Home > జ్ఞాపకాల గొలుసు > ఒరేయ్ ఆరిఫ్ రంజాన్ ముబారక్ రా..

ఒరేయ్ ఆరిఫ్ రంజాన్ ముబారక్ రా..

భయటికేల్లి ఉమ్ము మింగకుండా తుపుక్కున ఊంచి వచ్చి.

ఒరేయ్ ఇస్కూలు అయినాక మనం మసీదుకు పోదాం. ఇయాల సాయంత్రం “రోజా పొద్దు ఇడిచినక”  మాకు తెలిసినోల్లు ఇఫ్తార్ విందు ఇస్తున్నారు. అని నా దోస్తు ఆరిఫ్ చెప్పడంతో.

విందా.. అరేయ్ నేను గూడ వస్తా.

 

సాధారణంగా అరటి పళ్ళు, ఇంట్లో ఎవలికైన జ్వరం వస్తే తప్ప కనిపించని దానిమ్మ కాయ, అప్పుడప్పుడు దొడ్డు సేమియా(అదే బంబినో) పాయసం.

మా వాడలో, గుండం గల్లిల్లో, అంత ముస్లిములే, మా గల్లిలో ఉన్న ముసలోల్లంత తుర్క వాడ అనేటోలు. మా ఇస్కులు దోస్తులంత ముస్లిం అని పిలువాలి అని మారం సేయడంతో నేను మాత్రం ముస్లిమోళ్ళ గల్లి అని పిలిచేవోన్ని. రంజాన్ పండగోస్తున్దంటే సాలు రకరకాల పళ్ళు, పళ్ళ రసాలు, కజ్జురాలు, మిటాయిలు, ఖీర్ పాయసం, హాలాల్ చేసిన మాంసం, దం బిర్యాని, పుల్క, రుమాల్, తందూరి, నాన్సు రొట్టెలు. ఎక్కడ లేని తిడంత గాన్నే గా ఇఫ్తార్ విందులల్ల ఉండేది. ఎందుకో మాంసం తినకపోయేటోన్ని. కాని నా శక్తి మేర పళ్ళు, రసాలు, కజ్జురాలు, పాయసం ఫుల్లుగా తీసుకొని పొట్టి నేక్కర్లేసుకున్న మేము  పెద్దోల్లలాగా ముందు నా పొట్టను పంపిస్తూ వెనకాల నేను నడిచేవొన్ని.

 

రంజాన్ పండగ రోజైతే చెప్పనక్కర్లేదు, మా గల్లి మొత్తం అత్తర్ గుభాలింపే. నన్ను కలుసుకోవడానికి మా దోస్తులంత దగ్గరున్న వాళ్ళు అబ్జల్, ఇర్షాద్, నయీం, నౌషాద్, లియాకత్ అలీ నడుచుకుంటూ, చాన్దూరం ఉన్నవాళ్ళు  సైకల్లెసుకొని, టిఫిను డబ్బాల్లో ఖీర్ పాయసం పట్టుకోచ్చేవోల్లు, ఇంటెదురుగా ఉన్న బేబీ వాళ్ళు, మసూదు వాళ్ళు ఇంకా మా అన్న దోస్తులు అంత పాయసం ఇచ్చేటోల్లు.  అందరికన్నా ఆరిఫ్ వొళ్ళ అమ్మ చేసే కద్దు ఖీర్ పాయసం, పోనీ ఖీర్ పాయసం, ఇంకా నెయ్యితో చేసిన స్వీట్లు అంటే మస్తు ఇష్టం అందుకేనేమో పెద్ద పెద్ద గిన్నెలో పట్టుకొచ్చేవాడు మా ఇంట్లోలందరి కోసం.

 

నేను ఆరిఫ్ ఎంత మంచి దోస్తులమంటే నా చిన్ననాటి సగం దినాలు వాడి ఇంట్లోనే గడిచినాయి. వాళ్ళింట్లో నేను మా ఇంట్లో వాడు కుటుంబ సబ్యులమైనాము. వాళ్ళ నాన్న సాబిర్ పాషా వ్యవసాయశాకలో గోవర్నమెంటు జాబు. ఇద్దరక్కలు వీడొక్కడు. ఏందో మాకు ఊహోచ్చేసరికే ఆ ఇద్దరక్కలకి పెళ్లిలయినాయి.

 

జుబ్బాలు, కుర్తాలు, లాల్చి పైజాములు, తెల్లని టోపీలు, కొందరు చమ్కీల తో రంగు రంగు అల్లికలున్న బుషోట్లు. కర్రు కర్రు మని శబ్దం చేసే తోలు చెప్పులతో యెడ సూశిన ఒక్కల్నోకలు గలేల్ను కలుపుకుంటూ కౌగిలించుకోనేవోల్లు. నాకడికోచ్చిన మా దోస్తులనంధరిని గలే మిల్ అనుకోని కౌగిలించోకొని రంజాన్ ముబారాక్ అనుకుంటోల్లము.

 

ఇక మా క్లాస్ లో ఉన్న అడవోల్లు  కూడా వాళ్ళ ఇంటికి పిలిచేటోల్లు. మచిలిబాజార్ లో ఉండే రానా, గుండం వాడలో ఉండే సాజియ, రాజియ, ఫాతిమా ఇంకా చాలా ఇళ్ళకి వెళ్ళేవాళ్ళం రంజాన్ ముబారక్ చెప్పడానికి. వాళ్ళు పెట్టె ఖీర్ పాయసం స్వీట్లు ఆరగించడానికి. ఎందుకో ఎప్పుడు బుర్కాల్లో దిగేసున్న ముఖాలకి ఆ రోజు స్వాతంత్రం వచ్చేది, రంగు రంగు హైదరాబాద్ పరికినిలు, మెరుపు తీగల చున్నిలతో ముంబాయ్ నుండి తెచ్చుకున్న మొహలాయి చీరలు, దుబాయి అత్తర్లు, అబ్బో ఎన్నడు లేని సంబరమంత ఆరోజు వాళ్ళల్లో కనిపించేది. ఫాతిమా తాను వేసుకున్న రంగు రంగు మెరుపు అద్దపు గాజులని కిటికీ నుండి వచ్చే వెలుతురు దగ్గర పెట్టి గాజుల అద్దాలలో పడుతున్న కిరణాలకి తళుక్కుమని గోడపై మెరుస్తున్న రంగుల నీడలను చూస్తూ మురిసిపోతూ మా పెద్దన్న చార్మినార్ కాడినుండి తెచ్చిండు అని గర్వంగా చెప్తుండేది. అప్పట్లో చార్మినార్ ని చూడాలనేది మా దోస్తులందరి అతి పెద్ద కోరిక. అందుకేనేమో మొదటిసారి హైదరాబాద్ కొచ్చినప్పుడు పొద్దటినుండి సాయంత్రం వరకు చార్మినార్ వాకిల్లోనే తెగ తిరిగాం నేను ఆరిఫ్.

 

ఫాతిమా వాళ్ళ ఇంట్లో మొత్తం ఎనమిది మంది అన్నలు, ఆరుగురు అక్క చెల్లెళ్ళు. చాలా పెద్ద కుటుంబం ఇమేధీ పదోకొండో నెంబర్ చిత్రం మా స్కూల్లో కూడా అమెది రోల్ నెంబర్ పదోకొండే తను పుట్టిన తేది కూడా నవంబర్ పదోకొండు ఇలా చాలా విషయాల్లో తనతో పదోకొండో  నెంబర్ ముడి పడింది. ఆ తర్వాత కాలం లో నఫీజ్ సుల్తాన నాకు మంచి దోస్తు వాళ్ళ ఇద్దరు చెల్లెళ్ళతో కలిసి మాకు రంజాన్ ముబారక్ చెప్పేది. 

 

కాలం తో పాటు నేను కూడా హైదరాబాద్ వాలిన ఇక్కడ కూడా నాతో పెనవేసుకున్న స్నేహాలు ఎన్నో సుల్తాన్ బాజార్ అలీ, చార్మినార్ అక్బర్, ఫయాజ్ హాష్మి, రఫిక్ దిల్సుఖ్ నగర్ జాహిద్, అబిడ్స్ మొహమ్మద్ ముజాహిద్, జుబ్బ సురయ బేగం, దూరదర్శన్ ఫాతిమా, హకీం పెట్ నాజియ టైమ్స్ అఫ్ ఇండియా హుస్సేన్ ఇలా చెప్పుకుంటే పోతే పర్వాలేదు ఈ రంజాన్ కూడా నన్ను ఆనంద పరచాడానికే వచ్చిందా అని అనిపిస్తుంది.

 

ఒరేయ్ నమాజు టైం ఆయ్యింధిర అనడంతో  సైకిల్ బొంగు మీద నేను కుర్చొంటే చిన్న పైడిల్ని భలంగా తొక్కడం తో ఒక్క పరుగున ఉజిలిబేసు మసీదును అందుకునేవాళ్ళం నేను ఆరిఫ్. ఏంటో నాతో పాటు వాడు గుడికొచ్చిన, వాడితో పాటు నేను మసీదుకేల్లిన యధ్రుచికంగానే పిలుస్తున్నది భగవంతున్నే అని అపుడు మా మనసులకి తెలియక పోయిన మా ఇరువురి మతాలు వేరనే భావన ఎవరు మాకు నూరిపోయనందుకు చాల సంతోషంగ ఉంది ఇప్పటికిను.

 

అల్లాహు అక్బర్ – అల్లాహు అక్బర్ అష్ హదు – అల్లా ఇలాహ్ అంటూ మొదలై అల్లాహు అఖ్బార్ లా ఇలాహ్ – ఇల్లల్లాహ్ అంటూ పూర్తయేది.

మెల్లిగా బయటికొచ్చి సైకిల్ లేసుకొని హన్మకొండ చౌరస్తా, నయీంనగర్ వెనకనుండి గల్లిలన్ని తిరుగుతూ తిరుగుతూ మళ్లీ కాకతీయ కాలనికి అటు నుండి అలంకార్ టాకీస్ దాటుతూ భద్ర కాలి చెరువు దగ్గర కాసేపు కూచొని, మెల్లిగా కదులుతూ దుదేకులోల్ల రఫీ, అనిల్ ని కలిసి, మూలా మలుపు తిరుగుతూ అమ్జాద్ వాళ్ళింటికి వెళ్లి ఆ తర్వాత ఆరిఫ్ వాళ్ళ ఇంటికి తీసుకేల్లెవోడు. విందు ను పూర్తి చేసుకొని, ముచ్చట్లు పెట్టుకొనే సరికి రాత్రి అయ్యేది.  మెల్లిగా ఇంటికొచ్చి రాత్రి బోజనాలయ్యాక చిమ్ని దీపం వెలుతురిని తగ్గించి ఓ మూలాన పెట్టి నేను పడుకుంటూ ఏమేమి చేసామో ఏమేం తిన్నానో ఆత్రంగా చెప్తుంటే గుడ్డి వెలుతురులో అమ్మ తువ్వాలతో నాకు గాలి విసురుతూ ఆశ్చర్యంగా  వింటూ ఉండేది. 

 

దాదాపుగా ఇన్నేళ్ళలో యే రంజాన్ కి మేమిద్దరం కలవుకుండా ఉండేవాళ్ళం కాదు. మొదటి సారి కలవలేక పోతున్నందుకు మనసుకు ఇప్పడు తెలుస్తుంది గలేల్ను కలుపుకొంటూ కౌగిలించుకోవడాల విలువా..

“అరేయ్ దిల్ తుజ్సే గలే మిలనేకే లీయే తరస్ రహ రే అని తడారిన గొంతుతో చెప్పి ఫోన్ పెట్టేసాడు దుబాయి నుండి ఆరిఫ్”

మొదటి సారి చిత్రంగ ఉంది మా ఇరువురి మనసుల కోరిక ఒకటే అవడం.

 

ఇప్పుడు మా ఇద్దరిని కాస్త దూరం చేసిందని గర్వపడుతున్న పిచ్చి కాలానికి తెలియదు పాపం, మేమిద్దరం అనుక్షణం ఇరువురి మనస్సులో కలిసే ఉన్నాం  అని.

 

చిన్ననాటి జ్ఞాపకాల్లో కత్తిరించుకోని పెట్టుకొన్న కవితొకటి గుర్తొచ్చింది.

 

దోస్తీ హొతి నహి భూల్ జానే కే లియే,

దోస్త్ మిల్తే నహి బిఖర్ జానే కే లియే,

దోస్తీ కార్కే ఖుష్ రహోగే ఇత్నా,

కి వక్త్ మిలేగా ని ఆన్సు బహానే కే లియే.

 

ఎలాగు నా మనసు మాట వాడికి వినిపిస్తుందని నాకు తెలుసు అందుకే

“ఒరేయ్ ఆరిఫ్ రంజాన్ ముబారక్ రా..”

  1. No comments yet.
  1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: