Home > కథనం > స్మృతి సౌరభాలు

స్మృతి సౌరభాలు

ఇంకా వెతుకుతున్నాను. వెతకడం నాకు కొత్త కాదు మరిచిపోవడం నాకో సహజమైన అలవాటు ఏ వస్తువు ఎక్కడ పెట్టానో గుర్తుకు రాక వెతుకుతూనే ఉంటా చాల సేపు. చిత్రం ఏంటో గాని వెళ్ళిన చోటుకి పది సార్లు వెళితే తప్ప నాకు దారి గుర్తుకు రాదూ అంత మతి మరుపు. మొత్తానికి దొరికింది పుస్తకం దాని మధ్యలో చిక్కుకున్న ఒకప్పటి కాగితం. కాగితం అనడం కాదు గాని చిన్ని ఉత్తరం అది ఇప్పుడెందుకు? ఇప్పుడవసరం! అని అనిపించింది.

 

దాదాపు ఎంతో కాలమవుతోంది బహుశ ఓ పుష్కరానికి పై మాటే.. కొన్ని అనుబంధాలు మనకు తెలియకుండానే ఎలాంటి మనస్పర్ధలు లేకుండానే ఎంతో దూరానికి, కాలానికి కూడా అందనంత దూరంగా నెట్టబడతాయి. అలాంటి అనుబంధమే ఎందుకో గుర్తుకు తెచ్చుకోడానికి, గుర్తుకు రావడానికి కాలంతో పాటు ఇంత కాలం వేచి చూడాల్సి వచ్చిందేమో. ఊగుతున్న గతం తాలుకు వంతెనపై మనసుతో ఒక్కో అడుగును వేయిస్తూ.. అలా పదిహేనేండ్ల క్రితపు  హన్మకొండ పబ్లిక్ గార్డెన్ ని రోడ్ కి ఆనుకోనుండే గ్రంధాలయానికి ఎప్పటి లాగే అడుగు పెట్టా సాధారణంగా కుడి వైపు పత్రికల విభాగానికి ఎప్పుడో గాని వెళ్ళను నాకెందుకో ఆదివారం తప్ప ఏ రోజు పత్రికను చూడలేను. ఎప్పుడు మనిషిని మభ్య పెట్టె, భ్రమ పెట్టె, భయపెట్టే వార్తలు.. సమాజం లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం ముఖ్యమే కాని ఎన్నో విపత్తులు మన మీదకు కూడా పొంచి వస్తున్నాయి అనే భయంకరమైన వార్తలంటే బొత్తిగా చిరాకు. అందుకే ఇక నా దోస్తులేమో అందులోకి దూరే వాళ్ళు నేనేమో మాసపత్రికలు పుస్తకాలుండే, నడుస్తుంటే నాకు సూటిగా ఎదురుగా చివరగా ఉండే విశాలమైన గదికి అలవాటు ప్రకారంగా చేరుకునే వాణ్ణి.. గదిలోకి చేరుకోగానే కుడి వైపు సంతకం దిద్ది ఎడం వైపు అందరిని దీక్షగా పరీక్షించే లైబ్రేరియన్ వైపు ఒక చూపేసి వెళ్లి పెద్ద పుస్తకాల అలమారా దగ్గరలో వెనక నుండి గాలి బాగా వీచే కిటికీకి వెన్ను చూపేల కూర్చొని తోచిన ప్రతి పుస్తకాన్ని గంటలకొద్దీ నమలడం అప్పట్లో అలవాటైన ఒక వ్యసనం..  ప్రతి రోజు లాగే ఆ రోజు కూడా పుస్తకాలన్నీ మూకుమ్మడిగా ముక్కున వేలేసుకొని కిక్కురు మనట్లేదు. వాటిని చూస్తున్న ప్రతి సారి ధ్యాన ముద్రలో ఉన్న జ్ఞాన సాధువులా  తలపిస్తాయి. వాటిని చూస్తున్నప్పుడల్లా సాధువులు ఎందుకు మౌనంగా నిశ్శబ్ధంగా ఉంటారో అర్ధమవుతుంది. ప్రపంచం అంత పుస్తకాలను దాస్తున్న ఆ అలమారలో ఉందేమో అనే ఆశ్చర్యం కూడా కలుగుతుంటుంది. లోకం అంతా కూడా అరచేతిలో ఇమిడి వేలుతో తిప్పే ప్రతి పేజిలో బంది అయి నాతో ముచ్చట పెడుతుందని వింతగా మురిసేవాన్ని..

ఎప్పుడు నిశ్శబ్దం తొణికిసలాడే ఆ చోటులో కిటికి గుండా  వీచే గాలి కమ్మని సంగీతాన్ని తలపిస్తూ ఆ సవ్వళ్ళు మనసుని  పుస్తకాల్లోని లోకాలకు యిట్టే తీసుకెల్దుండే.. ఆ గదిలో ఉన్నంత సేపు ఎవరు ఎవరితో పెద్దగ మాట్లాడుకోకపోయిన రోజు కనిపించే వ్యక్తులు నోరు మెదపకుండా చిరునవ్వుతో పలకరించుకునే వారు. అలా చిరునవ్వు పలకరింపులో పరిచమైన వ్యక్తే శంకర్ ఆ పరిచయం గదికే అంకితం కాకుండా నా అడుగులు కూడా తనతో నెమ్మదిగా సాగేవి రోడ్ కి అవతల పబ్లిక్ గార్డెన్ ప్రహారి గోడకి ఆనుకొని కాలానికి తగ్గట్టుగా సీత ఫలాలు, కంకులు, పరికిపళ్ళు , గేగులు, మామిడి పళ్ళు, అలా గ్రామాల్లో నుండి బుట్టల్లో బండ్లల్లో తెచ్చి జామకాయలు కోసి ఉప్పు కారం చల్లి ఇచ్చే బండి కి, ఉడికించిన పల్లిలను పొట్లం కట్టి నిమ్మకాయ పిండి ఇచ్చే ఇంకో బండికి అటు పక్కనో ఇటు పక్కనో పెట్టుకొని అమ్మే వాళ్ళు. రోజు గ్రంధాలయం నుండి అడుగు బయట పెట్టడం ఆలస్యం ఏది కనపడితే అది కొనుక్కోవాలనే ఉండేది నాకు. ఎప్పటిలాగే జేబు ఎలాంటి బరువు లేకుండా చాల స్వచ్చంగా ఉండేది. శంకర్ జేబులో వారానికోసారి ఐదు రూపాయలనుండి ఇరవై రూపాయల వరకు ఉండేవి. అవి వారానికి సరిపడే విధంగా మేమిద్దరం  ఖర్చు పెట్టేవాళ్ళం. పండో లేక పల్లిలో కంకో ఏదో ఒక చిరు తిండి తీసుకొని గార్డెన్ లోకి అడుగు పెట్టి కర్ర పట్టుకొని ముందుకు అడిగేస్తున్నట్టు కనిపించే తెల్లని గాంధీ విగ్రహం దగ్గర మెట్ల మీద కూర్చొని నెమ్మదిగా లాగించేవాళ్ళం. అప్పుడప్పుడు గార్డెన్ కమ్యునిటీ హాల్ లో రాజస్థానీ మేళాలు జరుగుతుండేవి జరుగుతున్న రోజుల్లో ఎక్కువ సేపు అక్కడే గడిపే వాళ్ళం. శంకర్ బహుశ నా కన్నా వయసులో కాస్త పెద్ద వాడు ఎక్కువగా పుస్తకాలతో గడుపుతూ పొద్దున్న ఇంటింటికి పేపర్, పాల ప్యాకెట్లు వేస్తుండడం ఇక పరిక్షల సమయంలో పరీక్షా సెంటర్స్ లో ఏదో ఒక సెంటర్ దగ్గర ఎంసెట్ ఈ సెట్ కోచింగ్ సెంటర్ల కరపత్రాలు నలబై రూపాయలకోసం సూర్యుడు ఈ పక్కనుండి ఆపక్కకి ఒదిగే వరకు అక్కడక్కడే తిరుగుతూ అందరి చేతుల్లో పెడుతుండే వాడు. బహుశ సమాజంలో మెలగగలగడం బ్రతకగలగడం అప్పటికే అలవాటయ్యిందేమో ఎప్పుడు వాస్తవానికి దగ్గరగా ప్రపంచానికి దూరంగా తన ఆలోచనలు ఉండేవి. డిగ్నిటీ పేరుతో మనుషుల్ని మషిన్లు గ మార్చే రోజులు అప్పుడే కొత్తగా మొదలవుతున్నాయి. ఆ తరుణంలో నాకు శంకర్ ఒక ఆదర్శం. ఏ పని చేసిన దానికి గౌరవం ఇవ్వాలని మన చుట్టూ ఉన్న చిన్నా చితక కార్మికుల నుండి బడా వ్యాపారాలు ఉన్నతాధికారులు ప్రతి ఒకరు కూడా కష్టపడి పని చేసుకుంటూ చేసే పనిలో ఆనందం వెతుక్కుంటున్నారు. అందులో తప్పేముంది అంటూ ఒకరికి హాని కలిగించని ఏ పనైనా ఇష్టంగా చేసేవాడు వచ్చిన ప్రతిఫలాన్ని కళ్ళు  పెద్దవిగా చేసి చూసుకుంటూ మురిసిపోయేవాడు. ఇక మా ఇద్దరికి చెడు అని ముద్రేసుకున్న ఏ అలవాట్లు లేకపోవడంతో చాల ధైర్యంగ గర్వంగా ఉండే వాళ్ళం. సమాజం గుర్తించ తగ్గ చదువు లేక పోయిన మానవత్వానికి సరిపడా సంస్కారం మనిషిని అనిపించుకోగలిగే సభ్యత తనకి మెండుగా ఉన్నాయి. తన మాటలు ఎప్పుడు ఉత్తేజితంగా ఉండేవి మంచి మనసుతో ప్రపంచాన్ని గెలిచేయ్యోచ్చు అనే గట్టి నమ్మకం నాలో బహుశ తన సాంగత్యంలోనే అలవడిందనే చెప్పుకోవాలి.

ఒకరోజు పబ్లిక్ గార్డెన్ లో నేరెళ్ళ వేణుమాధవ్ కళ ప్రాంగణం లో జీవ హింస మహా పాపం పేరుతో శాకాహారం ప్రాముఖ్యతను తెలియచెప్పే మహత్తర కార్యక్రమంలో నాకు శంకర్ కి లక్ష్మి పరిచయం అయ్యింది ఆ పరిచయం తరువాత శాకాహార నినాదం వాడ వాడ ల స్కూల్ కాలేజీ స్టూడెంట్స్ తో నిర్వహించిన ర్యాలి లో పాల్గొన్నాం. అంతా అయ్యాక నాలుగు రోజుల తరువాత యధావిధిగా లైబ్రరీ ధాటి గార్డెన్ లోకి వెళ్ళగానే లక్ష్మి కనిపించింది. అప్పటి వరకు నేను గమనించిన అమ్మాయిల్లో కన్నా కాస్త పరిణితి చెందిన ఆలోచన విధానం తన మాటల్లో కనిపించడంతో నాకన్నా పెద్దావిడ అనే భావన పడిపోయింది అందుకే ఇక తన పేరుకి గారు తగిలించి మాట్లాడడం మొదలయ్యింది.

ఎంత చేసిన మాంసాహారం ఎంత పాపమో ప్రజలకి తెలియట్లేదు అని వాపోతుంటే దానికి శంకర్ మనం చేయగలిగింది మనం చేస్తాం. ఏ ఉద్యమానికైనా ఫలితం వెంటనే రావాలనుకోవడం మన అమాయకత్వం. ప్రపంచానికి మంచి చేసేవాడు ఆ మంచిని ముందు మనం మన చుట్టూ అలవరుచుకోవాలి. బహుశ నన్ను మాంసాహారం నుండి బయటపడేసిన అనేక ప్రేరెపనలో ఇది కూడా ఒక కారణమే. నడుం బిగించి ఎంత కష్టపడిన ఇన్ని సంవత్సరాలైనా నా కుటుంబం లో నా మిత్రుల్లో ఒక్కరిని కూడా పూర్తి శాకహారిగ మార్చలేకపోయాను. ఆ టైం లోనే కరాకండిగ ఒక నిర్ణయం తీసుకున్నాం ముగ్గురం. ఎవ్వరిని మార్చలేక పోయిన మనం మంసాహరులుగా మారకుడదని. ఆ శపథం మాట పక్కన పెడితే నను పూర్తి శాకహారిగా మార్చిన బలమైన ప్రేరేణ మాత్రం వేరే చోట కలిగింది.

లక్ష్మి తాను మెడిసిన్ చేయలనుకునేది. నాన్న డాక్టర్ చాల స్వతంత్రురాలు అభ్యుదయ భావాలు ఎక్కువగా ఉండేవి. ఇంచుమించి శంకర్ లక్ష్మి ఆలోచనలు చాల పరిణితి చెంది ఒకేలా ఉండేవి. కాలం తో పాటు ఎవరి కాలంలో వాళ్ళం బిజీ ఐపోయీ రోజు కాకపోయినా వారానికో పది రోజులకో కలుసుకునే వాళ్ళం.

ఆ రోజు సాయంత్రం శంకర్ నేను అశోక టాకీస్ రోడ్ మీద మంచి మంచి సీనరీలున్న పోస్టర్లు అమ్మే చోటుకి చేరుకొని చెట్లు చేమలతో కళకళ లాడే అందమైన దృశ్యం ఉన్న పోస్టర్ ఒకటి ఐదు రూపాయలకి కొని చౌరస్తా లో పెద్ద కాలువ పక్కన జుబైర్ బుక్ స్టాల్ కి ఆనుకొని ఉన్న ఫ్రేములు తాయారు చేసే దుకాణం లో పదిహేను రూపాయలిచ్చి ఆ పోస్టర్ ని కార్డు బోర్డ్ ఫ్రేం తయారు చేపించి బుక్ స్టాల్ లో దొరికే మెరిసిపోయే గిఫ్ట్ ప్యాక్ కవర్తో చక్కగా ప్యాక్ చేసి దాని పైన ఒక పేపర్ అతికించి మరుసటి రోజు ఆదివారం ఉదయం ఆరు గంటలకి నేను శంకర్ పబ్లిక్ గార్డెన్ లో రోడ్ మీద లక్ష్మి కోసం ఎదురు చూస్తూ ఉండగా తను వచ్చింది. చేతిలో ఉన్న గిఫ్ట్ ని తన చేతికందిస్తూ హ్యాపీ బర్త్ డే లక్ష్మి అన్నాడు. తనతో పాటే నేను కూడా వంత పాడాను. పైన అతికించిన కాగితం మీద హ్యాపీ బర్త్ డే అనే పదాలు రాసి ఇట్లు శంకర్ అని రాసిచ్చింది నేనే..

 

ఇక అక్కడినుండి మా ముగ్గిరి ప్రయాణం చిన్న గ్రామం లోకి.. తన తో ఒక బాగ్ తెచ్చుకుంది ఆ బ్యాగ్ తీసి మా ముందు పెట్టింది నాకెప్పుడు తిండి ధ్యాసే బర్త్ డే కదా తినడానికి ఏమైనా తెచ్చిందేమో అనుకున్న తీర చూస్తే బ్యాగ్ నిండా చింత గింజలు, సీత ఫలం గింజలు దాదాపు రెండు మూడు కిలోలుంటాయి. నాకు అర్ధం కాలేదు. మా ఇద్దరి చేతుల్లో పెడుతూ తను ఒక చేత్తో తీసుకొని అల నడుచుకుంటూ దారికి ఇరువైపులా విసురుకుంటూ ఒక నాలుగు కిలో మీటర్లు నడిచాక గాని గింజలు విసిరేసే మా ఆట ఆగలేదు. అప్పుడు చెప్పడం మొదలు పెట్టింది ఇప్పుడు మనం విసిరినా కొన్ని వందల గింజల్లో ఒక మూడు చెట్లు మొలకెత్తిన చాలు కొంత మందికి నీడనిస్తుంది ఆ నీడకు ఒకప్పటి మనమే కారకులం అనే త్రుప్తి. అందుకే మీతో ఈ ఆట ఆడించాను అంది. ఆ రోజు తో నాకు తెలియని మరో లక్ష్మి కనిపించింది.

అలా మా పరిచయం కొనసాగుతున్నది.

 

ఓ రోజు నన్ను శంకర్ ఎం జి ఎం హాస్పిటల్ కి తీసుకెళ్ళాడు అక్కడ కొందరు  రోగులు పడి ఉన్నారు. తీర వాకాబు చేస్తే కల్తి సార తాగి ఎనిమిది మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని తనకు తెలిసిన పరిచయమున్న  తన దోస్తులని కూడా తీసుకొచ్చాడు వారందరి సహాయంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ ఎనిమిది మందిని ఒక గదిలో వరసగా పడుకోబెట్టి డాక్టర్లచే వైద్యం అందిస్తున్నారు. శంకర్ మరో పదిహేను మంది కలిసి హాస్పిటల్ బయట రోడ్ మీద కల్తి సారా అమ్ముతున్న వాళ్ళని ప్రబుత్వం శిక్షించాలి అనే ఫ్లై కార్డ్ లు వెంటనే తయారయ్యాయి. గట్టిగ అరుస్తూ నినాదాలు చేస్తున్నారు. వచ్చే పోయేవాళ్ళు మా చుట్టూ మూగారు కాసేపట్లోనే దాదాపు రోడ్ మొత్తం జనాలతో కిక్కిరిసింది. దానికితోడు కుల సంఘాల రాజకీయ నాయకులు కొందరు వచ్చారు ఉద్యమం లో ప్రసంగించారు. జరుగుతున్న తతంగంలో ఎవరో వచ్చి చెప్పారు ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారని. నేను శంకర్ ఆ గదిలోకి వెళ్ళాం. అప్పటికే జనాలు కిక్కిరిసిపోయారు వారి వారి బంధువులతో. చాల సేపు చూసి శంకర్ బయటికొచ్చాడు. తన వెంటే నేను కూడా హాస్పిటల్ కి దూరంగా వెళ్ళాం నిశ్శబ్దంగా నడుస్తున్నాం. చనిపోయిన వారిని దగ్గరగా చూడడం అదే మొదటి సారి ఆ ఏడుపులు నాకు భయంగా అనిపించాయి. అందుకే నేను కూడా ఏమి మాట్లాడలేక పోయా. శంకర్ ఏడుస్తున్నాడు వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. పిచ్చిగా అరుస్తున్నాడు నాకు ఎం చేయాలో తోచట్లేదు. దగ్గరికొచ్చాడు నా కళ్ళలోకి చూస్తూ చచ్చిన వాళ్ళలో మా నాన్న ఉన్నాడు అని నను దగ్గరికి తీసుకొని ఏడుస్తున్నాడు. నాక్కూడా ఏడుపు ఆగలేదు. నా తల్లి ఎప్పుడు చనిపోయిందో తెలిదు మాటలు రాని ఈ ముసలోడే నన్ను పెంచాడు. ఇప్పుడిలా వెళ్ళిపోయాడు. అని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు.

కాసేపటికి ఒక్క శవం తప్ప మిగతావన్నీ గది కాలి అయ్యాయి. బయట ఉద్యమం నెమ్మదిగా సద్దు మణిగింది మేము దూరం నుండే గమనిస్తున్నాం. రాజకీయ నాయకులూ గాని పోలీసులు గాని ఎవరు ఎం చేయట్లేదు అంత నిశ్శబ్దం యధావిధిగా రోడ్ వచ్చి పోయే వాహనాలతో మల్లి రద్దీ అయ్యింది. పేపర్ వాళ్ళు శవాన్ని నాలుగు వైపులా నుండి ఫోటోలు తీసుకున్నారు. పాపం శంకర్ జేబులో డబ్బులు లేవు ఎం చేయాలో తోచక దగ్గరికి కూడా వెళ్ళలేదు. హాస్పిటల్ వాళ్ళు లోపలికి తీసుకెళ్ళారు. ఆ తరువాత ఎం జరిగిందో నాకు శంకర్ కి ఏమి తెలియదు ఇప్పటికి.

 

ఈ సంగటన జరిగిన చాల కాలానికి మళ్ళీ కలిసాం ముగ్గురం లక్ష్మి కి సంగతి తెలిసినట్టుంది చాల బాధ పడింది. అప్పటికే ఒకరికొకరు మానసికంగా దగ్గరయ్యరనిపించింది. తనకని ఎవరు మిగలని శంకర్ కోసం లక్ష్మి ఉండడం నాకెంతో ఆనందం వేసింది. ఇద్దరికీ కూడా ఎవరికీ వారు ఏం చేస్తున్నారో ఏం చేయబోతున్నారో వారికి ఒక స్పష్టత ఉంది. వారిరువిరి నడుమన ఉన్న ప్రేమ బహుశ సమాజానికి అర్ధం కానిది అర్ధం చేసుకోలేనిది. అందుకేనేమో వారిరువురి అందరికి దూరంగా ఉంటారు. రెండేళ్ళ పరిచయం వారిని జీవితాంతం కలిసుండగల నమ్మకాన్ని శక్తిని ఇచ్చింది.

 

ఆ రోజు మధ్యాహ్నం పద్మావతి ఎక్స్ప్రెస్స్ మరి కొద్ది సేపట్లో ప్లాట్ ఫాం కి వస్తుందనగా నేను శంకర్ ఆటో లో వరంగల్ రైల్వే స్టేషన్ కి చేరాం. అప్పటికే లక్ష్మి శంకర్ కోసం టికెట్ తీసుకుంది. మేము కలిసి బతకాలి అనుకుంటున్నాం. అందుకే దూరంగా వెళ్దామనుకుంటున్నాం.  మా ప్రేమని అర్ధం చేసుకునే విశాల హృదయం ఎవరికీ లేదు అలాంటి చోటులో మేముండలేము. అనే మాటతో లక్ష్మి శంకర్ చేతిని తన చేతిలోకి తీసుకుంటూ ఇద్దరు ట్రైన్ ఎక్కారు. ట్రైన్ లో వెళుతున్న రెండు హృదయాలతో నా హృదయాన్ని పరుగులు పెట్టించి ట్రైన్ వెళ్ళిన చాల సేపటి వరకు నేనక్కడే కూర్చుండి పోయా.

 

చాల కాలం తరువాత నను చేరిన ఉత్తరంలో

ప్రేమించడం ఆనందం… ప్రేమింపబడడం మహదానందం… అనే పరిచయ వాక్యాలతో ఆ లెటర్ మొదలయ్యింది. నను రమ్మని ఆహ్వానం. వెంటనే తిరుపతికి ప్రయాణం. ఒక రేకుల గదిలో ఉన్నారు. శంకర్, లక్ష్మి చదువు కోసం తను తిరుపతికి రాగానే చూసుకున్న పని చెప్పులు కుట్టడం అదొక్కటే వాళ్ళ నాన్న తనకి వెన్నకన్న ముందు పెట్టిన విద్య. అలా మొదలు పెట్టి ఆ పని ఈ పని అని కాకుండా దొరికిన ప్రతి పని చేస్తూ లక్ష్మిని చదివించాడు అతి కష్టం మీద లక్ష్మి తాను అనుకున్నట్టుగా మెడిసిన్ పూర్తి చేసింది. చివరగా నాకు తెలిసినప్పటికీ తిరుపతి నుండి వారి మకాం పూరి క్షేత్రానికి మారిందని దేవుడి దయవల్ల ఏ లోటు లేదని. పూరి లో ఎక్కడున్నారో అనే సంగతి ఇప్పటికి తెలియలేదు. జీవితం లో మళ్ళీ నాకు కలిసిన కలవక పోయినా వారి ప్రపంచంలో మహదానందం గ ఉంటారని తలుస్తున్న…

 

నిజమే ప్రేమించడం ఒక ఆనందం ప్రేమింప బడడం మహదానందం మనం ఎంతో మంది ప్రేమికులని చూసాము. కాని ఈ జంట మాత్రం నాకు ఎప్పుడు ఆదర్శమే నాకే కాదు అందరికి

ఎందుకంటే శంకర్ కి చిన్నప్పుడే పోలియో వచ్చి కుడి కాలు చచ్చు పడి పోయింది. కర్ర సహాయం లేకుండా నడవలేని పరిస్థితి.. తనని అవయవంతో కాక మనసుతో అర్ధం చేసుకొని తనతో జీవితం సాగించడానికి సిద్దపడి కలిసుంటున్న లక్ష్మికి హాట్స్ ఆఫ్.. లక్ష్మి కోసమే జీవిస్తున్న నా మిత్రుడు శంకర్ కి హాట్స్ ఆఫ్..   

 

వారి చివరి సారి కలిసినా సన్నివేశం తరువాత సాగినా నా పదేళ్ళ ప్రస్తానం లో

ప్రపంచం మనుషుల్ని మిషిన్లుగా మారుస్తూ అనుబంధాల అత్మీయతలను సైతం డబ్బుతో కొలుస్తూ సున్నితత్వానికి అర్ధం మారిపోయిన ఈ సమాజం లో నా ఈ మనసుని మనసుతో ప్రేమించే మనసులు నా కోసం ఇంకా మిగిలే ఉన్నాయంటూ ఆత్మీయుల్ని ఈ ఫేస్ బుక్ కల్పించిది. ఇదే ఫేస్ బుక్ వాళ్ళని కూడా కల్పిస్తే ఎంత బావుండు.

 

వచ్చే నెల ఫోటోగ్రఫీ పుణ్యమా అని ఓ పెళ్లి షూట్, ఓ క్యాలెండర్ షూట్ కోసం పలాస వెళ్తున్నాను. అక్కడి నుండి నా ప్రయాణం పూరి, కోణార్క్, చిలికా లేక్.. చూడాలి పూరి వరకు వెళ్తున్న వారిని కలిస్తే మహదానందం కలుసుకోలేక పోయినా మనసులో వారి జ్ఞాపకాలు చెదరకుండా పదిల పరుచుకుంటూ…

Categories: కథనం
  1. No comments yet.
  1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: