నిశీధ
నిశీధ నల్లని చీకట్లలో
సాయం సంధ్యాకాలంలో
మౌనంగా దాగిన నిశ్శబ్దాలలో వినిపిస్తున్నది కమ్మని గీతం.
ఆ గీతాల్లో రాగం సంగీతం, లయ, తాళం, పల్లవి, ఏవి లేవు, అయిన వినిపిస్తున్నది ఒక మౌనగీతం..
కనులు మూసినా, కనులు తెరిచినా అంతా చీకటి సర్వం చీకటి.
నాకు ఈ చీకటి తప్ప ఎం కనిపించట్లేదు ఈ క్షణంలో..
ఆలోచనలు మనసు అంచుపొరలను చీల్చుకుంటు మరి మరి పరుగెత్తుకుంటూ ప్రత్యక్షమవుతున్నాయి..
పెను తుఫానుల వేడి పవనాల గాలులతో ఆలోచనలు కలిసి చీకట్లతో యుద్ధం చేస్తున్న శబ్దాలు వినిపిస్తున్నాయి ఆ మౌనగీతంలో.
కాని ఎటు చూసిన ఏమి లేదు. మళ్ళీ నిశ్శబ్దం మళ్ళీ శూన్యం.
మెల్లిగా మరోసారి కనులు మూసి ఏదైనా ఊహించేందుకు ప్రయత్నించా.
క్షణకాలపు ఊహ తెగిపోయింది మెల్లిగా తెరిచిన కను రెప్పతో.
దూరంగా అటునుండి ఏదో మేఘం మెల్లిగా పుట్టింది.
కొద్ది కొద్దిగా పురోగతి చెందుతూ పెద్దగా మారి పాయలు పాయలుగా చీల్చుకుంటు నిండుగా ఆకాశమంతా ఆవహించింది.
చిన్నగా మొదలై..
పెద్ద పెద్ద వెలుతుర్ల మెరుపులతో భయపెడుతున్నది.
చిత్రంగా ఉంది నేను భయపడలేదు.
చేతి మీద ఏదో పడ్డట్లనిపించింది, చూస్తే చిన్న చిన్న చినుకులు.
మెల్లిగా మొత్తం చినుకులమయమైంది.
కాళ్ళ కింద ఏదో పాకినట్టయింది.
కిందికి చూస్తే ఆశ్చర్యం. నీళ్ళు.. ఆ నీళ్ళల్లో మునిగిపోయాయి నా పాదాలు.
చిన్న చిన్న చినుకులు పోయి పెద్ద హోరుతో కుంభ వర్షం కురుస్తుంది.
కొద్ది కొద్దిగ నీరు పై పైకి వస్తోంది.. చూస్తుండగానే మోకాళ్ళనుండి నడుము వరకు చేరాయి.
వాటినే పరీక్షిత దీక్షతో మౌనంగా చూస్తున్నాను, చూస్తుండగానే మళ్లీ భుజాల వరకు, ఇంకా ఇంకా మీదకు వస్తూనే ఉన్నాయి.
అయిన మౌనంగానే చూస్తున్నా..
దూరంగా ఎవరో పిలిచినట్టు వినిపించింది.
అదేమి పట్టించుకోలేదు.
ఇంకాస్త పెద్ద స్వరంతో పిలుపు వినిపించింది.
కొద్దిగా స్తిమితపడ్డాను.
ఆకస్మికంగా నా భుజాలపై ఎవరివో చేతులు,
గుండెజల్లుమంది.
ఉలిక్కిపడి కళ్ళు తెరిచా, ఆశ్చర్యం అపుడే తెలవారింది…