరికే అవకాశం కనిపించని ఈ చెట్ల మధ్యలో విపరీతమైన ఆకలి.
ఒరేయ్ నాయన ఇంకా ఎంత సేపురా.. నాకు ఆకలేస్తోంది అని విసుగ్గా అడిగా మనోహర్ గాడిని.
ఏరా ఇంకా ఏడూ కూడా కాలేదు అప్పుడేనా..
పోనిర ఎక్కడో చోట ఆపేయ్..
సారూ మీరు ఇంకో అరగంట ఓపిక పడితే ఒక పల్లె వస్తుంది. అక్కడేమైన దొరకొచ్చు అని మా యూనిట్ డ్రైవర్ రాజు చెప్పాడు.
పల్లెలు గ్రామాలూ ఊర్లు తిరగడం నాకు ఎంత ఇష్టమైన, ఎందుకో ఇంత నీరసంలో చిరాకు చికాకు తప్ప ఎలాంటి ఫీలింగ్ నాలో కలగట్లేదు.
ఈ మనోహర్ గాడు ఏదో సాంగ్ షూటింగ్ కి లొకేషన్ వెతకడానికి వద్దురా అని బతిమాలిన వెంటేసుకొచ్చాడు నన్ను.
మెలకువలోనే ఉండి కూడా కళ్ళు తెరుచుకోలేకపోతున్న.
ఏంటో ప్రపంచం బద్దలైన పర్వాలేదు నేను భరించలేని విషయాలు ఒకటి నిద్ర రెండు ఆకలి అందుకేనేమో ఈ రెండు విషయాల్లో కొత్త పాత అని లేకుండా నిర్మొహమాటంగ ఉంటాను. అందుకే…
రాజు బాబు తొందరగా పోనివ్వు నాయన..
ఓకే సార్.. వెంటనే వచ్చిన సమాధానం కి తోడుగ వేగం పుంజుకుంది.
వెచ్చని ఈదురు గాలులు కొంకర్లు తిరిగిన చేతులని, ఒళ్ళు ని సరి చేసింది. కాస్త విశ్రాంతిగా ఉంది. సర్రుమంటూ బ్రేక్ వేసాడు. ఒకే ఒక్క పూరి గుడిస రోడ్ కి కుడి వైపున. నెమ్మదిగా దిగాము. చుట్టూ చూసా ఎటు చూసిన దాదాపు రెండు మూడు కిలో మీటర్ల వరకు ఒక్క ఇల్లు కూడా లేదు. చుట్టూ చెట్లు, మధ్యన నల్లటి సింగల్ రోడ్, మా వెహికల్ మరియు ఆ పూరిగుడిస.
రాజు వెళ్లి ఏదో అడిగాడు గుడిసెలో ఉన్న అవ్వని. బయటికొచ్చి సార్ మీరు ఈ వేపపుల్లలతో అక్కడ మొహాలు కడుక్కోండి ముసలవ్వ పిండి పిసుకుతోంది పది నిమిషాల్లో వాళ్ళ కొడుకొస్తాడట. పూరీలు రెడీ అవుతాయి. గుడిసెకు ఆమడ దూరంలో గోళం నిండా నీళ్ళు చిన్న బకిటు మూరేడుకు సగముండే తెల్లని లోట లైఫ్బాయ్ సబ్బు. ఆ పక్కనే నులక మంచం గబా గబా వెళ్ళాను నులక మంచంలో బ్యాగ్ పడేసి ఒంట్లో ఉన్న మజ్జు పోవాలని మొహంతో పాటు ఏకంగా స్నానం కూడా కానిచ్చ. ఒక్కసారిగా ఏదో తెలియని ఆనందం వెచ్చగా కాస్తున్న ఎండా చల్లగా వీస్తున్న గాలులు ఎప్పుడో చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి..
మనోహర్ గాడు వింతగా చూసి కాసేపు నవ్వుకున్న వాడు కూడా అమెరికా దర్పాన్ని వదిలి ప్రకృతికి అంకితమయ్యాడు కాసేపు..
టీ షర్టు జీన్స్ మార్చుకొని తల గట్టిగ తుడుచుకుంటుంటే వెచ్చటి మీగడ పాలు అవ్వ పట్టుకొచ్చింది. పెద్ద రావి చెట్టు నీడలో వేసిన నులక మంచం లో కూర్చొని రెండు చేతులతో ఆ వేడి పాల చెంబుని గట్టిగ అదిమి పట్టి ఒక్కో గుటక గుండెలోకి దిగుతుంటే ఏదో తెలియని శక్తి నాలో ప్రవహిస్తున్నట్టుంది. పాలు తాగడం పూర్తవుతుండగా సైకిల్ తొక్కుతూ తెల్లని ఫుల్ బనీను మోకాల్ల వరకు మలిచిన పాయింటు తో కుంకుమ బొట్టు దానిపై విబుదితో అడ్డబొట్టు చూడడానికి మనిషి దిట్టంగా ఏదో మలయాళం పాట పాడుకుంటూ వచ్చి సైకిల్ ని గుడిసెకానించి కాళ్ళు చేతులు కడుక్కొని దేవుడికి దండం పెట్టుకొని పని మొదలు పెట్టాడు. పది నిమిషాల్లో మూడు ప్లేట్లతో, ఒక్క ప్లేటులో అరిటాకు వేసి నాలుగు పూరీలు చిన్న చిన్న గిన్నెల్లో వేడి వేడిగ గుమ గుమ లాడే పప్పు పాలకూరతో.
గుడిసెను చూస్తుంటే అది ఎందుకో హోటల్ లాగ అనిపించలేదు ఆ గుడిసె వెనకాల కాస్త పొలం చిన్న తోట ఉందంట అది ఆ ముసలవ్వ చూసుకుంటూ ఉంటుంది. అక్కడ కూలి పనికి వచ్చే వాళ్ళంతా వాళ్ళ తెచ్చుకున్న భోజనాలంత ఈ గుడిసె పక్కన చెట్టుకిందే చేస్తుంటారు.
వీళ్ళకి వీళ్ళ పిల్లలకని ఒక పది మందికి సరిపడా భోజనం ఈ ముసలవ్వ చేస్తుంటుంది. ఇక పొద్దున్న దారిన పోయేవాళ్ళు అడిగితే కాదనకుండా ఒక ఇరవై మంది కి సరిపడా టిఫిను చేస్తుంటుందంట. సరిగ్గా హై వే కి పది కిలోమీటర్ల దూరం లో మూడు కిలో మీటర్ల ఒక పల్లెకి దగ్గరలో ఉందని అర్ధమైంది. తల ఓ పది పూరీలు లాగించామో లేదో పెసర పప్పు మిరియాలతో చేసిన గుమ గుమ లాడే పొంగలి పై, పండు మిరపకాయతో చేసిన ఎర్రటి ఆవకాయ పచ్చడి అంచున వేసి నంజుకోడానికి వేయించిన చల్ల మిరపకాయలు చక్కగా ప్లేట్ లో సర్దుకొని అవ్వ, వాళ్ళ కొడుకు పట్టుకొచ్చారు. అరిటాకుల మహత్యమో ఏమో వెచ్చగా పొగలు కక్కుతూ గుమ గుమ లాడుతుంటే ఆగకుండా లాగించాం. శుబ్బరంగా చేతులు కడుక్కుంటుంటే ఓ అరిటిపండు తీయ్యని జామ పండు చేతిలో పెట్టారు. ఆహా మహా ప్రసాదం లాగ చేతిలోకి తీసుకొని తింటుండగా ఎంత అని రాజు అడిగి మాకు చెప్పాడు. చిత్రం ముగ్గురం తిన్న తిండికి వారు అడిగింది కేవలం యాబై రూపాయలు.
మాది హోటల్ కాదు బిడ్డ ఆకలని వస్తే ఉన్నంతలో సాయం చేయాలని మా అయ్య చెప్పేటోడు గదే నేను గూడ చేస్తున్న అని అవ్వ చెప్తోంది.
ఈ పొలం పనులకు బోయే పోరగాల్లకు తిండి సక్కగా దొరకదు వాళ్ళు సదుకొండ్రా అంటే వినరు అందుకే మా అవ్వ చేసిపెడతది. ఇగో ఆ కనపడే అరటి జామ తోట నాదే అని చెప్పుకుంటూ పోతుంటే నేను మనోహర్ గాడు ఆశ్చర్యంగా వింటూ ఉన్నాం. అవ్వ వద్దంటున్న మనోహర్ గాడు మూడు వంద నోట్లు చేతిలో పెట్టి వేల్లోస్తాం. అని చెప్తుంటే కృష్ణన్ అయ్యర్ (అవ్వ కొడుకు పేరు) ఒక ఇరవై అరటి పళ్ళు ఓ పాతిక జామ పళ్ళు సంచిలో పెట్టి ఇచ్చాడు. నేను మనోహర్ వెనకాల కూర్చున్నాం. రాజు నెమ్మదిగా బండి స్టార్ట్ చేసాడు. వేగంగా వీస్తున్న ఈదురు గాలి శబ్దం తప్ప చాల సేపు మాటలు లేవు. నా ఆలోచనలన్నీ ఆ పూరి గుడిసె చుట్టే తచ్చాడుతున్నాయి. ఇంకా సహజమైన నిస్వార్ధ సేవను చేసే మనుషులు మిగిలే ఉన్నారా…? ఎందుకో అప్పుడప్పుడు మానవ సమాజం మీద మనవ సంబంధాల మీద గౌరవం పెరుగుతుంటుంది ఇలాంటి వాళ్ళను చూస్తుంటే. ఏంటో చాలా కాలం తరువాత మనసుకు ఆనందం కలుగుతుంది.
ఒరేయ్! డబ్బు మనల్ని శాసిస్తుంద? లేక మనం డబ్బుకు దాసోహ మంటున్నమా?? సూటిగా అడిగిన వాడి ప్రశ్నతో ఆలోచనల్లోనుండి తేరుకున్నాను.
సమాజం పీకని ఊపిరాడనివ్వనంతగా పిసికే చనువుని ఆ డబ్బుకి మనమే కల్పించాం.
ఏమో రా.. నువ్వు చెప్పింది నిజమే కాని ఇప్పుడు మనమేమి చేయలేము కదరా..
అంతే.. అందరం అల చేతులు దులుపెసుకొని మన పరిధులలో మన స్వేచ్చలో ఆనందంగా గడిపే ప్రయత్నమే నీది నాది. ప్రపంచాన్ని మర్చేయల్సిన పని లేదు మంచి మనసుతో నలుగురికి నాలుగు ముద్దలు పెట్టె ఆ అవ్వని చూడు. అంతకు మించిన దైవత్వం ఇంకేం ఉంటుందిరా??? మంచిని పంచుతున్నామని నొసలు మీద రాసుకొని తిరగనక్కర్లేదు. ఎవరిని అడగనక్కర్లేదు. ఎవరికీ చెప్పుకోనక్కరలేదు. మనం మన అంతరాత్మ ఆ ముసలవ్వలాగ నిస్వార్ధంగా ఉంచుకోగలిగితే చాలు. అని నా ఉద్దేశం రా..
నిజమే.. అని వెనక్కి తల వాల్చాడు నేను కూడా అల తల వాల్చి కళ్ళు మూసుకున్నాను..
అరగంట ప్రయాణం తరువాత నెమ్మదిగా వాతావరణంలో మార్పు సూర్యుడు మేఘాల మూసుగు తొడిగాడు. వాతావరణం మరింత చల్ల బడింది. పల్లెల్లో నుండి మా ప్రయాణం ఇరుపక్కల చిన్న చిన్న గుడిసెలు మట్టి రోడ్డు చల్లని గాలులు అప్పుడప్పుడు ఉరుములు.
ఒక చోట పక్కకి ఆగాము. రాజు ఎవరినో ఏదో అడిగాడు ఒక చెరువు పచ్చని అరటి తోటలు సూర్యుడు సరిగ్గా కనపడే విధంగా ఉండే పొలం గట్లు బాదం తోట ఉండే చోటు గురించి. మరో మూడు కిలో మీటర్ల దూరం లో ఉందన్నాడు. ఇక మా ప్రయాణం ఆగకుండా సాగుతూ ఒక గూన పెంకుల ఇంటి ముందు ఆగింది. అది పల్లె చివరిదో మొదటిదో అర్ధం కాలేదు కాని ఆ ఇంటిముందు దానిని అనుకోని చెట్లు చేమలు పొలాలు తోటలు ఒక పెద్ద వాగు చూడడానికి అందంగా, ఆకాశం మబ్బుపట్టి ఉండడంతో కాస్త భయంగా అనిపించింది.
ఆ ఇంట్లో బక్క పలుచని మూరెడు పొడుగు గడ్డం తో ముసలాయన వాళ్ళ కొడుకు కోడలు పదేళ్ళ మనవడు. ఆ ఇంట్లో రెండు గదులు రెండో గదిలో చిన్న పిట్టగోడ అడ్డుగా కట్టెల పొయ్యి. ఆ ఊర్లో ఉదయం ఒక రెండు గంటలు సాయంత్రం ఒక నాలుగు గంటలు మాత్రమే కరెంటు ఉంటుంది. అలుకు అద్దిన నున్నటి నేల..
గడ్డం ముసలయానికి తెలుగు వచ్చు. వాళ్ళ కొడుకు రమేష్, కోడలు శాంతమ్మ, మనవడు నాగరాజు.
రాజు వాళ్ళతో ఏదో మాట్లాడి. ఆ తర్వాత
రమేషు రాజు ఇద్దరు మలయాళంలో మాట్లాడుకుంటూ బయటికెళ్ళారు..
కాసేపటికి చేపలతో వచ్చారు వంట మొదలయ్యింది. నేను మాంసం తినని సంగతి రాజు కి తెలియదు. అదే విషయం మనోహర్ చెప్పాడు. అయ్యో సారి సార్ నాకు తెలవదు మీకోసం ఎం చేపియ్యమంటారు. ఏదైనా పర్వాలేదు. పెరుగు కాని పచ్చడి ఉన్న చాలు వాళ్ళని ఇబ్బంది పెట్టకు అని అంటుంటే.. ఇబ్బంది ఎందుకు బిడ్డ అని లోపలనుండి ముసలాయన అన్నాడు. నేను నవ్వుకుంటూ పందిరి కింద మంచంలో కూర్చుండి పోయా..
మా యూనిట్ డ్రైవర్ రాజు ను చూస్తే నాకు ఆశ్చర్యమేస్తుంటుంది. నిమిషాల్లో అల ఎలా పరిచయం చేసుకుంటాడో మనుషుల్ని అల ఎలా మచ్చిక చేసుకొని ఒప్పించగలడో అని. అదే ప్రశ్న వేస్తే ఏముంది ఇదంతా అలవాటైపోయింది అని తన సినిమా చరిత్రని అరగంట సేపు చెప్తుండగా వంట సిద్దం అయ్యింది అని మలయాళంలో రమేషు చెప్పడం తో లోపలికెళ్ళి మాకోసం పరిచిన నూలు సంచుల్లో కూర్చున్నాం. శాంతమ్మ పల్లాలలో వడ్డించింది రాజుకి మనోహర్ కీ వాళ్ళని కూడా కూచోమను అని రాజుతో చెప్పాను. మనం తిన్నాక తింటారట అన్నాడు.
చిన్నప్పుడు ఇంట్లో చెమటలు పట్టేంత తృప్తిగా ఆనందంగ మళ్ళీ ఇంతకాలానికి తిన్నాను. నాకోసం ముద్ద పప్పు పచ్చి పులుసు అప్పడం తో పాటు గిన్నెడు మీగడ పెరుగు పెట్టింది. తృప్తిగా భోజనం పూర్తి చేసుకున్నాం.
అమెరికాలో దొరకకుండ జిహ్వాని చంపేసుకున్న మనోహర్ కి ఊహించని చేపల పులుసుని యమ జుర్రుకున్నాడు. మా బోజనాలు కానిచ్చి బయటికొచ్చి పందిరి కింద నడుం వాల్చాను. ఏంటో ఎప్పుడు నిద్ర లోకి జారుకున్ననో ఏమో సన్నని నీటి తుంపర్లు పడుతుండగా మెలకువ వచ్చింది. లేచి చూసా దూరంగా రమేష్ గేదేలకి చొప్ప పెడుతున్నాడు. టైం ఆరు కావొస్తోంది అబ్బో చాల సేపే పడుకున్నాను..
చూస్తే రాజు మనోహర్ లేరు. రమేష్ ని ఎలా ఏమని అడగాలో తెలియలేదు గదిలోకి తొంగి చూస్తే ముసలయన ఉన్నాడు. మా బ్యాగ్ లు గదిలో ఓ మూలకి ఉన్నాయి.
ఇప్పుడే వస్తాం తాత అని చెప్పి వెళ్లారు. నీకు రెండ్రోజుల నుండి నిద్ర లేదంటాగ పడుకోనివ్వండి అన్నారు.
నెమ్మదిగా వర్షం మొదలయ్యింది. పందిరి నీడలో మంచం లో కూర్చున్నాను.
మనసు ఆలోచనల తో పాటు నేను ఒంటరిగా కూర్చుండి పోయా..
ఏంటో ప్రయాణం లాగే జీవితం కూడా ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో.. ప్రతి మలుపు ఏ గుర్తుని మిగుల్చుతుందో అంత సస్పెన్స్ అంత రహస్యం…
కర్ర పట్టుకొని నెమ్మదిగా శివ మంత్రమేదో జపం చేస్తూ నా పక్కనే కూర్చున్నాడు ఆ ముసలాయన.
“అంత రహస్యమే బిడ్డ చావు పుట్టుకలతో పాటు ప్రతి క్షణం కూడా పెద్ద రహస్యమే అని చెప్పాడు.” ఒక్క సారిగా ఉలిక్కి పడ్డాను ఒక్క నిమిషం అర్ధం కాలేదు.
నిజంగా ఏంటి ఈ తాత నా ఆలోచనకు తన మాట అనుకోకుండా కలిసింద లేక…. అనే ఆలోచనలో ఉన్న
మళ్ళీ తానే మొదలు పెట్టాడు. “ప్రపంచానికి మన మనసు కనపడితే అంత గగుర్పాటే గగ్గోలాలే.”
ఒక్క నిమిషం పిచ్చెక్కిపోయింది.
ఇంతకి నువ్వు భగవంతున్ని నమ్ముతావ? భగవత్ తత్వాన్ని నమ్ముతావ? అని సూటిగా నా కళ్ళలోకి చూస్తూ అడిగాడు.
నాకు ఏది వాస్తవమో ఏది అవాస్తవమో తెలీదు తాత అన్నాను.
వాస్తవం అనే గమ్యస్థానానికి అవాస్తవం అని నమ్మించే గంతలను కట్టుకొనే వెళ్ళాలి. అప్పుడే వాస్తవం మరింత శక్తివంతమవుతుంది. అనే సమాధానం వినపడింది. అది కూడా అర్ధం కాలేదు. ఆ మాటల్లో ఏదో రహస్యం దాగుంది అనిపించింది.
ఆ వెంటనే.. రహస్యాన్ని ఇప్పుడు రహస్యంగా ఉంచగలిగితేనే మరో తరం పాత రహస్యాన్ని చేధించే పరిశోధనలో కొత్త రహస్యాన్ని సృష్టించగలరు. అయిన ఇప్పుడు రహస్యం లో దాగిన వాస్తవాన్ని ఎవరు నమ్మగలరు. నమ్మించాల్సిన అవసరం భగవంతుడికి లేదు నమ్మే ఓపిక మనిషికి లేదు. అందుకే భగంతుడు ఎంతో దూరంలో ఉంటాడనే భ్రమలో ఉంటూ దూరం లోనే పెట్టేస్తారు మానవులు. భగవంతుడు ఏదో చెప్తాడు తమకేదో అర్ధమవుతుంది. వారు వేరొకరికి ఇంకేదో చెప్తుంటారు. ఇక అసలు రహస్యం ఎప్పటికి రహస్యంగానే ఉండిపోతుంది.
తన మాటలతో మరింత ఆశ్చర్యం కలిగింది నిజంగానే నా మనసుని వినగలుగుతున్నాడ? ఒకేసారి వింత వింత ప్రశ్నలు నన్ను చుట్టూ ముట్టాయి.
వర్షం మరింత పెరిగింది. పచ్చని పొలాలు నిండి పోయాయి. ఏడు కావస్తోంది వీడు ఇంకా రాలేదు. మరో వైపు కాస్త గాబరా మొదలయ్యింది. కరెంటొచ్చింది వెంటనే ఫోన్ చార్జింగ్ పెట్టాను.. నో సిగ్నల్స్.
తాత మంచంలో పడుకొని ఏదో జపం చేసుకుంటున్నాడు.
మనసుల్ని చదివే శాస్త్రం ఒకటుంటుంది అని బలంగా నమ్మే నాకు తాత మాటలు అలవాటైపోయాయి. రమేష్ వచ్చి పక్కన కూచొని వచ్చి రాని తెలుగులో వర్షం పడుతోంది కదా దారి సరిగా ఉండదు మొత్తం నీళ్ళతో నిండిపోతుంది ఎక్కడైనా చిక్కుకున్నారు కావచ్చు అని..
నాగ రాజు వాళ్ళ అమ్మ కొంగు చుట్టూ తిరుగుతూ వంట చేస్తుంటే చూస్తున్నాడు. పప్పుచారు గుమ గుమ లాడుతుంది. రమేష్ పాలు పితుకేందుకు గేదల వైపు వెళ్ళాడు.
కంగారు పడకు వస్తారు లే అని మంచం మీది నుండే చెప్పాడు. సరే తాత అన్నాను.
ఆలోచనలన్నీ ఎవరినో గుర్తు తెచ్చుకొనే ప్రయత్నం చేస్తున్నాయి.
అచ్చంగా కొన్ని ఏళ్ళ క్రితం ఓ గడ్డం ముసలాయన ఇంటింటికి బిక్షం అడుక్కొని మా ఇంటికి దగ్గరలో ఉండే గుట్ట మీద గుడి వద్ద ఉండే వాడు. అప్పట్లో మా బోటి పిల్లలంతా పిచ్చోడు పిచ్చోడు అంటూ వెంట పడే వారు. మనిషి చాల సన్నగా ఎముకలు తేలి గట్టిగ ఉండే వాడు. తనని చూడాలంటేనే నాకు భయం. ఎవరిని ఏమనే వాడు కాదు తనలోకంలో తాను ఉండే వాడు. ఎప్పుడు అర్ధం కాకుండా ఏవేవో మాట్లాడుతుండే వాడు అక్కడే భధ్రకాళి చెరువులో స్నానం చేసేవాడు. కొన్ని సంవత్సరాలు గడిచాక తనని అలా చూడడం అలవాటయ్యింది. చిత్రమైన విషయమేంటంటే తను చనిపోయే ముందు ఇక నేను చనిపోబోతున్నానని చెప్పడం. అతనిదొక పెద్ద కథ తనని దగ్గరిగా చూసిన వాళ్ళు తన గురించి చిత్రమైన సంగతులు చెప్పేవారు.
ఆ తరువాత మళ్ళీ ఈ తాత.. నిజంగానే సైన్స్ కి అందని ఎన్నో రహస్యాలు ఉంటాయని తెలిసిన
ఏమి తెలియని మోసగాళ్ళు దొంగలు సాధువుల వేషం వేసుకొని అమాయక ప్రజల్ని పీడించే వాళ్ళని చూసి చూసి అసలు వాస్తవులు ఎవరో తెలుసుకొనే సమయం కాని ఆలోచన కాని మనం ఎప్పటికి రానివ్వమేమో..
నిజమే తాతా చెప్పింది “నమ్మించాల్సిన అవసరం భగవంతుడికి లేదు నమ్మే ఓపిక మనిషికి లేదు” మిగతాదంత రంగులు పూసి భ్రమలోకి దింపడమే. దానికి తోడు మనుషుల అవసరాలు, భ్రమకు వాస్తవికత అని నమ్మించే మరో కొత్త రంగు రాజకీయం చేరిపోతు పిచ్చిగా ఆడుకుంటున్నారు సమాజంతో..
లే.. భోజనం చేద్దాం అనడంతో అందరం కూచున్నాం బోజనానికి. నా ఆలోచనంత వీడు ఇంకా రాలేదనే.. ఊరు పేరు తెలియని చోట ఎవరో తెలియని మనుషుల మధ్య ఇలా ఆతిధ్యం తీసుకోవడం ఎందుకో చాల ఇబ్బందిగ మొహమాటంగా అనిపిస్తోంది. వర్షం శబ్దం, గంటె తో వడ్డిస్తున్న శబ్దం తప్ప మిగతాదంత నిశ్శబ్దం. ఎవ్వరం ఏం మాట్లాడకుండానే పప్పుచారుతో భోజనం పూర్తయ్యింది. రమేష్ అల ఊళ్ళో వరకు వేల్లోస్తా అని గొడుగు పట్టుకొని వెళ్ళాడు. వెళ్ళిన మనిషి గంటైన తిరిగి రాలేదు. వర్షం తన ప్రతాపం ఇంకా చూపెడుతూనే ఉంది.
బండి ఆగిపోయినట్టుంది. వాళ్ళు రావడానికి టైం పడుతుంది నువ్వు పడుకో బిడ్డ అన్నాడు తాత. సరే అని నెమ్మదిగా మంచంలో వాలాను..
నిక్కరేసుకున్న నాగ రాజు పుస్తకాలు ముందేసుకొని ఏవో రాస్తున్నాడు.. కళ్ళు మూసుకున్న కాసేపటికి నాగరాజు వచ్చిలేపి చేతికి దుప్పటి ఇచ్చాడు కప్పుకోమని. వెచ్చగా కప్పుకున్నాను. వింత వింత ఆలోచనలతో ఎప్పుడు నిద్ర లోకి జారుకున్ననో తెలీలేదు.
తెల్లగా తెలవారుతున్నట్టుంది. లేచి చూసా పక్కనే రెండు మంచాల్లో మనోహర్, రాజు. మనసు కుదుట పడింది. వాళ్ళని లేపకుండానే తాత నేను అల బయటికి నడిచాం. వీల్లెప్పుడొచ్చారు? ఏం జరిగిందట? అనే ప్రశ్నలు అడగకుండానే అల నడుచుకుంటూ వెళ్లాం.
పంటంతా వాగులో కొట్టుకుపోతోంది. తాత కళ్ళలో నాకు మాత్రమే కనిపిస్తున్న తడి.
చుట్టూ ఇంకా చల్లగానే ఉంది. స్వేట్టర్ జేబుల్లోకి చేతులు పెట్టేసిన కూడా చల్లని వణుకు ఇంకా తగ్గట్లేదు. తాత మాత్రం పంచ, పైన శాలువ బహుశ తాను నాలుగంట్లకే లేచినట్టున్నాడు. స్నానం చేసి బొట్లతో నిండుగా ఉన్నాడు. మేము ప్రకృతి మరియు మాకు మాత్రమే అర్ధమయ్యే పెద్ద నిశ్శబ్దం.
చాల సేపు పెద్ద బండ రాయిపై కూర్చొని వెళ్ళిన దారిలోనే కాసేపటికి తాత నేను వెనక్కి తిరిగాం. ఇంకా సూర్యుడి జాడ తెలిట్లేదు.
హే రఘు మామ గుడ్ మార్నింగ్ రా.. ఏరా బాగా నిద్ర పట్టిందా.. అని మనోహర్ ఎదురొచ్చాడు.
ఏమైపోయావ్ రా.. ఏం లేదురా బండి ఆగిపోయింది. నానా తంటాలు పడి అది రిపేర్ చేయించి రాత్రి రెండు గంటలకు వచ్చాం. రమేష్ వచ్చాడు కాబట్టి సరిపోయింది. ఆ వర్షంలో ఎటు వెళ్ళలేని పరిస్థితి. అంటూ చెప్పుకుంటు పోయాడు.
నేను వెంటనే తాత వైపు చూసా.. తనలో ఎలాంటి మార్పులేకుండా చాల నిశ్చలంగా నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉన్నాడు.
మొహాలు కడుక్కొని వేడి వేడి ఉప్మా తినేసి బయటికొచ్చాం. రమేష్ చేతిలో కొన్ని డబ్బులు పెడుతుంటే వద్దంటే వద్దంటూ తీసుకోలేదు.
తాత మా దగ్గరికొచ్చి
మనిషికి మనిషే సాయం. కష్టాల్లో నాలాంటి అనామకుడు నీ ఇంటిముందుకు వస్తే నువ్వు సాయం చేయవా ఇది అంతే.. ఉంచండి నాయన జాగ్రత్తగ వెళ్ళండి..
బండి స్టార్ట్ చేసాం. అది నెమ్మదిగా తిరుగు ప్రయాణం వైపు దూసుకుంది.
నేను మనోహర్ ఇద్దరం బీకరమైన నిశ్శబ్దంలో ఉండి పోయాం. ఆ నిశ్శభ్డంలో తాత మాట ఇంకా స్పష్టంగా వినపడుతూనే ఉంది.
“కష్టాల్లో నాలాంటి అనామకుడు నీ ఇంటిముందుకు వస్తే నువ్వు సాయం చేయవ?!”