నా పేరు నయీం…. (చిన్న కథ)
ఉదయం 5.00 గ..
దూరాన మసీదు మైకు గొట్టం నుండి నమాజు తో తెలవారింది.
వస్తున్న నమాజు శబ్దానికి మెలకువ వచ్చింది.
దుప్పటి తెరుచుకొని ఒళ్ళు విరుచుకుంటూ ఒక చేత్తో కళ్ళజోడు కోసం వెతుకుతూ, నెమ్మదిగా లేచాడు.
ఆదొక రేకుల గది,
సాధారణంగా ఆ గది లో అతను తప్ప ఎవరు లేరు ఇంకా పెళ్లి కాలేదు.
సాదా సీదాగ కనిపించే తనకి ఓ పాతికేల్లుంటాయి.
మనిషి చూడడానికి కాస్త నేమ్మధస్తుడిగా, అమాయకత్వంతో, ఎప్పుడు ఆలోచనతో గడిపే రకం.
దొరికిన కల్లజోడుని టేబుల్ పై పెట్టి. వాష్ బేసిన్ దగ్గరికి వెళ్లి, నిద్ర మబ్బు పోవడానికి వాష్ బేసిన్ కులాయి విప్పి దోసిలితో నీళ్లు ముఖాన జల్లుకొని రెండు చేతులతో ముఖాన్ని నుదురు దాటిస్తూ కళ్ళు తెరుచుకుంటూ అద్దంలో కనిపిస్తున్న తన కళ్ళని సూటిగా చూస్తుండగా..
నెమ్మదిగా తన మనసు మాట్లాడడం మొదలు పెట్టింది.
“నా పేరు నయీం….”
కాళ్ళు చేతులు కూడా శుబ్రం చేసుకొని కింద పొడిగుడ్డను పరిచి తలకు టోపీ పెట్టుకొని నమాజుకు సిద్దం అవుతాడు. నమాజు పూర్తిచేసి,
“మా అమ్మి పేరు జుబేద బేగం
మా అబ్బ సుల్తాన్ పాషా
నాకో చెల్లి నస్రీన్ ఫాతిమా
తమ్ముడు ఇక్బాల్”
చొక్కా పాయింటు వేసుకొని కళ్ళజోడు తొడుక్కొని రేకుల గదికి తాళం బిగించి మెట్లు దిగి, రోడ్ మీద బస్ కోసం వేచి చూస్తుండగా బస్ వచ్చింది.
పరుగులాంటి నడకతో బస్ ఎక్కాడు. కాళీగా ఉన్న సీటులో కూర్చొని నెమ్మదిగా కిటికీ నుండి వెనక్కి దూసుకెళ్తున్న ప్రపంచాన్ని చూస్తూ ముందుకు సాగుతున్న బస్ లో సాటి జనాల్లో ప్రయానికుడిగా ఉన్న ఓ ఒంటరి వ్యక్తి.
ఆలోచనలన్నీ వెంట వెంట దూసుకొస్తున్న. చూపులు మాత్రం కిటికీ పక్కన వెనక్కి సాగిపోతున్న బ్రతుకు చిత్రాలను ఆకాశ హర్మలను చూస్తూ…
మా అబ్బ… ఇంటింట ప్లాస్టీకు సామానును తోపుడు బండి మీద కొనుక్కొని, పెద్ద గరాజుకెల్లి అమ్మేస్తుంటాడు.
మా అమ్మి… మూరెడుకు భారాన చొప్పున పూలు రోజంతా అల్లుతునే ఉంటది.
నా చెల్లికి పెల్లిచేసినం మా భావ కోటి చౌరస్తాల చెరుకురసం పిండుతనే ఉంటడు. మిగిలిన కట్నం డబ్బులు తేలేదని చెల్లిని రోజు ఉతికి ఆరేస్తునే ఉంటాడు.
నా తమ్ముడు మస్తు సధువులు సదవాలి అని తెగ సదువుతుంటాడు. ఆడికి సదువుమీదున్నంత ఇష్టం నాకు లేదు. ఆడ్నైన సదివిద్ధామంటే పైసల్లేవు.
పైసలు.. ఇవి లేకే.. మా ఇంట్లోల్ల తిప్పలన్ని.
మా అబ్బ సేప్ప్తుంటోడూ అరేయ్ నీకు ఏ ఒక్క పనికూడా చాతగాదు. ఎందుకు పనికిరాని అసమర్దుడివి.
నిజమే నేను ఎందుకు పనికి రాని అసమర్దున్నే… నేను సమర్దున్నే అయితే ఇంకా నా వాళ్ళు ఇలా ఎందుకుంటారు.
నేనే సమర్దున్నైతే మా ఇల్లు ఇరుకుగల్లిల ఎందుకుంటది?
కట్నం డబ్బుల కోసం చెల్లి పడుతున్న తిప్పలు తీరేవి.
బహుశ మా అబ్బ ఎప్పుడు నన్ను సమర్ధుడిగా చూడ లేక పోవడమే నేనిలా ఉండడానికి కారణం.
ఎలాంటి బావోద్వేగాలు అంటకుండా, ప్రపంచం లోనే ఉంటూ ప్రపంచం తో పనిలేనట్టుగా మిగిలిపోయా, నా అసమర్ధతకి చిహ్నంగా ఓ ఒంటరి వాడిగా మిగిలిపోయా..
నన్ను నేను నిరుపించుకోవాలనుకుంటే కావాల్సింది డబ్బు.
డబ్బు కేవలం డబ్బు ఆ డబ్బే మా ఇంట్లో వాళ్ళ దాహం తీరుస్తుంది. నన్ను సమర్దున్ని చేస్తుంది.
ఎలాగైనా చేసి డబ్బు సంపాదించాలి.ఏంటో ఈ డబ్బు..
నేనెవరో తెలియనంత వరకు ప్రపంచానికి నేనొక అజ్ఞాతాన్ని, నేనేంటో తెలిసిన నాడు ప్రపంచం చూపంత నా వైపే.
కసయోడికి తన కుటుంబం మీద ప్రేమ ఎక్కువ.
అయిన వాడి చేతిలోని కత్తికి పదునెక్కువ.
గొర్రె పోతు మెడకి నునుపెక్కువ
దానికి తనకన్నా కసయోడిమీదే నమ్మకం ఎక్కువ
ఇక ధర్మ సందేహంలో పాపా పుణ్యాల తావెక్కడ…!
బ్లేడి లైఫ్
ఏది ధర్మమో ఏది న్యాయమో ఎప్పుటికి నాకు అంతుపట్టని చిక్కు ప్రశ్న. ఒకడి మంచి మరొకడికి చెడు. అదే ధర్మం అని సమర్ధింకోవడమే జీవితమా? ఏంటో.. మనకు తెలిసిందే న్యాయం అనే ముసుగు తొడిగి మనసు మనల్ని ఊపిరాడనివ్వదు.
ఆలోచనలు తెంపుతూ వాస్తవంలోకి వచ్చి చూడగా బస్సు అఫ్జల్ గంజ్ చేరుకుందని తెలుస్తుంది.
ఓ నేను పుట్టి పెరిగిన నా ఆనవాలు నా కోసం ఎదురోస్తున్నాయి.
కలీల్ గాడు ఈ గల్లిలల్లనే పరిచయం అయ్యాడు. నా ఒంటరి ప్రపంచాన్ని అర్ధం చేసుకున్నది వాడొక్కడే. వాడే గనక లేక పోతే ఇపుడు నేనిలా మిగలకపోయేవాన్ని.. వాడి పరిచయం తరువాత వాడిని నమ్మడం మొదలు పెట్టడంతో వాడు నన్ను పనిలో పెట్టాడు. ఆరేడు నెలలనుండి దాదాపు మా కష్టాలన్నీ ఒక్కొక్కటిగా తీరుతున్నాయి. ఇక వాడి పుణ్యమా అని మరో కొద్ది గంటల్లో నేను దుబాయ్ కెల్లబోతున్న.. ..
ఆలోచనను హత మార్చుతూ చార్మినార్ స్టాప్ లో బస్సు ఆగింది.
అందరితో పాటు దిగి బస్ స్టాప్ నుండి బయటికి రాగానే. తచ్చాడిన ఆ చిన్న నాటి వాసనలు ఒక్కసారిగా వెంట పడ్డాయి.
మరో కొద్దిగంటల్లో నేను తెగ తిరిగిన ఈ చోటుకి దురం కాబోతున్న. ఉన్న ఈ కొన్ని గంటలు నేను పుట్టి పెరిగి తిరిగిన ఈ గల్లిలని హత్తుకోవాలని ఇక్కడికొచ్చ.
నోరు మేధపకున్న నా బ్రతుకికి నిలువెత్తు సాక్ష్యం ఈ చార్మినార్. నా చిన్ననాటి రోజులన్నీ ఈ రద్ది మనుషులమధ్యే గడిచింది. బ్రతుకు చిత్రాల నడుమ చిత్రంగా సాగేది కర్రతో నెట్టుకుంటూ పోయే నా టయీర్ ఆట.
ఏ మార్పు లేదు.. చార్మినార్ కి, దాని వాకిలి నిండా పరుచుకున్న జీవితాలకి.
ఏంటో ఈ జీవితం చూస్తుండాగానే కాలం అల పరుగులుతీస్తునే ఉంటుంది మన ప్రమేయం లేకుండా.
ఇప్పుడంత రద్దీ లేదు గాని పండగ దినాల్లో ఆ సందడే వేరు.
నేను నా ఇంట్లో వాళ్ళతో తప్ప ఎవరితో మాట్లాడింది లేదు.
అయిన అందరు నాకు పరిచయమే నేనే వారికి తెలియదు.
చెప్పానుగా ప్రపంచంతో పని లేనట్టు ఓ ఒంటరి పిచ్చివాడిగా గడిచింది చిన్నప్పటినుండి ఇప్పటి వరకు.
అయిన ఈ వీదులే నా నేస్తాలు, ఆ మక్కా మస్జిదె నా చోటు,
ఆ చార్మినార్ ఆలింగనంలో ప్రశాంతంగా సేద తీరేవాన్ని.
నెమ్మదిగా నడుస్తూ చుట్టూ చూస్తూ ఆలోచిస్తూ మక్కా మస్జిదు ఎదురుగా రోడ్డు మీద తోపుడు బండి మీద పొయ్యి పెట్టి దోసలు వేస్తున్న చోట ఆగి,
ఎక్ బట్టర్ దోస.. ఆర్డర్ ఇచ్చి తాయారు చేస్తున్న దోసలను చూస్తూ నెమ్మదిగా ఆలోచనలోకి…
మా అమ్మ తర్వాత నాకు తిండి పెట్టేది ఈడే నాకు ఊహ తెలిసినప్పటి నుండి రోజు పొద్దున్న వీడి దగ్గర టిఫిన్ చెయ్యందే రోజు గడవదు, దునియా తెలవదు.
ప్రతి రోజు చూసేవాన్ని ఏ రోజు ఎక్ దోస అనే పదం తప్ప ఇంకో మాట వాడితో పలికింది లేదు. ఏంటో చిత్రంగా ఈ రోజు కూడా ఏమి మాట్లాడలేక పోయా..
చేతికిస్తున్న దోసాని తీసుకొని నెమ్మదిగా తినడం పూర్తయ్యింది. మక్కా మస్జిదు లోకి వెళ్లి ఎగురుతున్న కపోతాలు, వాటికి దాన వేస్తూ పిల్లలని చూస్తూ.
ఈ మక్కలోనే ఎన్నో దువాలు చేస్తే అల్లా దయ వళ్ళ నేను పుట్టానట.
అందుకే అమ్మికి, అబ్బ జాన్ కి ఈ మసీదంటే ప్రాణం.
అల్లః యాడుంటాడో తెలియక పోయిన నీతోడు ఉంటాడ్రా… అని అమ్మ చెబితేనే నమాజు చేస్తున్నా…
నాకు తను ఉన్నాడన్న నమ్మకం ఇప్పటికి కలగ లేదు.
అమ్మ చెప్పింది కాబట్టి దేవుడున్నాడని నేను నమ్ముతున్న…
ఈ మెట్ల మీదే కూర్చొని పాపం పుణ్యం, ధర్మం న్యాయం, నరకం స్వర్గం, అని ఏమేమో చెప్పే టోడూ మా అబ్బ జాన్.. ఒక్క ముక్క అర్ధమైతే ఒట్టు.
నాకు అర్ధమైంది ఒకటే నను కన్నది నా తలిదండ్రులు వారే నా దేవుళ్ళు బస్..
అంతకు మించి ఎం చెప్పిన ఎం జరిగిన అంత పిచ్చిగా ఉంటుంది. అందుకే ఈ విషయాలకి నేను దూరం.
అమ్మ తరువాత నను అమ్మలా సేద తీర్చేది ఈ మసిదే అందుకే నాకు ఈ మసీదన్న కనిపించని దేవుడన్న ఇష్టమే..
నేను ఈ దేహాన్ని కాదంట… ఆత్మనంట… ఆత్మని కప్పుకున్న తొడుగు ఈ దేహమంటా కావచ్చు. నేను కాదనను.
చివరికి నేను అత్మనని నా మెదడు కూడా నమ్మింది కాని ఎం లాభం నాకు నాకు చెప్పినోడికి ఇద్దరికి ఇంకా అనుభవంలోకి రాలేదు.
నెమ్మదిగా బయటికొచ్చి చార్మినార్ వైపుకు అడుగులు. పొద్దున్న లేవడమే ఆలస్యం టయిరు పట్టుకొని దిని చుట్టూ తిరుగుతూ ఆడుకోవడం.
అబ్బాజాన్ చెంప పగలగొట్టినపుడు ఏడుస్తూ వచ్చి ఇక్కడే కూచునే వాణ్ని.
నేను ఇక్కడే కుర్చుంటానని మా అమ్మకి తెలుసు అందుకే మా అమ్మ భోజనం టైం కి వచ్చి నన్ను ఎత్తుకొని తీసుకెళ్ళేది.
ఈ చరిమినార్ చుట్టూ వీధులన్నీ ఎప్పుడు నన్ను హత్తుకుందామ అని చూస్తున్నాయి. ఈ వీదులకి ఈ చార్మినార్ కి మరి కొద్ది గంటల్లో నేను దూరం. కాదు కాదు నా మనసుకే నేను దూరం కాబోతున్న.
కిందికి దిగి చార్మినార్ మూల దుర్గ పూజని చూస్తూ..
ఎవరి నమ్మకాల్లో వారు ఉండడమే మంచిది. కనీసం ఆ నమ్మకల్లోనైన ఆనందంగా బ్రతుకుతారు. ఏంటో అప్పుడప్పుడు దేవుడున్నాడనే బ్రమ నిజమనిపిస్తుంది. కొందరి నమ్మకాలని చూస్తుంటే. ఉన్నాడేమో నిజంగానే రక్షిస్తున్నడెమో ఏమో.. ఎవరికి తెలుసు…
మెల్లిగా అడుగులు చార్మినార్ వొదిలి వీధిలోకి నడుస్తూ ….
కనపడే ఆ ఇరుకు గల్లిలోనే మా ఇల్లుండేది. కోల్ల లొల్లితోనే రోజంతా గడిచేది నాకు.
అన్ని తప్పని తెలిసిన తప్పు చేస్తూనే ఉంటాం. ఒకడు ఇంకొకడి మంచిని కోరేవాడైతే ఈ లోకమంతా ప్రవక్తలే, ప్రపంచం అంత సాదువులే. ఇది ఎప్పటికి జరగని తీరని ఓ అందమైన కల.
ఆలోచనలు ఇరానీ కేఫ్ దగ్గర ఆగిపోవడంతో లోపలికెళ్ళి కూర్చున్నాడు. ఒక చాయ్ ఆర్డర్ ఇచ్చాడు. ఇచ్చిన కాసేపటికి తెచ్చిన చాయ్ ని తాగుతూ.
నేను జ్ఞానినో అజ్ఞానినో తెలుసుకోవాలన్న తాపత్రయం లేదు.
అన్ని తెలుసనుకునే ముర్కున్ని, ఏమి తెలియదని సమర్ధించుకునే అమాయకుణ్ణి.
బయటికొచ్చిన కాసేపటికి కాస్తున్న ఎండలో మండుతున్న కడుపుని పట్టుకొని
కనిపించిన మదిన హోటల్ లోకి దూరి బిర్యాని ఆర్డర్ ఇస్తూ కూర్చున్నాడు.
బ్రతుకు పోరాటంతో పోలిస్తే, ప్రతి నినాదం, ధర్నాలు, జులుసులు, శాంతి పోరాటాలు, వర్గ పోరాటాలు, మత కలహాలు, అన్ని పనికిమాలినవే.
ఆకలేస్తే కడుపు మాడక మానదు. తెల్లారితే ఏదో ఒక పనిచేసుకొని బ్రతకక తప్పదు.
వచ్చిన బిర్యనిని తిని నెమ్మదిగా బయటికొచ్చి, కిల్లి వేసుకొని..
బస్సు స్టాపులో బస్ కోసం ఎదురుచూస్తూ, వచ్చే పోయే వాహనాలను చూస్తూ…
ఉన్న జీవితం లోనే అధ్బుతల్లేవు ఇక కళ్ళు మూసుకుంటే లేని లోకాల బ్రమలో ఏమస్తుందో.
సమాజం ఎప్పుడు మన ఆలోచనలకి వెనకబడి ఉంటుంది. ఆ ఆలోచనలని అందుకోడానికే ఈ ఉరుకులు పరుగులు.
బస్సు ఎక్కి కిటికీ వైపు కూర్చొని కొద్ది దూరం తర్వత కిటికిలోంచి కనపడిన చర్చి ని చూసి
నా చిన్నపుడు మా అబ్బ జాన్ ని అడిగా అందులో ఏముంటుంది అబ్బా అని.
మా అబ్బ చెప్తుండే మంచి అని చెప్పిన మంచి మనిషిని మోలలతో కొట్టి శిలువేసారు. ఏంటో ఈ లోకం ఎంత చెడు చేసిన పట్టించుకోదు. మంచి చేద్ధామనుకున్నోని ఒర్వదు.
అందుకేనేమో ఎలాంటి ఎమోషన్స్ లేని నాలాంటి బండ రాయి కసాయి లే ఈ లోకమంతా.
బస్ దిగి హుస్సేన్ సాగర్ ఆ మూలనుండి నడుస్తూ.. బుద్దిడికి చేరువయ్యాడు. సాగరాన్ని, ఆకాశాన్ని, పక్షుల్ని సూర్య అస్తమయాన్ని మౌనంగా నిలుచున్నా బుద్దుడిని చూస్తూ…
చిన్నప్పటి నుండి చూస్తున్న… ఎండకి వానకి తడుస్తూ, వీచే పెనుగాలులని, మురికి కంపుని, రణ గోన ధ్వనుల్ని భరిస్తూ, ప్రశాంత వదనంతో ఆశీర్వదిస్తూ.
ఏంటో ఇప్పటి వరకు తను నాకు చెప్పింది ఏమి లేదు. నేను కూడా తనకి చెప్పింది ఏమి లేదు. ఇద్దరం ఓ శిలువల నిల్చోని ఉన్నాం కొన్ని యేండ్ల నుండి.
అక్కడినుండి నెమ్మదిగా గోరీలున్న చోటు దగ్గర కూర్చొని
ఎన్ని నమాజులు చేసిన ఎన్ని బజనాలు చేసిన చివరికిలా వెల్లికలా పడుకోవల్సిందే.
ఇక పాపం పుణ్యం అంత ఓ ట్రాష్… తనకు తానో లేక ఇంకొకరినో త్రుప్తి పరిచే వింత ఆరాటమే లైఫ్ బ్లేడి లైఫ్.
రేపెప్పుడో నేను కూడా చివరికి ఇక్కడే ఎక్కడో వెల్లికల పడుకోవల్సిందే… అయిన ఏంటో నా ఈ వింత ఆరాటం.
నా ఆరాటానికి ఓ అర్ధం ఉంది నా దైవాలైన అమ్మ అబ్బని సంతోషపెట్టాలని. వారు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు లేరు ఎవరితో పని లేదు.
నా మాటలు వింటే నాకు స్వార్ధం ఎక్కువ అనుకోవచ్చు. నిజమే నాది స్వార్ధమే. నా స్వార్ధం కోసమే ఏ పని చేసిన, నేనే కాదు అందరు అంతే..
నాలంటోల్లె ఈ ప్రపంచమంతా కూడా.
ప్రపంచంతో సంబంధం లేకుండా నేనుంటే నాతో సంబంధం లేకుండా ఈ ప్రపంచం.
కొన్ని వేల ఎకాకుల్లో నేనో ఏకాకిని.
అక్కడి నుండి అన్ని చూస్తూ తిరుగు ప్రయాణం. రేకుల గది తలుపులు తెరిచి లోపలికెళ్ళి తలుపులేసుకున్నాడు. అంత చీకటి. చీకటి కమ్మిన ఆ గదిలో టేబుల్ లాంప్ స్విచ్ ఆన్ చేసి కళ్ళ జోడు పక్కన పెట్టి..
టేబుల్ కి ఆనుకొని ఉన్న కుర్చీని లాగి నెమ్మదిగా కూర్చొని మొబైల్ దగ్గరకి తీసుకొని చూస్తే నో మిస్డ్ కాల్స్, ఏంటి ఇంకా కలీల్ ఫోన్ చేయలేదు. పని పూర్తయ్యాక చేస్తా అన్నాడు.
ఏంటో ఒక్కొక్కరికి ఒక్కో పిచ్చి మా అమ్మకి నేనంటే పిచ్చి, మా అబ్బకు నన్ను తిట్టడం అంటే పిచ్చి, నాకు నా కుటుంబం అంటే పిచ్చి, ఆ కుటుంబానికి డబ్బంటే పిచ్చి,
ఏంటో ఈ పిచ్చి గోలా.
నాకు లాగే కలీల్ గానికి ఇంకో పిచ్చి ఎప్పుడు ఎదోదేదో వాగుతాడు ఎక్కడెక్కడికో తీసుకెళ్తాడు, ఎవరెవరికో పరిచయం చేస్తాడు, నేను అల్లా కోసం ప్రాణలిస్తా అని ఆవేశంతో ఊగిపోతాడు. వాడి పనులన్నీ నేను చేసిపెడతాను కాని నేనెప్పుడు వాడిని సమర్ధించలేను, అలా అని విమర్శించలేను, వాడు చేసే పనుల్లో నా ప్రమేయం ఉన్న నాకెందుకో వాడి కున్న కసి నాకు లేదు.
దేవుడంటేనే నాకు సరిగా తెలియదు. దేవుడి కోసం చేసే ధర్మ యుద్ధం గురించి ఎం పట్టించుకోవాలి.
ప్రపంచంలో శాంతి తీసుకు రావాలంటే ఒకరిని చంపడం అధర్మమేమి కాదని వాడి వాదన. ఏంటో ఈ యుద్ధం ధర్మనికో అధర్మాని ఏ రకంగ చంపినా పోయేది ప్రాణమే అనేది నా భావన. అయిన నాకేందుకోచ్చిన గొడవ నాకు నా కుటుంబం సంతోషం కోసం డబ్బు కావలి. డబ్బు వీడుస్తున్నాడు నేను పనిచేస్తున్నాను. ఇక పాపం పుణ్యం తో నాకు సంబంధం లేదు.
ఇక నా తల రాత రాసింది దేవుడే అయితే తనకు తెలుసుగా నేను చేస్తున్నది తప్పని, తప్పని తెలిసిన నా నుండి తప్పు జరిగితే దేవుడు లేనట్టే…
నిజంగా దేవుడుంటే ఈ యుద్ధాలను చూస్తూ ఎందుకూరుకుంటాడు. ఈ అసమర్ధుని చేతిలో తప్పు ఎందుకు జరగనిస్తాడు.
ఏంటి ఎన్నడు లేనంతగా వింత వింత ఆలోచనలు నను చుట్టూ ముడుతున్నాయి. నేను చేసిన పనికి భయపడుతున్నాన ఏమో చూస్తుంటే అలానే అనిపిస్తుంది.
నేను దొరికే ఛాన్స్ లేదు. కాని దొరికిపోతే………..
నిశ్శబ్దం ఆవహించిన ఆ గదిలో గడియారపు ముళ్ళు శబ్దం అతి బయంకరంగా ఉంది. టేబుల్ లాంప్ వెలుతుర్లో బయం తాలుకు వణుకు కళ్ళల్లో చేతుల్లో స్పష్టంగా కనిపిస్తుంది. నుదురు చిట్లిస్తూ భారంతో నిండిన తల నెప్పిని భరించలేక కను బొమ్మలను ముని వేళ్ళతో ఒత్తుకుంటున్నాడు. తల పట్టుకొని మళ్లీ ఆలోచనలు.
నేను దొరకను ఒక వేల దొరికితే.. ఆత్మని కప్పుకున్న ఈ దేహానికి ప్రపంచం ఓ వింత పేరు తగిలిస్తుంది అదే తీవ్రవాది. నేనెవరిని చంపలేదు కాని….. కాని కొన్ని వేల చావులకి ప్రత్యక్షంగానో పరోక్షంగానో నేను కారకున్నే. ఏంటో పూర్తిగా ఈ ఊబిలోకి చిక్కుకున్న.
ఒక వేల ముందే చెప్తే ఏమని చెప్పను నేను తీవ్రవదినన. అదే చెప్తే సంతోషంగా భోగ బాగ్యలతో సుఖంగా ఉన్న కుటుంబం మళ్లీ మురికివాడలోనో మరెక్కడో బ్రతుకు లీడుస్తారు. లోకం నిజం చెప్తే ఎన్నడు నమ్మిందని. నన్ను ఓ తివ్రవాధిగా గుర్తించి అనుక్షణం నరకం అనే బిరుధిని ఇస్తారు జైల్లో..
ఇదంతా చూసి మా అమ్మి బతికుంటుందా. ఎవరికి తల వంచక తలెత్తుకొని తన పనిలో తాను గర్వంగా బ్రతికిన అబ్బ జాన్ తల నా మూలాన దించుకోవడం ఎంత వరకు న్యాయం.
ఎన్నడు లేంది ఏంటి నా గుండెలో ఈ భయం. నేను స్వర్ధపరున్నే కాని ఎదుటి మనిషి చావాలని కోరుకునే కసాయిని కాను. కాని నేను చేసిన పని నను కసాయిగా ముద్ర వేస్తుంది తప్పదు.
నా ఒక్క కుటుంబం కోసం కొన్ని వందల కుటుంబాలు బలి కాబోతున్నాయ????
ఆ చీకటి గది లో క్షణనికోసారి వాచీ చూస్తూ ఈ గోరం ఎక్కడ జరగబోతుందో తెలియదు, ఎలా ఆపాలో తెలియదు.
హా దేవుడున్నాడని నమ్మే మా అమ్మి దువ సత్యమైతే ఆ దేవున్నే కోరుతున్న నా నుండి ఏ తప్పు జరగకుండా చూడు. ఏ గోరం జరగకుండా చూడు.
పొడి గుడ్డని నేలపై పరిచి నమాజు చేస్తూ…
దేవుడా రక్షించు నిను వేడుకునే అభాగ్యులని రక్షించు.. నీవున్నవో లేవో నాకు తెలియదు. అయినా వేడుకుంటున్న..
ఏంటో తను ఉన్నాడో లేడో.. కాని నేను తప్పు మానవత్వం కోణం నుండి చూస్తే నేను తప్పు చేశాను. ఆ తప్పుకు శిక్ష లోకనికన్న ముందే నేను వేసుకుంటున్న.
నా స్వార్ధం పూర్తయ్యింది. నా తల్లి దండ్రులని సంతోష పెట్టాను వారికి కావాల్సిన సౌకర్యాలన్నీ సమ కూర్చాను
తివ్రవాధిగా నన్ను చూస్తూ వేదనకు గురి చేయడం కన్నా నేను లేకున్నా నా జ్ఞాపకాలతో వారు సంతోషంగా ఉండగలరు నాకా నమ్మకం ఉంది.
నిజం… ఏది నిజం.. తెలిసి చేసిన తెలియక చేసిన తప్పు ఎప్పుడు తప్పే.. ఆ తప్పుకి నేనే శిక్షించుకుంటున్న..
రెండు నిమిషాల గడియారపు ముల్లె ఇంత గుచ్చుకుంటుంది. కొన్ని వందల కుటుంబాల అక్రంధనల చూపులు ఇంకెంతగా గుచ్చుకుంటాయో ఆ నరకం అనుభావించడం కన్నా ఒక్క గుండుతో చావడమే స్వర్గం.
మొబైల్ ఫోన్ రింగ్ అయ్యింది. చూస్తే ఖలీల్. గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఎత్తితే అవతలి వైపు నుండి ఖలీల్ గొంతు.
ముబారక్ నయీం ముబారక్ మనం అనుకున్నది సాధించం. మేము పెట్టిన బాంబు పేలింది. ఇపుడు హైదరాబాద్ అంత అల్లకల్లోలం. టీవీ చూల్లేదా.. ఒకటే అరుపులు, అక్రనాదాలు, వందల మంది మాంసపు ముద్దలై రోడ్లమీద గిల గిల కొట్టుకోవడం అః ఎంత చూడ చక్క చిత్రం దిల్ కుష్ హోగయా ఈ జీహాద్ యుద్ధం లో మనం గెలిచాం.
ఇక నువ్ ఏ టెన్షన్ లేకుండా దుబాయి కి వెళ్ళిపో సంతోషంగా ఉండు.
ఫోన్ పక్కన పెట్టి ఏడవడం మొదలు పెట్టాడు, భయం భయం కళ్ళల్లో భయం
ఏడుస్తూ అంతా అయిపోయింది. ఇక నా తప్పుకి చావే ముగింపు.
చెప్పానుగా దేవుడు లేడు. కనీసం నేను నా కుటుంబన్నైన సంతోషంగా చూడాలని నాకు నేను వేసుకున్న శిక్ష
గన్ తీసుకొని మెదడు గురి పెట్టుకొని కాల్చుకుంటుండగా
మళ్లీ ఫోన్ మోగింది.
ఎత్తాడు.
ఒరేయ్ నయీం నేన్ర పాషాని. ఎక్కడున్నావ్ విషయం తెలుసా!
మీ అబ్బ అమ్మి బాంబు పేలుడులో చచ్చిపోయారు.
నువ్ దుబాయ్ క్షేమంగా వెళ్ళాలని దువ చేయడానికి మసిదుకెల్తుంటే బాంబు పేలిదంట
వేరు పడిన తలలను చూసి గుర్తు పట్టారూ.
అంతే
కట్టలు తెంచుకున్న బాధ ఆవేశంతో ఫోన్ విసిరిగొట్టి
యా అల్లః “నా రాతను ఇలా రాసావా.. ఇదేనా నరకం అంటే..”
మెదడులోకి గుండు దిగుతూ
కళ్ళ ముందు నల్లని తెర.
*మిత్రుడు జాహీద్ కవిత “ఆఖిరీ పల్ – చివరిక్షణం” ఆధారంగా..