Archive

Author Archive

మరుపు

November 22, 2017 Leave a comment

పోటి ప్రపంచంలో మనిషిలా గుర్తించుకోతగ్గ చదువు గాని అనుభవం గాని నాకు లేవనే చెప్పాలి. రాసుకోవడమనే అంశం నా నిజ జీవితంలో ఎప్పుడు మొదలయ్యిందో పెద్దగ తెలీదు కాని అందరు ఊన్న ఎవరు లేని నాలోని ఒంటరితనాన్ని దిగమింగుకోవడం కోసమే కెమరా, పుస్తకం, నడిచిన తరగని తారు రోడ్డు, కుడి ఎడమల వైపు కనపడే సందోహాలు మరియు కంటికి ఇంపుగా కనిపించే ప్రకృతి ఇవే ఒక విధంగా నాకు గొప్ప ఆసరా..
++
ఇతరులందరికీ ఏవగింపు కలిగించే పరిస్థితుల నడుమన జీవితం మొదలై గడుస్తున్నప్పటికి చిత్రంగా యధ్రుచికంగా నాకు మాత్రం ప్రతీది అందంగా అర్ధవంతంగా ఎందుకు కనిపించేదో ఇప్పటికి నాకు అర్ధం కాదు.
++
మర్చిపోవడం అనేది నాకు పట్టిన ఒక పెద్ద దెయ్యం భహుశ దాన్ని పోగొట్టుకోడానికి నాకు నేను ఎంత ప్రయత్నం చేసినా.., పనిగట్టుకొని మా అమ్మ ఇంటికి దగ్గరలో ములుగు రోడ్ చౌరస్తా దగ్గరలో శుక్రారం శుక్రారం దర్గాకు తీసుకెళ్ళి తాయత్తు కట్టించి నెమలి కన్నుల చీపిరితో వెన్నులో చరిపించి ఊదు పొగ వేసినా…, దయ్యం సంగతి పక్కన పెడితే సాహీబు తంతు జరుపుతున్న ఆ ఐదు నిమిషాలు మాత్రం అగరొత్తుల, ధూపం నుండి, దర్గా గర్బంలో నింపేసిన మల్లెలు గులాబీల నుండి వీస్తున్న కమ్మని గుబాళింపు మత్తులో ఆనందంగా మునిగి తేలుతుండేవాన్ని..
++
మతి మరుపు
ఇక మతి మరుపు నను నిండా ముంచక ముందే దాన్ని నేను ముంచెయ్యలనె ఆరాటం లోనే ఉన్నదీ లేంది జరిగింది జరగంది చూసింది ఊహించింది కలగన్నది అది ఇది అని కాకుండా ఏదిపడితే అది పేజీల కొద్ది రాసుకోవడం అలవాటయ్యింది. ఆ అలవాటు రాను రాను నా నుండి ఓ రెండు పుస్తకాలని పుట్టిస్తుందని వాటి పుట్టుక అందరిని మెప్పిస్తుందని నన్ను నలుగురి ముందు నిలుచోబెడుతుందని ఎన్నడు నే ఊహించలేదు.
ఇప్పుడు ఆలోచిస్తుంటే న్యూనతలను అధిగమించాలనే ధోరణిలో ఈ కాలం నన్నెంతో దూరం నెట్టుకొచ్చింది ప్రపంచంతో నాకేం సంబంధం లేదంటూ ప్రపంచపు ప్రాపంచికానికి భయంతో, బాధతో, న్యూనతతో పారిపోతూ పరిగెట్టే నా మనసుకు ఇదే ప్రపంచంలో నాకంటూ ఒక ప్రపంచం ఏర్పడటం అంత యాదృచ్చికమే అంత మాయే ఇదంతా కాలం మహిమే.
++
నా మట్టుకు మతి మరుపుని అధిగమించానని నాకనిపించట్లేదు అందుకేనేమో చదివిన ఏ పుస్తకమైనా చుసిన ఏ దృశ్యమైన యిట్టె మాయమవుతోంది. అదే పుస్తకం అదే దృశ్యం మళ్ళీ చదివిన మళ్ళీ చూసిన మొదటిసారి కలిగిన అనుభూతుల గిలిగింతలే మళ్ళీ మళ్ళీ కలగడం నా మట్టుకు నాకో వరమే.. అందుకే కాబోలు ఎన్ని చోట్లకైనా ఎన్ని సార్లు వెళ్లిన మనసుకు ఎప్పుడు కొత్తే. ప్రదేశాలు, పుస్తకాలే కాదు మనసులతో కూడా ఇలాంటి అనుభూతే కలిసిన ప్రతి సారి తెలియని కొత్త ఉత్తేజం కొంగొత్త అలజడి..
అందుకే నేనంటాను పనిగట్టుకొని గుర్తపెట్టుకొని బట్టిపట్టుకొని ఏవో సాధించడం కన్నా ఏది రాని నాలాంటి అజ్ఞానికి సైతం ఈ లోకం చోటిచ్చి మనసును ఆనందపరుస్తోంది. మనసును అనుక్షణం ఆనందంగ ఉంచుకోడానికి మించిన ఇంకో స్వర్గం ఉంటుందని నేనకొను కాబట్టి నా వరకు నా మతి మరుపు మంచిదే.
మరక మంచిదే టైపు..

చీకటి.

November 22, 2017 Leave a comment

చీకటి. వైషమ్యాల ఆవరణల్ని అమాంతం కప్పేసి కావలి కాస్తున్నట్టు.
ఎవరో అమావాస్య పేరుతో తనని దొంగలించినట్టు కానరాని చంద్రబింబం కల్పించిన స్వాతంత్రంతో పుంజుకున్న దీని అస్తిత్వం మరింత బలంగా కానొస్తోంది.

సుమారు రెండున్నర కావస్తోంది. అప్పటికే ఒకదాని మీద ఒకటి థర్మల్ సాక్సులు, ఉల్లెన్ సాక్సులు, మరో జత సాక్సులు దాని మీద ట్రెక్కింగ్ షూ, అప్పటికి కాని పాదాల్లో వణుకు తగ్గి కదలిక రాలేదు. కాళ్ళదే ఈ పరిస్థితి ఉంటె మిగతా శరీరం ఇంకేన్నింటిని కప్పేసుకుందో..

కెమెరాని లిల్లీపుట్ ట్రైపాడ్ కి చక్కగా బిగించి బల్బ్ మోడ్ లో పెట్టి స్లో షట్టర్ క్లిక్ నొక్కి కదులుతున్న సెకండ్ల లెక్క చూపిస్తున్న కెమెరా మోనిటర్ ని చూస్తున్నాను.

నక్షత్రాల కదలికల్ని, పాలపుంతని స్పష్టంగా బంధించాలంటే షట్టర్ స్పీడ్ తో పాటు నిద్ర లేని రాత్రిని, చీకటిని, కొంకర్లు తిప్పే చలిని యాదృచ్చికంగా ప్రేమించే గుణం కావాలి.. అవును ప్రేమించే గుణం ప్రేమించడం ఎంతైనా మామూలు విషయం కాదు. సర్దుబాట్లతో కూడిన ఇషాల్ని, కష్టాల్ని, కోరికల్ని, ఆనందాల్ని, సమీకరించినా చక్కని కూడలి. ఆ కూడల్లో ఓపిక, సహనం, క్షమగుణం, నిజాయితి మరియు వీటన్నింటికి మించి నమ్మకం ఉండాలి.

నమ్మకం ముందు మన మీద మనకి, తర్వాత ఎదురుగా కనిపించే ప్రపంచం మీద, మనుషులమీద, పరిసరాలమీద, పరిస్థితులమీద, సందర్భాల మీద…

ఇక మోసమా.. ఏది మోసం? మోసాన్ని సైతం అధిగమించగలగడం తపస్సే.. కాని మోస తీవ్రత మనం ఏర్పరుచుకున్న వ్యామోహల మీద ఆధారపడి ఉంటుంది. అందుకే మితి మీరిన ఇష్టాలు, బాంధవ్యాలు, ఆధారపడటాలు ఇవన్నీ కూడాను స్థాయిని బట్టి మోస తీవ్రతను, దుఖ్ఖ సాంద్రతని పెంచుతాయి. వీటన్నిటిని ఎరుకతో బాలన్స్ చేసుకోవడాన్నే బహుశా ఆత్మపరిజ్ఞానం అంటారేమో.

“రఘు సాప్ ధూద్ లిజియే..” అంటూ స్టాంజిన్ వేడి వేడిగా పాల కప్పు చేతికందించాడు. ఈ చోటుకు రావడం మూడోవసారి. మొదటి రెండు సార్లకన్నా ఈ సారి రావడానికి తేడా ఒక్కటే అది ఒంటరిగా నేనొక్కడినే రావడం. ముందు రెండు సార్లు రావడంతో ఇక అపరిచితానికి, భయానికి న్యూనతకి తావులేకపోవడం నాకో మంచి విషయం. అందుకేనేమో నడిచిన దారుల్నే మళ్ళి మళ్ళీ దర్శించుకుంటాను.

“స్టాంజిన్” ఇక్కడ విరివిగా వినపడే పేరు నన్ను మోసుకొచ్చిన డ్రైవర్ మరియు నాకు ఆశ్రయం ఇచ్చిన ఇంటి యజమాని పేరు కూడా స్టాంజిన్. తనకి ఉదయం అడిగినప్పుడే టీ, కాఫీ తాగను అని చెప్పా దానితో నేను చెప్పక ముందే నన్ను అడక్కుండానే పాలు కలుపుకొని తీసుకొస్తున్నాడు.

నాలాగా ఒక చోట ఎక్కువ రోజులు గడపాలనుకునే వారంతా కూడాను లాడ్జిలకి, హోటల్స్ కాకుండా హోమ్ స్టే లను ఆశ్రయిస్తారు. హోమ్ స్టే అనగా స్థానికంగా స్థిరపడిన గ్రామీణుల ఇళ్లు, పూరి గుడిసెలు, పాకలు, డేరాలు వివిధమైన స్థావరాలు. ఒక్కో చోటు ఒక్కో రుసుము రెండు వందల నుండి ఐదు వందలు విడిదికి. భోజనానికి రోజు మొత్తం కలిపి రెండు వందలు. చవకగా దొరికడం ఒక కారణమైతే, స్థానిక ప్రజలకి, వారి మనసులకి, జీవితాలకి, ఆహారపు అలవాట్లకి, సంప్రదయాలకి, నమ్మకాలకి, చరిత్రకి, కథలకి, దగ్గరవ్వడం ఒక గొప్ప అనుభూతిగా భావిస్తాను.. అలా అనుభూతి చెందాలని వచ్చినట్టనిపించింది తను కూడా. నిన్న ఈ చోటుకు చేరుకొని కార్లోనుండి దిగుతున్నప్పుడు పెద్ద బండరాళ్ళ మీద కూచోని డైరీలో రాసుకుంటున్న సురభి పఠాన్ ని కలిసినపుడు తనకి తాను బ్లాగర్ని మరియు ట్రవెలర్ అని క్లుప్తంగా తన పరిచయం చేసుకున్నప్పుడు.

స్టాంజిన్ నా పక్కనే గొంగళి కప్పుకొని లడాకి బాషలో ఏదో రాగం ఆలపిస్తున్నాడు. అది లీలగా నిశ్శబ్దంగా పారుతున్న ప్యాంగాంగ్ నది తీరాన నీటి తాకిడికి గులకరాళ్లలో కలిగే సవ్వళ్ళకు రేగిన శృతులు జత కలిసాయి.

మెరక్ గ్రామం మొత్తం కలిపితే కూడా వంద ఇల్లులు ఉండవేమో.. మంచు బాగా కురిసినపుడు కొన్ని నెలల వరకు కూడా రాకపోకలు ఉండవు. పూర్తిగా మంచుతో కప్పబడి వంద కిలోమీటర్ల ఈ ఉప్పు నీటి నది కూడా గడ్డకడుతుంది. నలబై కిలోమీటర్లు భారతంలో మిగిలిన అరవై కిలోమీటర్లు చైనాలో. చైనా అంటే గుర్తొచ్చింది. నేనున్న చోటుకి రెండు కిలోమీటర్లో చైనా బార్డర్. నా మూర్కత్వం కాకపోతే ఈ లెక్కలు, మనుషులు ఏర్పరుచుకున్న హద్దులు ప్రకృతికి తెలియవుగా..

ప్రకృతితో మమేకమవుదామన్న నాలాంటి వారికెవ్వరికి కూడా పరిధులతో, పరిమిథులతో సంబంధం లేకుండా బతకడానికి ఇష్టపడుతుంటారని నా నమ్మకం. ఆ నమ్మకం నేను చేసే ప్రయాణాల్లో చాల మనుసుల నుండి గ్రహించగలిగాను.

ఇరవై ఐదు నిమిషాల తర్వాత షట్టర్ రిలీజ్ చేసాను కెమెరా చేతులోకి తీసుకొని జేబులో కెమెరా సంబంధించిన మక్మల్ గుడ్డతో మంచు తడిని తుడిచి ఆత్రుతగా ఫోటో ఎలా వచ్చిందని చూసాను.
స్టార్ ట్రేయిల్ నక్షత్రాల గమనాన్ని గీతల రూపంలో బంధించడం ఈ బల్బ్ మోడ్ ప్రత్యేకత ఫోటో మాత్రం నేను ఊహించుకున్న దానికి కొంచెం భిన్నంగా వచ్చింది. అసంతృప్తి గాని సంతృప్తి గాని ఏ అనుభూతి లేదు. చెప్పా కదా మితి మీరిన కోరిక, నమ్మకం ఎప్పుడు ఇబ్బంది కలిగించేవే.

నా దృష్టిలో ఇబ్బంది గురిచేసే అంశాలనుండి మనసుని స్థిమిత పరుచుకునే దిశగా నన్ను నేను మలుచుకుంటున్నా..

“చలేంగే సాప్ బహుత్ దెర్ హోగయా..”
నిజమే మూడు దాటింది. ఈ సమయంలో వాతరవరణం మైనస్ డిగ్రీలోకి చేరుకొని నది పై పొర గడ్డ కట్టే సమయం. ఒక్కోసారి ఆక్సిజన్ దొరక్కపోవడం కూడా జరుగుతుంది. ఆల్టిట్యూడ్ తారతమ్య వాతావరణానికి అలవాటుపడనంత వరకు ఆరోగ్యరిత్యా చాల జాగ్రత్తలు తీసుకోవాలి.

వెంటనే గదికి చేరుకున్నాను. అప్పటికే సురభి పడుకుంది. తన పక్కన మంచంలో ఫ్రాన్స్ నుండి వచ్చిన విరిటో. ఇక నా మంచం కిటికీ దగ్గర ఉంటుంది. ఒక విధంగా వెడల్పాటి గదిలో మూడు మంచాలు గది మధ్యలో వేడి కుంపటి. నిండా కప్పుకొని ఉన్న నేను మంచం మీద మరింత నిండుగా రెండేసి గొంగళ్ళు కప్పుకున్నాను లాంతరుల తలపించే చిన్న సోలార్ లైట్ని స్విచ్ ఆఫ్ చేస్తూ..

స్టాంజిన్ కుంపటిలో బొగ్గుల్ని ఎగతోపుతుండడంతో మంటని రాజుకొని బొగ్గులు తమ శక్తి మేరా చీకట్లో దాక్కున్న చలిని చీల్చి చెండాడేందుకు ఎర్రని వేడి యుద్ధం ప్రకటించింది. ఆ యుద్ధం దాడికి చలి ఎప్పుడు పారిపోయిందో.. నా స్పృహని ఎప్పుడు నిద్రలోకి ఓంపుకున్నానో గుర్తులేదు..

**

Raghu Mandaati
#TravelMusings
#Amigoroadtrip

స్వేచ్చ – సౌకర్యం

October 19, 2015 Leave a comment

డబుల్ బెడ్ ఫ్లాట్ లో పని గట్టు కొని దగ్గరుండి ఇంటీరియర్ అంతా ఆమెకు నచ్చినట్టు చూసుకుంటోంది. ఇంట్లో ప్రతి చోటు ఆచి తూచి మరి కలర్ కాంబినేషన్, అటాచ్డ్ బాత్రూం టాయిలెట్ ఐటమ్స్ అన్ని లగ్జరీగా మరియు మోడరన్వి ఉండేలా డిజైనర్తో వెంటపడి శాంపిల్ పిక్చర్స్ గంటల తరబడి చూసి ఆర్డర్ చేసింది. తనకంటూ అన్ని సమకూర్చుకోవాలనే ధోరణి కాలమే పనిగట్టుకొని నేర్పింది.

ఏడెనిమిది తరగతి నుండే ఎంత నిద్రొచ్చిన ఆమెను అవ్వ పొద్దున్నే లేపేది. లేవడం ఎంత చిరాకు విషయమో అప్పట్లో అర్ధం కాకపోయినా పదో తరగతికి వచ్చే సరికి పూర్తిగా అర్ధమైంది. ఎంత నిద్ర ఉన్న నాలుగున్నరకే లేచి గోళంలోంచి నీళ్ళని సర్వ నిండా ముంచుకొని ఓణి నెత్తి మీదేసుకొని ఇంటి ముందున్న లచ్చమ్మొల్లా ఎకరం శెలకలో వేసిన పత్తి పంట అంచు గట్టు మీదనుండి నలబై అయిదు రూపాయల పారగన్ స్లిప్పర్లతో రాగడి మట్టిని వెనక్కి నెట్టుతు నెట్టుతు శెలకలు పొలాలు ధాటి గుబురుగా పెరిగిన తుమ్మ ముళ్ళ  పొదల్లని చేరుకొని ఎవరైనా చూస్తున్నారా అనే గాబరాతో భయం భయంగా కృత్యం తీర్చుకోవడం తనకి తనతో పాటు పల్లె ఆడవాల్లందరికీ నిత్యకృత్యం.

అందరు కోళ్ళ ఫారాలు పెడుతున్నరయ్య.  ఈరయ్య కొడుకు రమేశు..
శిన్నవ్వా..  గా బ్యాంకు సుట్టు తిరిగితే శెడ్డు ఏసుకోని బాయిలర్ కోళ్ళని పెంచుకోనీకి లోన్లిస్తున్నారట్నే నేను గుడా నా పేరు రాసోచ్చినా పెదనాయనగ్గూడా కూడా జరంత సమ్జాయించు..  అని కొడుకు సేప్తుండే..
నువ్ కూడా ఇంకా ఎంతకని పత్తి మిల్లులా కాళ్ళుబొంగా తొక్కుతావ్ ఇద్దరాడ పిల్లలు ఉన్నదో లేందో తిని ఆళ్ళ సధులేందో ఆల్లు సదూకోబడితిరి పెద్దది పెద్దమనిషైన సంధి నుండి నాకేమో దడ పట్టుకుంది. ఇల్లు సుత్తనేమో గిట్లుండే”
 అని కిరసనాయిల్ దీపం వెలుతురులో ఆకలితో ఆధారబాదరగా పొద్దున దొడ్లో కాసిన లేత బిరకాయల్ని లచ్చువమ్మ ఇంటెనక అలికిన కొత్తిమిర పుదిన తో పాటు ఎర్రగా పండినా నాలుగు టమాటాలు కొంగు నేసుకొని తీసుకొచ్చి రెన్నెల్ల కిందట అంగట్లకు పోయినపుడు బస్తా సంచిన కుట్టుకొని తీసుకొచ్చిన  పది కిలోల ఎండు మిర్చిని పట్టించి పెద్ద జాడి నిండా నింపి గుడ్డ సుట్టి పెట్టిన కారం పొడిని మూడు గంటెలు వేసి  వండిన బీరకాయ టమాట కూరని ఒత్తుగా కలుపుకొని కారం మంటకు నూదుట చేరిన చెమటలు అప్పుడప్పుడు తువ్వాలుతో తుడుచుకుంటూ తింటు ఈమె చెప్పే మాటలేవి పట్టించుకోకుండా తిని చేతులు కడుక్కొని చింత చెట్టు కింద నులక మంచం వేసుకొని… అలా కాసేపు ఒరిగి మోకాల్లని పట్టుకొని అవస్థపడుతూ…
“ఒసేవ్ ఆ జండుబాము సీస తెచ్చి గీ పిక్కలకి రాయవే దీనాల్ది పాణం పోతాంది నొప్పితోని.”
అలా అరుపు వినపడిందో లేదో వెళ్లి అరగంట సేపు పిక్కల్ని అరి కాళ్ళని పట్టుకొని జండుబాము రాస్తే గాని నిద్ర పట్టదు.
ఇదంతా రోజు గడిచేదే కొత్తగా చూస్తున్నదేమి కాదు.
కాని ఆ రోజు.. ఆ రోజుని తలుచుకున్న ప్రతి సారి ఒళ్ళంతా ఒకటే కంపరం తొమ్మిదో తరగతి ధాటి పదిని అందుకోవల్నంటే బిమారం రామారం ధాటి నయీంనగర్కు చేరవేసే హన్మకొండ బస్సును పట్టుకొని స్కాలరుషిప్పు సరిగిస్తారు అని నమ్మకున్న గవర్నమెంటు స్కూలుకి  చేరుకోవాలి. నాలుగు నెలలు దాటాక ఓ రోజు క్లాసులో నోట్స్ తీసి మొదటి పేజి తిప్పగానే మడిచిన పేపర్, ఆ పేపర్ తెరిచి చూస్తే కాల కృత్యం తీసుకుంటున్న బొమ్మ గీసి పిచ్చి బూతు రాతలతో తిన పేరుండడం. తిన బ్యాగును తెరిచి మరి నోట్ బుక్ లో తన అంగాలని చిత్ర విచిత్రంగా పిచ్చిగా గీసి పేరు రాసి  ఎవడు పెట్టి ఉంటాడో అని తలని చుట్టూ తిప్పి అందరి వైపు పరీక్షగా చూస్తోంది. పళ్ళు పట పట కొరుకుతోంది. గుండెలనిండా ఊపిరి బిగ పట్టి పిచ్చి గీతల కాగితాన్ని పిచ్చి పిచ్చిగా నలిపి ముక్కలుగా చించుతోంది. ఆ రోజంతా తల పట్టుకొని రాత్రంతా సిగ్గుతో కుమిలిపోయింది. ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి. ఎవరో నన్ను గమనిస్తూ ఉండాలి. వాడికి బుద్దేలా చెప్పాలనే విషయం కన్నా రోజు జరుగుతున్న పరిస్థితి నుండి ఎలా బయట పడాలనే విషయం మీదే తనని మరింత గబారకి గురి చేసింది. చెప్పలేక చెప్పలేక తల్లికి
“అమ్మ గీ సర్వ బట్టుకొని చెట్లల్లకి పోవడం నాకస్సలు ఇష్టంలే” అని చెప్పింది.
“గిట్లైతే ఎట్లనే ఇప్పటికే నాలుగు చినుకులు పడితే సూరు సిర్కలు వాసి ఇల్లంతా నీళ్ళతో నానుతాంది. పెంకులు సరి జేపినీకే పైసలు పుడతలేవు గిప్పుగు పయకానంటే ఎట్లా బిడ్డ..  ఏ మేమంధంరం బోతలేమా” అని అంటున్న తల్లికి ఎట్లా సముదాయించాల్నో అర్ధం కాలేదు..
లాభం లేదనుకొని చెల్లెను కూచో బెట్టుకొని “నువ్వు తోమ్మిదిలకెల్లి పదిల పడుతావ్ నేను పదిల కెల్లి ఇంటర్ కోస్తా.. మనం మంచి చదువులు చదవల్నన్నా మంచి బట్టలు వేసుకోవల్నన్నా నాయన తీసుకొచ్చే పైసల్ ఏ మూలకు సరిపోవు అవ్వ గూడ ఎం జేస్తది. మొన్ననే చూసినావ్ కదా పత్తేరుతూ శెల్కల కూలబడే, లో బీపి అని షుగర్ భిమారని చెప్తిరి. ఇంకా మనం పిల్లలమేమి కాదు. ఈ సెలవులల్లా మనం కూడా పత్తి పనికి పోదాం” అని.
అనుకున్నట్టు గానే సెలవులు రానే వచ్చాయి.  అనుమతి అవసరం లేదనిపించి అవ్వ నాయనకి చెప్పాకుండానే పత్తేరడానికి, ఇంటెనకాల దొడ్లో కాసిన కూరగాయలు, మల్లేషన్న షెల్కలో నాలుగు జామ చెట్లు వాటికి కాస్తున్న కాయలు ఆ చెట్లకి అవతలి పక్కన శంకరన్నోల్ల పొలంలో మంచి నీళ్ళ బాయి ఉండడంతో దాంట్లో ఎప్పుడు నీళ్ళురుతాయి గనక అన్ని కాయకూరలే పండించెటోల్లు. శంకరన్న కాడికి పోయి తానెం చెయ్యాలనుకున్న విషయం పూస గుచ్చినట్టు చెప్పింది. నువ్వు వారం వారం రైతు బజారుకు పోయి అమ్ముకోడం కన్నా పొలంపని సుసుకుంటూ ఆ కాయలేవో నాకే అమ్ము నేనేల్లి అమ్ముకొచ్చుకుంటా..
రోజు పొద్దున్నే ఏ కూరగాయలుంటే ఆ కూరగాయల్ని పెద్ద సైకిల్ క్యారెల్ మీద బుట్టలో పెట్టుకొని  హన్మకొండలో అశోక టాకీసు ఇంకా రెడ్డి కాలినిలల్లా  తిరిగి అమ్ముకోవడం మొదలయ్యింది. సెలవులైపోయ్ స్కూల్ మొదలైనప్పటికి తెల్లార గట్ల నాలుగ్గంటలకే లేవడం బుట్టకు బదులు రెండు పెద్ద సంచుల నిండ కాయగూరలు ఆక్కురలు నింపుకుంటూ పైడిల్ని అమాంతం తొక్కితే అరగంటలో తన సైకిల్ హన్మకొండకి చేరుకునేది. పాల ప్యాకెట్లు పేపర్ చేరుకునే టైంకి రెడ్డికాలనీల ఉండే ఇంట్ల ముందు ఫ్రెష్ కూరగాయాలతో తిన సైకిల్ బెల్లు మోగేది. ముక్కినవి పుచ్చిపోయినవి అనే బాధ లేకుండా వంక పెట్టకుండా గంట సేపట్లో రెండు సంచులు ఖాళి అయ్యేటివి. ఖాళి సంచుల్ని పుస్తకాల బ్యాగ్ లో మడత పెట్టి అందరికన్నా స్కూలుకి ముందుగా చేరుకొని బోరింగు దగ్గర మొహం కడుక్కొని బొట్టు జుట్టు సర్దుకొని కళ్ళకు కాటుక దట్టంగా అద్దుకొని ముద్దుగా రెడీ అయ్యేది.
బ్యాంకు నుండి అప్పు తీసుకొని ఇంటి ముందట కోళ్ల ఫారం వెలిసింది. అవ్వ ఇంటిని కోళ్ళ ఫారంని చూసుకోవడం. అవసరమైనప్పుడల్లా డాక్టరుతో కోళ్ళకి టీకా మందు లిప్పించడం, దాన పట్టుకు రావడం నాయన పని.  రోజు పొద్దున్న లేచి షెడ్డులోకి అడుగుపెడితే ఒకదానేంబడి ఒకటి రెక్కలనూపుతూ ముద్దుగా బొద్దుగా తెల్లగా మెరిసిపోయే కోళ్ళని చూస్తూ సంబరపడిపోయే అవ్వ నాయనలకి  ఎక్కడి నుండో ఎగిరొచ్చిన బర్డ్ ఫ్లూ రోగం ధాటికి కోళ్ళన్ని  శవాలుగా కుప్పలుగా పడి వీళ్ళ ఆశలని కన్నీటి ధారలుగా మిగిల్చింది.
ఇద్దరక్క చెల్లెళ్ళు రెన్నెల్లు తిరక్కుండానే పన్నెండు వేల రూపాయిలు నాయన చేతిల పెట్టి
“ఏం జేస్తావో జెయ్ నాకు మనింట్ల లెట్రిన్ కట్టించాల్సిందే.. ” అని గట్టిగానే చెప్పింది.
దానికి నాయన నవ్వుతు…
“ఇంట్ల అమ్మ కూడా కూడబెట్టిన పైసలు మూడు వేలు ఉంటాయి బిడ్డ ఈ పైసల్తో కోళ్ళ ఫారంలకి పిల్లల్ని కొనుక్కొస్తా.. “
అని సముదాయిస్తున్న తండ్రిని చూసి అప్పటి వరకు ఆపుకున్న కసి కోపం అంత కూడా గట్టుకొని గట్టిగ అరిచి
“నీకు చాతనైతే కట్టించు లేకపోతే నేనే మేస్త్రిని  పిలుసుకోస్తా.. “
అన్న తిన మాటలు విని ఖంగు తిన్నాడు అలాగే చూస్తుండగా కసి కోపం కన్నీల్లుగా మారి ఏడుస్తుంటే..
బిడ్డని ఏమయిందవ్వ అని తల్లి కళ్ళు తుడుస్తూ రొమ్మున చేర్చుకుంది. జరిగిన విషయం అంత తల్లికి చెప్తుంటే విన్న నాయన మనసు ఎట్లనో అయ్యింది. తన అసమర్ధత బిడ్డ కంట్లె కన్నీల్లై పారుతుంటే ఏమనుకున్నాడో ఏమో.. పెద్ద సైకిలేసుకొని అరగంటలో మేస్త్రిని తీసుకొచ్చి పాయకన బాత్రుంకు కొలతలు తీపించి లెక్కలు కట్టి పని మొదలు పెట్టిచ్చిండు.
మేడం మేడం.. ఒక్కసారిగా మళ్ళీ ఈ లోకం లోకొచ్చింది.
పని పూర్తయ్యింది మేడం.
డోర్ తీసి చూసుకుంది. వాష్ రూం అంతా కలకలాడుతోంది. షవర్, కమోడ్, గోడల మీద యురోపియన్ స్టైల్ ఆర్ట్ వర్క్ లైట్స్ మిర్రర్ అచ్చంగా బ్రౌచర్లో చూపినట్టుగానే ఉంది..
బావుంది. మిగతా పేమెంట్ అక్కడికక్కడే టాబ్ తీసి ఫోన్ బ్యాంకింగ్ తో మాడ్యులర్ హౌస్ ఐడియా డట్ కాం కంపెనీ ఎకౌంటుకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేసింది.
సరే మేడం ఇక మేము వెళ్తాం.
వెళ్ళగానే డోర్ క్లోజ్ చేసుకొని వెనక్కి తిరిగి చూసుకుంది.
తాననుకున్నట్టు గానే ఇల్లంతా తయారయ్యింది. అన్ని గదుల్ని టెక్చర్డ్ వాల్స్ ని తనివి తీరా తడిమి చూసుకుంది.
నిద్ర లేక చాల అలిసిపోయింది. ఒళ్ళంతా కాస్త నొప్పులు.
టవల్ తీసుకొని వాష్ రూం లో కెళ్ళింది. ప్రశాంతంగా షవర్ కింద సేద తీరడం తనకి అలవాటైన వ్యసనం.
నెమ్మదిగా షవర్ ఆన్ చేసింది నీళ్ళు రావట్లేదు. టాప్ విప్పింది అందులోనూ రావట్లేదు.
వెంటనే మైంటెనెన్స్ కి కాల్ చేసి రమేష్ త్రీ జీరో టూ ఫ్లాట్.
ఆ.. చెప్పండి మాడం.
వాష్ రూం లో వాటర్ రావట్లేదు. ఏంటో చూడు.
చూసేదేమి లేదు మాడం. ఎల్లుండి టాంకర్ ఒస్తది. అరగంట సేపు ఓదులుతాం మీరు రంబు లో పట్టుకోండి. అంటూ తాపీగా అవతలి నుండి కాల్ కట్..
చేసేదేమీ లేక టపి మని ఫోన్ నెలకి విసేరేసి,
వీల్ చైర్ లో వెనక్కి తల వాల్చి తిను..
నేల మీద పడి ఊగుతున్న రిసీవర్..
ఆన్ చేసే ఉన్న షవర్,
పక్క వాటా టీవీ లో పెద్ద శబ్దంతో
“మన హైదరాబాద్ భారత దేశంలో హ్యాపీగా బతకగలిగే సిటీగ గుర్తింపు పొందడం గర్వంగా ఉంది” అని మంత్రి మాటలు.

–Raghu Mandaatifecility

అలవి

September 11, 2013 Leave a comment

సాధారణంగానే ఏ అంచనాలు లేకుండా ఏ బంధం మొదలవ్వదేమో. కాలానికెప్పుడు నన్ను తర్కించే పనే.. ఎందుకో మరి ఎవ్వరికి అర్ధంకకపోవడం అనే ముద్ర మంచిదే అయ్యింది.. అందుకే ఇప్పటికి నేనందరికీ దూరం.మనుషుల మధ్య ఒంటరిగా నడుస్తూ గడపడం నాకో అలవాటైన వ్యసనం. ఏంటో నాకు సంబంధం లేని మనుషులని వారి సహజమైన భావాల్ని దగ్గరినుండి చూసే అవకాశం ఉంటుందనే రద్దీగా ఉన్న చోటులో గడుపుతుంటాను. ఇక అలా గడపొచ్చు అనే ఉద్దేశంతోనే సంతకు చేరుకున్నా. సంతలో చుట్టూ జనాలతో ఇరుపక్కల చిన్న చిన్న షాపులతో కిక్కిరిసిపోయింది. జనాల మధ్య ప్రతి పది పదిహేను సెకన్లకి తళుక్కుమని మాయమవుతోంది తను. ఇక తనని చూసాక మొట్టమొదట మనసులో కలిగిన బావం తనని తనివితీరా చూడాలని. ఏంటో కళ్ళతో పాటే అడుగులు అందరిని తోసుకుంటూ తనని చేరుకున్నాయి. నా అడుగుల్లో వేగం తగ్గింది. ఇక తనకి నేను ఏ మాత్రం దూరం లో లేను. రెండే రెండు అడుగుల దూరం నుండి తన వెంట నడుస్తున్నాను. సాధారణంగ ఏ అమ్మాయిని కూడా ఇంత తపనతో వెంట పడింది లేదు.

 
నా వయసు వాళ్ళందరు అమ్మాయిల వెంట పరుగులు పెడుతుంటే అర్ధమే కాలేదు ఇంత కాలం.. 
 
నల్లగా నిగనిగలాడుతు చక్కగా అల్లుకున్న జడ అడుగు అడుగుకు ఆగకుండా జడ గంటలు సుతారంగా ఎత్తు వంపులను తగులుతూ…
అంత గోలలో కూడా పాదానికి హత్తుకున్న అందెలు జిల్లు జిల్లు మంటున్నాయి.
తలలో గులాబీ పువ్వు దానిని ఆనుకుంటూ మూరెడు మల్లెలు. ఊగుతున్న కమ్మ బుట్టాలు. పిచ్చెక్కిస్తున్న నడుము వంపు. కనకాంబరం రంగు లంగా తెల్లని ఓణి ఏ మాత్రం ఒంపులను నా కంటపడకుండా దాచలేక పోతున్నాయి..
ఇప్పుడిక దూరం మరింత దగ్గరయ్యింది తన కంట పడకుండా తనని ఎదురుగా చూసేందుకు నలుగురైదుగురిని పక్క పక్కగా దాటుకుంటూ తన కన్నా కాస్త ముందుకు చేరుకొని వెనక్కి తిరిగి చూసా..
నా కళ్ళకి ఒక్క సారిగా మైకం.. తన నిలువెత్తు దేహంలో ప్రతి కదలిక వర్ణనాతీతం.
తన అందాల సుగంధాలు మత్తెక్కిస్తున్నాయి.
ఏదో వింతైన రసాయన చర్య ఒంట్లో జరుగుతున్నట్టు అనిపిస్తోంది.
తాను దగ్గరవుతున్న కొద్ది వింత ప్రకంపనలు అల్లకల్లోలం చేస్తున్నాయి.
లాభం లేదు తనతో ఎలాగైనా మాటలు కలపాలి కానీ ఎలా?
 
చాల సేపు గమనించాను తానొక్కతే సంతకి వచ్చినట్టుంది. తన పని తాను చేసుకొని ఇక సంత బయటకు అడుగులేస్తోంది. ఆ అడుగుల వెంటే నా అడుగులు. ఆకాశం మబ్బులని వడ్డించింది. వీస్తున్న గాలి చల్లదనాన్ని విసురుతోంది. జన సందోహాన్ని చీల్చుకుంటూ సాగుతున్న మా నడకలు చివరికి మమ్మల్ని మాత్రమే మిగిల్చాయి. 
 
ఇప్పుడు తన ప్రతి అడుగు స్పష్టంగా వినిపిస్తోంది. ఉన్నపళాన చినుకులు మట్టిలో దాగిన సుగంధాన్ని తవ్వుతున్నాయి. చల్లని తుంపర్లు గిలిగింత పెడుతూన్నాయి. కొద్ది కొద్దిగ తుంపర్లు కలిసిగట్టుగా జల్లుల రూపాంతరం చెందింది. తన ఓణీని ముని వేళ్ళతో పైనుండి అందమైన భంగిమలో తలమీద పరుచుకొని పట్టులంగా కింద తడవనీకుండా పైకెత్తుకొని నడక కాస్త పరుగుగా మారింది. పచ్చని పైరుని నీలాకాశాన్ని కురుస్తున్న జల్లులో తడిచిన కనకాంబరం పట్టులంగాలో పరుగెడుతున్న తను…..
ఆ దృశ్యం మనసు క్యాన్వాస్ పై వర్ణ చిత్రమై  దిద్దుకుంది. అల చూస్తూ నడుస్తున్న నేను ఎప్పుడు తడిచానో తెలీనే లేదు.
 
దూరాన రెండు ఈత చెట్ల కింద తడిసి ముద్దవుతున్న చిన్న పాక. ఆమె పరుగు లాంటి నడకతో అందులోకి చేరుకుంది. నెమ్మదిగా నా అడుగులకి వేగం అందించి చిన్న పరుగుతో చేరుకున్న. నలుగురు కూర్చోడానికి రెండు బల్లలేసిన చిన్న టీ కొట్టు. అందులో యాబై ఏళ్ళ ముసలమ్మా పొయ్యిమంట పెడుతూ పాల గిన్నెతో కుస్తీ పడుతూ..
 
పాకలో చిన్న కర్ర గుంజను ఆనుకొని చిన్న బల్లపై కూర్చొని తడి కొంగును దులుపుకుంటూ తను. తడిచిన జడలోని మల్లె పూలు మరింత తెల్లగా.. గులాబి రేకులో బందిలై మెరుస్తున్న చినుకులు. నొసటి నుండి కంటిని దాటుతూ పెదాలకు అడ్డుపడుతున్న వెంట్రుకల నుండి ఒక్కో చుక్క మెడను దాటుతూ హృదయం పై పడుతూ ఆ హృదయాన్ని దాచుకున్న రవికతో పాటు నా మనసుని కూడా తడుపుతూ..
 
ఎప్పుడు గమనించిదో తను
 
..ఓయ్ పిల్లోడ.. ఎంటా చూపు..
 
ఉలిక్కిపడ్డాను.
 
కళ్ళను నేలకు వేసుకొని ఎం చేయాలో అర్ధం కాక అది..  అది..  అంటూ ఎం చెప్పాలో తెలియట్లేదు.
 
మరోసారి నెమ్మదిగా చూసా..
 
తన జుట్టు విప్పుకుంటూ సూటిగా నా కళ్ళలోకి బొమ్మలెగిరేస్తూ తన చూపులు ప్రశ్నార్ధకంగా గుచ్చుకుంటున్నాయి. కాని తను నన్నలా చూడడం తనని నేనలా  చూడడం చాల ఆనందంతో చిత్రంగా ఉంది.  చల్లని ఈదురు గాలికి నడుం వంపులో చెక్కుకున్న తెల్లని కొంగు ఉండలేక పైపైకి రెపరెప లాడుతూ ముసుగేసుకున్న నాబి తెరని ఎత్తి చూపుతోంది. గోదుమ బంగారు పసుపు రంగులు కలబోసుకొని ఓ సరి కొత్త రంగులో తన దేహ ఛాయా. మునుపెన్నడూ చూడని ఆ అందం కను రెప్పని వేయనీయలేకపోతోంది. నా వాలకం చూస్తుంటే కామందుడిగా  మారుతున్నానా?? ఎప్పుడు గమనించిందో చట్టుక్కున తెర దించి కొంగుని లంగాలోకి మళ్ళి చెక్కుకుంది అయినా తడిచిన ఓణిగుండా మసగ్గా ఇంకా మైమరిపిస్తూనే ఉంది.
 
ఓయ్ పిల్లోడా.. ఏ ఊరి మీది. అడిగేది నిన్నే…!! కిక్కురు మనట్లేదు. సంతలో నుండి చూస్తున్న నువ్ నా వెంట బడటం..
 

Alavi

ఇదిగోవే పిల్ల వేడి వేడి గ కాస్త చాయ్ నీళ్ళు గొంతులో పోసుకో చలి వణుకు ఆగిపోద్ది అని ముసలవ్వ తన చేతిలో పెట్టింది. రెండు చేతులకి కొంగు సాయంతో దోసిలితో అందుకొని గుంజకి ఆనుకొని దగ్గరికి ముడుచుకొని వణుకుతూ ఒక్కో గుటక గొంతులోకి దింపుకుంటూ సేద తీరిన ములుగుతో ఆహ: ఒసే ముసల్దాన నువ్వు సూపరు..
 
నోరు మూసుకోవే నువ్వు నీ వాలకం.
పాడు వాన తగ్గేటట్టు లేదు ఇదిగో నాయన నువ్వు కూడా తాగు అనడంతో తీసుకున్నాను..
 
తాగు పిల్లోడ.. ఈ ముసల్దాని చాయ్ సూపర్ గుంటది.
 
పిల్లోడ పిల్లోడ అని ఏంటే ఆ మాటలు, ఒంటి మీదకు వయసొచ్చిన పెద్దంతరం చిన్నంతరం లేకుండా. ముక్కు మొహం తెలియకుండా ఏంటే అవి.  రాను రాను దీని ఆగడాలు ఎక్కువైతున్నాయి. ఓ మొగుణ్ణి కట్టబెడితే గాని దీని తిక్క కుదరదు.
 
మొగుడా…!! ఒసేయ్ ముసల్దాన నీకే తీసుకోస్తా మొగుణ్ణి.
 
ఆ అదొక్కటే తక్కువ నాకు..
 
నువ్వు తాగు బిడ్డ ఈ పోరి పెద్ద వాగుబోతు. నువ్వేం పట్టించుకోకు. మాకిది మామూలే..
 
చలాకి పిల్ల. పిల్లేం కాదు దగ్గరి దగ్గరగా ఓ ఇరవై యేండ్లు ఉంటుంది కావచ్చు.. ఎందుకో ఆ చలాకీతనం నాకు నచ్చింది..
 
ఒసేయ్ బట్టలు మార్చుకోవే చలి బట్టలతో ఎంత సేపని ఉంటావు. చలి ఆగక పోతే దా ఈ పొయ్యి కాడికి.. కాస్త సెగ అంటుకో.. నువ్ గూడ రా బాబు.
 
అగొ… రా బాబు ముసల్ది పిలుస్తోంది. అంటూ వెకిలి భంగిమ పెడుతూ నవ్వుతు పిలిచింది.
 
ప్రేమ పుస్తకాలు ఎన్నో చదివా ఎన్నో సినిమాలు చూసా కాని ప్రత్యక్ష అనుభవం కలో నిజమో ఏమి అర్ధం కాకుండా చిత్రంగా, కొత్తగా గిలిగింత పెడుతోంది. దానికి తోడు చల్లని ఈదురు గాలులు, వర్షంలో తడిచిన ప్యాంటు షర్టు చలిని రెట్టింపు చేసింది. ఇక చలిని భరించడం నా వళ్ళ కాదనుకుంటూ ఒంటిని కాపుకునేందుకు పొయ్యిమంట  దగ్గర తిష్టేసా.. వెచ్చటి సెగ నెమ్మదిగా ఒళ్ళునంత తాకేసింది కాస్త కుదుట పడింది.
 
నెమ్మదిగా లేచి పాక బయటికి  తొంగి చూసా కోరస్ పాడుతున్నట్టు వర్షం. తెలీకుండానే పాక చుట్టూ, ఆకాశం నిండా చీకట్లు అలుముకున్నాయి. వర్షం తగ్గేలా లేదు. ఎం చేయాలో తోచట్లేదు.. ఒక్కోసారి మనసు మన మాట వినదు అనుకోడానికి ఇది సరైన నిదర్శనం. ప్రతి మగాడు అమ్మాయికి ఆకర్షింప పడతాడు ఇది సృష్టి ధర్మం అంటారు. ఆకర్షింప పడేది అందానికా? మనసుకా? మనసుకు ఆకర్షింపబడడం కన్నా ముందు నన్నడిగితే అందమే. ఆ అందమే ఎంతటి మగాన్నైన వెంట పడేలా చేస్తుంది.. ఇక మనసుతో మొదలయ్యే బంధాలు శరీరంతో పనిలేనట్టుగా నటిస్తూ గడుస్తాయి. అయిన ఏ బంధమైన ఒకరికొకరై ఇష్టపూర్వకంగా మమేకమైనపుడే బంధానికి పరిపూర్ణమైన అర్ధం చేకూరుతుంది. అర్ధం అనే దానికన్నా వేరే పేర్లని ఎన్నో పెట్టుకోవచ్చు. ఇలాంటి స్టేట్ మెంట్ లని చలం ఎప్పుడో ఇచ్చే ఉన్నాడు. అయినా ఎవరు ఏం చెప్పిన ఎవరికి వారికి ఎదురైన సంఘటన సారాంశం మీదే లేదా వారి కోరికల ఉహ జనితంగా నిర్మించుకున్న సౌదాలపై ఆధార పడి ఉంటుంది వారి వారి నిర్వచనాలు.
 
ఓయ్ పిల్లోడా..
వెనక్కి తిరిగి చూసా.. లాంతరు వెలుతుర్లో. నేనెన్నడు ఊహించని మైమరిపించే అందం ఇలా కళ్ళముందు నన్ను కలవరిస్తూ చూస్తుంటే. గుండెలో తెలియని వింత భావమేదో నన్ను శిలను చేసేస్తోంది. మాట పెగలనివ్వట్లేదు.
 
ఓయ్ పిల్లోడా.. ఆడ పిల్లను ఎప్పుడు చూడనట్టు మింగేసే ఆ చూపేంది..
 
అవునా..! నిజంగానే నా చూపు అలా ఉంటుందా.. ఏమో? ఈ అమ్మాయి చెప్పే తీరును చూస్తే అలానే ఉండి ఉంటుంది. అందరు నా నవ్వు బావుంటుంది. కళ్ళు కలవరపెడతాయి. అంటూ క్లాస్ మేట్స్  సరదా పట్టించేవారు. నా ప్రయాణం అమ్మాయిలు లేక ఒంటరిగా ఏం సాగలేదు అలా అని అమ్మాయిలతోనే సాగలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏ అమ్మాయి నన్ను ఆకర్షించలేదు. ఆ విషయం గురించి పెద్దగ ఆలోచించ కుండానే రోజులు అలా  గడిచిపోయాయి. కాని ఈ అమ్మాయిని చూడగానే తెలియకుండానే నరనరాలు వేడెక్కుతున్నాయి.. తెలియని వైబ్రేషనల తో అమాంతం శరీరం అంత ఊగిపోతున్నట్టు తలపు. ఒక్కసారిగా తనలోకి దూకేయ్యలన్న ఆత్రుత.. ఈ క్షణంలో ఆలోచనలకు కోరికలు ఊతమిస్తూ శరీరాన్ని బలోపేతం చేస్తూ ఇంచుమించు వ్యవసున్ని చేస్తున్నాయి.. అయిన ఈ చర్య ఏది బయటికి కనపడనీకుండా ఎంత నిశబ్దంగా ఉండాలని ప్రయత్నించిన ఏం లాభం నా కళ్ళు యిట్టే బయట పెడుతున్నాయి.. ఈ అమ్మాయికి నా బాష కళ్ళతో అర్ధమైనట్టుంది ఇక తప్పదన్నట్టు చూపును పక్కకి తిప్పుకున్న..
 
లాంతరులో మిలుమిలుకు మంటు చిన్ని దీపం చీకట్లతో సాధ్యమైనంత యుద్ధం చేస్తూ తన అస్తిత్వంతో ఆమె అందానికి మరింత అందాన్ని ముద్దుగా అద్దుతోంది..  చల్లని గాలులు తన కురుల కొసలను లాక్కెల్లె ప్రయత్నం చేస్తున్నాయి.. నుదిటి పై ఎర్రని సింధూరం. కనుబొమలు ఎగిరేస్తున్న ప్రతిసారి నన్ను గట్టిగ ప్రశ్నిస్తున్నట్టు. గుండ్రటి కళ్ళు ఎప్పుడు చూసిన నన్ను తన వైపుకు లాగుతున్నట్టు. ఆ కను రెప్పల పై అక్కడక్కడ తడికి చెదిరిన కాటుక గుర్తులు.  ఆ పెదాల అంచున మకరందాన్ని దాచిన పుప్పొడి గుత్తులా.. ఎగిసిపడుతున్న తడి ఆరిన కురులతో, లాంతరు పట్టిన చేతి మణికట్టుకు మెరుస్తున్న మెరుపు గాజులు బహుశా సాయంత్రం సంతలో కొన్నవే అనుకుంటా..
 
మగాడి మనసు పారే నీరు. అంచనా మానసికమైన మరే రకమైనదైన ఎప్పుడు నా కోణాల్లో నుండి తర్కిస్తూ బేరీజు వేస్తూ క్షణ క్షణానికి అభిప్రాయపడుతూ, అర్ధం చెసుకుంటున్నట్టు  అనంతమైన అనుభూతి యేదో ఉందని భ్రమ పడుతూ, తృప్తిని పొందలేకపోయినా, ఇవ్వలేకపోయినా అంతర్గతంగా సాగుతున్న ఈ వింత అలజడులను ఇంతకు ముందెన్నడు పొందలేదు. బహుశ నాది మోహమో లేక కామమో కాక ప్రేమో ఏమో…
 
ఏంటోయ్ పిల్లగా ఏం మాట్లాడట్లేవ్ ఏంది సంగతి?
 
మాటలా ఎందుకు మాట్లాడట్లేదు కొన్ని గంటలుగా నాలో నేను నాలోని నీతో ఎన్నో ఎన్నెన్నో మాట్లాడుతూనే ఉన్నా వాటిని మౌనంగా నువ్వు పసిగడుతున్నవన్న సంగతి కుడా నాకు తెలుసు. ఇక తెలుసుకోవాల్సింది తేల్చుకోవాల్సింది ఏమైన మిగిలి ఉందంటే నీకు నాకు నడుమ మిగిలిన ఈ అడుగు దూరమే.. నిజాన్ని నిర్బయంగా ఈ క్షణం అనుభావిస్తున్ననా లేక అనుభవంలోనే ఉన్నానన్న భ్రమలో ఉన్నానా! కళ్ళముందు యాంత్రికంగా గడిచిపోయే క్షణం నాకోసం కల్పితమై కళాత్మకమై చిలిపిగా కలవరపెడుతున్నదా! ఇలాంటి కాదు కాదు ఈ అనుభవాన్నేనా ఎన్నాళ్ళనుండో నేను కోరుకుంటున్నది. ఏమో.. కావచ్చు మనసులోని వింత ప్రేలాపనలా ప్రేరేపణల వాలకాన్ని చూస్తుంటే నిజమే అనిపిస్తోంది.
మగాడికి కావాల్సిన ప్రపంచమే అమ్మాయికి ఆయుధం. మగాడిని మించిన ధైర్యం కాని భయం కాని మరోటి తన ప్రపంచంలోనే లేదు.
 
చీకట్లో కప్పలు తమ సామర్ధ్యాన్ని కలిసిగట్టుగా వినిపిస్తున్నాయి.. వాటికి ఏవో కీటకాలు శృతి కలిపాయి.. చల్లని తుంపర్లతో కూడుకున్న వర్షపు గాలులు నన్ను తన మీదకు నెడుతున్నాయి. కళ్ళెదురుగా నిలువెత్తు అందం అందంగా నన్ను అలాగే గమనిస్తోంది.
 
దా.. వానా ఇప్పుడప్పుడే తగ్గదు గాని లోనికి రా.. నోట్ల నాల్క లేనట్టు జేస్తున్నావ్ నేనోకధాన్ని ప్రశ్న మీద ప్రశ్న అడుగుతున్న ఉలుకతలేవ్ పలుకుతలేవ్ ఏందో ఈ పిలగాని సంగతి. రా…  
 
అంటూ తన కుడి చేయి లాంతర్ని కిందికి దించుతు ఎడం చేయితో నా కుడి భుజం పట్టుకొని లోపలికి జరుపుతు ముందుకు నెట్టింది. 
ప్రశ్న నాకు నేనే ఒక పెద్ద ప్రశ్న సమాధానం కోసం వెతుకుతూ వెతుకుతూ ప్రశ్నల సాగరంలో సమాధాన తీరం కోసం శక్తినంత ఉపయోగిస్తూ చిల్చుకు పోతున్నా చిత్రం ఏంటో గాని తీరం కనపడితే ఒట్టు. నింగి నీరు కలియపడుతున్న చోట నాలో జ్ఞాన వెలుగును వెలిగించుకునేందుకు నన్ను నేను ప్రశ్నల మంటలో కాల్చుకుంటూ కాలానికి సాక్ష్యంగా ఏకాంతంగా అర్ధంకాని ఓ అజ్ఞాత సమిధనై ఇంకా మిగిలి ఉన్న.. ఇక తను అడిగే ప్రశ్నకు సమాధానాన్ని తయారు చేసుకోక తప్పదు. నిజమే తనని చూసినప్పటి నుండి ఇప్పటి వరకు తనను చూడడమే తప్ప తనతో పలికింది లేదు.
 
ఊగుతున్న లాంతరు నా నీడను కూడ అటు ఇటు ఊపేస్తుండగా మెల్లిగా అడుగులు వేస్తూ లోపలి నడిచా నా వెనకాలే వయ్యారంగా లాంతరుతో తాను. లంగా ఓనిలో కాస్త పిల్ల చేష్టలు కనిపించిన ఆ పిల్ల చేష్టలను వానలో తడిసిన లంగా ఓనిలో దాచేసి మిగిలిన నున్నటి శిల్పానికి లేత పసుపు రంగు నార చిరని బిగుతుగా చుట్టేసి విశాలమైన ఆడతనాన్ని కొంగుతో కప్పేసి పరమార్ధపు నడుం వంపులో గాలికి ఎగిరిపోకుండా జాలువారుతూ మిగిలిన కొంగుని చెక్కుకొని ఓ నూతనత్వాన్ని ఆపాదించుకొని పరిపూర్ణమైన కన్యతనానికి చిరునామై నృత్య భంగిమలో హొయలుగొలుపు సుతి మెత్తని చిరు మెలికల కదలికలతో అడుగులోన అడుగువేస్తు వెళ్లి నేను కూర్చున్న ఎదురు బల్లపై కర్ర గుంజకి వీపుని ఆనించి అదే గుంజకి పొడుచుకుంటూ ముందుకు సాగిన కర్ర వంపులో లాంతరును వేలాడించింది. తన మోకాళ్ళని గుండె ధరి దాపుకు వచ్చేదాక ముడుచుకొని ఎడమ చెయ్యితో మొకాళ్ళని చుట్టేసి కుడి చేతిని నడుము వెనక బల్లపై పెట్టి వెన్నుతో పాటు తలని కూడా కర్రగుంజకి ఆనించి చాల నిశ్శబ్దంగా ప్రశాంతంగా అలిసిన ప్రకృతి సొమ్మసిల్లి సేద తీరుతున్నట్టుగా కూర్చున్న తనపై లాంతరు వెలుతురు పోటి పడి మరి తన లోని ఒక వైపుని అమాంతం వాటేసుకొని ప్రతి కదలికల వంపులో ఓ సరికొత్త సౌందర్యాన్ని పూత పోసి ఇక కళాకారుడి కుంచెలో మమేకమవడానికి పూర్తిగా తనని సంసిద్ధం చేసేసింది. తనను సుతిమెత్తగా హత్తుకుంటున్న లాంతరు వెలుతురుకున్న స్వాత్రంత్రం ఇంకా నా ముని వేళ్ళకి ఎప్పుడొస్తుందో.. తన ఉచ్చ్వాస నిశ్వాసలకు లయబద్దంగా గుండెపై పరుచుకున్న ఆడతనం ఊయలలూగుతోంది. ఆ ఊయలపై పిల్లాడిల తలవాల్చుకొని ప్రియసఖుడినై నను చూసే ఆ చూపుల దారులగుండా తన మనసులోకి తొంగి చూడాలని ఏంటో ఏవో ఏవేవో అర్ధం కాని నా ఆలోచనలను అర్ధవంతం చేసుకోవాలనే తపనతో తన చుట్టే పరిభ్రమింపచేస్తూ, ఇక  మౌనంగా మిగిలిన నా దేహాన్నిబల్లపై జీవమున్న శవంలా బంధించేసా…
 
చుట్టూ పరుచుకున్న నల్లని చీకట్లు వీస్తున్న చల్లగాలులు కురుస్తున్న వర్షం వెలుగుతున్నలాంతరు తనకు నాకు నడుమన మిగిలిన ఘడ సౌందర్యనిశ్శబ్ధం హ్మ్… నా చుట్టూ, నాలో గడుస్తున్నఅందమైన భావ క్షణానికి ఇవే సాక్ష్యాలు. ప్రతి ఒక్కరు దేనికోసం పరితపిస్తారో నాకు తెలీదు. ఇంతకాలం నేను దేనికోసం తపిస్తున్నానో అర్ధమే కాలేదు. తమ కోసం, తమను తాము త్రుప్తి పరుచుకోవడం కోసం అవగాహన లేని యాద్రుచిక దారుల్లో గుడ్డిగా ప్రయాణం చేస్తుంటారు. కొన్ని ప్రయాణాల్లో ఆది నుండి అంతం వరకు వేటికి నిర్వచనాలు ఉండవు. ఇలాంటి ప్రయాణాల్లో చివరికి మిగిలేది అనుభవం అనుభూతి మరియు ఎప్పటికి అర్ధం కాకుండా ఓ ప్రశ్నలా మరో ప్రయాణానికి సిద్దంగా మిగిలిపోయే మనం. బహుశ ఇప్పుడు నేను అనుభవిస్తున్న ఈ అనుభూతి ఇంచు మించు అలాంటి ఓ అరుదైన ప్రయాణమే.. కాని ఆదికి అంతానికి నడుమ అర్ధం కాకుండా శిలల ఉండిపోవడం ఎందుకో బావుంది.
 
ఓ పొల్ల పడుకున్నావే..! అంటూ ముసలావిడ లోపలి నుండి వచ్చింది. పాక చిన్నదే పాక గోడలు వెదురు తడకలతో తాయారు చేసుకున్నట్టుంది.  ఆ పాకలో నలబై శాతంలో తడకలనే అడ్డు పెట్టి అందులో మల్లి రెండు చిన్న చిన్న అర్రలుగా విడదీసి ఒక దాంట్లో పొయ్యి గిన్నెలు పెట్టుకుంది. ఇంకో అర్ర పట్టె మంచం బట్టలు పెట్టుకోడానికి. చీకటిలో అంత స్పష్టంగా కనిపించట్లేదు కాని పోల్చుకొగలిగాను. పొయ్యి మీద వంట పూర్తి చేసుకొని ఇప్పుడో రేపో చిరిగిపోతుంది అన్నట్టుండే చీర కొంగుకు తడి చేతులు తుడుచుకుంటూ తన దగ్గరికి వచ్చింది.
 
లేవే లే.. అనడంతో ఉలిక్కి పడి లేచింది.
 
ఎంటే..  ముసల్దానా! మంచి నిద్రను పొట్టన బెట్టుకున్నావ్. అని ముసలావిడ మీదకు విరుచుకు పడింది.
 
అబ్బో సాల్లే.. నీ పొట్టలో ఇంత కూడేయ్యలని లెపినానె.. లే లెగు ఇంత సల్లబడు. అంటూ రెక్క పట్టి లేపే ప్రయత్నం చేస్తోంది.
 
అయ్యో పిల్లోడ నువ్వింకా బొలెధా..? అని నిద్ర కళ్ళతో ప్రశ్నించింది. నాకు ఆశ్చర్యమేసింది.
 
యాడికి బోతాడే బయట వాన ఎట్లగోడ్తాంది సుషినవా? ఇంకా నయం తుఫాను గట్ర ఐతే మాత్రం ఈ గూడు గూడ నిలవదు. ఇంత సీకట్ల ఈ వానల యాడికి బోతావ్ ఈ రేత్రి యిన్నే ఉండు బిడ్డ. వాన తగ్గేకా తెల్లారగట్ల బొదువు లె..
 
లేవే పొల్ల లే.. లేచి అబ్బాయి చెయ్ గడుక్కోనికి ఇన్ని నీళ్ళు ఇవ్వు. తొరగా రండి నేను బోయి పళ్ళెం లో అన్నం తోడుతా..
 
ముసలావిడ పొయ్యి మీద నుండి వంట కుండలు, పళ్ళాలు, కూచోడానికి పీటలు సిద్దం  చేస్తోంది. తను సర్వలో నీళ్ళు పట్టుకొచ్చింది. నెమ్మదిగా ఇద్దరం పాక బయటికి చేతులు పెట్టి కడుక్కున్నం.
 
ఇగో… నేను ఇగ నీతో మాట్లాడను పిల్లగా. అంటూ నా వైపుకు చూసింది.
 
ఏ ఎందుకండి.
 
అబ్బ. ముత్యాలే రాలుతున్నాయి. ఎందుకలా మూతి ముడ్చుకొని ఉంటావ్. సంధిస్తే ఎక్కడలేని సోదంత వాగుతారు అబ్బాయిలంత. నువ్వేంటయ్య ఇలా.. అమ్మాయిని అందులో మాంచి అందగత్తెని నన్ను ఎదురుగా పెట్టుకొని ఎక్కడెక్కడో అలోసిత్తున్నావ్..
 
అదేం కాదండి. వర్షం ఎప్పుడు తగ్గుతుందా అని.
 
ఒక్క సారిగా నావైపు చూసి చేతిలో ఉన్న సర్వని ధడాల్న కింద పడేసి. కోపంతో
 
మరి నా యెంట ఎందుకొచ్చినావ్? అట్నుండి అటే ఎల్లలేకపోతివా.. ఛీ పో.. అంటూ టక టక లోపలికి వెళ్ళింది. నేనక్కడే ఉండిపోయా.. ఏమనుకుందో ఏమో..
 
ఆన్నే ఏం జేస్తున్నావ్ చెయ్యి బట్టి గుంజుకు రావాల్నా?  దా తొరగా..  అంటూ ధబాయించింది. ఇక తన వెంటే వెళ్లి నాకోసం సిద్దం చేసిన  పళ్ళెం ముందు కూచున్న. నాకు దాదాపుగ పక్కనే తను కూచుంది. ముసలావిడ కుండలో నుండి చేపల పులుసు గంటెతో వంపుతోంది.
 
ఓయ్ పిల్లగా అలగకుండా గులగకుండా కడుపునిండా తిను. మా ముసల్దాని చేప పులుసు తినే అద్రుష్టం నీకు దొరికింది. తినిసూడు ఇగ నువ్వు మరిసిపోతే ఒట్టు.
 
నువ్ నోర్ముయ్యవే అబ్బాయిని తినని ఎప్పుడు ఏందో వాగుతావ్..
 
ఏందే ముసల్దాన నా మీదకి ఎగురుతున్నావ్ పళ్ళెం ఎత్తేస్తా జాగర్త..
 
అబ్బో దీనికేం తగ్గువలేదు రోజురోజుకి గారవం చేత్తుంటే నెత్తికెక్కుతాంది. నీకిప్పుడు తెల్వది ఆగు.
 
ఇక వాళ్ళిద్దరూ గొడవపెట్టుకోకుండా క్షణం ఉండలేరని అర్ధమయ్యింది.
 
నెమ్మదిగా పొగలు గక్కుతున్న అన్నంలో కమ్మని చాపల పులుసు. పైగా కడుపులో పేగులు నకనక లాడుతున్నాయి. ఇక ఆగలేక గబా గబా కలుపుకొని ఒక్కో బుక్క నములుతుంటే నిజంగానే స్వర్గం కనపడుతోంది.
 
కాసేపటివరకు ఏ మాటలు లేకుండా ప్రశాంతంగా ముగ్గురం తినే పనిలో మునిగిపోయాం..
 
చాల కాలానికి రుచికరమైన బోజనాన్ని శ్రద్దగా తినడంతో నొసటిపై చిరు చెమటలు పట్టాయి. వేడి వేడి పొయ్యి మంట వద్ద కూచొని తినడంతో ఒళ్ళంతా వేడిగా మారింది. భయటికొచ్చి నిల్చున్న చేతులు కడుక్కున్నాను. తల అటు తిప్పుకొని చెయ్ తుడుచుకో అంటూ తన కొంగును అందించింది. ఇక తన కొంగుతో చేయి తుడుచుకోకపోతే మళ్ళీ ఏమంటుందో అని తుడుచుకున్నాను. వర్షం తన అస్తిత్వాన్ని ఇంకా వీడలేదు చల్లని గాలుల సైన్యాన్ని వెంటేసుకొని నేలపై ఆగకుండా బాణాలను విసురుతూనే ఉంది. ఆ చల్లగాలుల కౌగిలింతలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. బహుశా ఆ మధురిమలు తనను కూడ గిలిగింత పెడుతున్నట్టున్నాయి. ఏదో కూని రాగం తీస్తూ చేయి ముందుకి చాచి పాక అంచులనుండి సన్నగా జాలువారుతున్న ధారని అరచేతిలో నింపుకుంటోంది. అరచేతిలో పడుతున్న చల్లనిదార గిలిగింత పెడుతున్నట్టుంది. చిలిపిగా తనలో తాను నవ్వుకుంటోంది. తననలా చూస్తున్నాను. ఓ సారి అలా నా వైపుకు తొంగి చూసింది. నేనింక తనని అలానే చూస్తున్న. తన అరచేతిలో నిండిన ధారా చేతిలోనుండి పొంగి పోర్లుతోంది. ఉన్న పలానా నా మీదకి విసిరింది. ఆకస్మిక చర్యకి ఉలిక్కిపడ్డాను. తను ఫక్కుమని నవ్వుతోంది. ఆనందంగా నవ్వుతోంది. నా ముఖాన చిమ్మిన చల్లని నీళ్ళతో ఒళ్ళు పులకరించింది. తిరిగి తానే తన కొంగు అంచుతో నెమ్మదిగా నవ్వుతు తుడుస్తోంది. తన చిలిపి పని నాక్కూడా నవ్వు తెప్పించింది. చిన్నగా నవ్వాను.
 
అబ్బో సొట్టబుగ్గలా…
 
తనలా అంటుంటే కాస్త కొత్తగా అనిపిస్తోంది.
 
ముఖాన్ని నెమ్మదిగా కొంగుతో తుడుస్తోంది. అప్పుడప్పుడు తన వేళ్ళు నా నుదిటిని, చెంపని, పెదాల్ని తగులుతోంది. ఏ అమ్మాయిని ఇంత వరకు నేను తాకింది లేదు, నన్నెవరు తాకింది లేదు. కాని ఎన్నడు ఎరగని ఈ అనుభూతి వీస్తున్న చల్ల గాలుల కన్నా మరింత ఎక్కువ  హాయినిస్తోంది. ఒళ్ళు పులకరిస్తోంది చెప్పాలంటే చేతులపై రోమాలు నిక్కపోడుచుకున్నాయి.
 
కళ్ళు మూసుకున్నాను ఇంకా ఆ హాయి మాయలోనే తచ్చాడుతున్నా.
ధ్యాన ముద్రలో ఉచ్చ్వాస నిశ్వాసలు ఏకమైన చోట తెలియని ఓ తేలికతనం మది చుట్టూ దేహం చుట్టూ అల్లుకుంటుంది దేని అవసరం లేనంతగా చివరికి శ్వాస కూడా. అలాంటి స్వచ్చమైన తేలికైన స్థితికి నెట్టుకొని ఎల్లలు లేని విశాల గగనంలో ఇప్పుడు సాగిపోతున్న..
 
అనంత దూరాలను, కొండలను, జలపాతాలను, కండలు తిరిగిన మేఘాలను, చల్లని తుంపర్లను, మంచు  బిందువులను, పూలను, పక్షులను, మైదానాలను, హరిత వనాలను, రక రకాల వర్ణాలను, ఇంద్రధనస్సును అన్నిటిని దాటుతూ దాటుతూ నీలాకాశాన్ని చిమ్మ చీకటిని చుక్కల్ని నక్షత్రాలని పాలపుంతలని కూడా దాటేస్తూ శూన్యాన్ని నిశ్శబ్దాన్ని చేరుకున్న అక్కడే ఎక్కడో మరింత దూరాన ఎవరిదో కూని రాగం. ఆ రాగానికి దగ్గరగా మరింత దగ్గరగా..
 
శృతులన్ని ఒలికినట్టున్నాయి ఒక్కో శృతి ఏరుతూ ఏరుతూ ఎవరిదో నీడ హా అవును నీడే…  ఆశ్చర్యం చిమ్మ చీకట్లో సైతం ప్రకాశంగా వెలుగుతున్న నీడ. శృతులని ఏరుకునే పనిలో అందెల మువ్వలు ఒక్కోటి అదే శూన్యంలో శూన్యానికే తగులుతూ ఘల్లుమని రాలుతున్నాయి. రాలిన మువ్వ ఓరగా నను చూస్తూ జాలిగా నవ్వుతోంది.
 
పారాణి దిద్దుకున్న పాదం అడుగు తీయగానే నీటిలో పడిన రంగు చుక్కలా పారాణి  ఇదే శూన్యంలో చెదిరిపోతోంది. వెలుతురు కూడా లేని ఈ శూన్యంలో రంగు ఎలా మొలిసిందో.. ఊగిసలాడుతూ పలుచని తెర దేనికో అడ్డంగా ఉంది.  తెరను తాకాలని కదిలా కదులుతున్నకొద్దీ తెర దగ్గరవుతున్న కొద్ది ఏవో సుగంధాలు కనిపించకుండా నా చుట్టూ నాట్యం చేస్తున్నాయి.
 
పలుచని తెర, రెప రెప లాడుతూ తెర, అలల్లా పొర్లుతున్న తెర, తెల్లని తెర, ఆ తెర అంచుల చివరి కొనదారాలు నా నుదిటిని కళ్ళను దాటాయి. చేతితో పట్టుకొనే ప్రయత్నంలో ఎవరో ఆ తెరని లాగుతూన్నట్టు చేజారి పోయింది. మిగిలిన మువ్వలు చేసే అలజడులతో అందెలు గుర్తులు పెడుతున్నాయి అడుగు వేసిన చిరునామాని నాకు తెలిసేట్టుగా..
 
అలజడి ఆగింది. తెర పారిపోవడం కూడా ఆగింది. నేను ఆగిపోయా..  ఎక్కడినుండో ప్రయాణమవుతూ తెరని చేరిన నెమలికన్ను. ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల వేల కొలది కన్నులు తెరను చుట్టుకున్న నీడ చుట్టూ గుండ్రటి గోళంలా అల్లుకున్నాయి. ఆ నీడకు నాకు తెలీకుండానే రంగులద్దుకున్నాయి. రక రకాల రంగులతో రంగుల శిలల ముద్రించుకుంది. శిల చుట్టూ గుండ్రటి నెమలికన్నుల విశాల  గోళం. ఆ గోళం చుట్టూ పచ్చదనం దానికి పైన నీలం ఒక్కొక్కటిగా చుట్టూ ఇంద్రధనస్సు రంగు పరుచుకుంది. మధ్యలో రంగులు దిద్దుకున్న శిలకు  దగ్గరవుతూ మరింత దగ్గరగా రంగు రంగుల అందమైన పూలు గుత్తులు గుత్తులుగా వేల సంఖ్యలో ఎదురుపడగ వాటిలో ఈదుకుంటూ కనిపిస్తున్న వందలకొలది రామ చిలుకలు  ఒకేచోట తమ రెక్కలు రెపరెపలాడిస్తున్నాయి. వాటిని దాటుకుంటూ రంగుల శిల్పానికి చేరువవుతున్నాను. మరింత దగ్గరగా  సుగంధపు పరిమళాలను హత్తుకుంటూ చేరాను. మేలి ముసుగు తొడిగిన రంగుల శిల్పం వయ్యారంగా నిల్చొని కుడి పాదం బొటన వేలు శూన్యంలో అటు ఇటు అంటూ ఏదో రాస్తోంది. ఆ రాతలోనుండి రక రకాల రంగుల పొడులు విబిన్న రూపాల్లో వేవేల తరంగాలై నా చుట్టూ అల్లుకుంటున్నాయి.
 
చిత్రంగా నేనింక  సీతాకోకల రెక్కలతో అల్లుకున్న మేలి ముసుగు వెనకాల దాగిన రూపాన్ని చూసేందుకు వేచి చూస్తున్న. నెమ్మదిగా తన మెలి ముసుగు తీసింది. నేను ఊహించిన రూపమే తానే అవును తానే తన అంగాంగము ప్రకృతిలో కలగలసి ఓ వన కన్యలా…  చక్కని పలువరుస కూడిన నవ్వుతో నావైపే చూస్తోంది. ఇది కల కాదు నా ఎదురుగానే ఉంది. మరి మా ఇరువురి చుట్టూ అల్లుకున్న ఈ వింత ప్రపంచం ఇది కూడా కల కాదేమో ప్రతిది అనుభూతి చెందుతున్నాను. మాయ కూడా కాదు ఆణువణువూ నన్నల్లుకొని ఆత్మతో సంబాషిస్తోంది.
వన కన్యై తాను నా ముందుకొచ్చి ముని వేళ్ళతో జుట్టు నిమురుతోంది. నొప్పి పెట్టెల బుగ్గను గిల్లింది ఉలిక్కి పడి కళ్ళు తెరిచా..
 
ఏంటి పిల్లోడా కళ్ళు మూసుకొని కల గంటున్నావా!
 
అవును కలే అంతరాంతరాల్లో మేలుకున్న వాస్తవమెరుగని అస్తిత్వాన్నికూడబెట్టుకున్న సజీవ కల దాన్ని నేను కంటున్నాన లేదు దానికదే పురుడు పోసుకుంది నీ స్పర్శతో. నిజం నీ స్పర్శకు నిజంగానే కలలను పురుడు పోయించే శక్తి ఉంది. ఇంతకి ఎవరు నువ్వు. నీ స్పర్శే నన్నిలా చేస్తుందా లేక నేనే భ్రమ పడుతూ ఊహిస్తున్ననా. ఏమో ఏది అర్ధం కాకుండా చిత్రంగా ఉంది. నీ వైపుకు నను లాగుతున్న ఆ అనుకూల భావనలను చదవలేకపోతున్న ఆ భావనకు తగిన నీ ప్రతిస్పందనలను కలో నిజమో తెలియని సందిగ్ధంలో సతమతమౌతూ నీ ముందిలా మూగావాన్నిగా నిలబెడుతున్నాయి.. ఇప్పటికి అదే ప్రశ్న ఎవరు నువ్వు. కలవా కల్పనవా లేక నాకోసమే వేచి చూస్తూన్న నా ప్రియ సఖివా..
 
భలే ఉన్నాయే..
 
నిజంగానా
 
ఔనూ…  చొట్ట బుగ్గలతో చాల అందంగున్నావ్..
 
అవును పిల్లగా నిన్నోటి అడగనా నిన్ను పిల్లగా పిల్లగా అని విసిగిస్తున్నాను కదా నా మీద కోపం రాట్లేదా..
 
కోపమా అదేమి లేదు. నువు మాట్లాడుతుంటే అలాగే వింటూ ఉండాలనిపిస్తుంది.
 
అబ్బో మస్తు పటాయించుతున్నావ్ గా.. ఏంది సంగతి నేను నచ్చినాన!!!
 
చిలిపిగా తాను అడిగిన ప్రశ్నకు చిన్న నవ్వుతో తననే దీక్షగా చూస్తున్నా..
 
ఏమని చెప్పాలి ఎంత నచ్చావని చెప్పాలి. నచ్చే కదా నీ వెంట వచ్చింది అని చెప్పాలా. నిన్ను అనుక్షణం చూస్తూనే ఉండిపోవాలని ఉంటుంది అని చెప్పనా. నా బిగి కౌగిల్లో నిను ఉక్కిరి బిక్కిరి చేసెయ్యాలని ఉందని చెప్పనా.. ఏమని చెప్పాలి..
 
మనసు కన్నులు తెరుచుకొని చూస్తే జీవితాలను చదవడం పెద్ద కష్టమేమి కాదు. ఒక్కో జీవితం చరిత్రను సృష్టించక పోయిన ఒక్కోసారి గగుర్బాటు కలిగిస్తే, మరోసారి జాలి, ఇంకోసారి కోపం, అసహనం, రకరకాల రసాలతో కూడి నాటకీయం అనిపించినా జీవితం తెర మీద రక్తి కట్టించే చర్మం తొడుక్కున్న తోలు బొమ్మలం మనుషులం. ఆడించే వాడి గురించి పక్కన పెడితే నిజం చెప్పాలంటే మనిషిగా మనిషి జీవితాన్ని చదవగలిగితే అంతకు మించిన పట్టా మరోటి ఉండదేమో. సమాజంలో జరుగుతున్న ప్రతి విషయం మనకు సంబంధం లేనట్టుగా ఎలాంటి స్పందనలే లేనట్టుగా అదో సాధారణ విషయంల బావించడం నిత్యం మనకొక అలవాటైన విషయం. కాని కాని నేను గడిపిన జీవితం నేర్పిన ఫిలాసఫీ అంత ఒక్క క్షణం లో  ఎదురుగా పరుచుకున్న నీ అందం ముందు అంత మటు మాయం.
 
ఈ నిశ్శబ్దం ఇరువురికి చక్కగా అర్ధమయ్యే పాటంలా ఇక చదవాల్సింది ఏమి మిగిలి లేదన్నట్టుగా ఒకరికొకరం ఇంచు మించు అర్ధం వొడిలోకి జారుకున్నామనే అనిపిస్తోంది.
 
తన చేయి నా బుజం మీద నెమ్మదిగా వేసింది ఒక్కసారిగా ఆకాశాన్ని చిల్చుతూ విల్లులా మెరుపు. మెరుపు వెలుగు తన అణువణువును ముద్దాడుతూ ఒక్క సెకను నన్ను నేను తన మిరుమిట్లు గొలిపే అందం మైకంలో కమ్ముకుపోయాను.
 
మెరుపు వెలుతురుకు ఉలిక్కిపడి లోపలికి వెళ్ళింది. ఇంతలో ఆకాశంలో మరో మెరుపు ఆ మెరుపులో జోరుగా కురుస్తు గాల్లో నిండుగా పరుచుకున్న వర్షం వజ్రాల్ల తలుకుమంటూ ఎన్నడు చూడని వింత వెలుగు  బీకరంగా బయపెట్టింది. ప్రకృతికి నాకు ఎడ తెరిపి లేని యుద్ధం ఎన్నో ఏళ్లుగా.  నన్ను ప్రకృతి తన దోసిల్లో దాచుకొని నాతో ఆడుకుంటున్నట్టు అనిపిస్తుంటుంది. మనసుని అమాంతం ప్రకృతి మొత్తాన్ని తెగ చుట్టేస్తూ కంటికి కనిపించిన అందాన్ని మనసులో బంధించేందుకు వీరుడిలా ఆలోచనల గుర్రంపై సవారి చేస్తూ ఒకటే ప్రయాణం చిత్రంగా ఎంత ప్రయాణించిన ఆలోచనల గుర్రానికి, అంతమెరుగని ప్రకృతికి రెంటికి అలసట అనేదే రాదూ.
 
ఓయ్ పిల్లగా లోనకు రా. పిడుగ్గిట్ల బడ్తది అంటూ పిలుస్తూ లోపలి నుండి కొడవలి తెచ్చి పాక ముందు పడేసింది.
 
ఏం చేస్తున్నావ్?!
 
కొడవలి జూసి పిడుగు పారిపోద్ది. ఇంగ మనకేం బయ్యం లేదు దా పిలగా..
 
మెల్లిగా తనతో లోపలికి నడిచా.. కనిపించి కనపడని చికట్లతో లాంతరులో తలెత్తుకు నిలుచున్న దీపం నుండి పొంగుతున్న బంగారు రంగు వెలుతురు ఇప్పుడు నాకు అమితంగా నచ్చే గొప్ప అంశం. అదే గనక లేక పోతే కళ్ళతో తన అందాన్ని బంధించుకునేవాన్నా లేదు. వంపు తిరిగిన నడుంను చూస్తున్న కొద్ది దాని  చుట్టూ నా చేతులని పెన వేయాలని లోలోనా ఎంతో ఆరాటం ఆగని వర్షపు శబ్దంలో కూడా పెరిగిన నా గుండె సవ్వడి స్పష్టంగా వినిపిస్తోంది.
 
నెమ్మదిగా లాంతరును కర్ర గుంజకి వేలాడేసి లోపల పొయ్యి దగ్గరికి వెళ్ళింది.
ఒసేయ్ ముసల్దాన పడుకున్నవానే…! అనడిగింది. ముసలావిడ పడుకున్నట్టుంది. నెమ్మదిగా అర్రలో నుండి లుంగీ బనియన్ టవల్ తీసుకొచ్చి లాంతరు వెలుతురును చిన్నగా చేస్తూ అవి నా చేతి కిచ్చింది.
 
తొరగా ఆ బట్టలు మార్సుకో. కింద సల్లగుంది లోపల అర్రలో మంచం మీన పడుకో నేను ముసల్దాని పక్కన పడుకుంటా..
 
ఏం చేయాలో తోచట్లేదు.  ఆలోచిస్తుండగానే అమాంతం లాంతరు వెలుతురును ఎవరో మింగేసి వదిలేసిన ఆనవాలే ఈ చీకట్లు. చీకటి అది ఇప్పుడోక అర్ధం కాని వివరం లేని వింత వర్ణం. ప్రపంచాన్ని ఈ చీకటే మింగేస్తే ఇంకేముంది కలవరించడానికి. చీకట్లు సృష్టించిన విద్వంసం అంత ఇంత కాదు ఒక్కసారిగా ఏదో ఊబిలో మునిగి మనసుకు తన అందం శ్వాస అందక ఉక్కిరి బిక్కిరవుతు కొట్టుమిట్టాడుతోంది.
 
ఏంది పిలగా మార్సుకున్నవ? లేదా? ఇంకెంత సేపు ఈ సీకట్లుండాలి.
 
ఓ చీకట్లో పడి మరిచేపోయా
 
ఆ ఆ మార్చుకుంటున్నా.. ఒక్క నిమిషం
 
ఏంది ఒక్క నిమిషం నువ్వేమైన చీర గట్టుకుంటున్నవా గింత సేపు జేస్తున్నావ్.
 
ఓ. కే. మార్చుకున్న ఇక దీపం వెలిగించు.
 
చిన్ని దీపం వెలిగించగానే పాయలు పాయలుగా తనను కమ్మేసిన చీకట్లను చీల్చుకుంటూ సుతారంగ తన మోము నిండా పరుచుకున్నాయి. తనతో నా మనసులో నిండిన తన నిలువెత్తు అందాన్ని సైతం. గుండ్రటి విశాలమైన కను పాపలు చిలిపిగా రెప్ప వాల్చకుండా నా వంకే చూస్తున్నాయి.
 
అబ్బొ.. పర్లేదు పిల్లగా తెల్లగనే ఉన్నావ్. ఏంది ఆ జబ్బలు.. ఇంగ సరే ముందు తడకలు అడ్డం పెట్టి నేను పడుకుంటా నువ్వు గూడ లోపలికి బోయి పడుకో.
 
ఏంటి అప్పుడే నిద్రోస్తుందా..
 
ఏంది పిల్లగా ఏం మాట్లాడ్తలెవ్ ఇంగ నిద్ర రాక ఏమొస్తది.
 
నాకు నిద్ర రావట్లేదు.
 
ఎట్టోస్తది నిద్ర ఇంత రాతిరి నాలాంటిదాన్ని ముందు బెట్టుకొని. అవును పిల్లగా నా ఎంట రానికి నీకెట్ల ధైర్నం  బుట్టింది.
 
ఏమో..
 
సరేలే ఏమైతేంది నువ్వైతే గీ బనీన్ల మస్తుగోడుతున్నావ్ సాన సక్కగున్నావ్. వ్యంశాల గిట్ల బోతవ ఏంది మస్తు కండలు పెంచినవ్. ఔనోయ్ నేను గిట్ల మాట్లాడుతాంటే గిదేంది ముక్కు మొహం తెలినోడి తోటి గింత బరితెగించినట్టు మాట్లాడుతోంది అననుకుంటున్నావ్ గదా..
 
ఛ ఛ అదేం లేదు.
 
సరే ఆ బెంచి మీన కూర్సో నేను తడ్కలు అడ్డం బెడ్త లేక పోతే రాతిరంతా ఈదురు గాలికి సర్ధైతది ముక్కులు దిబ్బలు బడ్తై. అంటూ చిన్న చిన్న అడుగులతో వయ్యారంగా నడుం వంపు కింది ఎత్తులను పైకి కిందకు ఊగిసలాడుతుండగా నాలుగు మూరెలా జడ ఒక్కో ఎత్తుపై లయగా తాలం వేస్తుండగా నాకు తెలీకుండానే అడుగులు తనే వెంటే పడుతున్నాయి. తడకలను పాకకు ఆ మూల నుండి ఈ మూల వరకు అడ్డు పెడుతోంది.
 
ఓయ్ పి ల గా… ఏంది? కొంగు ఇడువూ..
 
తన కొంగు వైపు చూసా పాపం తనకు తెలీకుండా తన కొంగు అంచు తడకలో చిక్కుకుంది. తనేమో నేనే పట్టి లాగుతున్నానని అనుకోని మళ్ళీ
 
నిన్నే వదలయ్య  అనుకుంటూ వెనక్కి తిరిగి చూసింది.
 
తననే చూస్తూ చేతులు కట్టుకొని నేను.
 
నా వైపుకి, ఇరుక్కున్న కొంగు వైపుకి చూసి విసురుగా తడకలో చిక్కిన కొంగు అంచును పర్రున లాగి ముందుకు నడిచింది. నడుస్తు తను ఒక్క అడుగు అల వేసిందో లేదో నా చెయ్యితో తన చెయ్యి మని కట్టును దొరకబుచ్చుకున్నా. దొరకడమే ఆలస్యంగా వెనక్కి లాగా…  తాను ఊహించని నా చర్యకి పట్టు సడిలి ఒక్కసారిగా కంగారుగా వెనక్కి వాలింది. వెంటనే మరో అడుగు వెనక్కి వేసి నా వైపుకు తిరిగింది. మరో సారి లాగాను ఈ సారి అమాంతం కిందకు వాలిపోయే క్షణం లో తన వాలు జడతో పాటు తన వెన్ను నా చెయ్యి ఆసరలో ఒదిగింది. ఒక్కసారిగా తన తల వెనక్కి వాలడంతో బంగారు రంగు తన మెడ దాని కిందుగా తెల్లని పర్వతపు లోయ మొదలు నుండి ఘనంగా వెలువడుతున్న సుగంధాలు తనలోని మనసు గమ్యానికి నన్ను చేర్చుకునేందుకు నా ప్రయాణానికి సిద్దం చేస్తోంధన్నట్టు తలపిస్తున్నాయి. తన కళ్ళలో భయమో అత్రుతో ఆరాటమో ఆప్యాయతో ఆశ్చర్యమో ఏమో రక రకాల అర్ధాలు కలగాపులగంగా కనిపిస్తుంటే ఏది సత్యమో ఏది అసత్యమో ఏది భ్రమో ఏది నిజమో  అర్ధం కాని సతమతపు ఆలోచనలతోనే ఎక్కడో అధిమిపట్టిన భరించలేని వేడి కోరిక నా వైపుకి విసురుతున్న ఆ చూపులకి అదుపు తప్పేలా ఉంది. ఐన మా చుట్టూ ఇంకా వర్షపు గాలుల నిశబ్ధం తాండవం చూపుతూనే ఉంది. జరుగుతున్న తత్తంగానికి తన మరో చేతిలోని లాంతరు సైతం భయంతో ఊగిపోయింది. దానికి తోడు మా ఇరువురి నీడలు కూడా చిత్రంగా నేలపై అటు ఇటు ఊయలలూగుతున్నాయి. వెలుగుకెంత అస్తిత్వమో మా నీడలు చాటి చెప్పుతున్నాయి.
 
తన ముని వెళ్ళు నా జుట్టులోకి పంపించి దగ్గరగా లాక్కుంది. ఇప్పుడు తన హృదయం పై వాల్చుకొని సేద తీరుతున్న నా తల, తలతో పాటు నా ఆలోచనలు. ఐనా గుండెలో ఇంకా ఆగని వేగం. కొద్ది కొద్దిగా కౌగిల్లో బందినవుతుంటే గుండెవేగం స్థిమిత పడింది.  ఈ సారి మరింత గట్టిగా దూరాన్ని చేరిపెసాను.. పరిమళాన్ని ఆస్వాదిస్తూ తన మెడపై నా తల. ఎం జరుగుతుందో ఆలోచించడానికి ఆలోచనలు కూడా కరువయ్యాయి. రెప్ప తెరిచి చూస్తే నులక మంచంలో తానో నేనో లేక మేమిద్దరమో కాకా ఏకమైన మెమో ఏమి అర్ధంకాకుండా మసక వెలుతురు చీకట్లలో పోటి పడుతూ, పడుతూ లేస్తూ తిరిగి మమేకమవుతూ… ఓహ్… ఏంటి ఈ వింత నేనెన్నడు ఎరగని ఓ తాత్వికానంధపు శ్రుతులు ఇరువురి ఆణువణువును అదుముకున్నాయి..
 
కను మూసినా కను తెరిచినా ఒకే అనుబూతి ఆనందానుభూతి.. ఈ స్థితిని చేరుకునేందుకేనేమో ఇంత కాలం నా మనసు తపిస్తున్నది.
 
ఎప్పుడు నిద్ర లోకి జారుకున్నమో గుర్తేలేదు.  గుర్తు చేయడానికనేనేమో నాటు పుంజు కూత ఎక్కడో కూసిన, నా చెవి దగ్గరే కూసినట్టు  ఉలిక్కిపడి లేచా.. గోధుమ బంగారు రంగు కలోబోసుకున్న నున్నటి మెత్తని శిల్పం ఇంకా నను వాటేసుకొని అమాయకంగా సేద తీరుతోంది. నాక్కూడా లేవాలనిపించలేదు. మునివేళ్ళు నా ప్రమేయం లేకుండానే మెత్తని శిల్పం పై సుతారంగా మీటుతుంటే.. తన పెదాల అంచున సన్నని చిరునవ్వు. కళ్ళు తెరవకుండానే.. నా గుండెపై ముద్దు పెట్టింది.
 
అర్ధం కాకపోయినా అర్ధాలు వెతుక్కోవడం మాని చాల కాలమే అయ్యింది. జరుగుతున్న అనుభూతికి అర్ధాలు వెతుక్కునే అవసరం కూడా లేదనిపించింది..
 
ఓయ్ పిల్లగా నేనెలా ఉన్నాన్రా.. నీకు నచ్చినానా.. ఏయ్ ఏం ఆలోచిస్తున్నావ్.. నాకు తెలుసులే..
 
చెప్పలేని మాటలన్నీ పెదాల అంచున అల నిలబడి పోయాయి.  గడుస్తున్న అనుభవం మాటలుగా మారలేకపోతున్నాయి..
ఆ మూగ స్థితిలో ఆనందపు జడి వానలో కలో మాయో తెలీని సందిగ్ధంలో ఆశ్చర్యంగా ఆలోచనలతో పాటే దేహం కూడా పరుగులు పెట్టింది. చిత్రంగా నా వెంటే తాను కుడా కాదు కాదు తన వెంటే నేను కుడా..
 
ఇప్పటికి ఎన్ని వసంతాలను మా కౌగిల్లో బంధించామో లెక్క లేదు. అంతేనా లెక్కలేనన్ని చినుకుల జడి వానలో ఎన్ని సార్లు తడిసి ముద్దయ్యామొ…
 
నన్ను ఆటపట్టిస్తూ తాను..
తనకై తపిస్తూ, ఆరాదిస్తూ, ఆనందిస్తూ నేను..
 
ఓ.. చెప్పలేదు కదు తన పేరు “అలవి”..

గజల్

‘అప్పటికే ముగ్గురొచ్చారు. దాని ఒళ్ళంతా నీరసంగా ఉంది బాబు. అది చిన్న పొల్ల ఏదో పొట్ట కూటికే మా తిప్పలు గాని, దాని ఒళ్లమ్మి మిద్దెలు కట్టాలని నాకు లేదు నాయన. ఈ పొద్దుకు దాన్ని వొదిలెయ్..’
‘లేదండి నేను తనని ఇబ్బంది పెట్టను. కాసేపు తనతో మాట్లాడి వెళ్తాను.’
‘సరే అది పడుకుంది. అదో ఆ గదిలో..’
మక్కా పావురాలు ఇక్కడదాక వస్తాయి కాబోలు. గోడలు మొత్తం రెట్టలమయం. పాతికపైనే గురుకు గురుకుం అంటూ గూన పెంకుల చివర కొనలను, బట్టలారేసే దండాలను తాపీగా ఆక్రమించేసుకొని, నైజం ఆనవాలని కొద్దో గొప్పో చాటి చెప్తూ, శిధిలానికి చేరువలో, నవీనానికి దూరంలో, రెండంతస్తుల మేడలో, రెండో అంతస్తు చివరన కుడి వైపున ఉన్న చిన్నగదిని, ఆ గదికి వచ్చి పోయే వాళ్ళను చూస్తూ, వాటిలో అవి చెవులు కొరుక్కుంటూ తెల్లని నల్లని బూడిద రంగు కపోతాలు…

ఆ గదికి ఇరుకు కారిడార్ గుండా నడుచుకుంటూ చేరుకున్నాను. లొకు లొకు మనుకుంటున్న రెండు రిక్కల తలుపును నెమ్మదిగా తెరిచా. గుప్పు మంటూ మగత వాసనకు ఘాటుగా మత్తు గొలిపే అత్తరుతో పాటు అగరొత్తుల రోత. అప్పుడే ఒక యుద్ధం సద్దుమణిగినట్టు నిశ్శబ్దం. నాలుగు మూలల గదికి రెండు కిటికీలు, తాతల నాటి బల్లను పాన్పు సిద్దం చేసి దాని మీద రెండో మూడో ఒకదాని మీద ఒకటి పరిచిన దూది పరుపులతో ఆ పాన్పు మరింత మెత్తగా ఉంటుందని చూడగానే అర్ధమైయ్యింది. ఆ గదిలోని మగత వాసన తన ప్రతాపం ఇంకా చూపుతూనే ఉంది. మంచం చుట్టూ సన్నని దోమ తెర, పరుపు మీద మఖ్మల్ చద్దరు, ఒక గలీబు, రెండు ఎర్రని కుచ్చుల దిండ్లు, గదిలో ఒక మూల బట్టలు పెట్టుకునే రెక్క ఊడిన పాత అల్మారా..

ఇరుకిరుకు గల్లీలల్ల ఉన్న ఇళ్ళలోకి కిటికీల గుండా ఎంత ప్రయత్నించిన మిట్ట మధ్యానం కూడా వెలుతురు తక్కువే.. రెండు కిటికీల గుండా సన్నగా వీస్తున్న గాలికి చమ్కీలతో అల్లుకున్న పల్చని తెరలు సుతారంగా ఊగుతున్నాయి. ఒక కిటికీ వైపుకు నడిచా ఆ కిటికీ ఊచల గుండా కొంచెం దూరంలో నా వైపే ప్రశ్నగా చూస్తూ నిల్చున్న చార్మినార్. దానిచుట్టు విస్తరించుకున్న ప్రపంచం. సూర్యాస్తమయం వెలుగులో చక్కగా కుంచెతో గీసిన పెయింటింగ్ లాగ తోస్తుంది. ఎవరిదో ఘజల్ నెమ్మదిగా ఈ గాలి మోసుకొస్తున్నట్టుంది.
తెర మాటున పరుపుపై సేదతీరుతున్న పాలవర్ణ రాజహంస. పాపం అలసట నిండిన మత్తుతో ప్రపంచాన్ని మరిచి సేద తీరుతోంది. ఎప్పుడూ నిండైన బుర్కాలోనే చూసిన నాకు కేవలం ఓ పలుచని తెర మాత్రమే అడ్డుగా కప్పుకొని ఇలా తన దర్శనభాగ్యం కలుగుతుంధనుకోలేదు. వివస్త్రై ఎదురుగా పరుచుకున్న శిల్పం కన్నా అమాయకత్వంతో కూడిన తన రూపమే నన్ను కట్టి పడేసింది. ఇంకా చెప్పాలంటే తన కళ్ళే నన్నింత దూరం లాక్కొచ్చాయి.

బుర్కా మాటున మెరిసిన ఆ కళ్ళే ప్రతి రోజు కలవరపెట్టాయి. తర్వాత గాని తెలిసింది. ఆ కళ్ళను కలిగిన తాను ఇప్పుడు గల్లీలో అవసరాన్ని తీర్చే తెల్లని మాంసపు ముద్ద. నిజమే ఇప్పుడు తన మనసుకు శరీరానికి సంబంధం లేని ఓ అచేతన స్థితికి చేరుకున్న ఒక యోగిని. తన అనుకున్న ఈ సమాజం కావలిసినంత క్షోభ కొన్నేళ్ళుగా మనసుకు వడ్డిస్తూనే ఉంది. కన్నీళ్ళు కూడా కరువై ఇంకా తళతళ మెరుస్తూనే తన అమాయక రూపం. ఆ రూపం తనదేనన్న స్పృహ కూడా తనకు లేకుండా పోయింది కాబోలు లేక దాచుకోడానికి తనకంటూ ఇంకా ఏమి మిగలలేధనుకుంటూ ఒంటి మీద నూలు పోగైన లేకుండా తనను నిండా ముంచేసిన కాలంలో సేద తీరుతోంది.
చాల సేపు తననే చూస్తుండగా నెమ్మదిగా కళ్ళు తెరిచింది. అవే నయనాలు. ఒక్క క్షణం నాలో ఆనందం. అదే క్షణంలో తను నన్ను చూసి, చూడనట్టుగా మొహం చిట్లించి నిట్టూర్చింది.

‘పొత్తి కడుపులో నెప్పి ప్లీజ్ ఇప్పుడు నా వల్ల కాదు’ అని దీనంగా అంది.

‘ఛ! ఛ! నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఐ యాం సారీ నేను వెళ్ళిపోతాను మీరు హాయిగా పడుకోవచ్చు.’

ఏంటో నా భాష కొత్తగా ఉందనిపించిందో లేక అంత దూరం వచ్చి విషయానికి పనికిరాని వాడిలా మాట్లాడుతున్నట్టు అనిపించిందో ఏమో ఒక సెకను నన్ను చూసి మళ్లీ కళ్ళు మూసుకొని నిద్ర లోకి జారుకుంది. పక్కనున్న చెద్దరిని తన మీదకు పరిచి తన జుట్టు నిమిరి వెనక్కి తిరుగుతుంటే నా చేయి పట్టుకొని

‘థాంక్యు అర్ధం చేసుకున్నందుకు’ అని చెప్పి చెద్దరి నిండా కప్పుకుంది.
ఒక్క నిమిషం ఏమి అర్ధం కాలేదు. ఎన్నో ఏళ్లుగా నేనెదురు చూస్తున్న స్పర్శ ఇదేనేమో. తన మనసును పరుచుకున్న దేహానికన్నా మరేదో నన్ను ఆకర్షిస్తోంది.

తన దేహాన్నే కోరే వాన్నతే. ఈ రోజు కాకపోయినా ఏదో ఓ రోజైన
నా చెంతకు చేర్చుకోడానికైన, తన చెంతలోకి చేరడానికైనా, సమాజం కాని, కట్టు బాట్లు కాని మా ఇరువురి మతం కాని ఏవి అడ్డుగా లేవనే చెప్పాలి.

తాను ఇప్పుడొక సర్వం తెలిసిన జ్ఞాని, తత్వం ఎరిగిన సాధువు, సమాజాన్ని సొంత బిడ్డలా క్షమిస్తూ తనకు తానుగా క్షీణిస్తూ అమృతాన్ని పంచుతున్న దేవత. అవును దేవతే..

ఎన్ని నిఖాలు చేసుకున్నా.. నిఖాలతో, డబ్బుతో ఎందరికో సొంతమైన వారెవ్వరికి అర్ధమవ్వని దైవత్వం ఒక్క స్పర్శలోనే నాకు తెలిసొచ్చింది. బహుశ తనపై నేను ఏర్పరుచుకున్న ఊహొ, భ్రమో, లేక మితిమీరిన నా ఆలోచనో ఏమో..
నెమ్మదిగా అడుగులు బయటికి వేస్తూ, రెండు తలుపుల్ని మూసేస్తూ, మెట్లు దిగి చీకటిని ఆహ్వానం పలుకుతూ, గల్లీలన్ని దాటుతూ, మిరుమిట్లు గొల్పుతున్న చుడి బజార్ వీధులగుండా చార్మినార్ చుట్టూ నాలుగు చెక్కర్లు కొట్టి మక్కాలోకి అడుగు పెట్టా..
పావురాలు గుంపులు గుంపులుగా పోటా పోటిగా నేల వాలుతూ ఆకాశానికెగురుతూ ప్రపంచంతో పనిలేనట్టుగా ప్రశాంతంగా తమ ప్రవక్తల సూక్తులతో ఆనందంగా కాలం గడుపుతున్నాయి.

నా ఆలోచనలు మాత్రం ఇవేమీ పట్టనట్టు వదిలి వచ్చిన నా మనసు చుట్టే తిరుగుతున్నాయి.
చీకట్లకు పోటిగా మిరుమిట్లు గొలిపే విద్ధ్యుత్ కాంతిలో మెరిసిపోతున్న చార్మినార్. బాషతో సంబంధం లేకున్నా మతాలకతీతంగా నేను గడిపిన ఇన్నేళ్ళలో ఈ చోటు నాదేనన్న చిన్న గర్వం. సమాజానికి దూరంగా వెలివేసుకున్నానని కాస్త భ్రమలో ఉన్నా, నా భ్రమ భ్రమేనంటూ నా చుట్టూ చేరే రద్దీ.

ఆ మరుసటి రోజు ఉదయం తనే అవును నిజంగా తనే నిండైన బుర్ఖాలొ నెమ్మదిగా నడిచి వెళ్తోంది.
ఎందుకో తాను నాకిప్పుడు పరిచియమున్న అపరిచితురాలు. పరిచయానికి నోచుకోకుండా వెనుదిరిగిన అభాగ్యున్ని. తనకి నేనుగా ఎదురుపడేందుకు ఈ క్షణంలో నేను పడుతున్న ఆరాటం అంత ఇంత కాదు. తనని అంటిపెట్టుకునే నాయనమ్మ తప్ప తనకంటూ ఎవరు లేరు. అందుకే ఎప్పుడు కనిపించినా ఒంటరిగానే కనిపిస్తుంది.

నా ఎదురు పడబోతోంది. ఇంకాసెపట్లో… అవునూ చూసిందా?.. చూసే ఉంటుంది.!
యస్ చూసింది. నా కళ్ళు కూడా తన కళ్ళని డీ కొన్నాయి. ఇవేమీ తెలినట్టుగా, ఏమి జరగనట్టుగా ఆ కళ్ళతోనే చిన్నగా నవ్వింది. నవ్వుతూ నా పక్కనుండే వెళ్తోంది. తన వైపుకు జరుగుతూ నెమ్మదిగా చెవిలోకి తొంగి
‘మీ తోడు రానా మీకు అభ్యంతరం లేక పోతే..’
‘తోడు రాగలవనే నమ్మకం ఉందా..? అంత ధైర్యముందా..?’
సూటిగా నేను ఊహించని సమాధానం తన నోటి వెంట. తను తెలుగు ఇంత బాగా మాట్లడగలదని నేననుకోలేదు. నేనింక తనని అలానే చూస్తూన్న, మళ్ళీ తానే..
‘తోడొచ్చి ఏం చేస్తావ్? మహ అయితే ఓ పూట గడుపుతావ్ అంతేగా..’ అనుకుంటూ హుందాగా ధైర్యంగా ముందుకు నడుచుకుంటూ వెళ్ళింది..
ఏంటో నిజమే నేనలా అడగడంలో తను అలా అనుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. కాని, కాని ఏదో ఓ చిన్న ఆనందం. ఇది కల కాదుగా నేను కోరిన సుందరాంగి నాతో మాట్లాడింది. నేను భావించినట్టు తానేమి చిన్న అమ్మాయేమి కాదని, తన మాటల్లోని తాత్వికత, ధైర్యం తన పరిపక్వతను తెలుపుతున్నాయి.

యధావిధిగానే ఆ రోజు సాయంత్రం కూడా తనని మళ్ళీ చూడాలనిపించి వెళ్ళాను. ముసలావిడ చేతిలో కావలసినన్ని డబ్బులు పెట్టి లోపలికి వెళ్ళా.. మొదటి రాత్రికి సిద్దమయ్యినట్టు, గదిని అలంకరించి పరుపు మధ్యలో నైజం పరిపాలనలో రాజ నర్తకిలాగ నృత్యానికి సిద్దమైనట్టు మొహం కనపడకుండా చున్నీ కప్పుకొని పచ్చని ముత్యాలు పొదిగిన గాగ్రా దుస్తుల్లో పొందిగ్గా కూచుంది. గది బయట నుండే తెరిచిన తలుపుని నా వేళ్ళతో రెండు సార్లు కొట్టి శబ్దం చేసాను. తన మేలి ముసుగు నుండే
‘తెరిచిన తలుపు ఆపడానికి కాదు ఆహ్వానించడానికే’ అంటూ ఉర్దూలో మాటలు.

లోపలికి అడుగుపెట్టా మేలి ముసుగును తీస్తూ..
‘మీరా.. రండి’ అంటూ తెలుగులో ఆహ్వానించింది.
నను చూడగానే పరిచయమున్న వ్యక్తిలా
‘ఏంటి నిన్న మిమ్మల్ని ఇబ్బంది పెట్టానా.’
‘లేదండి నేనే మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే క్షమించాలి.’
‘సరే అలా కూచోండి.’ అనుకుంటూ వెళ్లి ఒక్కొక్కటిగా తన ఒంటి మీద దుస్తులను విప్పేస్తోంది.
‘ఒక్క నిమిషం ఆగండి. కాసేపు ఇలా వచ్చి కూచోండి.’
ఉక్కులు విప్పడం ఆపేసి చున్ని కప్పుకొని వచ్చి పక్కన కూచుంది.
‘ఏంటండి విషయం? మీలో విషయం లేదా? ఈ పనికి మీరు కొత్తా? లేక ఖంగారు పడుతున్నారా?’
‘అలా కాదు. ఈ పని చేయడానికి రాలేదు. మీతో మాట్లాడాలని వచ్చా.’
‘మాట్లాడడానికి డబ్బులెందుకిచ్చారైతే?’
‘ఇప్పుడు కాకపోతే.. ఇక్కడ కాకపోతే నేనేక్కడా మీతో ఇంత ఫ్రీగా మాట్లాడలేను కదండి.’
‘నాతో మాటలేం ఉంటాయి?’
‘చాలా ఉన్నాయి.’
‘ఏంటో చెప్పండి.’
‘ఈ రోజంతా నాతో గడపండి చాలు.’
‘నీ ఒక్కడితో గడిపితే పాపం మిగతా వాళ్ళంతా అభాగ్యులైపోతారేమో..’
‘నాతో ఈ ఒక్క రోజు గడిపితే వారినంతా ఎప్పటికి అభాగ్యులను చేస్తాను.’
ఫక్కు మని నవ్వి.. `మీరేమన్న కవులా కవిత్వం వల్లిస్తున్నారు.’
‘నేను కవిని కాను నీతో గడపాలనుకునే సాధారణ అభాగ్యుణ్ణ.’
‘ఏంటి నన్ను ప్రేమిస్తున్నారా..? ప్రేమిస్తే గనక విరమించుకోండి నాకు నాలుగేళ్ళనుండి ఎంత మంది ప్రేమికులో నాకే తెలీదు.’
‘అదే నాలుగేళ్ల క్రితం నిన్ను కలిసుంటే నేనొక్కన్నే నీ శాశ్వత ప్రేమికున్ని అయ్యేవాణ్ణేమో..’
‘మాటలకేం ఎన్నైనా బావుంటాయి.’
‘మీరు మనిద్ధరిని కలవని ఆ నింగి నేల తో పోల్చుతున్నారు.
నేనేమో తీరం సాగరంతో పోల్చుకుంటున్నాను.
నన్ను నమ్మక పోవడానికి మీకుండే కారణాలు బోలెడు.
మిమ్మల్నే తల్చుకోడానికి నాకున్న ఆశలు కూడా ఎక్కువే..
అయినా పర్వాలేదు తలుపులు తెరిచారుగా ఎలా గడిపితేనేమి మీతో గడవడమే నాక్కావలసింది.’
‘సరే బాబు నన్ను ఇప్పుడేం చెయ్యమంటావ్?’
‘కాసేపు మీ ఒళ్లో తల వాల్చుకుంటాను.’

ప్రేమగా తన నడుం చుట్టూ నా చేతులను పెనవేస్తూ తన ఒళ్ళో తల వాల్చుకున్నాను. ఎన్నో ఏళ్ళ నుండి ఎదురు చూస్తున్న లాలనలో నాకు నేనుగా పునీతున్నయ్యానేమో.. ఏదో తెలియని ఆప్యాయతను అమాంతం అల్లుకున్న భావన.
క్షణ కాలం తరువాత విచ్చుకున్న పుష్పంలా, కరిగిన మంచులా, మగాడిపై కరడుగట్టిన తన మనసు వెన్నలా కరుగుతున్నట్టనిపించింది తన చేతిని నా జుట్టు పై ఉంచి నెమ్మదిగా నిమురుతుంటే…
‘మరీ ఉత్త అమాయకులుగా ఉన్నారే.. నేనేమి నీ తల్లిని కాదు.
నువ్విలా పొదుముకొంటే ఆప్యాయతని లాలనని అందించడానికి.
నేనొక జీవమున్న బొమ్మని, మనసు చలించడం మరిచి చాల కాలమయ్యింది.
అప్పుడప్పుడు నాకు మనసనేది ఉందా అని కూడా డౌట్ వస్తుంటుంది.’
‘ఏమో నండి నాకు మీ మీద ఉంది కామం కాదు. నేను కోరుకుంటోంది మీ దేహం కాదు.
కామం తీర్చడానికి మీలాంటి దేహాలు నేను తిరుగుతున్న గల్లీల్లో కోకొల్లలు.’
‘మరి ఆ కోకోల్లల్లో ఆప్యాయతను పంచె వాళ్ళని వెతుక్కోలేక పోయారా..!’
‘మనసు మిమ్మలనెందుకు కోరుకుందో సరైన నిర్వచనం నాకే చెప్పలేదు.
ఇక మీ ప్రశ్నకు నేను ఏం చెప్పగలను.
ఒకటి మాత్రం నిజం మీరు నాతో జీవితాన్ని పంచుకోలేక పోయినా
నేను మాత్రం జీవితాంతం నీ సాంగత్యాన్ని కోరుకుంటున్నాను.
నేను చెప్పే విషయం మీకు అర్ధమైన కాకపోయినా
నేను బతికున్నంత కాలం తెరిచిన గది తలుపుల్ని, తెరుచుకోని మది తలుపుల్ని తడుతూనే ఉంటా..’
ఆ మాటతో జుట్టు నిమరడం ఆపేసింది.

‘అందరు నన్ను మోసం చేసినట్టు మిమ్మల్ని నేను మోసం చెయ్యలేను. కాలం చెదిర్చిన ఈ మోడును వదిలెయ్యండి. అల్లా నాకిలా రాసిపెట్టాడు. ఇదిలా జరగనివ్వండి నన్నొదిలెయ్యండి. నా కన్నా అందగత్తెని, అమాయకురాలిని, మంచి పిల్లని చూసుకొని పెళ్లి చేసుకోండి. తన ప్రేమలో లీనమయి నన్ను ఎప్పుడు మరిచిపోతావో నీక్కూడా తెలీదు.’
‘కావచ్చు కాని నేను పంచుకోవాలనుకున్న జీవితం నీతో.. ‘ అంటూ ఈ సారి తనని మరింత దగ్గరగా తీసుకున్నా.
‘ఇలా వాటేసుకున్న ప్రతి ఒక్కడు జీవితం గురించి వేదాంతం వల్లించే వాడే.’
‘ఏమో నువ్వు చెప్పేది నిజమే కావచ్చు. ఇంతకు ముందే అన్నానుగా నన్ను నమ్మక పోడానికి నీకు బోలెడు కారణాలు. నీ ప్రవర్తన, నీ మాటలు, నీ సంజాయిషీలు, నీ సలహాలు అన్ని నేను ఊహించినవే. కాని వీటన్నిటికి అతీతం నేను ఎంచుకున్న నిర్ణయం.’
‘ఏమో బాబు నీతో ఇక ఏమి మాట్లాడను. నాకు తెలిసినంత వరకు మగాళ్ళందరికీ నా దేహంతోనే పని. ఏది నటనో, ఏది నిజమో లెక్కలేసుకునే రోజుల నుండి ఎప్పుడో దాటి పోయాను. ఒక్కసారి నాతో పడుకున్నాక అందరికి తమ తమ సొంత జీవితాలు, సమాజం, కట్టుబాట్లు, కుటుంబం, గౌరవం, బాధ్యతలు.. అన్నీ.. గుర్తొస్తాయి. తప్పు చేసానని ఎవరికి వారు అల్లా ముందు మోకరిల్లి క్షమాపణ కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు కాకపోయినా మీక్కూడా నాతో గడిపాక ఏదో ఓ రోజు వీటిలో ఏదో ఒకటి తప్పక గుర్తొస్తుంది.’

అంటూ వడి వడిగా అన్నీ విప్పేసుకొని నా మీదకు చేరి తన బిగి కౌగిల్లో మెత్తగా వాటేసుకుంది. తెల్లని పాలపుంతలో చల్లని కొలనులో కమ్మగా సేద తీరుతున్నట్టు నన్ను నేను మరిచిపోయా. ఒకరినొకరం పెనవేసుకుంటూ ఎక్కడికెక్కడికి ప్రయాణం కట్టామో గుర్తే లేదు. మా ఇరువురి నడుమ దాగిన యుగాల దూరం క్షణాల్లా కరుగుతున్నది. తనది నటనే కావచ్చు, తనకిది సహజమే కావచ్చు, కాని తెలియని ఈ ఆనందం ఆప్యాయత నా కళ్ళని చెమర్చాయి. ఎందుకో గట్టిగా ఏడవాలనుంది. నా ఏడుపు బాష తనకు అర్ధం కాకపోతే నేనొక వెర్రిబాగులోడ్ని.
గడుస్తున్న గడియారపు గంటలు కాలాన్ని వెనక్కి నెడుతుంటే నేను మరింతగా తనలోకి నెట్టుకున్నాను. ఈ క్షణంలో నేననే అస్తిత్వం అంతమయ్యి తన అణువణువుతో లీనమయ్య.. ఓహ్.. నిజంగా తాను దేవతే!
సుధీర్ఘ ప్రయాణం తరువాత అలిసిన నా దేహంపై వెచ్చగా తాను సేద తీరుతోంది. తానిప్పుడు నా కంటికి కామం తీర్చిన కన్యలా కాదు. నా లాలనకై, నా ప్రేమకై, నా రక్షణకై అలమటిస్తున్న పసిపాపలా ఉంది. నా ఈ పసిపాపకు నేనున్నానని ఎన్నడు అర్ధమవుతుందో..

***

చల్లనిగాలి కిటికీ తెరలను, దోమ తెరను ఊపుతోంది. తెల్లగా తెలవారినట్టుంది. వెలుతుర్ల తాకిడితో నెమ్మదిగా గది చీకట్లు తొలిగాయి.. చల్లగాలి ఏమి కప్పుకోని దేహాన్ని జివ్వుమనిపిస్తోంది. నెమ్మదిగా కళ్ళు తెరుచుకుంది.
‘అనుకున్నట్టుగానే మాయమైపోయాడే..’ అనుకుంటూ వెకిలి నవ్వుతో బట్టలు తొడుక్కొని అద్దం ముందు తన రూపం చూసుకుంది. చాల రోజుల తరువాత ఓ అమాయకుడు దొరికాడు. వాడు అమాయకుడేంటి ఇంకాసేపు మాట్లాడితే మాటలతోనే నన్ను తన వశపరుచుకునే వాడేమో.. అయినా ఎందుకో క్షణ కాలం అతను నా పై చూపించే ఆరాధనకు మాటలు కరువయ్యాయి. రోజు ప్రతొక్కడితో అనుభవించిన నరకంతో పోలిస్తే ఇతన్ని కాస్త మెచ్చుకోవచ్చు. ఏ నెప్పీ తెలీకుండా ఎంత సుకుమారంగా ఓ పువ్వులా చూసుకున్నాడు. పాపం అమాయకుడే.. నా గురించి అన్నీ తెలిసినా నా చుట్టూ ఏమి జరగనట్టు ఎంత ప్రేమగా అల్లుకున్నాడు. ఇలాంటి అమాయకుణ్ణి మోసం చేస్తే అల్లా నన్ను క్షమించడు..

కిటికీ వద్దకు చేరుకొని వీస్తున్న చల్లగాలిని ఎదురుకుంటు దానిలో లీనమవుతోంది. తన సొగసైన కురులు గాలికి రెప రెప లాడుతున్నాయి. ఎవరో వెనక నుండి వచ్చి ప్రేమగా లోతుగా వాటేసుకున్న ఊహకు తను చెదిరిపోయింది. ఏంటి? ఏమైంది నాకు? మగ పిశాచులకు అర్పించుకున్న నా ఈ దేహానికి ఇన్నేళ్ళలో ఎన్నడు కలగని స్పందనలు ఇప్పుడేంటి కొత్తగా..! నా భ్రమ? లేక మరేంటి? ఇంత కాలం చెరిపించుకున్నధి చాలు. ఇంకా చెరుపుకోడానికి మిగులున్నది ఏముంది.?

అల్లా… ఇప్పటి వరకు నువ్వు చూపించిన, నువ్వు గీసిన జీవితాన్ని నవ్వుతూ సహించడం నేర్చుకున్నాను. మనసనేదే లేకుండా మొద్దుబారించుకున్నాను. దాంట్లో మళ్ళీ స్పందనలు రేపకు..

వీస్తున్న చల్లగాలికి అడ్డుపడుతున్నట్టు కిటికీని బలంగా మూసింది. ఎప్పటిలాగే రెండో కిటికీకి అనుకోని ఉన్న తాను రాసుకుంటూ కూచునే బల్ల వద్దకి వెళ్లి కూర్చుంది. అక్కడి పుస్తకాల్లో, వస్తువుల్లో మార్పు వచ్చింది. అటు ఇటు వెతికి చూసింది. తాను రాసుకునే నోట్సు లు అక్కడ లేవు తాను చదివే కితాబులు కూడా లేవు. కిందేమైన పడ్డయా అనుకుంటూ అటు ఇటు వెతుకుతోంది. ఆ వెతుకులాటలో చిన్న రాయి బరువుని మోస్తూ గాలికి రెప రెప లాడుతూ ఒక కాగితం కనిపిస్తోంది. నెమ్మదిగా చేతిలోకి తీసుకొని చదవడం మొదలు పెట్టింది.

ప్రియమైన రిజ్వాన గారికి
మీతో గడిపిన ఇన్ని వేల క్షణాల్లో ఒక్కో క్షణానికి ఒక్కో జీవితకాలం రుణపడి ఉంటాను.
మీ కారణాలు మీవి నా కోరికలు నావి.
నేను మీకు కామాంధుడిగా కనిపిస్తే అది సమాజం చేసుకున్న దురదృష్టకరం.
దోసిళ్ళ కొద్ది మీరు చేసుకుంటున్న దువాలతో నా కోరికని కూడా జత చెయ్యండి.
ఏమో అల్లా నా కోరికను మీతో చెప్పించుకోవాలనుకుంటున్నాడేమో..
అన్నీ తెలిసిన నువ్వు నీ ఆడతనాన్ని ఎందుకు చంపుతున్నావు.
నిన్ను నువ్వు చంపుకునే హక్కు నీకు కాని ఆ అల్లాకి కాని లేదు.
అందరు నటిస్తున్నరనుకుంటున్నావ్. చిత్రం ఏంటంటే నిన్ను నువ్వు చంపుకుని నీ ఒంటితో నీకు సంబంధం లేనట్టు నటిస్తూ బతుకుతున్నావు.
నా కంటితో చూడు.. కప్పుకున్న కొద్దీ పెరిగే ఆడతనం నీ సొంతం. అందుకే నువ్వు విప్పుతున్నా నిన్ను కట్టుకోమన్నాను. అందరు నీ దేహానికి దాసులవుతారు అన్నావు. నేను నీ ఆడతనానికి దాసుడ్నయ్యా..
నీ మనసు గొంతు పిసికి అనుక్షణం దాన్ని చిత్రవధ చేస్తున్నావు. ఇక నేను దాసుడని అవడానికి ఇంకా మిగిలింది కేవలం నీ ఆడతనమే.
ఇలా నలుగురితో పడుకొని డబ్బు కోసం చేస్తున్నాననే భ్రమలో ఉన్నావు. కాని నీదో అర్ధంకాని స్వార్ధం. నువ్వు చేస్తున్న పని నువ్వు ప్రేమించే అల్లా కూడా మెచ్చడని తెలిసినా నువ్వు చేస్తున్నావంటే పాపం అల్లాకే కాదు. నాక్కూడా నీ మీద జాలితో పాటు నవ్వు తెప్పిస్తోంది.
నిజం చెప్పనా..
నీ కోసం పరితపిస్తుంటే నీ కళ్ళకి నేనొక వెర్రిబాగులోన్ని.
నిన్ను ఆరాధిస్తున్ననంటే అది నా ఖర్మ అని వదిలేస్తావు.
అందుకేనేమో వేడుకోడానికి మాటలు, ఎదురు చూడడానికి కన్నులు సరిపోవు.
జీవితానికి సరిపడా జ్ఞాపకంతో మదిని నీ మందిరం చేసుకున్నానంటే నాలో నీకో ఓ అమాయకుడే కనిపిస్తాడే తప్ప నేను కనిపించను.
నీవు రావని, నాతోడు ఉండలేవని, అర్ధం చేసుకోడానికి నా మనసెంత కలత చెందిందో తెలపడానికి పాపం నువ్వు రాసుకునే ఘజల్ లో కూడా పదాలు లేవేమో..
అవును నేనో పిచ్చి వాణ్ని.
సమాజం నన్ను వెలివేసినా నీ తోడు కోరుకునే పిచ్చివాణ్ని.
సమాధాన పరుచుకోలేని వెర్రివాణ్ని.
నీకు అర్ధం కాని నీ వాణ్ని..
మనసులో నీ జ్ఞాపకం.
చేతిలో నీ పుస్తకం.
రెండు జడలతో దిగిన నీ ఫోటోతో సెలవు..

ఇట్లు
గౌతమ్.

చేతిలో కాగితం ఇంక రెప రెపలాడుతూనే ఉంది. ఇంత కాలం నిశబ్ధంలోనే గడిపిన తనకి అదే నిశ్శబ్దం ఈ క్షణం ముల్లులా గుచ్చుతోంది.. ఏకాంతం అర్ధం కాకుండా ఉంది. తనకు తానుగా ఎందుకిలా మారిందో ఆలోచించుకోలేని దీనస్థితిలోకి చేరుకుందని తెలుస్తోంది..
ఏంటో చిత్రంగా మనసులో చిన్నగ ఒక బాధ మొదలయ్యింది.
కనీసం అది కన్నీరవడానికి కూడా ఆ బాధకి భయం వేస్తోంది.
అతను పలికిన ఆడతనపు మాటలు నిలువునా కాల్చుతున్నాయి.
కారణాలు అనేకమే ఏ కారణానికి కూడా సరైన నిర్వచనం లేదు.
ఎందుకిలా ఇంత మొండిదాన్నయ్యాను?
కోపం నా మీదా? లేక నన్ను మోసం చేసిన వారి మీద?

వాడుకుని వదిలేస్తున్న ఈ దేహం మీద? లేక నా చుట్టూ నా జాతకాన్ని గురి చూసి గిరి గీసిన ఆ అల్లా మీదనా..?
ఆలోచిస్తుంటే మెదడంతా మొద్దు బారుతోంది. నెప్పి, నెప్పి భరించలేని నెప్పి. కొన్ని కాలాలుగా అణిచిపెట్టుకున్న నెప్పి. ఎవరో బలంగా గునపం గుండెలో గుచ్చిన నెప్పి. గాయాలతో రాయిలా మారిన మనసుని ఉలితో చెక్కిన నెప్పి. ఆ నెప్పిని భరించడం నా వల్ల కాదు.
నెమ్మదిగా బాత్రూంలోకి అడుగుపెట్టి లోటాల కొద్దీ నీళ్ళు కుమ్మరించుకుంది. తన నుండి జాలువారుతున్న నీటిలో కన్నీరేక్కడో కలిసింది. ఎండిన ఆకు నుండి ఏంటి ఈ పచ్చి వాసన. ఎండిన ఆ మనసునుండి పులిపిరిలా కొద్ది కొద్దిగా పచ్చదనం పైకి పొడుచుకు వస్తోంది. నెమ్మదిగా అది చిగురుగా మారుతోంది. చూస్తుండగానే చిన్న చిన్న ఆకులతో తీగలతో మనసుని పూర్తిగా చుట్టేసుకుంటోంది. చిత్రంగా మళ్ళీ గుండె కొట్టుకోవడం మొదలయ్యింది. ఆ గుండె ఇప్పుడు అతగాడి లాలనను శ్వాసిస్తోంది. మిగిలిన నీళ్ళని నిండా కుమ్మరించుకొని బయటికొచ్చింది. చల్లని గాలులు అమాంతం తనలా వాటేసుకున్నాయి. ఇంకా అతగాని శ్వాసలు తన మనసుని ఈ గదిని వీడి పోలేదు. తను తడిమిన చోటల్లా ఇప్పుడు కొత్త మెరుపులను సంతరించుకున్నాయి. తన దేహం కొత్తగా, మరింత అందంగా చిత్రంగా కనిపిస్తోంది. తన చుట్టూ చేరిన అతని శ్వాసలు ఓరగా చూస్తున్నట్టు తలపు. ఇప్పటి వరకు తానెరగని సిగ్గులు కొత్తగా చేరుకున్నాయి. ఒంటినంతా సన్నని చీరతో కప్పేసుకుంది..

అద్దంలో జాలు వారుతున్న కురుల అందాలతో తన రూపం తనకే పరిచయంలేనంత చిత్రంగా కనిపిస్తోంది. నున్నగా తల దువ్వుకుని అందంగా సింగారించుకుంది.

రోజు రోజుకి ఒక్కో మార్పు మొదటి మార్పు తన గది తలపులని మూసేసింది. తాను బయటికి రావడం మానేసింది. లోపలికి వచ్చే వారిని వారించింది. జరుగుతున్న మార్పుకి నాయనమ్మకి ఏమి అర్ధం కాలేదు. ఏమైందోనని ఎన్నిసార్లడిగినా మాట లేదు.
‘ఇలా అయితే ఇల్లు గడవడం కష్టం మనం చావడమే..’
‘చద్దాం బతికుండి ఇలా చావడం కన్నా ఒకేసారి చద్దాం.’
బిత్తిరి మొహం వేసుకొని అర్ధం కాకుండా చూస్తూ నిల్చున్న ముసలావిడ చేతిలో వంద నోటు పెట్టి
‘డబ్బుఎందుకే నీకు… మూలకు కూర్చో నేను వండి పెడతాను నువ్వు తిని పెట్టు. ఇగో ఈ వంద పట్టుకు పొయ్యి సరుకులు తేపో. నేను బయటికి వెళ్ళను ఎవ్వడ్ని లోపలికి రానియ్యకు.’
‘మరి ఎవరన్నా ఏమైనా అడిగితే ఏమని చెప్పనే. ‘
విసుగ్గా కోపంతో ఊగిపోతూ
‘నాకు ఎయిడ్స్ వచ్చిందని చెప్పు ఎవ్వడు ఇంటిమొహం చూడడు. ఇక వెళ్ళవే వెళ్ళు .’
రోజులు నమాజు చేసుకుంటూ, ఖురాను చదువుకుంటూ, ఘజల్లు రాసుకుంటూ, వంట చేస్తూ, అతనితో గడిపిన జ్ఞాపకంతో అతగాడి కోసం ఎదురు చూస్తూ గడుస్తున్నాయి.
అల్లా నను నన్నుగా గుర్తు చేయడానికి నువ్వే తనలా వచ్చావని అనిపిస్తోంది అనుకుంటూ ఖురాన్ను గుండెకు అదుముకుంది. అతనితో గడిపిన క్షణాలు ఆనందాశ్రువులై చల్లగా జారిపోతున్నాయి.
తనను కోరుకున్న గల్లీ వాసులకు ఇప్పుడు తానొక అందం పూసుకున్న చావు.. ఇప్పుడు తనని తాకడానికే భయపడుతున్నారు.
ఎన్నో రోజులతరువాత తన ఇంటి తలుపుతడుతూ ఒక ఉత్తరం. ఊహించినట్టుగానే అతగాడినుండి. ఉత్తరం తెరుస్తుంటే వెనకనుండి తన మెడమీద తల వాల్చి నెమ్మదిగా తన చేతుల్లో బంది అయిపోయి తనను తాను మరిచిపోతోంది.

ప్రియమైన రిజ్వాన గారికి
మీ నుండి ఎంత దూరమవుదామనుకున్నా మీ రూపం, ఆ కళ్ళు నన్ను నా ఆలోచనలను ఓడిస్తున్నాయి.
నాకు నేను ప్రశ్నల సాగరంలో ముంచేసుకున్నా తీరం మాత్రం నీవేనన్న సత్యం నుండి ఎందుకు బయట పడలేకపోతున్నానో అర్ధం కావడం లేదు.
నేను చూసిన అందం, నేను గడిపిన సాంగత్యం, మీ ఆడతనమే కాదు మీ రాతల మాటల వెనక దాగిన ఆ సున్నిత మనసుకి నేనిప్పుడు దాసుణ్ణి.
నువ్వు చెప్పిన ఆ సమాజానికి, కట్టు బాట్లకి, కుటుంబానికి, మతానికి, కులానికి, నేను అతీతం. ఇప్పుడు ఎప్పుడు నువ్వే నా మతం అభిమతం.
ఇప్పటికి నేను మీకు గుర్తుంటే మిమ్మల్ని నా లోకంలోకి తీసుకెళ్ళేందుకు నేను ఎదురు చూస్తుంటాను.
ట్రైన్ రిజర్వేషన్ టికెట్ని పంపించాను. వస్తే మీతో రైలు ప్రయాణం రాకుంటే మీ జ్ఞాపకాలతో ఈ జీవితయానం.

ఇట్లు
గౌతమ్..

మనసులో ఏదో తెలియని ఆనందం. ఇలాంటి ప్రేమలేఖలు ఇప్పటివరకు గడిచిన జీవితంలో ఎన్నో చదివినా, ఎందరి చేతిలో మోసపోయినా, ఎందుకో తన మాటలకు మనసెందుకిలా లొంగిపోతుంది. జరిగిన మోసాలతో పోల్చుకుంటే ఇతగాడి సాంగత్యంలో మోసపోయినా కూడా అదొక తీయని జ్ఞాపకమే.. ఒక్కరోజు మిగిల్చిన జ్ఞాపకంతోనే ఇన్ని నెలలు సంతోషంగా గడిపా..
ఇది అల్లా నాకిచ్చిన వరమనుకోనా లేక తన మీద నాకు కలిగిన ప్రేమా?
ఏదైతేనేమి నాక్కావాలి. అతనిప్పుడు నాకు కావాలి.
తన చేతుల్లో పువ్వులా సేద తీరడం నాక్కావాలి.
తన ఛాతీ మీద పసిపాపలా ఒదగడం నాక్కావాలి.

ఆ రోజు ఉదయమే నమాజు పూర్తిచేసుకొని ఖురాన్ను రంగు పరదాలో చుట్టుకొని గుండెకు అదుముకొని ఇంకో చేత్తో ట్రైన్ టికెట్తో రైల్వే స్టేషన్ కి చేరుకుంది.

అర్ధం కాని గందరగోళంలో పిచ్చిగా తిరిగింది. తనకోసం వెతికింది. ఎంక్వయిరీలో అడగ్గానే ట్రైన్ వెళ్ళిపోయిందని సమాధానం…
ఎవరో గుండెను బలంగా పిసికేస్తున్నట్టు శ్వాస ఆడట్లేదు. అక్కడే ఓ మూల గోడకి చతికిల పడింది. బయటికొచ్చి నడుస్తోంది.. ఏడుపొస్తోంది పిచ్చిగా ఏడుస్తోంది. సన్నగా వర్షం. చూస్తుండగానే జోరందుకుంది. రోడ్లన్నీ నిండుకున్నాయి. ఆ వర్షంలో తన ఏడుపు తో పాటు తాను కూడా కొట్టుకుపోతోంది. ఎప్పుడు స్పృహ తప్పిందో తెలీలేదు.
కళ్ళు తెరవగానే తన గదిలో.. పక్కన తన నాయనమ్మతో..
చిత్రంగా ఇంకా తన కౌగిల్లో తడిచి ముద్దైన ఖురాను.
బయట వర్షం ఇంకా కురుస్తూనే ఉంది.
తన మనసులో ఎర్రటి ఎండ తనని కాల్చుతూ..
ఆ ఎర్రటి ఎండలో.. కన్నీళ్లు సైతం ఆవిరయ్యాయి..
వీస్తున్న జోరు గాలిలో కూడా ముచ్చెమటలు..
కను రెప్పలు బరువెక్కుతున్నాయి..
కళ్ళు మూసుకుపోతున్నాయి..
ఆ ఎడారిలో దూరంగా అతగాడు అతనికోసం పరిగెడుతూ పరిగెడుతూ..
తాను మాయమవుతూ తిరిగి కనిపిస్తూ మళ్ళీ మాయమవుతూ..
కాలం వెర్రిగా ఆడుకుంటోంది. తన మనసు పువ్వై, ఎడారి ఇసుకలో సల సల మాడుతోంది. మాడుతున్న పువ్వుపై ఎండిన ముళ్ళ కంచె పూరెమ్మలను చీల్చుతోంది.. నెమ్మదిగా కళ్ళు తెరుచుకున్నాయి.. ఇంకా వర్షం అలాగే కురుస్తోంది వర్షంతో పాటు కన్నీరు కూడా ఇంకా ఆగట్లేదు..
టక్ టక్.. తలుపు రెక్కలు ఎవరో కొడుతున్నారు..
“రిజ్వాన..”
అదే గొంతు.. కలా? నిజమా? ఇది అతని గొంతే..
ఒక్కసారిగా వేలాది సారంగుల శ్రుతులు మదిలో మోగుతున్నాయి.
గీరుకున్న పూరెమ్మని ఇసుక తెమ్మ నుండి చల్లని చేతులోకి తీసుకున్నట్టు గుండె అతని శ్వాసలకోసం పరితపిస్తూ ఉలిక్కిపడి లేచి పరుగు పరుగున తలుపు తెరిచింది.
ఆశ్చర్యం ఆనందంతో మాటలు కరువై ఎదురుగున్న తనని చూసి చిన్న పిల్లలా వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఏడుస్తూ అమాంతం వాటేసుకుంది.
“ఎందుకో నిన్నొదిలి ఈ పిచ్చి మనసు వెళ్ళలేకపోయింది.” ఇక జీవితాంతం నిన్ను చూస్తూ బతికేందుకు తిరిగి వచ్చేసానంటూ.. ఒకరిలోకి ఒకరు లీనమవుతూ…
ఒకరితో ఒకరు ఏకమవుతున్న తమని చూస్తూ వర్షపు బిందువుల్ని దులుపుకుంటూ కిటికీ వద్ద కపోతాల జంట. *

Categories: కథనం

చనిపోవడమంటే?

నా గతం తో ముడిపడిన విషయాల్లో చావు కూడా ముఖ్య పాత్ర వహించింది..

నా చిన్నప్పుడు అందరిల్లలో ఎప్పుడో ఒకసారైన శుభకార్యానికి సన్నాయి మేళం మొగుతుండేది. కాని మా ఇంట్లో ఎప్పుడు చావు డప్పే.. మా బాపుని మా బాపమ్మ తాతయ్య దత్తత తీసుకున్నారు మా తాత వాళ్ళ అన్న దగ్గరినుండి.

ఆ రకంగా మా బాపు తరపున నాకు ఇద్దరు తాతయ్యలు ఇద్దరు బాపమ్మలు ఎం జరిగిందో ఏమో నాకు ఊహ వచ్చే సరికి మేము బాపు పుట్టిన ఇంట్లో ఉన్నాం..

ఇక మా బాపమ్మకి మా అమ్మ అంటే ఎంత ఇష్టమంటే డబ్బా నిండా కిరోసిన ఒంటి పై పోసి కాల్చే అంత.. బిక్కు బిక్కు మంటూ గుడ్లు తెలేయడం తప్ప ఏమి చేయలేను. అమ్మ నన్ను తన వెనకాల దాచుకునేది. అన్నయ అక్కయ స్కూల్ కి వెళ్ళే వారు. బాపు పొద్దున్నే పనికి బోయేటోడు. ఇక బాపమ్మ కి అమ్మంటే ఎందుకంత కసియో నాకు తెలీదు. పొయ్యి దగ్గర ఏడుస్తూ వంట చేయడం తప్ప ఎప్పుడు ఎదురు మాట్లాడినట్టు నేను ఎరగను.. తన తీరు తెన్నులు దినదినాబివ్రుద్ది చెందుతూ రోజుకోరకమైన హింస పెట్టేది. ఇవన్ని భరించడమే తప్ప ఏ రోజు బాపుకి కాని వేరే ఎవ్వరికి గాని చెప్పేది కాదు..

రోజు అవుతున్న గొడవలు చూడలేక ఆ గల్లిలో ఉండే ఓ తాత ఆయన్ని మా బాపు చిన్న నాయన అని పిలిచెటోడు. ఓ రోజు అర్ధ రాత్రి పనికిబోయి వస్తుంటే ఇంట్లోకి పిలిపించి. ఏరా మొగిలి ఇక్కడెందుకుంటున్నావ్ రా నిన్ను దత్తత తీసుకున్న అవ్వ అయ్యలు ఎం పాపం చేసారురా ఇల్లు లేదా ముంగిలి లేదా నీ కన్నోల్లని చూసుకోడానికి మీ అన్న గాడు లేడా!! వాల్లనెవరు చూసుకుంటారు రా.. పాపం ఆ పొల్లని సూస్తే సయిస్తలేదు రోజు రోజుకి దానికి నరకం జూపిస్తాంది మీ అవ్వ ఇయ్యాల గ్యాసు నూనె ఒంటి మీద బోసింది దబ్బున మేము అందుకునే సరికి సరిపోయింది కాని ఇయ్యాల ఆ పొల్ల పాణం పోయేటిదే.. ఆ పొల్ల కి ఏమన్నైతే నీ పిల్లల గతేంది. నువ్వా తాగుబోతు గానివి.. ఇగోరా నీ మంచి కోరి జెప్తున్న. సక్కగా ఆ ఇంటికి బో.. అని..

ఆ రోజు నాకింకా గుర్తు పొద్దున్న పుట్టిన భయం ధాటికి నిద్ర నా దగ్గరికి రావట్లేదు. రోజు లాగే అమ్మ బాపుకు అన్నం పెట్టి పక్కన కూచుంది. ఏమైంది గట్లున్నావ్ అని అడిగాడు. నాకేమైంది మంచిగనే ఉన్న అంటూ కొంగు బుజం మీద కప్పుకుంది. రేపు మనం ఆ ఇంటికి పోతున్నాం పిలగాండ్లని స్కూల్ కు పంపకు. ఇక ఆన్నే ఉందాం.. అని చెప్తున్న బాపు కళ్ళలోని నీటి తెర దీపం వెలుగులో ఇంకా కనపడుతూనే ఉంది.

తెల్లగా తెలవారింది. నేను లేచే సరికి బాపు పనికి బోలె, అన్నయ అక్కయ కూడా స్కూల్ కి బోలె.. అందరు కలిసి సామాను మూట గడుతున్నారు. అన్నయ్య నులక మంచం ఎత్తి సిద్ధమయ్యాడు. అక్కయ కట్టెల సంచిలో కొన్ని బోళ్ళు పెట్టి పట్టుకుంది. బాపు పెద్ద సైకిల్ కి పెద్ద మూట కట్టుకున్నాడు. అప్పుడే లేచిన నేను ఒంటి మీద పడ్డ నిమ్మ పూతని దులుపుకొని ఓ సారి నిమ్మ చెట్టుకేసి చూసా.. ఆ చెట్టు లాగే అమ్మకి సహనం ఎక్కువ. అన్ని సర్దుకొని బయటికొస్తుంటే బాపుని పట్టుకొని వెల్లకని బాపమ్మ ఏడుస్తోంది. నేనేడికి బోతున్ననే ఆ ఇంటికేగా.. అదేమో దూరం ఉన్నట్టు చేస్తున్నావ్ పది ఇండ్ల దూరమే గాధవ్వా.. అనుకుంటూ బయల్దేరాం నిజమే కరక్టుగా లెక్క బెడితే ఐదిండ్లు దాటంగానే వచ్చింది ఆ ఇల్లు.. ముందుగానే మా అన్న చెప్పినట్టున్నాడు ఆ బాపమ్మ కి ఇంటి బయటనే నిల్చొని చూస్తోంది. అల చేరుకున్నామో లేదో.. మా బాపుని దగ్గరికి తీసుకొని ఇంత కాలానికి ఈ అవ్వ గుర్తోచ్చిందారా అంటూ దగ్గరికి తీసుకొని కళ్ళ నీళ్ళు పెట్టుకుంది. లోపలికి అడుగుపెడుతుండగా..నన్ను తన చంకనెత్తుకుంది. నాకు ఊహ మోదలైంది అప్పటి నుండే కావచ్చు తనని మొదటి సారి చూస్తున్నట్టుగా అనిపించింది. అంతకు ముందు మేము ఈ ఇంట్లోనే ఉండే వాళ్ళమంటా నాకెంతకి గుర్తు రాలేదు. ఏవి గుర్తు రాకపోవడం గురించి ఆలోచిస్తుంటే బహుశా నా బాల్యం ఆ క్షణం నుండే మొదలయ్యిందేమో.. ఈ బాపమ్మ మా అమ్మని ముద్దుగా సరోజనవ్వ అని పిలిచేది.

ఈ ఇంటికి మారాక అమ్మకి కాస్త ఊరట లబించింది. నన్ను కూడా స్కూల్ కి పంపడం మొదలు పెట్టింది. నేను రెండో తరగతి లో ఉన్నాననుకుంటా మా పెద్ద బాపమ్మ ఇంటికొచ్చింది ఏ మాత్రం కోపం గాని ఎలాంటి అసహనం ప్రదర్శించ కుండానే ఇంట్లోకి పిలిచి మర్యాదలు చేసింది మా అమ్మా.. మా అన్న మాత్రం గట్టిగానే తిట్టాడు ఎందుకోచ్చినావ్ అని. అమ్మ కల్పించుకొని తప్పు అలా మాట్లాడొద్దని అన్నయ్యని బెదిరించింది. ఇద్దరు బాపమ్మలు కాసేపు మాట్లాడుకొని పోయ్యోస్తవ్వా.. అనుకుంటూ వెళ్తూ వెళ్తూ నా చేతిల ఆటాన బిళ్ళ పెట్టి వెళ్ళింది.

చీకటి పడింది అమ్మ బుజంపై తలపెట్టి కడుపు మీద చెయ్యేసి పడుకున్న. అమ్మ నను దగ్గరికని తీసుకొని అట్ట తో విసురుతోంది.”అమ్మ.. ఆ బాపమ్మ ని ఎందుకు తిట్టలేదు నువ్వు” అని అడిగా. తప్పొప్పులు లెక్క లేస్తూ పైన దేవుడు రాసుకుంటూ ఉంటాడు. పాపం జేసినోల్లందరు ఏదో ఓ రోజు ఆళ్ళ పాపం తెలుసుకుంటారు. ఆల్లు తప్పు చేసారని మనం తప్పు చేస్తే ఇగ దేవునికేం పనుంటది. అమ్మ చెప్తోందంటే నిజమే అయ్యుంటది నిజంగానే దేవుడు అందరు లెక్కలు చూస్తున్నాడేమో.

కాలం తన పని తాను చేసుకుంటూ దొర్లుకుంటూ పోతున్న రోజుల్లో మా పెద్ద బాపమ్మ మళ్లీ వచ్చింది. మా అన్నయ నులక మంచం వేసాడు దాని మీద అమ్మ చేద్దరేసి కూచో అత్తా అని కుచోబెట్టింది అమ్మ కింద కుచున్నది బాపమ్మ పక్కన మంచం మీద నన్ను కూచోబెట్టుకున్నది. అన్నయ్య అక్కయ్య అటు పక్కన కూర్చున్నారు. నన్ను ముద్దు చేస్తూ మా చిన్న నాయన కూడా బడికి బోతాండ మా నాయనే.. అంటూ అప్పుడప్పుడే వచ్చిన కొత్త ఆటాన బిళ్ళ ఒకటి చేతిలో బెట్టింది. మంచిగ సదుకొవాలా.. పిల్లల్ని మంచిగా జూసుకో అవ్వ అంటూ మా అమ్మకి చెప్తూ ఉన్న పలానా మంచం లో వెనక్కి వాలింది. నవ్వుతూ మా అమ్మతో బిడ్డ నేను పురుగుల మందు దాగిన ఇగ సచ్చిపోతా కొడుకుని బిడ్డల్ని జాగ్రత్త గ జూసుకో అని చెప్తుండగా నోట్లో నుండి నురగలు వస్తున్నాయి బాపమ్మ కొద్ది సేపు కడుపును ఒత్తుకొని ఒత్తుకొని ఆగి పోయింది. మా అమ్మ బయటికొచ్చి అరుస్తూ అరుస్తూ ఇంటి చుట్టూ పక్కలోల్ల అందరిని పిలిచింది. మా ఇంట్లో ఎప్పుడు చూడనంత మంది గుమి గూడారు రిక్షాలో గాంధీ ధవఖనకి తీసుకెళ్ళారు. గ్యాసు మొద్దు పెట్టి ముక్కులకి పైపులు తొడిగి ఏమో చేసిండ్లు లాబం లేదు చచ్చిపోయింది ఇగ ఇంటికి తీసుకుబొమ్మన్నారు.

మా బాపుకు మా బాపుకన్న ముందు ఇంకో ఇద్దరక్కలు ఒక అన్న ఉన్నారు. మా బాపు వాళ్ళ అన్నకి నా ఐదో తరగతిలో అయ్యింది పెళ్లి. నాకు పాతికేల్లోచ్చిన కూడా తానేంటో ఇంకా అర్ధం కాలేదు. నా దగ్గర ఒక్క రూపాయి లేదు అది చస్తే నాకేంది అని మాట్లాడాడు..

మళ్ళీ మా బాపుకి బుద్ది చెప్పిన ఆ తాతే పైసలిస్తే శవాన్ని సాగనంపే పనులు మొదలైనయ్.. ఎన్నడు చూడని జనాలు మా ఇంట్లో మా ఇంటి చుట్టూ గుమి గూడారు. బాపమ్మని పాడే మీద పడుకోబెట్టారు. చావు డప్పు మోగడం మొదలయ్యింది ఆ శబ్దానికి నా గుండె భయం భయంతో వణికింది. చుట్టూ ఒకటే ఏడుపులు ఒక్కసారిగా మూకుమ్మడిగా నన్ను మధ్యలో కూర్చోబెట్టి నా చుట్టూ అందరు కావాలని చేరి బయపెడుతున్నట్టుగా అనిపించింది ఆ వాతావరణం. చావంటే ఇదేనెమో శవం ముందు గుడంబా తాగి మైకంతో పిచ్చిగా ఎగురుతున్నారు.. నా చేయిని ఎవరో దొరక బుచ్చుకొని ఆ గుంపులో నడిపించుకు పోతున్నారు. ఎంత తలెత్తి చూసిన మోసుకేల్తున్న శవం నాకు కనిపించట్లేదు నా ముందు వెనకా నా చుట్టూ అంత జనం వీధి అంత కిక్కిరుసుకుంది కొద్ది సేపటి తరువాత అందరు ఆగిపోయారు నేను అమ్మ బాపు అన్నయ అక్కయ కోసం వెతుకుతూ జనాలను తోసుకుంటూ ముందుకు నడిచా అక్కయ కనిపించింది మా చిన్నమ్మను పట్టుకొని. బాపు పొగలు కక్కుతున్న కుండ ని పట్టుకొని మెడలో దండ వేసుకొని ఉన్నాడు. బాపు పక్కనే అన్నయ్య. నాలుగు పక్కల పట్టుకున్న వారు నెమ్మదిగా మూడు బాటల కాడ దింపారు. ముందు బాపు వెళ్లి పాడే మీద పడుకున్న బాపమ్మ చెవిలో ఏదో మాట్లాడి వచ్చాడు. వరుసగా ఒకరి తరువాత ఒకరు వెళ్లి వస్తున్నారు. నా చూపులు మాత్రం అమ్మని వెతుకుతున్నాయి అమ్మ మా ఇంకో బాపమ్మ తో ఉంది. చాల సేపటినుండి ఎడుస్తున్నట్టుంది కావచ్చు మొహమంత పూర్తిగా వాలిపోయింది. అమ్మ కూడా వెళ్లి చాల సేపు చెవిలో ఏదో చెప్తూ ఏడ్చుకుంటూ తనని పట్టుకుంది. అందరు దూరం జరిపి పాడే ఎత్తారు. స్మశానం లో కట్టెల మీద పడుకోబెట్టారు కొద్ది కొద్దిగా అంటుకొని కాసేపటికి పెద్ద మంటలో తానేక్కడ ఉందో కనపడలేనంతగా కలిసిపోయింది.

చనిపోవడమంటే ఇదేనెమో అనుకుంటూ అందరం కలిసి బద్రకాలి చెరువుకి వెళ్లాం అక్కడే స్నానాలు కానిచ్చి ఇంటికి చేరుకున్నాం.. ఓ మూలకి కూర్చున్న ఆశ్చర్యంగా పోయిన బాపమ్మ జ్ఞాపకమై ఇంకా పిడికిల్లో బంది అయి ఉంది కొత్త ఆటానా రూపంలో.

ఇక అక్కడినుండి మొదలు, ఇద్దరు తాతలు, మా ఇంకో బాపమ్మ, మా అమ్మ వాళ్ళ నాయన అందరు అందరు చివరి రోజుల్లో మా అమ్మ సేవని అందుకున్న వాళ్ళే ఒక్కొక్కరుగా కాలం చెల్లుతుంటే చావంటే ఇదేనేమో అని అనుకోవడం ఇక అలవాటయ్యింది.. అందరు ఏడుస్తున్న కూడా నాకు మాత్రం ఏడుపు రాకపోయేది ఎందుకో తెలిదు..

చావు ను గురించిన ప్రశ్న చాల కాలం చాల మందిని అడిగాను. ఒక్కొక్కరు వారికి తోచినట్టు చెప్పారు.

అదొక ఘడ నిద్ర అని, దేవుడు దగ్గరికి వెళ్లిపోయారని, వారు వేరే దేహం లోకి వెళ్ళారని, మళ్ళీ ఎక్కడో పుట్టారని రక రకాలుగా ఎవ్వరికి తోచిన సమాధానం వారిచ్చేవారు. చిత్రంగా నేను తిరిగి ప్రశించేవాన్ని నువ్వు చెప్పేది ఎంత వరకు నిజం నువ్వేమైన ఇంతకు ముందు చచ్చిపోయి తెలుసుకున్నవా అని..

Categories: కథనం

పోయిన ఉగాదికి…

నేను పుట్టక ముందే మా పాలోల్లాయన కొత్త కుండని సైకిల్ మీద పట్టుకొస్తుంటే దేనికో తగిలి పగిలిందంట. కుండ పగలటంలో సోధ్యం ఏముంది. అని ఎవ్వలైన అనుకుంటారు కాని గక్కడ్నే మొదలయింది ముచ్చటంత. ఆ కుండ పగలడం సంగతి జూషినోల్లు చెవులు కోరుక్కోవడంతో నిమిషంలో గల్లి గల్లంత పాకింది.

ఒక్కో ముసలోడు ఒక్కో మాట అన్నాడు. అమ్మమ్మలు, అమ్మలక్కలంత అయ్యో అయ్యో అన్నారు. గిదంత కాదు గాని పంతులు దగ్గరికి పోతేనే ఏం జేయాల్నో ఎర్కైతది అనుకొని కుల పెద్దలంత కలిసి పంతులు గార్ని కలిసి జరిగిన ముచ్చటంత అప్పజెప్పిండ్లు. నొసలు చిట్లించి ఏవో బొక్కులు ముందేసుకొని తిరిగేసి తిరిగేసి ఒక్క ఇషయం తెగేసి సెప్పిండు. ఇంగ మీ మందాటోల్లు ఉగాది పచ్చడి చేసుకునేడిదే లేదు. ఎవ్వలైన సేసుకుంటే అందరికి అరిష్టం అని చెప్పిండు. ఇది జరిగిన శాన ఏండ్లకి నేను బుట్టిన కాబట్టి ఇది నా చేతిల లేని సంగతైంది. నాకు అర్ధం కాదు గాని కుండ అనక పగలదా? పగలగొట్టినోడు అందరికి తెలిసేలా ఎందుకు పగలగొట్టిండు? పగిలితే పగిలింది గాని గీ పచ్చడ బంధు వెట్టడం ఏందో నాకైతే అస్సలు సమజ్ గాలే… అందరింట్లో ఏందో గాని ఉగాది పండగొస్తుందంటే గీ పచ్చడి గురించి కనీసం ఒక్క సారైనా మా అమ్మతో లొల్లి బెట్టుకునేటోన్ని.

తెల్లారగట్లల్ల లేచినవెంటనే గదే గా రాఘవేంద్ర రావు సినిమాలో లాగ పడుకున్న మా పక్కల నిండ, ఇంక నా మీద వేప పువ్వు రాలేది. ఎంతగా రాలేదంటే నేనే వేప పువ్వు పరుపులో పడుకున్నట్టుగా అనిపించేటిది. ఎంతైనా ఎండా కాలం, ఇంట్లో కరెంటే లేంది పంక యాడికెల్లివొస్తది? గందుకే ఎండాకాలం అంత ఇంటెనకాల వేపసెట్టు కిందే మా పక్కలు. వేప పువ్వు రాలుతుందంటే పండగ దగ్గర పడ్డట్టే..

గింతంత గాలి తగుల్తే సాలు గుప్పెడు పువ్వు రాలేది. రంబులో, గోలెంలో, బకిట్లో ఆడ ఈడ అని తేడా లేకుండా యాడ బడ్తే ఆడ ఒకటే పడుడు. మా అమ్మకి వాకిలి ఊడ్వలేక యాష్టకోచ్చేది గాని నాకు మాత్రం మస్తు సంబరంమయ్యేది. రేడియోలో మౌనమేలనోయి అనే పాట వస్తుంటే చెట్టు కేసి మౌనంగా సూస్తుండేవాన్ని. చెట్టు నుండి పువ్వు విడిపోవడమే ఆలిస్యం నేల మీద పడకుండా అందుకోవా ల్నని ఎంత ఆరాట పడేవాన్నో..

పొద్దున్నే లేచి వేపాకు కలిపిన గోరెచ్చని నీళ్ళు తల మీద నుండి పడుతుంటే ఆ హాయి మాటలకు అస్సలు అందదు. రెండు నిండు బకీట్లు ఐపోయినంక కూడా కోరిక తీరక పోయేటిది. అమ్మ చూసిందంటే ఇక అంతే జ్వరం వస్తదని బలవంతంగా ఆపేసి తల తుడిచేది. పండగ గద తెల్లారగట్లే లేచి మా అమ్మ, అక్కయ ఇంటి పనుల్లో పడేటోల్లు. మా బాపు పొద్దున్నే వరంగల్ కి పోయేటోడు కొత్త సంవత్సరం కదా ఆల్లు పనిచేసే దుకానాలకి వెళ్లి మావిడాకు పెట్టి పూజలు చేసుకొని పొద్దునే మళ్ళీ ఏడెనిమిది గంట్లకి వచ్చేటోడు. వస్తు వస్తు తెల్లని సంచినిండా మావిడాకు కుక్కుకొని తెచ్చేటోడు.

ఇగ నేను, మా అన్న ఆగకుండా మా అన్న నా కన్నా కొంచెం పొడుగు కాబట్టి నిల్చొని దర్వాజకు ఆ మూలనుండి ఈ మూల వరకు చిక్కగా మావిడాకు పెడ్తుంటే. నేనేమో ఇంకో ధర్వాజకి కుర్చేసుకొని పెట్టెటోన్ని. మా బాపు గోడెక్కి వేప కొమ్మ మీద నిల్చొని లేత మండల్ని పువ్వు రాలకుండా జాగర్తగా సుంచి కిందకు వేస్తుంటే మా ఇంటి సుట్టు పక్కనున్నోల్లందరు మా ఇంటెనకాల లైను కట్టేటోల్లు. దగ్గర దగ్గర పది పదిహేనిండ్లోల్లందరు వేప పువ్వు వేపాకు మండలు పట్టుకుపోయేటోల్లు. మావిడాకు పెట్టడం పూర్తయ్యాక ప్రతి ధర్వాజకు రెండు దిక్కుల వేప మండలను చక్కగా చిక్కియ్యడం తో ఇగ మా పని అయిపోయేడిది.

మాకెట్లాగో పచ్చడి బాగ్యం లేదు. ఆ సంగతి నా కన్నా ఎక్కువ మా ఇంటి సుట్టు పక్క ఉన్నోల్లందరికీ ఏర్కైన సంగతే. ఇగ ఆల్లందరు చెంబుల కొద్ది పచ్చడి తెచ్చి ఇచ్చేటోల్లు. మా హన్మకొండలో ఉగాది పచ్చడి పచ్చి పులుసు లాగ, చారు లాగ చేసేటోల్లు. ఒక్కో ఇంటిది ఒక్కో రుచి మా ఇంట్లో పచ్చడికి ఇక లోటే లేనంతగా అందరు తెచ్చిన పచ్చడి సగం అడ్డ నిండేడిది. మనమసలె జిహ్వ ప్రియులం. పెద్ద గిలాస నిండుగా దగ్గర దగ్గరగా ఓ పది గిలాసులు పైనే తాగేటోన్ని. ఏంటో తాగినప్పుడల్లా ఆరు రుచుల్లో ఏదో ఓ రుచి జివ్వుమనిపించేది.

అమ్మ అక్కయ ఉడికించిన శనగ పప్పు, బెల్లం రోట్లో కచ్చ పచ్చిగా దంచి సన్నటి రొట్టెలు చేసి ఒక రొట్టె మధ్యలో రోట్లో దంచిన పప్పు బెల్లం ముద్దని పెట్టి దానిపై ఇంకో రొట్టెతో అతికించి సన్నటి బచ్చప్పాలు చేసి డాల్డా తో పెనం మీద కాల్చుతుంటే ఎక్కడో కూసున్న మా బాపు మా అన్న నేను దిగ్గ దిగ్గ అడుగులేసుకుంటు పొయ్యి దగ్గరకొచ్చి కూచొని ఎప్పుడెప్పుడు రికాబులో వేసి ఇస్తుందా అని అవురావురని చూస్తూ కూసునే వాళ్ళం.

ఇక నా కోసం రికాబులో రెండు బచ్చాలు పెట్టి, గ్లాసు నిండా పచ్చడి పోసి ఇస్తే నెమ్మదిగా ఇంటెనక వేప చెట్టు కింద సంచి పరుచుకొని కూసోని ఒక ముక్క బచ్చప్ప ఒక గుటిక పచ్చడి అలా కళ్ళు మూసుకొని ఆస్వాదిస్తుంటే అబ్బ ఆ మాజా అనుభవించినోడికే తెలుస్తది. ఆ మజా నుండి బయటపడనీకి ఆ ఉగాది ఒక్కరోజు అస్సలు సాలదు.

పొట్ట ఫుల్లుగా నిండిన తరువాత కాయిదంలో ఓ పది బచ్చాలు దాక చక్కగా పొట్లం కట్టిస్తే. అది పట్టుకొని నెమ్మదిగా కొత్త అంగి కొత్త ప్యాంటు వేసుకొని నున్నగా దువ్వుకొని కొత్త ప్యారగాన్ చెప్పులు వేసుకొని టప్పు టప్పు అని శబ్దం చేసుకుంటూ.. టప్పు టప్పు అని శబ్దం చెయడానికి వెనక ఓ రహస్యం ఉంది. ఎందుకంటే ఆ సౌండుకు అందరి చూపు నా కాళ్ళ మీదే పడి నేను కొత్త చెప్పులేసుకున్నానని తెలుస్తుందని. గప్పట్ల మా దోస్తానలో ఆళ్ళ అడుగులు సౌండు విని ఎవరోస్తున్నారో గుర్తు పట్టేటోల్లం.

అడుగులో అడుగేసుకుంటు గల్లీకి అటు పక్కన ఇటు పక్కన అందరిండ్ల ధర్వాజలను మావిడాకు తోరణాలను ముగ్గులను చూసుకుంటూ చూసుకుంటూ ఆరిఫ్ గానింటికి చేరుకుంటోన్ని. ఆల్లమ్మ చేతిలో బచ్చాలు పెట్టి ఆడు నేను ఫిలిప్స్ టూ ఇన్ వన్ టేప్ రికార్డర్ లో సజ్జద్ అలీ, అత్తవుల్లః ఖాన్ పాటలు ఆస్వాదిస్తూ ఆళ్ళ తెల్ల నవారు మంచం లో వెల్లికల పడుకొని కాలుమీద కాలేసుకొని ముచ్చట పెట్టుకుంటు గడిపేటోల్లం.

ఏ పండగకైన మా చిన్నమ్మ వాళ్ళింటికి పోతే మాత్రం మా చిన్నమ్మ మమ్మల్ని సూసుకునే తీరు పండగ జరుపుకునే విధానం నాకు మస్తు ఇష్టం. ముల్కనూరు నుండి కొత్తకొండ చేరుకొని, అక్కడినుండి ధర్మారం. గ్రామం లోపలికి చేరుకోవాల్నంటే మూడు కిలోమీటర్ల నడక ప్రయాణం.

ఆ గ్రామం మొత్తం కూడా చాల పద్దతిగా ఒక వైపును పూర్తిగా కొండలు ఆక్రమించుకొని, ఆ కొండలపై బారులు తీరిన ఊడలతో కూడిన పెద్ద పెద్ద వృక్షాలు కమ్ముకొని చిక్కటి అడవిలా తోస్తే. ఆ ఆడవి మొత్తం మాదే అన్నట్టు రక రకాల జంతు పశు పక్ష్యాదుల రాజ్యం. మరో వైపంత పచ్చని పంట పొలాలు, అక్కడక్కడ నీటి తూములు, చిన్న చెరువు, ఇవన్ని కాదన్నట్టు పెద్ద పెద్ద బోరు బావులు. ప్రతి పొలం గట్టుకు ఆనుకొని చిన్న పాక. పాక పక్కన దూలంకు కట్టేసి పెట్టిన ఆవులు, ఎడ్లు, గేదెలు, పొలం గట్లకు కొండకు మధ్యన చిన్న మట్టి బాట. బాటకు ఇరువైపులా జామాయిల్, మామిడి, వేప, తుమ్మ, తాడి, మర్రి, శివశింతకాయ, చెప్పుకుంటూ పోతే తెగలేనన్ని పేర్లతో ఉన్న చెట్లు.

ఆ పల్లె మొత్తం మీద గట్టిగ లెక్క పెడితే యాబై ఇండ్లు ఉంటె ఎక్కువ. రేపు పండగ అనంగా మేము గియ్యాల్నే పోయేటోల్లం. తెల్లార గట్ల కోడి కూయక మునుపే మా చిన్నమ్మ లేచేది. ఇల్లు ఇంటి చుట్టూ పక్కన ఊడ్చి అలుకు చల్లల్నంటే రెండు మూడు గంటల పైమాటే ఇంకా ముగ్గుల సంగతి చెప్పేడిది ఏముంది.

నేను మా చిన్నమ్మ కొడుకులు ఇద్దరు తమ్ములని వేసుకొని పొలం గట్లని ఏలడానికి పోయేటోల్లం. చిన్నమ్మ వాళ్ళ ఇంటి ముందే రెండెకరాల శెలక అందులో ఒక్కోసారి ఒక్కో పంట. పత్తి, కంది, బబ్బెర, పొద్దు తిరుగుడు పోయినప్పుడల్లా ఏదో ఒక పంట గాలికి వయ్యారంగా ఊగేటిది. పొద్దు తిరుగుడు పంట గనక ఉంటె ఇగ సూసుకో పొద్దంతా ఆ పొలంలోనే.. ఆ గ్రామంలోని పంట పొలాల్లో, పండ్ల తోటల్లో మనసుకు అందని ఏదో వింత మర్మం దాగి ఉండేది. దానిని చేధించేందుకు యోగిలా సాగేది నా పరిశోధన. ఒక్కో సెకను ఒక్కో ఆకు మీద. లతలా పెనవేసుకున్న తీగల అందం ఓ లయలా నన్ను అల్లుకునేవి. విచ్చుకునే ప్రతిపువ్వు రంగులు నాపై చిలికిన భావం. వర్షం పడితే పాదాలు పరుగులు తీసేవి బంగారు రంగు బురద తూములోకి. పోటా పోటిగా అందరు కలిసి అమాంతం గాల్లోకి లేపి చాతి వరకు మునిగేటి ఆ బురద తూములోకి విసరడం. వీస్తున్న ఈదురు గాలులు విసురుతున్న వర్షం. అల్లరిగా సాగే బురద ఆటలు. ముక్కు పుటలను అదరగొట్టే పచ్చి వాసనకు బుక్కల కొద్ది మింగేయ్యాలన్నంత రుచి బురద మట్టికి చేరేది. ఎలాగో తినలేను కాబట్టే చీల్చుకుంటూ చీల్చుకుంటూ మునుగుతూ తేలుతూ బురదని ఆస్వాధించెవొన్ని.

తల పైకెత్తి పడుతున్న వర్షపు బాణాలు జివ్వు మని గుచ్చుతున్న కళ్ళు తెరిచి నీటితో మునిగిన ఆ నీలాకాశాన్ని తనివి తీరచూడాలని ఎంత తాపత్రయమో. ఒక్కోసారి తూఫాను వేగాన్ని సైతం చేతులు చాచి అక్కున వాటేసుకునే టోన్ని. ఆకాశం నేల నిండా మునిగి పచ్చని సముద్రపు అల నను అమాంతం ముంచేస్తున్న తలపు.
ఏంటో అనుభవిస్తున్నప్పుడు ఆ క్షణమే శాశ్వతం ఎందుకో ఎప్పటికి ఆ క్షణం లోనే ఉండిపోవాలని పిచ్చిగా కోరుకునేవాన్ని..

చిన్నమ్మ వాళ్ళింటి వెనకాల మధ్యలో పెద్ద చింత చెట్టు. దాని మొదట్లో కట్టెల పొయ్యి. ఆ చెట్టు చుట్టూ విశాలమైన వాకిలి. ఆ వాకిలికి ఆనుకొని లెక్క లేనన్ని ఆకు కూరలు కాయగూరలు పూల చెట్లు, పది పన్నెండు కోళ్ళు, ఒక కుక్క దాని పేరు మల్లేశం. దానికి తోడు రెండు పిల్లులు. ఇవ్వన్ని కుటుంబ సభ్యులు. ఇవేనా కాదు మెరిగలు వేసి పిలిస్తే లెక్కలేనన్ని పిచ్చుకలు పక్కకొచ్చి వాలి ముచ్చట పెట్టుకునేటివి.

ఆ గ్రామంలో ప్రతి ఇంటి ముందు రెండు లేక మూడు నీటి గోలాల్లో ఎప్పుడు నీళ్ళు నింపి పెట్టె వాళ్ళు. నాకు ఊహ తెలిసాక తెలిసిన విషయం ఏంటంటే ఆ గ్రామంలో లెక్కలేనన్ని ఎలుగుబంట్లు. ఒకటో రెండో చిరుతలుండేవి. ఎండాకాలంలో అవి నీళ్ళకోసం ఇళ్ళలోకి వచ్చేవని. కొండెంగ కోతులు మాత్రం నన్నెప్పుడు భయపెట్టేవి. ఇవేనా ఇప్పుడు జూ పార్కు లో చూస్తున్న రకరకాల జంతువలన్ని కూడా స్వేచ్చగా మా ముందే బారులు తీరి కేరింతలేసేవి.

బాబాయి కొత్త కుండ, పచ్చడి సామాను పట్టుకొస్తే చిన్నమ్మ పచ్చడి చేసే పనిలో పడితే అమ్మనేమో బచ్చప్పాల పనిలో పడేది. బాపు, బాబాయి ఓ పక్కన మంచం ఏసుకొని ముచ్చట పెట్టుకుంటుంటే, అమ్మ చిన్నమ్మ, నేను, అక్కయ్య, తమ్ముళ్ళు అందరం బచ్చప్పాలు తినుకుంటూ మస్తు బిజీగా ఉంటుండే. మా అన్న మా బాపమ్మ పక్కన కూసోని ఊరు కథలన్నీ మంచిగా ఇనేటోడు..

ఏంటో పాయలు పాయలుగా ఆలోచనలన్నీ సుదూర తీరాలన్నీ చుట్టేసింది.గతించిన అనుభూతుల జ్ఞాపకాల మూటను మరో సారి విప్పడానికైనా… కనీసం నెమరు వేసుకున్నకొద్ది తీగలా అల్లుకుపోయే తెగలేనన్ని ఆనందాల గుర్తులను గుర్తు తెచ్చుకోడానికైనా… ఇలాంటి పండగలు అవసరమే. పండగ చరిత్ర దేవుడెరుగు ఆ పండగ రోజుల్లో ముడిపడిన విషయాలే నాకు తెలిసిన చరిత్ర.

పట్నం ఏలడానికొచ్చిన ఇన్నాళ్ళకి, ఇప్పటికి కూడా నాకు ఉగాదంటే ఇష్టమే ప్రతి పండగకి ఏదో ఒక ఫేస్ బుక్ ఫ్రెండ్ ఇంట్లో హాజరు పడాల్సిందే.. కొత్త ఆనందాలకు నాంది పలకాల్సిందే.. గడిపిన రోజు మరో యుగానికి చరిత్రగా మిగాలాల్సిందే… ఇగో గిదే నేను అనుభవించి, అనుభవిస్తున్న పండగ ముచ్చట.

Categories: కథనం

శివరాత్రి, ఆరిఫ్ గాడూ, నేనూ..!

ఇంగ రేప్పొద్దున పండగని తెల్వంగనే మా ఇస్కూలు దోస్తులవందరం కట్ట గట్టుగొని సైన్సు టీచర్ రాకపోయేసరికి కితాబులను సంచిలోకి ఎట్టి కిలాసు గలాసు లేదన్నట్టు కూసోని ప్లాన్ల మీద ప్లాన్లు ఏసుకొని గుండం వాడ అఫ్జలు, అర్షద్, డబ్బకాడి అమ్జదు దుదేకుల అఫ్సరు, కాకతీయ కాలని రవిగాడు, ఆరిఫ్ గాడు, ముడ్డబ్బాల కాడి హరి గాడు, ఇంకా నలుగురవైదుగురం ఒక్క ముచ్చటకొచ్చినం రేపు మాత్రం ఫుల్లుగా శివరాత్రి పండుగను పండగ జేసుకొవాల్నని. ఇంకేవుంది రవి గానికి ఆరిఫ్ గానికి సైకిల్ ఉండనే ఉండే ఇంగ నాకేం రంది ఊరంతా తిప్పి ఆల్లే ఇంట్ల పడగొడ్తారు అనుకొని ఇగ నేను గూడ సై అన్న.

ఆ రోజుకూడా రోజులెక్కనే తెల్లారింది. లెక్క ప్రకారం అయితే ఇస్కూల్ లేదు ఇంకో గంటైన పడుకునే హక్కుంది. ఆ హక్కును లాక్కుంటూ మా అమ్మ ఒకటే లేపుడు పండగ పూట ఇంత సేపు పడుకుంటే ఎట్లా అని. ఇంగ సరేనని లేచే సరికి అప్పటికే ఇంటి ముందు ఇంటెనకాల పండగ కళ కొట్టోచ్చింది. మా ఇళ్ళు పేరుకు పేదిళ్ళే అయినా మా అమ్మ సూసుకునే తీరుతో అదోక కళాకండం. భద్రకాళి చెరువు గట్టు కానుంచి చిన్న బకీటు నిండా మా అన్న ఆవు పేడ పట్టుకొచ్చేటోడు.

మా ఇంటెనకాల ఆ మూల నుండి ఈ మూల వరకు ఎంత పెద్ద అడుగులేసిన పదడుగులు తగ్గక పోయేటిది దగ్గర దగ్గరగా పరవాలేదనిపించే విశాలం. ఇంటెనకాల బావి, దానికి ఆనుకొని వేప చెట్టు దాన్ని అల్లుకొని చిక్కుడు చెట్టు మిగిలిన విశాలమైన వాకిలినంత ఊడ్చి పేడతో అలుకు చల్లి అవసరమైన చోట ఎర్ర మన్నుతో నెలలో నుండి పుట్టుకొచ్చిన గోడ మొదల్లో జానెడు మందంతో చక్కగా అలికేది. తెల్లని గోడకు ఆ ఎర్ర మన్ను పట్టితో జరి అంచుచీర కట్టుకున్న కేరళ అమ్మాయిలా అనిపించేటిది. ఇక అలకడంతోనే పని ఐపోయింది అనుకుంటే ఎట్లా గడపలను పసుపుతో పుదించి, అప్పటికి మా గడపలకి రంగు పేంటింగ్ వెయ్యలేదు నా మూరేడుతో రెండింతలుండే గడపే సాక్ష్యం మా అమ్మ సృజనాత్మక కథకి.

అప్పుడప్పుడు నేనేమైన అందంగా వంకర్లు తిరిగిన పూల గుత్తులను పేపర్ పై పరిస్తే దాన్ని ఎవ్వలైన పొగిడితే మాత్రం అదంతా మా అమ్మ చలువే. ఇక అందంగా గడపను బియ్యంపిండి పసుపు కుంకుమలతో చక్కగా పూర్తి చేసి ఇక కన్ను వాకిలి మీద పడేది. వాకిలి తనకో క్యాన్వాస్ మునివేళ్ళు కుంచెలయ్యెవి. సుద్దతో వేళ్ళు సుతారంగా తిప్పుతుంటే సుద్ద నేలను ముద్దాడుతున్నట్టు మా అమ్మ వేళ్ళు నేలకు చెక్కిలిగింత పెడుతున్నట్టు ఆ చేక్కిలిగింతేదో నాకు కలుగుతున్నట్టుండేడిది. మా అమ్మకి రక రకాల రంగులంటే ఇష్టం కచ్చిగా చెప్పాల్నంటే రంగులంటే పిచ్చి. తెల్లగా అల్లుకొని వాకిలి నిండా పరుచుకున్న ముగ్గులో కనకాంబరం, చిలకపచ్చ, ఆకు పచ్చ, నెమలి కంటపు నీలి, లేత పచ్చి పసుపు పచ్చ, నాలికపై మంత్రంవేసినట్టుండే అల్లనేరేడు పండు రంగు, పారాణి, ఇలాంటి రంగులంటే తనకి పిచ్చి ఇష్టం. అవ్వన్నీ కూడా ఆ ముగ్గులో అందంగా ఆకులో ఆకుల ముగ్గునిండా అలుముకుంటే అది నన్ను అదుముకునేది. మా దోస్తులెవరైనా పండగ పూట ఇంటికొస్తే మా ఇళ్ళు చూసి మస్తు పరిషాన్ ఐతుండే ‘పరిషాన్ లో పతంగులు ఎగిరేస్తుండే (తీవ్ర సంభ్రమాశ్చర్యం కలిగినప్పుడు మా దోస్తులమనుకునే ఊత సామెత)’ ఏ పండగైన మా ఇంట్లో రెండు పండగలు ఒకేసారి జరుగుతున్నట్టు ఉండెడిది ఆ ముగ్గుతో.

రేడియోలో శివో మహేశ్వరశ్శంభుః పినాకీ శశిశేఖరః వామదేవో విరూపాక్షః కపర్దీ నీలలోహితః శంకరశ్శూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభః అనుకుంటూ వినిపించే శివాష్టకం తో మొదలయ్యేది నా స్నానం. పండగలోచ్చినప్పుడు గోరువెచ్చని నీళ్ళలో పచ్చని వేపాకు పరుచుకోవాల్సిందే. స్నానం పూర్తి కాంగనే తడి కలిపిన ఊబిది తీసుకొచ్చి నుదుట అడ్డంగా బొట్టు పెట్టేది. అప్పుడు మొదలయ్యేది బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మలభాసిత శోభిత లింగమ్ జన్మజ దుఃఖ వినాశక లింగం తత్-ప్రణమామి సదాశివ లింగమ్ శుద్దంగా లీలగా వినిపిస్తున్నా గాత్రానికి అప్పుడే పాపాలని కడిగేసుకొని పునీతుడని అవుతున్నట్టు మది తేలికవుతుండే.. మా అమ్మ ఖచ్చితంగా ఆ రోజు ఒక్క పొద్దు ఉంటుండే.

మేము ఆకలికి ఓర్సుకోలేమని మా కోసం సేమియా పాయసం సగ్గుబియ్యంతో పరమాన్నం అన్నం ఆక్కూర చక్కగా వండిపెడితే పొట్ట నిండుగా తృప్తిగా తినేటోన్ని. మేమెందుకు ఉపవాసం ఉండకూడదనే ప్రశ్నకి మీ అందరి తరుపున నేనొక్కదాన్ని ఉంటున్న ఆ శివయ్య ఏమనుకోడు అనేది. నెమ్మదిగా బయటికొస్తుంటే జంగాయన జోలె పట్టుకొని వచ్చేటోడు పాట పాడుకుంటూ ఏమి సేతురా లింగా ఏమి సేతురా. గంగ ఉదకము తెచ్చి నీకు లింగ పూజలు సేద్దామంటే.. అని కమ్మగా సాగేది. ఆయనతో నాకు మంచి స్నేహం ఆ స్నేహం గురించి పెద్ద కథే అవుతుంది. శివుడి ప్రస్తావన రాగానే ఎప్పుడు నాకు ఈ పాట మెదిలేది ఊహ వచ్చాక శివుడ్ని కూడా లీనం చేయగల శక్తి ఆ గొంతుకలో ఉందని గట్టిగ నమ్మి ఆ గొంతుక ఎవరిదో అని పరిశోధించి ఆ గాత్రానికి దాసుడనయ్య ఆ గాత్రం మరెవరిదో కాదు డాక్టర్ బాలమురళి కృష్ణ గారు. ఈ మధ్య కాలంలో నన్ను వెంటాడే శివ గీతం భరణి గారి ఆట గదరా శివ ఆట గధ కేశవా.. సంగీతం నిజమైన భక్తి తత్వాన్ని మేలుకొల్పుతుందని గట్టిగ నమ్మే వాళ్ళలో నేను ఒకడ్ని.

శివుడి గురించి కథలు కథలుగ ఎన్నో చదివిన మనసుకు ఏ భావన కలగక పోయేటిది ఎందుకో వెయ్యి స్థంబాల గుళ్ళో మాత్రం నాకు తెలీకుండానే ఏవో అంతర్గత ప్రకంపనలు ఉప్పొంగేవి ఆ ప్రశాంత వాతావరణమో లేక ప్రతిధ్వనించే ఓంకార నాధమో లేక కమ్మగా వినిపించే గీతమో ఏమో ఏదో రకంగా మనసు త్రుప్తి పడుతుండే.

ఇంకేముంది చూస్తుండగానే ఆ ముచ్చట ఈ ముచ్చట పెట్టుకొంగానే సాయంత్రం అయ్యేటిది చీకటి బడేటిది. నేనైతే ఆ రోజు ఎదురు చూసేది ఆ ‘సాయింత్రం’ కోసమే. అప్పుడు నెమ్మదిగా నిన్న సైకల్ మీద బుట్టలో పెట్టుకోని అమ్మేటాయన దగ్గర కొన్న కందగడ్డలు సంచిలో నుండి తీసి శుబ్రంగా కడిగి రాతెండి గిన్నలో నీళ్ళు పోసి కొంచెం ఉప్పు వేసి గిన్నె నిండుగా కందగడ్డల్ని వేసి మూత పెట్టి కట్టెల పొయ్యి మీద ఉడికించేది. నేను మాత్రం పొయ్యి మొఖం, గిన్నె మొఖం సూసుకుంటూ ఎప్పుడెప్పుడు గిన్నె మీద మూత పొంగుతో గణ గణ మంటదో అని. ఇగ ఉడికిందని తెల్వంగనే నెమ్మదిగా నీళ్ళు వంపి ఇష్టీలు బెషన్లోకి దింపేది.

సుతారమైన పొగలు కక్కుతుంటే దేవునికి దణ్ణం పెట్టి మా అమ్మ ఒకటి రుచి చూసి పొద్దు ఇడ్శేధీ. ఒక్కొక్కరికి చిన్న కటోర(గిన్నె)లో రెండేసి ఇస్తే నేను మా అన్న మా అక్క వరుసగా సంచులు పరుచుకొని సకిలం ముకిలం పెట్టుకొని కూసోని ఓ సరికొత్త రుచిని సంతరించుకున్న మెత్తగా ఉడికిన కంద గూగం నెమ్మదిగా తింటుంటే మనసుని ఎక్కడికో తీసుకెళ్ళేది. కందగడ్డలు తినడం కోసమైనా శివరాత్రంటే నాకు మస్తు ఇష్టం. మా చిన్నమ్మ మాత్రం నూనెలో వేంపి చేసేది అది మరో అధ్బుతమైన రుచి. కాలక్రమేణా ప్రపంచానికి దూరంగా పరిస్థితులని కాలదన్ని తీసుకున్న రెండు నిర్ణయాల్లో ఒకటి ఆత్మహత్య రెండు ఇంట్లో నుండి పారిపోవడం మొదటిది ఎన్నో సార్లు ప్రయత్నించిన ధైర్యం చాలలేదు మనిషికి బతకడానికన్న చావడానికే ధైర్యం ఎక్కువ కావాలని అర్ధమయ్యింది.

ఇంట్లో నుండి పారిపోయి మా పరిస్థితులను చక్కదిద్దేంతటి ధనం మూట గట్టుకొని రావాల్నని ఇంట్లో నుండి పారిపోయి తెలీకుండా బైరాగులతో కలిసి పుష్కర స్నానానికి వెళ్ళినప్పుడు కంద మూలతో, పచ్చి దుంపల్ని ఉడికించుకొని కడుపు నింపుకున్నాం. ఆ తర్వాత మరో సారి ఇక ఎప్పుడు తిరిగి రాకుడదని పారిపోయినప్పుడు వైష్ణవ సాదుగణం తో రాష్ట్రాలు ఊళ్లు పల్లెలు తిరిగినపుడు కూడా ఇలాంటి దుంపలతో చేసిన వంటలతో కడుపు నింపుకున్నాం. తిండికి మించిన నీఘూడ సత్యాలే నను నిలబెట్టాయి ఒక రకంగా చెప్పాలంటే తత్వం తెలియకపోయినా శివ తత్వం కృష్ణ తత్వం నను ఉరి కొర నుండి తప్పించాయి. ఆ ప్రయాణం మిగిల్చిన ఆత్మీయులు ఒక రకంగా ఇప్పటికి నాకు బలం. మనిషిలా నన్ను మిగిల్చింది వారే. జీవితంలో నేను ప్రభావితమైన ప్రయాణంలో ఈ రెండు తత్వాలతో కూడుకున్న తత్వ ప్రయాణం. అదో తెగని పెద్ద కథ ఆ పారిపోవడం ఆ ప్రయాణాలు ఇంట్లో తెలీకుండా చెప్పిన సాకులు. ఇక ఆ కథని కంద గడ్డల్ని అలా ఉంచితే. నెమ్మదిగా జిహ్వను త్రుప్తి పరుచుకుని కంధల్ని పూర్తి చేసుకున్న టైం కి ఇంటి ముందు ఆరిఫ్ గాని చిన్న సైకిల్ బెల్లు మోగేది. అమ్మ నేను గుడికి బోయ్యోస్తా మా దోస్తులందరు వస్తాండ్లు మల్ల మధ్య రాత్రికోస్తా అనిచెప్పి బయటపడేటోన్ని.

ఆరిఫ్ గాని సైకిల్ ముందు హేండిల్ ని పట్టుకొని కూసుంటే ఆడు గాల్లో తీసుకెళ్ళేటోడు నెమ్మదిగా మా సైకిల్ భరత్ గాని మార్వాడి దుఖానం దగ్గర ఆగేది. ఇక నా జేబుల చిల్లర పైసలక్కుడా స్థానం లేదని తెలిసిన ఇషయమే. నన్ను మాత్రం సుసుకునేది ఆరిఫ్ గాడు రవి గాడే. ఇక భరత్ గాని దుకాణం లో రూపాయికి ఒక పొట్లం చొప్పున ఐదారు పెరుగు మూటలు కట్టించుకొని వర్కు సంచిలో ఏసుకొని ఇంకా కొన్ని వర్కు సంచుల్ని బతిలాడి అడుక్కొని బయల్దేరే వాళ్ళం.

వెయ్యి స్థంబాల గుడికి దగ్గరవుతుంటే అందమైన పట్టు చీరలు, కొత్త బట్టలు వేసుకున్న ఆడోల్లు పిల్లలు వాళ్ళను వరసగా నిలబెడుతూ జనం రద్దీని కంట్రోల్ చేస్తూ పోలిసోల్లు రోడ్డు మీద వాహనాలు ఆగకుండా కర్రలతో దబాయిస్తూ ముందుకు పంపించే ట్రాఫిక్ పోలిసోల్లతో కలిసి చుట్టూ విపరీతమైన రద్దీ ఆ సంబరపు అస్తిత్వాన్ని అరిచి మరిచి చెబుతున్నట్టు

మైకు గొట్టం నుండి వినిపించే భక్తి పాటలు ఒగ్గు కథలు బుర్ర కథలు నాటకాల శబ్దాలు. చీకట్లను చీల్చి చెండాడే రంగు రంగుల మిలుకు మిలుకుమనే యమ్ యమ్ ఖాన్ టెంట్ హౌస్ లైట్ లు తోరణాలుగా రోడ్డుకి వీదులకి ఇరుపక్కల. రోజు నా చోటులాగా నా సొంతం అన్నట్టు తెగ తిరిగి ఆడుకునే గుడి ఒక్కసారిగా ఎవరో అక్రమించేసుకొని ప్రశాంతంగా ధ్యాన ముద్రలో లీనమయి ఉండే దేవాలయాన్ని మూకుమ్మడిగా ఊపిరి తీసుకోలేనంత ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్టు ఒక బికర దృశ్యం అక్కడ అలుముకునేది.

ఎట్లో గట్ల లైన్ ల నిలబడి లోపకి చేరుకున్నాం మేము కలుసుకోవల్నని అనుకున్న జాగాలోనే మా దోస్తుగాల్లందరు కూసోని ముచ్చట్లు పెట్టుకుంటాడ్లు. కాసేపు బుర్ర కథ, ఇంకాసేపు నాటకం, ఆ తర్వాత మా బాబాన్న (కొప్పుల రాజేందర్) మిమిక్రీ, ఆయన దోస్తులు పాడే పల్లె పాటలు తల్లి పాటలు ఇనెంత సేపు ఇని కిక్కిర్సిన జనాలను వాళ్ళు అప్పజేప్పుకునే మొక్కులను చూస్తూ గడిపి. అప్పుడు లైన్ లోకి దూరేవాళ్ళం అదే ఆ పులిహోర ప్రసాదం కోసం. నాకని ఒకసారి మా అమ్మకని ఓసారి మా అక్కకని మా చెల్లకని ఎవరెవరి పేరు చెప్పో ఒకటికి రెండు సార్లు లైన్ లో నిలబడి మా కాలి వరకు సంచులని పులిహోరాలతో నింపుకొని నెమ్మదిగా బయట పడేవాళ్ళం.

అక్కడి నుండి సైకిళ్ళ మీద పద్మాక్షమ్మ గుట్ట కాడ రావణాసురుణ్ణి పేల్చే జాగకు చివరన శివాలయం ఉంది. అక్కడకూడా ఆ రోజే ఏ రోజు లేనంత ఎక్కడ లేనంత జనం. మా కన్ను మాత్రం కొబ్బరికాయలు కొట్టే నంది దగ్గరే తలో కొబ్బరి చిప్ప జెజిక్కిచ్చుకొని సంతోషంతో బయటికొచ్చి ఇక నెమ్మదిగా చల్లని గాలులతో పద్మాక్షి గుట్ట మీదకెక్కి చీకట్లు అలుముకున్న సిటీ మధ్యలో అక్కడక్కడ మిలుకు మిలుకు మంటూ వెలుగుతున్న వీధి దీపాలను చూస్తూ తల కొంచెం పులిహోర నెమ్మదిగా తింటూ కాసేపు సేద తీరేవాళ్ళం. చర్చి లో కేకు, మసీదు లో మిటాయి, గుళ్ళో పులిహోర ఇదే అప్పట్లో మాకు తెలిసిన మతం. పులిహోర ఒక్క దఫా పూర్తి చేసి అందరి జేబుల్ల పైసలు లెక్క బెట్టుకొని ఇక టాకీస్ మీదకు ఎగబడడం. మేము సూడకుండా మిస్సయిన సినిమాలని ఒక్క పెట్టున రాత్రంతా సోలుగుతూ కండ్లు నలుచుకుంటూ ఒకటే సూసుడు మధ్య మధ్యన పులిహోరలో పెరుగు ముద్దా వేసుకొని ఒక్క బుక్క పులిహోర అంచుకు కొబ్బరి ఇగ జూసుకో పండగే పండగ. సినిమా ఐపోడమే ఆలిస్యం వీధులన్నీ సైకిళ్ళ మీద బలాదురుగా తిరుగుతూ శివరాతిరికిన్యాయం జేశేటోళ్ళం..

మొన్న పొద్దున్నే అమ్మ ఫోన్ చేసింది లేచినవా? స్నానం జేసినవా అవ్వ ( మా అమ్మ నాలో వాళ్ళ అమ్మని చూసుకుంటుంది అందుకే ప్రేమగా నన్ను అవ్వ, కన్నా అని పిలుచుకుంటది) ఇయ్యాల అసలే శివరాత్రి. అని చెప్పేంత వరకు కూడా తెలిలేదు ఆ రోజు పండగని. మనిషిని పరిస్థితులు ఎంతగా చుట్టు ముట్టి మనల్ని మనలోనే తప్పిపోయేలా చేసాయో అర్ధమయ్యింది. ఒక ప్రశాంతమైన పరిస్థితినుండి అందమైన జ్ఞాపకాలనుండి ఆధ్యాత్మిక చింతన చేతన నుండి ఎంతో దూరం నెట్టుకున్నానని స్పష్టంగ తెలిసొస్తుంది. మా దోస్తు వైష్ణవ సాధువు చెప్పిన మాటోటి గుర్తొచ్చింది. పరిస్థితులు ఎప్పుడు మన మీద కన్నేసి ఉంచుతాయి.

మనకు తెలీకుండానే మనసును మాయ ప్రాపంచికంలోముంచేస్తుంది. ఎంతటి విపత్తు వచ్చిన మనసెప్పుడు బ్యాలెన్స్ గ ఉంచుకుంటూ ఎప్పుడు భగవత్ చింతనలో అతి సాధారణమైన జీవన విధానాన్ని అలవరుచుకొని ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చెయాలని. అది నేను చేయట్లేనని చేయలేని బద్ధకంలో కూరుకు పోయానని కూడా ఇప్పుడు మరింత స్పష్టంగా తెలిసోస్తాంది.

Categories: కథనం

నేను పోగొట్టుకున్న కొన్ని సంబరాలు…!

పూర్తిగా ఆవహించిన చీకట్లో వెలుగుతున్న ముసలి దీపం ముందు పెట్టుకొని మట్టి నేలపై సంచి పరుచుకొని పుస్తకాలను ముందేసుకొని, ఇక అన్నయకి తెలియకుండా తన తెల్ల నోటు బుక్కులోనుండి చింపుకున్న ఓ మూడు జంట కమ్మలు నెమ్మదిగా మడతలు పెడుతూ అరచేయి సైజు లో కత్తిరించుకొని పెన్సిల్ తో తోచిన బొమ్మలు గీయడం మొదలుపెట్టా.  ఓ ముప్పై వరకు తయారయ్యాక ఒక్కో బొమ్మకి పక్కన వదిలిన ఖాళీస్థలం లో నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇట్లు మీ నేస్తం రఘు అని రాసి రేపటికి సిద్ధంగా ఉంచుకోనేవాన్ని.

ఎంత ఇంగ్లీష్ పండగైన మా బోటి పిలగాండ్లందరికి చిన్నపాటి పెద్ద పండగే.. అప్పటికి ఇంట్లో కరెంటు లేదు. మా అన్న చేతికుండే నంబర్ల గడియారంలో పన్నెండు పడగానే తెలిసేది హ్యాపీ న్యూ ఇయర్ వచ్చిందని. నాకు ఊహ వచ్చేవరకు గ్రీటింగ్ కార్డులు కొన్న దాఖలాలు ఎంతకి లేవు. ఎప్పుడు నేను చేతితో గీసిన బొమ్మలే పంచేవాన్ని.
ఈ నూతన సంవత్సరం మనందరి జీవితాల్లో వెలుగుని ప్రసాదించాలని కోరుతూ అనే వాక్యం మా ప్రిన్సిపాల్ మేడమ్ గారు ప్రతి ఏడు మాకందించేవారు. ఎన్నో ఏళ్ళకి గాని మా ఇంట్లోకి కరెంటు వెలుగు రాలేదు. చిత్రం ఏంటో గాని మా అమ్మ తయారు చేసే ఒత్తి దీపాలు గొప్ప నేస్తాలు. ఎప్పుడైనా గాజు దీపం కొనడానికి చౌరస్తా కెల్తే నా సంబరం అంబరాన్ని తాకేది. కొత్త సంవత్సరం వస్తే ఇంట్లోకి చిన్న పాటి కిరోసిన్ గాజు దీపాలు కొనేది. అందులో ఒక దీపం తప్పనిసరిగా నాదే. వెలుతురిని ఎక్కువ తక్కువ చేసే వీలు గల చిన్న చక్రం కడ్డితో తెగ ఆటలాడే వాణ్ని. గాజు గోడల గదిలో బంది అయిన ఆ చిన్ని దీపం చమ్కీల ముసుగులో ముస్తాబైన పెళ్లి కూతురులా సిగ్గు పడుతున్నట్టుగా ఉండేది. పాపం ఆ సిగ్గులు నా కంట పడకుండా గాజు గోడలు ఆపలేకపోయేవి ఎలా ఆపుతాయి వాటికి మా అమ్మ మసి పట్టనిస్తేగా….
అప్పట్లో మా దోస్తుల్లో కొందరికి చీకటంటే భయం. చీకట్లో దయ్యాలు ఉంటాయని, పీడ కలలోస్తాయని, నాకూ చీకటంటే భయమే బాపు తాగోస్తాడని. కాని నిద్ర పుచ్చే అమ్మ ఒడిలో ఆ భయం కూడ బలాదూర్. నాకు తెలిసి మనిషిని మించిన దయ్యం కాని, దేవుడు కాని లేడని నా నమ్మకం. అందుకేనేమో ఏ దయ్యం కథలు నన్ను భయపెట్టలేక పోయేవి.
అన్ని రోజులకన్న ఆరోజెందుకో ఎవరు లేపకుండానే మెలకువ వచ్చేది. లేచి చూసే సరికి అమ్మ అక్కయ్య రంగు రంగుల ముగ్గులేస్తూ దర్శనం ఇచ్చేవారు. యదావిధిగా స్నానాలు కానిచ్చి చక్కని పోడి బట్టలు తొడుక్కొని పుస్తకాల బ్యాగును భుజాన వేసుకొనే టైం కి చిన్న గిన్నెలో రాత్రి బాపు తెచ్చిన బాదుష మిటాయి కొద్ది కొద్దిగా తింటుంటే ఇది అసలు న్యూ ఇయర్ అంటే అనిపించేది అంత తీయగుండేది. ఇక చక చక స్కూలుకి బయల్దేరడమే ఆలస్యం ఎదురుపడే నా బోటి పిల్లలంతా ఒకటే చెప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ అని. దానికి థాంక్యూ విష్ యూ ద సేమ్  అని నేను… స్కూల్ కి చేరుకోగానే ఆ రోజు స్కూల్ లో యే  టీచర్ బెత్తం పట్టుకోదు. దానికి తోడు ఆరోజు ఒక్క పూటే ఇంకేం ఇక మాదే లోకం అన్నట్టు ఒకటే అల్లరి.  ఒకరికొకరం గ్రీటింగులు ఇచ్చిపుచ్చుకున్నాక అప్పుడు తీసుకోచ్చేది మా ఆయా క్రీమ్ బిస్కెట్లు, స్కూల్ బెల్లు మోగడమే ఆలస్యం కట్ట గట్టుగొని పిల్లలమంతా వీదిలన్ని నడుచుకుంటూ స్కూల్ వొదిలేసిన మా పాత టీచర్ల ఇళ్ళకు పోయి కలిసేవాళ్ళం. తిరిగి తిరిగి మ్యూజికల్ గార్డెన్ కి గాని, సినిమాకి గాని, జూ పార్క్ కి గాని వెళ్ళే వాళ్ళం.
రాను రాను రంగు రంగు బొమ్మల గ్రీటింగ్ కార్డులు రాజ్యమేలడం మొదలవడంతో అసలీ నూతన సంవత్సరం ఎందుకోస్తుందా? అని బాధ పడిన సందర్బాలు కూడా ఉండేవి. అందరు నాకు తీసుకొచ్చేవారు గ్రీటింగ్ కార్డు లు. నాకు ఏం చేయాలో తోచక తెల్ల కాగీతం మీద అందంగా వారి పేరు గీసిచ్చేవాన్ని. అది నాకు చిన్న తనంగా అనిపించినా రాను రాను అవే పేర్లు టీచర్ల దగ్గర ప్రిన్సిపాల్ మేడమ్ దగ్గర మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ రకంగా చూస్తే ఏమి లేని బీదరికం కూడా ఎంతో ఆనందాన్ని మిగుల్చుతుందని అర్ధమయ్యింది. ఇంట్లో ఎప్పుడైనా బొమ్మలు గీసుకుంటూ కూర్చుంటే మా బాపమ్మ మా అమ్మ చూసిమురిసిపోతుండే. ఆ తరువాత తరువాత న్యూ ఇయర్ వస్తుందంటే చాలు నాకు స్కూల్ లో వీధిలో మస్తు గిరాకి దాదాపు ఒక యాబై పై చిలుకు పేర్లు రాసేవాన్ని ఊరికే మాత్రం కాదు అప్పటి నేను గీసిచ్చే బొమ్మల ఖరీదు రెండు రూపాయల నుండి ఐదు రూపాయలవరకు ఉండేది వచ్చిన మొత్తంతో గ్రంధాలయం రుసుము కొత్త కథల పుస్తకాలు, కొన్ని నెలలకు సరిపడా పోస్ట్ కార్డులు నా సంచిలో ములిగేవి..
కాలంతో పాటే సంబరాలు కూడా మారుతూ వచ్చాయి దానితో పాటే నేను కూడా..
పోస్ట్ కార్డుల కాలానికి తెర దింపుతూ ప్రత్యక్షమైన టెలిఫోన్ బూత్ లు, వాటి దాటుకుంటూ ఇంటర్నెట్ లు, జేబులో సెల్  ఫోనులు. మార్పు ఊహించిందే వెలుగు కూడా ఊహించిందే అయిన అర్ధం కానిదొక్కటే ఇతరులకి నేను దూరమవుతున్నానా, లేక నాకు నేనే దూరమవుతున్నానా ప్రతి ఏడు దేహాన్ని వెలుతుర్లోకి పంపిస్తూ నేను ఒంటరిననే చీకట్లోకి నెట్టుకుంటున్నాన ఏమో.. వేటికుండే అస్తిత్వం వాటిదే కాలంతో పాటు దేహాన్ని దొర్లించిన మనసు మాత్రం ఎప్పుడు గతం తాలుకు కొండచారికల్లో ఊగిసలాడుతూ ఉంటుంది. ఆనాడు దాచుకున్న గ్రీటింగ్ కార్డులు తడిమితే చాలు ఏదో తెలియని ఆలంబన, ఏదో తెలియని ఆప్యాయత ఒక్క సారిగా ఆ మనసుతో నా మనసు పెనవేసుకున్న ఆనందాల నావ కనులముందు ప్రత్యక్షమై గిలిగింత పెడుతుంది.
పిచ్చి మనసుకు ఎంత ఆరాటం గడిపినంత సేపు తెలీదు రాబోవు కాలాలకు అవొక అమృత గడియలని.
న్యూ ఇయర్ అంటే ఇప్పటికి నాకిష్టం.
ఇంట్లోకోచ్చే కొత్త చిమ్ని దీపాలు. బాపు తీసుకొచ్చే బాదుష మిటాయి. అమ్మ అక్కయ ఇంటి ముంగిట్లో, వెనక వాకిట్లో వేసే రంగు రంగుల ముగ్గులు. స్కూల్ లో పెట్టె క్రీమ్ బిస్కెట్లు. మా బాపమ్మ కొనిచ్చే నిమ్మ చాక్లేటు. ఎక్కడో దూరాన మిత్రులు పంపే జ్ఞాపకాల లేఖలు, కొత్త సినిమాలు. ఓహ్ నెమరు వేసుకున్న కొద్ది ఎన్నెన్ని జ్ఞాపకాలో..
Categories: కథనం

మా నాన్న మంచోడే

December 6, 2012 Leave a comment

మా బాపు తాగోస్తే పిచ్చోడే గాని ఉత్తప్పుడు ఆయనంత మంచి మనిషి ఇంకోడు లేనేలే..

ఈ విషయం నాకు నా చిన్నప్పుడు మా బాపు  కొన్ని రోజులు చెరువుగట్టు హనుమంతునికి పూజ చేసి కొబ్బరికాయా కొట్టోచ్చి, ఎర్ర బొట్టు పెట్టుకొని, పెద్ద సైకిల్ మీద అమ్మ కట్టిచ్చిన టిపిను బాక్సు పెట్టుకొని పనికేల్తుంటే అది చూసి మా అమ్మకే కాదు నాకు కూడా మస్తు సంబరమేసేది.

ఇక మా బాపుకి తాగుడలవాటు పెళ్లి గాక మునుపే సదువు మానేసిన పోరాగాల్లతో గుట్ట మీద పేకాట ఆడుకునే పోరాగాల్లతో అలవాటయ్యిందని ఎప్పుడు తిడుతుండేది మా బాపమ్మ.

 

మా బాపు దోస్తులంత పటేలు పటేలు అనుకుంటూ వొచ్చేటోల్లు మా ఇంటికి. “కూటికి గతిలేదు గాని పేరుకి పటేలు ఎందుకొచ్చిండ్రా పో పోండి అని తిడుతుండేది మా బాపమ్మ”.

 

ఇగ మా బాపు నాకెందుకు నచ్చేటోడంటే ఇక బస్తా సంచిని పరుచుకొని నేను పుస్తకాలను ముందేసుకొని సదువుతా తెగ రాస్తావుంటే, అది చూసి మా బాపు బాలమిత్ర, చందమామ, విపుల, చతుర, బాలానందం, వండరు వరల్డు, ఆంధ్ర భూమి వార పత్రికలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇంకా బోలెడన్ని, నవలలు, యద్దనపూడి సులోచన రాణి, యండమూరి, శ్రీ శ్రీ, జిడ్డు, చలం, దేవులపల్లి, వంశీ, కదిరు,  కాకుండా అనువాదాలు అప్పుడప్పుడు మత గ్రంధాలు, మంచి వ్యాసాల పుస్తకాలు, అంతేనా బాపు, అక్బరు, శ్రీధరు కార్టునులని కత్తిరించుకోవడం,  జీవిత చరిత్రలు ఇలా ఏది బడితే అది అన్ని రెండుకట్టెల సంచిలో మొదట్లో అవన్నీ ఏడినుండి తెచ్చేటోడో తెలియకుండా అడక్కుండా అన్నిటిని ఊది పడేసేటోన్ని ఆ తర్వాత తెలిసింది అవన్నీ చిత్తుకాగితాల వాళ్ళు పాత పేపర్ వాళ్ళు కొనుక్కేల్లి అమ్మి పడేసే ఐరన్ గారేజులో నుండి కిలలకోద్ది చొప్పున వాల్లధగ్గరినుండి ఐదారుపయలక్కిల చొప్పున తీసుకొచ్చి కుప్పలుగా పోసేటోడు.

 

ఏంటో ఇక తెచ్చిన పుస్తకాలలో రెండు రోజులు తీరి పార బొమ్మల్ని చుసిన తర్వాత అప్పుడు నెమ్మదిగా రోజుకు నాలుగు, వీలైతే ఐదు ఆరు గంటల చొప్పున ఎండకాలమైతే ఇక తిండి తిప్పలు లేకుండా మేమేమి తక్కువ కాదన్నట్టు మా అక్క మా అన్న కూడా మూకుమ్మడిగా కిక్కురుమనకుండా రెండు గదుల కొంపలో ఇంటెనక కాలి జాగాలో, వీలైతే వంటకేల్లె గుట్టమిధ నరసింహ స్వామి గుళ్ళో, బాధ్రకాలి చెరువుగట్టో పెట్రోల్ బంకు కాడి పబ్లిక్ గార్డెన్ లోనో జూ పార్కులోనో, ముజికల్ గార్డెన్ లోనో, వేయిస్థంబాల గుళ్ళో ఇలా ఎక్కడ బడితే అక్కడ ఎప్పుడు బడితే అప్పుడు ఒకటే సదువుడు.అందుకేనేమో మా గల్లిలల్ల ఉండే పిలయకలకు నేను దోస్తుని కాలేక పోయా. కొద్ది రోజులు తర్వాత మా అన్నయ అప్పుడప్పుడు రాసేటోడు ఏది బడితే అది, అది చూసి  అక్కయ కూడా బాగానే రాసింది కథలు కవిత్వాలు ఏంటో రాను తగ్గించి పూర్తిగా మానేసింది. ఇంట్లో ఆకరోన్ని పైగా పుస్తకాల పిచ్చోని మనం రాయకోపోతే ఎట్టా. ఇగ రాసుడే రాసుడు ఎవరికీ యే వ్యాసం కావాలన్నా, ప్రేమ లేకలు రాయాలన్న, ఉపన్యాసాలు ఇవ్వాలన్న, జోకుల డ్రామాలు వేయాలన్న, వచ్చి రాక నేను రాసే పిచ్చి గీతలే మా దోస్తులకి దిక్కు.

 

అప్పట్లో కథలు రాసుకునే రచయత చేతిలో ఉండే పెద్ద జిప్పు సంచి లాంటి సంచే నా బుజాన కూడా ఎప్పుడు వేలాడుతుండేది. నేను చదివే చదువుడు చూసి మా అమ్మ, మా బాపు, మా బాబాయి, మా మామయ్యా, ఆకరికి మా కిలాసు పిలకాయలంత ముక్కున ఎలేసుకొనేటోల్లు.

 

నేను చదివిన పుస్తకాలో లేక నాకు పరిచమైన బిన్న స్వభావపు వ్యక్తుల ప్రభావమో ఏమో గాని సాధారణ సబ్య సమాజానికి వేలివేసినట్టు, ఇది కుదరని పని, వీడు వీడి ఆలోచనలు, గాల్లో మేడలు కట్టకు, ముందు నీ సదువు సదివి మంచి ఉద్యోగం సంపాదించు, ఇలా ఆవహేళనకు, అవమానాలకు, దగ్గరిగా ఉండేవి నా ఆలోచనలు, నా ఆచరణలు, అయినా స్వతంత్ర భావాలు సొంత నిర్ణయాలు, దేనికి భయపడకపోయే తత్వం, నా మీద నాకు గట్టి నమ్మకం, ప్రపంచమేమి ఒకరి సొంతం కాదు అనుకోవడం, మనుషుల్ని చూడగానే వారి స్వభావాన్ని వారిని యిట్టె పసిగట్టడం, నా జీవితం నాదే నాకు నచ్చినట్టు బతకొచ్చనే ధీమా అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ఎక్కడలేని ఎన్నడు లేని మార్పంత నాలో కలిగింది ఆ పుస్తకాల దెబ్బతో. ఇక రాను రాను ఆ పుస్తకాలని పెట్టుకొనే చోటు మా కొంపలో లేక  మా కాపువాడ  రావి చెట్టు దాగ్గరుండే చిన్న గ్రంధాలయంలో ఇంకా కొన్ని పబ్లిక్ గార్డెన్ గ్రంధాలయంలో, మిగిలినవి జుబైర్ బుక్ స్టాల్ కి అనుకోని ఉన్న మాసిదు పక్కనుండే గ్రంధాలయంలో భధ్రపరిచనం నేను మా ఆరిఫ్ గాడు.

 

అప్పట్లో నా పుస్తకాల పిచ్చిని, నేను తెచ్చుకునే మార్కులని చూసి మా ప్రిన్సిపాల్ మేడం ఆరో తరగతిలో టీచర్లందరిని పిలిచి భలే మెచ్చుకుంటూ అభినంధించేది,

ఇక అప్పటి సంధి, మా శ్రీ వాణి నికేతాన్ చిన్న స్కూల్లో పిలకాయలందరికీ నేనే పెద్ద దిక్కునయినా. ఇస్కుల్లో ఎం జరిగిన జరగపోయిన అన్ని పనులకు పెద్ద దిక్కునై నడిపించేటోన్ని. నాకు తోడుగా రవి గాడు ఆరిఫ్ గాడు. 

 

ఏడో తరగతి వరకు మాత్రమే ఉన్న మా స్కూల్ ని ఎనమిది, తొమ్మిది, పది, వరకు తీసుకోచ్చినం. అంటే ఆ స్కూల్లో టెంతు ఫస్టు బ్యాచు మేమే చిత్రమేమిటంటే అన్ని స్కూల్లో ఒక్కో తరగతిలో నలబై యాబై పిలకాయలుంటే మా పదో తరగతి బ్యాచులో నేను, రవి గాడు, ఆరిఫు గాడు, నఫీజా సుల్తాన మేము నలుగురం.

 

ఇంకో బాధాకరమైన విషయమేమిటంటే పదో తరగతిలో నేను ఫస్టు క్లాసులో పాసైతే తక్కిన ముగ్గురు ఫెయిలవడం. అయితేనేమి ఎందుకు కొరగాకుండా పోతరేమోనని అప్పట్లో బయపడ్డ వాళ్ళంతా తర్వాత తర్వాత ఆరిఫు, రవి గాడి ని చూసి మెచ్చుకుంటుంటే నాకు సంతోషంతో మనిషికి కావాల్సింది చదువు కాదు బ్రతుకుతెరువు నేర్చుకోవాలి దేహి అని ఒకరిపై ఆధారపడి బ్రతకడం కాకా సొంతకాళ్ళపై ధైర్యంగా నిలబడగలిగే సత్తువ ముఖ్యం అని వారిని చూసి నేర్చుకున్నాను. ఇక పదో తరగతి తర్వాత నఫీజా సుల్తాన ఇప్పటికైనా కనిపిస్తే ఒట్టు (పాపం మంచి పిల్ల ఇప్పుదేక్కడుందో).

 

ఇక గమ్మున కూర్చునే రకాన్ని నేను కాకపోవడం, కొద్దో గొప్పో వాడలో నాకున్న మంచి పేరు, నేను గీసిన బొమ్మలు కథల పుస్తకాల్లో కనిపించడం, విశ్వం సౌండ్ సెంటర్ లో పార్ట్ టైం జాబు చేస్తున్నపుడు పరిచయమైనా ఆకాశవాణి చంద్రమోహన్ గారి పుణ్యమా అని రేడియోలో నా గొంతు వినపడడం, జానపద గాయకులతో కలిసి పనిచేయడం, ఇక మా సైకాలజీ డాక్టర్ నారాయణ అంకులుతో కలిసి జైల్లో కైదిలను, పిచ్చాసుపత్రిలో పిచ్చోల్లని, ఆనాద ఆశ్రమం లో పిల్లలని, వృద్ధాశ్రమం లో పెద్దోల్లని, వారి మనస్తత్వాలని గమనిస్తూ వారిలో మనో ధైర్యాన్ని కల్పించే కౌన్సిలింగు ఇచ్చే విధానాన్ని పసిగట్టడం అది వీలు చిక్కినప్పుడల్లా మా వీధిలో ఉన్న పిల్లకాయల భవిష్యత్తు పై చదువు పై ఉన్న భయాలను పోగొట్టే కౌన్సిలింగునిస్తూ, బొమ్మలు గీయడం నేర్పిస్తూ, ఊరంతా తిప్పుతూ, టూషన్లు చెప్తా ఉంటె నాకు మా గల్లిలనే కాదు ఊరంతా దోస్తులే. ఇక హైదరాబాద్ కి వచ్చిన ఈ ఆరేళ్లలో ఈ దోస్తుల లిస్టు మరి పెరిగిపోయింది. ఈ ఆరేళ్లలో హన్మకొండ లో మార్పులెన్ని జరిగిన అప్పుడప్పుడు నేను పని చేసిన విశ్వం సౌండ్ సెంటర్ కి వెళ్తే ఆప్యాయంగా పలకిరించే సూర్యం సేటు, ఆ సౌండ్ సెంటర్ కి అనుకోని ఉండే జుబేర్ బుక్ స్టాల్ ఓనర్ జుబేర్ భై హత్తుకొని వాటేసుకోవడం(ఆలోచిస్తుంటే విశ్వం సౌండ్ సెంటర్, జుబేర్ బుక్ స్టాల్ ఓనర్ కి ముందు ముందు రెండు కథలని అంకితం చేయక తప్పదు. నేను వారితో గడిపిన రోజులు అలాంటివి). నేక్కర్లేసుకొని నా చుట్టూ రఘు అన్న అంటూ తిరిగిన పిల్లలంతా గుర్తు పట్టి ఆగి మరి గౌరవిస్తుంటే నాకు భలే సంతోషమేస్తుంటుంది.

 

అప్పుడప్పుడు మా మాడెం చెప్తుండేది మీరు పెద్ధవల్లయ్యమని గర్వపడుతున్న మా కళ్ళకి నిక్కర్లేసుకొని చిముడు తుడుచుకుంటు బుల్లి బుల్లి అడుగులేసుకుంటూ వొచ్చే చిన్న పిల్లలే. నిజమే అందుకే ఇప్పటికి పిల్లాడినై ప్రతి పంద్ర ఆగష్టుకి, ప్రతి గణతంత్ర దినోత్సవానికి, జానువరి ఫస్టు కి తప్పకుండ నాకు చదువుని ప్రసాదించిన మా ప్రిన్సిపాల్ వాణి మాడం గారిని కలిసి ఓ మంచి పుస్తకాన్ని బహుమతి ఇవ్వడం అలవాటుగా ఏర్పరుచుకున్నాను. ఏంటో న్యూ ఇయర్ కి మిస్ అయ్యాను. గణతంత్రం వొస్తుంది. మొన్న విశాలాంధ్రలో తన కోసం తీసుకున్న కొన్ని పుస్తకాలని పట్టుకొని వెళ్లి కలవాలి మా మేడంని తనతో పాటే,

ఆ స్కూల్ గేటు తలుపుల్ని తాకి నా జ్ఞాపకాల తలపులని తెరచుకొని రావాలి,

కూర్చోడానికి సరిగా అందని బెంచీలు ఇప్పుడు చూడడానికి పొట్టిగా కనిపించే బెంచిలకు మధ్యన దాగిన స్వచ్చమైన మల్లె పూల  జ్ఞాపకాల తీగను మళ్లీ అల్లుకొని రావాలి.  మా స్కూల్ కి మరో ఆరు రోజుల దూరం లో నేను.

 

ఏంటో ఆలోచిస్తుంటే నాకు బ్రతుకుని ఎలా బ్రతకాలో నేర్చుకోవడానికి నాకోసం బీదరికాన్ని సృష్టించి పెట్టినందుకు,

ఆ బిధరింకంలో అనుక్షణం ఆనందాన్ని వేత్తుక్కునే అవకాశం కల్పించినందుకు,

నేను నీల మారకుండా నువ్వు నాకు ఆదర్శంగా నిలిచినందుకు,

పై చదువులు చదవించలేక పోయిన నాకోసం విలువైన జ్ఞానాన్ని కుప్పలుగా పోసినందుకు, వాటి ద్వారా నను మనిషిల మార్చినందుకు,

ప్రతి రోజు నా ఆలోచనలన్నీ ఆచరణలోకి పెట్టె ప్రయత్నం చేస్తూ అప్పుడప్పుడు నన్ను అవహేళన చేసిన వారిని ముక్కున వేలేసుకునేలా చేయగలుగుతున్నందుకు,

 

తెలిసో తెలియకో దానికి కారణం మా తాగుబోతు నన్నే అనే గర్వంగా చెప్పుకోవాలని ఉంది.

అందుకే బాపు ఐ లవ్ యు.