Archive

Archive for the ‘జ్ఞాపకాల గొలుసు’ Category

మా నాన్న మంచోడే

December 6, 2012 Leave a comment

మా బాపు తాగోస్తే పిచ్చోడే గాని ఉత్తప్పుడు ఆయనంత మంచి మనిషి ఇంకోడు లేనేలే..

ఈ విషయం నాకు నా చిన్నప్పుడు మా బాపు  కొన్ని రోజులు చెరువుగట్టు హనుమంతునికి పూజ చేసి కొబ్బరికాయా కొట్టోచ్చి, ఎర్ర బొట్టు పెట్టుకొని, పెద్ద సైకిల్ మీద అమ్మ కట్టిచ్చిన టిపిను బాక్సు పెట్టుకొని పనికేల్తుంటే అది చూసి మా అమ్మకే కాదు నాకు కూడా మస్తు సంబరమేసేది.

ఇక మా బాపుకి తాగుడలవాటు పెళ్లి గాక మునుపే సదువు మానేసిన పోరాగాల్లతో గుట్ట మీద పేకాట ఆడుకునే పోరాగాల్లతో అలవాటయ్యిందని ఎప్పుడు తిడుతుండేది మా బాపమ్మ.

 

మా బాపు దోస్తులంత పటేలు పటేలు అనుకుంటూ వొచ్చేటోల్లు మా ఇంటికి. “కూటికి గతిలేదు గాని పేరుకి పటేలు ఎందుకొచ్చిండ్రా పో పోండి అని తిడుతుండేది మా బాపమ్మ”.

 

ఇగ మా బాపు నాకెందుకు నచ్చేటోడంటే ఇక బస్తా సంచిని పరుచుకొని నేను పుస్తకాలను ముందేసుకొని సదువుతా తెగ రాస్తావుంటే, అది చూసి మా బాపు బాలమిత్ర, చందమామ, విపుల, చతుర, బాలానందం, వండరు వరల్డు, ఆంధ్ర భూమి వార పత్రికలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇంకా బోలెడన్ని, నవలలు, యద్దనపూడి సులోచన రాణి, యండమూరి, శ్రీ శ్రీ, జిడ్డు, చలం, దేవులపల్లి, వంశీ, కదిరు,  కాకుండా అనువాదాలు అప్పుడప్పుడు మత గ్రంధాలు, మంచి వ్యాసాల పుస్తకాలు, అంతేనా బాపు, అక్బరు, శ్రీధరు కార్టునులని కత్తిరించుకోవడం,  జీవిత చరిత్రలు ఇలా ఏది బడితే అది అన్ని రెండుకట్టెల సంచిలో మొదట్లో అవన్నీ ఏడినుండి తెచ్చేటోడో తెలియకుండా అడక్కుండా అన్నిటిని ఊది పడేసేటోన్ని ఆ తర్వాత తెలిసింది అవన్నీ చిత్తుకాగితాల వాళ్ళు పాత పేపర్ వాళ్ళు కొనుక్కేల్లి అమ్మి పడేసే ఐరన్ గారేజులో నుండి కిలలకోద్ది చొప్పున వాల్లధగ్గరినుండి ఐదారుపయలక్కిల చొప్పున తీసుకొచ్చి కుప్పలుగా పోసేటోడు.

 

ఏంటో ఇక తెచ్చిన పుస్తకాలలో రెండు రోజులు తీరి పార బొమ్మల్ని చుసిన తర్వాత అప్పుడు నెమ్మదిగా రోజుకు నాలుగు, వీలైతే ఐదు ఆరు గంటల చొప్పున ఎండకాలమైతే ఇక తిండి తిప్పలు లేకుండా మేమేమి తక్కువ కాదన్నట్టు మా అక్క మా అన్న కూడా మూకుమ్మడిగా కిక్కురుమనకుండా రెండు గదుల కొంపలో ఇంటెనక కాలి జాగాలో, వీలైతే వంటకేల్లె గుట్టమిధ నరసింహ స్వామి గుళ్ళో, బాధ్రకాలి చెరువుగట్టో పెట్రోల్ బంకు కాడి పబ్లిక్ గార్డెన్ లోనో జూ పార్కులోనో, ముజికల్ గార్డెన్ లోనో, వేయిస్థంబాల గుళ్ళో ఇలా ఎక్కడ బడితే అక్కడ ఎప్పుడు బడితే అప్పుడు ఒకటే సదువుడు.అందుకేనేమో మా గల్లిలల్ల ఉండే పిలయకలకు నేను దోస్తుని కాలేక పోయా. కొద్ది రోజులు తర్వాత మా అన్నయ అప్పుడప్పుడు రాసేటోడు ఏది బడితే అది, అది చూసి  అక్కయ కూడా బాగానే రాసింది కథలు కవిత్వాలు ఏంటో రాను తగ్గించి పూర్తిగా మానేసింది. ఇంట్లో ఆకరోన్ని పైగా పుస్తకాల పిచ్చోని మనం రాయకోపోతే ఎట్టా. ఇగ రాసుడే రాసుడు ఎవరికీ యే వ్యాసం కావాలన్నా, ప్రేమ లేకలు రాయాలన్న, ఉపన్యాసాలు ఇవ్వాలన్న, జోకుల డ్రామాలు వేయాలన్న, వచ్చి రాక నేను రాసే పిచ్చి గీతలే మా దోస్తులకి దిక్కు.

 

అప్పట్లో కథలు రాసుకునే రచయత చేతిలో ఉండే పెద్ద జిప్పు సంచి లాంటి సంచే నా బుజాన కూడా ఎప్పుడు వేలాడుతుండేది. నేను చదివే చదువుడు చూసి మా అమ్మ, మా బాపు, మా బాబాయి, మా మామయ్యా, ఆకరికి మా కిలాసు పిలకాయలంత ముక్కున ఎలేసుకొనేటోల్లు.

 

నేను చదివిన పుస్తకాలో లేక నాకు పరిచమైన బిన్న స్వభావపు వ్యక్తుల ప్రభావమో ఏమో గాని సాధారణ సబ్య సమాజానికి వేలివేసినట్టు, ఇది కుదరని పని, వీడు వీడి ఆలోచనలు, గాల్లో మేడలు కట్టకు, ముందు నీ సదువు సదివి మంచి ఉద్యోగం సంపాదించు, ఇలా ఆవహేళనకు, అవమానాలకు, దగ్గరిగా ఉండేవి నా ఆలోచనలు, నా ఆచరణలు, అయినా స్వతంత్ర భావాలు సొంత నిర్ణయాలు, దేనికి భయపడకపోయే తత్వం, నా మీద నాకు గట్టి నమ్మకం, ప్రపంచమేమి ఒకరి సొంతం కాదు అనుకోవడం, మనుషుల్ని చూడగానే వారి స్వభావాన్ని వారిని యిట్టె పసిగట్టడం, నా జీవితం నాదే నాకు నచ్చినట్టు బతకొచ్చనే ధీమా అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ఎక్కడలేని ఎన్నడు లేని మార్పంత నాలో కలిగింది ఆ పుస్తకాల దెబ్బతో. ఇక రాను రాను ఆ పుస్తకాలని పెట్టుకొనే చోటు మా కొంపలో లేక  మా కాపువాడ  రావి చెట్టు దాగ్గరుండే చిన్న గ్రంధాలయంలో ఇంకా కొన్ని పబ్లిక్ గార్డెన్ గ్రంధాలయంలో, మిగిలినవి జుబైర్ బుక్ స్టాల్ కి అనుకోని ఉన్న మాసిదు పక్కనుండే గ్రంధాలయంలో భధ్రపరిచనం నేను మా ఆరిఫ్ గాడు.

 

అప్పట్లో నా పుస్తకాల పిచ్చిని, నేను తెచ్చుకునే మార్కులని చూసి మా ప్రిన్సిపాల్ మేడం ఆరో తరగతిలో టీచర్లందరిని పిలిచి భలే మెచ్చుకుంటూ అభినంధించేది,

ఇక అప్పటి సంధి, మా శ్రీ వాణి నికేతాన్ చిన్న స్కూల్లో పిలకాయలందరికీ నేనే పెద్ద దిక్కునయినా. ఇస్కుల్లో ఎం జరిగిన జరగపోయిన అన్ని పనులకు పెద్ద దిక్కునై నడిపించేటోన్ని. నాకు తోడుగా రవి గాడు ఆరిఫ్ గాడు. 

 

ఏడో తరగతి వరకు మాత్రమే ఉన్న మా స్కూల్ ని ఎనమిది, తొమ్మిది, పది, వరకు తీసుకోచ్చినం. అంటే ఆ స్కూల్లో టెంతు ఫస్టు బ్యాచు మేమే చిత్రమేమిటంటే అన్ని స్కూల్లో ఒక్కో తరగతిలో నలబై యాబై పిలకాయలుంటే మా పదో తరగతి బ్యాచులో నేను, రవి గాడు, ఆరిఫు గాడు, నఫీజా సుల్తాన మేము నలుగురం.

 

ఇంకో బాధాకరమైన విషయమేమిటంటే పదో తరగతిలో నేను ఫస్టు క్లాసులో పాసైతే తక్కిన ముగ్గురు ఫెయిలవడం. అయితేనేమి ఎందుకు కొరగాకుండా పోతరేమోనని అప్పట్లో బయపడ్డ వాళ్ళంతా తర్వాత తర్వాత ఆరిఫు, రవి గాడి ని చూసి మెచ్చుకుంటుంటే నాకు సంతోషంతో మనిషికి కావాల్సింది చదువు కాదు బ్రతుకుతెరువు నేర్చుకోవాలి దేహి అని ఒకరిపై ఆధారపడి బ్రతకడం కాకా సొంతకాళ్ళపై ధైర్యంగా నిలబడగలిగే సత్తువ ముఖ్యం అని వారిని చూసి నేర్చుకున్నాను. ఇక పదో తరగతి తర్వాత నఫీజా సుల్తాన ఇప్పటికైనా కనిపిస్తే ఒట్టు (పాపం మంచి పిల్ల ఇప్పుదేక్కడుందో).

 

ఇక గమ్మున కూర్చునే రకాన్ని నేను కాకపోవడం, కొద్దో గొప్పో వాడలో నాకున్న మంచి పేరు, నేను గీసిన బొమ్మలు కథల పుస్తకాల్లో కనిపించడం, విశ్వం సౌండ్ సెంటర్ లో పార్ట్ టైం జాబు చేస్తున్నపుడు పరిచయమైనా ఆకాశవాణి చంద్రమోహన్ గారి పుణ్యమా అని రేడియోలో నా గొంతు వినపడడం, జానపద గాయకులతో కలిసి పనిచేయడం, ఇక మా సైకాలజీ డాక్టర్ నారాయణ అంకులుతో కలిసి జైల్లో కైదిలను, పిచ్చాసుపత్రిలో పిచ్చోల్లని, ఆనాద ఆశ్రమం లో పిల్లలని, వృద్ధాశ్రమం లో పెద్దోల్లని, వారి మనస్తత్వాలని గమనిస్తూ వారిలో మనో ధైర్యాన్ని కల్పించే కౌన్సిలింగు ఇచ్చే విధానాన్ని పసిగట్టడం అది వీలు చిక్కినప్పుడల్లా మా వీధిలో ఉన్న పిల్లకాయల భవిష్యత్తు పై చదువు పై ఉన్న భయాలను పోగొట్టే కౌన్సిలింగునిస్తూ, బొమ్మలు గీయడం నేర్పిస్తూ, ఊరంతా తిప్పుతూ, టూషన్లు చెప్తా ఉంటె నాకు మా గల్లిలనే కాదు ఊరంతా దోస్తులే. ఇక హైదరాబాద్ కి వచ్చిన ఈ ఆరేళ్లలో ఈ దోస్తుల లిస్టు మరి పెరిగిపోయింది. ఈ ఆరేళ్లలో హన్మకొండ లో మార్పులెన్ని జరిగిన అప్పుడప్పుడు నేను పని చేసిన విశ్వం సౌండ్ సెంటర్ కి వెళ్తే ఆప్యాయంగా పలకిరించే సూర్యం సేటు, ఆ సౌండ్ సెంటర్ కి అనుకోని ఉండే జుబేర్ బుక్ స్టాల్ ఓనర్ జుబేర్ భై హత్తుకొని వాటేసుకోవడం(ఆలోచిస్తుంటే విశ్వం సౌండ్ సెంటర్, జుబేర్ బుక్ స్టాల్ ఓనర్ కి ముందు ముందు రెండు కథలని అంకితం చేయక తప్పదు. నేను వారితో గడిపిన రోజులు అలాంటివి). నేక్కర్లేసుకొని నా చుట్టూ రఘు అన్న అంటూ తిరిగిన పిల్లలంతా గుర్తు పట్టి ఆగి మరి గౌరవిస్తుంటే నాకు భలే సంతోషమేస్తుంటుంది.

 

అప్పుడప్పుడు మా మాడెం చెప్తుండేది మీరు పెద్ధవల్లయ్యమని గర్వపడుతున్న మా కళ్ళకి నిక్కర్లేసుకొని చిముడు తుడుచుకుంటు బుల్లి బుల్లి అడుగులేసుకుంటూ వొచ్చే చిన్న పిల్లలే. నిజమే అందుకే ఇప్పటికి పిల్లాడినై ప్రతి పంద్ర ఆగష్టుకి, ప్రతి గణతంత్ర దినోత్సవానికి, జానువరి ఫస్టు కి తప్పకుండ నాకు చదువుని ప్రసాదించిన మా ప్రిన్సిపాల్ వాణి మాడం గారిని కలిసి ఓ మంచి పుస్తకాన్ని బహుమతి ఇవ్వడం అలవాటుగా ఏర్పరుచుకున్నాను. ఏంటో న్యూ ఇయర్ కి మిస్ అయ్యాను. గణతంత్రం వొస్తుంది. మొన్న విశాలాంధ్రలో తన కోసం తీసుకున్న కొన్ని పుస్తకాలని పట్టుకొని వెళ్లి కలవాలి మా మేడంని తనతో పాటే,

ఆ స్కూల్ గేటు తలుపుల్ని తాకి నా జ్ఞాపకాల తలపులని తెరచుకొని రావాలి,

కూర్చోడానికి సరిగా అందని బెంచీలు ఇప్పుడు చూడడానికి పొట్టిగా కనిపించే బెంచిలకు మధ్యన దాగిన స్వచ్చమైన మల్లె పూల  జ్ఞాపకాల తీగను మళ్లీ అల్లుకొని రావాలి.  మా స్కూల్ కి మరో ఆరు రోజుల దూరం లో నేను.

 

ఏంటో ఆలోచిస్తుంటే నాకు బ్రతుకుని ఎలా బ్రతకాలో నేర్చుకోవడానికి నాకోసం బీదరికాన్ని సృష్టించి పెట్టినందుకు,

ఆ బిధరింకంలో అనుక్షణం ఆనందాన్ని వేత్తుక్కునే అవకాశం కల్పించినందుకు,

నేను నీల మారకుండా నువ్వు నాకు ఆదర్శంగా నిలిచినందుకు,

పై చదువులు చదవించలేక పోయిన నాకోసం విలువైన జ్ఞానాన్ని కుప్పలుగా పోసినందుకు, వాటి ద్వారా నను మనిషిల మార్చినందుకు,

ప్రతి రోజు నా ఆలోచనలన్నీ ఆచరణలోకి పెట్టె ప్రయత్నం చేస్తూ అప్పుడప్పుడు నన్ను అవహేళన చేసిన వారిని ముక్కున వేలేసుకునేలా చేయగలుగుతున్నందుకు,

 

తెలిసో తెలియకో దానికి కారణం మా తాగుబోతు నన్నే అనే గర్వంగా చెప్పుకోవాలని ఉంది.

అందుకే బాపు ఐ లవ్ యు.

మా యింటి ఎనకాల చిక్కుడు చెట్టు

December 6, 2012 Leave a comment

మా అన్న కి నాకు యిపరితమైన చెట్ల పిచ్చి, ఏందో చిన్నప్పటి సంధి మా ఇంటెనకాల ఎన్ని మొక్కలు పాతి పెట్టిన ఒక్కటి కూడా ఏరందుకోలే. ఏడికెల్లి పట్టుకొంచ్చిండో ఏందో రెండు వేప మొక్కలు. హన్మకొండ అప్పట్లోనే కాదు ఇప్పుడు కూడా చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళందరికీ హన్మకొండ అంటే పెద్ద సిటీ. పేరుకు మాత్రమే మేము పట్నాపోల్లమే గాని కూటికి తిప్పలు పడే గరీబోల్ల లిస్టు లో మా ఇల్లు ఫస్టు.

 

ఇక మా గల్లిల ఉన్నోల్లందరికీ ఎండా కాలం వచ్చిందంటే చేరుగట్టు కాడుండే రావిచెర్ల బావి తర్వాత మా బావి నీళ్ళే దిక్కు. 

 

ఆ భావికి ఇవుతల వేప మొక్కలు తేవడమే తరువాయి ఆ మూల ఈ మూల దబ దబ మట్టి దవ్వి వేప మొక్కలు నాటితిమి, పొద్దున లేచిన సంధి దుప్పటి కప్పెసుకునేంత వరకు ఎప్పుడు వీలైతే అప్పుడు చెంబుల కొద్ది నీళ్ళు పోస్తుంటే. ఓ పోలగాల్లర మొక్కలు మురిగిపోతాయ్ బిడ్డ అని మా బాపమ్మ చెప్పిన కూడా ఇనకుండా పోయడంతో ఆమె అన్నట్టుగానే ఓ మొక్క చనిపోవడం. చనిపోవడంతో ఇక మేము జాగ్రత్త పడడం ఎంటనే జరిగిపోయనాయీ..

 

ఇక ఉన్న మొక్కని చాల జాగ్రత్తగ  పెంచడం తో చూస్తుండగానే నిక్కర్లు తొడుక్కునే నాకన్నా మూడు నాలుగు ఐదింతలు పెరిగింది. 

నా పిడికిలంత లావుండే దాని కాండం మెల్ల మెల్లగా రెండు చేతులతో కావలించుకునేంత లావయ్యింది. 

మా గల్లిలో ఎవలికి తల్లైన మా ఇంటి వేప కొమ్మలే, ఎవరికీ జ్వరమొచ్చిన జిష్టి తీసుకునేందుకు మా వేప కొమ్మలే, పోచమ్మలు చేసుకున్న, బోనాలు ఎత్తుకున్న, ఇలా  పండగలకి పబ్బాలకి మా యాపే చెట్టే దిక్కు.

గల్లిలల్ల ఉండే ధర్వాజలన్ని మావిడాకులతో పాటు ఆ కొస ఈ కొస వేలాడ దీసే యాప కొమ్మలను చూపెడుతూ  మా ఇంట్ల తెంపి ఇచ్చినవే అని గర్వంగే చెప్పుకునేటొన్ని మా దోస్తులతో. 

 

మా కులంలో ఊగాది పచ్చడి చేసుకుంటుంటే కుండ పలిగిందని, మళ్లీ మా కులంలో ఉగాది పచ్చడి చేసుకుంటే అరిష్టం అనే పుకారు నేను పుట్టకముందు నుండే ఉండే సరికి నేను కూడా ఆ పుకారుకి అలవాటు పడిపోయాను, ఇక మా ఇంట్లో ఉగాది పచ్చడి చేసుకోమని తెలిసి మా ఇంటి వేప కాయాలు తేమ్పుకున్నోల్లు తేమ్పుకోనోల్లు అందరు చెంబులకోద్ధి(మా వరంగల్ లో పచ్చడి చారు లాగ పలుచగా చేస్తుంటారు అందుకే చెంబులల్లో పట్టుకొచ్చేటొల్లు)  ఉగాది పచ్చడి. 

 

ఇక ఎవరిచ్చారో ఏంటో నాలుగు చిక్కుడు గింజలు పొట్లం కట్టుకొని మా బాపు పట్టుకోచ్చిండు. ఇక మా అన్నా ఆగనే లే వెంటనే మట్టి తవ్వి సిద్ధం చేస్తే మా అమ్మ మనసులో దేవుడికి  దన్నం పెట్టుకొని మంచిగ పెరగాల అనుకుంటూ తవ్విన చోట్ల అక్కడక్కడ గింజలు నాటింది. 

 

ఇక పెట్టినకాన్నుండి  పొద్దున లేచిన వెంటనే నేను మా అన్నయ మా అక్కయ నేను ఒకటే సూసుడు ఎప్పుడు మొలుస్తుందా అని. 

 

ఆ రోజు రాత్రి వర్షాకాలానికి స్వాగతం చెప్తూ చిన్న తుంపర్లతో మొదలై చక్కని జల్లు కురిసింది.

మాధీ పెంకుటిల్లు మేమేసుకున్న పక్క లు తడవకుండా పెంకు రంధ్రల్లోనుండి కురుస్తున్న నీటి చుక్కలు పడుతున్న చోటులో  గిన్నెలు తపాలలు పెడుతుండేది మా అమ్మ. నేను ఇంటి బయట ధర్వాజకు ఒక్క రిక్క తలుపు ఉండేది దాని  గొళ్ళెం తీసి చీకటి నిశ్శబ్దం లో కమ్మగా వినిపించే వర్షపు రాగాన్ని వింటూ గూన పెంకు వాలు నుండి ధారగా పడుతున్న నీటి వరుసుల్ని దీపం వెలుతుర్లో చూస్తూ, అప్పుడప్పుడు మెరిసే మెరుపు ఉరుములకి ఉలిక్కి పడుతూ తీయని మట్టి సువాసనలు ఆస్వాదిస్తూ అల ఎప్పుడు పడుకునే వాన్నో…. తెల్లారి లేచి చూస్తే మాత్రం దుప్పటి ముసుగులో ఉండేవాన్ని (దాదాపు వర్షాకాలం వచ్చిందంటే చాలు ఇలా వర్షం చూస్తూ నిద్ర పోవడం అమ్మ ఎత్తుకొచ్చి పక్కలో పడుకోబెట్టి దుప్పటి కప్పడం సర్వ సాధారణం).

 

వర్షం కురిసి వెలిచిన ఇంకా ఆ ఆనవాలు మిగిలే ఉండేది ఇంటెనక మట్టి నేల మీద తడి రూపంలో. తడి ఆరలేదు ఇంకా చిత్తడి గానే ఉంది.

కాళ్ళు తుడుచుకునేందుకు దర్వాజా బయట  ఓ గోనే సంచి వేసేది. కాళ్ళతో మట్టి లోపలి రాకుండా. ఇక గాలి వీచినప్పుడల్లా దాచిపెట్టుకున్న నీటి బొట్లని వేప కొమ్మల్లో ఉన్న ప్రతి ఆకు నా పై గురిచూసుకొని మరి విసిరేవి. పడుతున్న పెద్ద పెద్ద చినుకులని తప్పించుకుంటూ అల అడుగులో అడుగు వేసుకుంటూ గింజ నాటిన  చోటుకి వెళ్లి చూసా….

 

“మెడలు వంచి సిగ్గుతో అల్లాడిపోతున్న ఓ నగ్న యువతీల ఎంతో సున్నిత సుకుమారంగా నేలలోనుంచి పురుడు పోసుకుంది… మా చిక్కుడు మొక్క. 

అంతే…….. నా ఆనందానికి అవధుల్లు లేవు. ఒక్క పరుగున వెళ్లి “అమ్మ మొక్క మొలిచింది రా సూడు”.. అని చేయి పట్టుకొని లాక్కొచ్చాను అమ్మని. 

నా మాటకి కట్టగట్టుకొని అందరం. ఆకరికి భారికాయమేసుకున్న మా బాపమ్మ కూడా ఉ. ఉ. అని మూలుగుతూ రైక సరి చేసుకుంటూ కొంగు మిదేసుకుని మరి వచ్చి చూసింది. ఇక మా అమ్మ మంచిగా పెరగాలని దీవిస్తూఆ మొక్క చుట్టూ మట్టి తో అద్దులు పెట్టి సరిచేసింది.

 

ఇగో మొక్కని  ఊకే చూడొద్దు జిష్టి తకుతది అని చెప్పే సరికి ఇక కొద్ది రోజుల వరకు పట్టించులేదు నేను. ఇక మా అమ్మ నే రీలు దారం ఆ తర్వాత సుతిలు దారం ఉపయోగించి ఎట్టో గట్ల మా పయకాన రేకు మీదికి తీగను పారిచ్చింది. ఆ తీగ ఎప్పుడందుకుందో ఏమో  మా యాప చెట్టుని. నేను సుస్తుండగానే మంచి లవ్వు పుట్టి యాప కొమ్మలకి అల్లుకుంది, ఈ చిక్కుడు తీగ.

 

ఇక కిక్కురుమనకుండా పెరుగుతున్న యాప చెట్టూ చిక్కుడు చెట్టూ నాకు మంచి దోస్తులు. ఏదో సీరియల్ లో చూపించినట్టు నేను కూడా ఎవలికి చెప్పుకోలేని మాటలన్నీ ఈ చెట్లకే చెప్పుకునే టొన్ని.

అవి నాకు మంచి దోస్తులవడమో లేక వాటికి మాటలు రాకపోవడమో ఏమోగాని నేను చెప్పిన మాటల్ని ఎవరికీ చెప్పకుండా యాప చెట్టూ తన కాండం కడుపులో, చిక్కుడు తన సొగసరి తీగ మనసులో దాచుకునేది. అవే గనక నాకు శాత్రువులయ్యింటే అప్పుడు మా ఇంట్లో నా  ఇజ్జత్ మొత్తం పోయేటిది.

 

ఎన్నెన్ని చెప్పుకుంటోన్నో నొక్కేసినా చాకుపీసు ముక్కలు, 

దోరికిపోయినందుకు టీచర్ వాయిపంపులు, 

ఇంగ్లీషు టీచర్ పై నేను పెంచుకున్న ఇష్టం (అబ్బో ఆ కథే వేరు ఇప్పటికి ఒళ్ళు పులకరిస్తుంటుంది ఆ రోజులు గుర్తొస్తే), 

దొంగ తనంగ సైకిల్ తొక్కుతూ పైకి కనపడకుండా ఎన్ని దెబ్బలు తగిలించుకున్ననో, 

ఎవరెవరు నన్ను హేళన చేసారో, 

ఎవరెవరికి అబద్ధం చెప్పానో, 

రూపాయి రెండ్రుపాయలు తీసుకొని మా క్లాస్స్ పిలగండ్లందరి  నోటుబుక్కు ముందు పేజీల్లో వారి పేర్లు గీసిచ్చనో, 

మా అన్నకి తెలీకుండా తన వైట్ నోటు బుక్ లో ఎన్ని జంట కమ్మలను చింపుకున్ననో… ఇంకా ఎన్నో మా దోస్తు ఆరిఫ్ గానికి కూడా చెప్పుకోలేక ఈ చిక్కుడు చెట్టూ పందిరి కింద కాసేపు, వేప చెట్టూ మొదలుకు సంచి పరుచుకొని వొరిగి మరి చూచి రాతలు రాసుకుంటూ కాసేపు చెప్పుకునే టోన్ని.  

వామ్మో ఇన్నేసి సంగతులో ఇంట్లో తెలిస్తే ఇంకేమైనా ఉందా ఇజ్జాత్ మొత్తం పోయేటిది అందుకే ఈ రెండు చెట్లంటే నాకు మస్తు ఇష్టం.

 

వాకిలి ఊడ్చి చెత్త ఎత్తుతూ తలెత్తినప్పుడు మా అక్కకి ఒక వింత కనిపించినట్టుంది గట్టిగ మా అమ్మని పిలిచింది. నేను కూడా జల్దీ జల్దీ ఇంటేనకకి పరుగు పెట్టాను. ఏమైందో అనుకున్న. మా అమ్మ కు, నాకు అదిగో అటు చూడు అని చెప్తే చూసాం. తెల్లని వంకర పూలు పూసాయి మా చిక్కుడు చెట్టుకు. నాకు ఆశ్చర్యం “అమ్మ.. చిక్కుడు చెట్టుకు చిక్కుడు కాయలకి బదులు పూలు పూస్తున్నయి.” అని అడిగా…. ముందు పూలు పూసి తర్వాత కాయలు కాస్తాయి అని చెప్పింది మెరుస్తున్న ఆనందపు కళ్ళతో..

 

ఇక చూడు పొద్దున బడికి పోయేటపుడు మధ్యానం అన్నం బెల్లు మోగి ఇంటికొచ్చినప్పుడు, సాయంత్రం ఇంటికిచ్చి చూచి రాతలు రాసుకునేటప్పుడు  ఇలా ప్రతి రోజు పూల వంక చూస్తుండగా ఒక రోజు చిన్న చిన్న కాయలు గుత్తులు గుత్తులుగా కనిపించాయి. ఏంటో ఈ వేప చెట్టూ ఎంత ఎత్తుందో నాకు సరిగా కనిపించదు కాని అంత వరకు ఈ చిక్కుడు దానితో పాటు నా మనసుతోను అల్లుకుపోయింది.

 

ఇది పెద్ద రకం విత్తనం కొంచెం పెరగగానే తెంపొద్దు బాగా పెరగాలి ఒక్క కాయలో పది పన్నెండు గింజలు పడతాయి అని బాపు చెప్తే మా అన్న నేను అక్క విన్నాం. మా బాపు చెప్పినట్టుగానే కాయలు చాల పొడవుగా లావు విత్తనాలు దాచుకొని పెరిగాయి. ఇక మా అమ్మ చెప్పడమే ఆలస్యం మా అన్న ఇంటెనక గోడ ఎక్కడం చేతికి అందినవి అందినట్టు తెంపి వర్కు కాయితం (కవర్ సంచి) లో నింపి దింపడంతో,  అమ్మ చాల సేపు తృప్తిగా తాకి, నారను తీసి, ఒక్కో గింజ కు ఆ పక్క ఈ పక్క తోలు ఉండేలా వొలుచుకొని శుబ్రంగా కడిగి, టమాటాలు కలిపి, దట్టంగా మెంతు పొడి, పుదిన, కొత్తిమీర జల్లి కొంచెం రసం గిన్నె చుట్టూ తిప్పి దేవుడికి దండం పెట్టి చేతిలోకి గంటె తో  కొంచెం రాసుకొని రుచి చూసి తృప్తిగా కల్లగేరేయడం చూస్తే వంట సూపర్ అని అర్ధమైంది. 

వెంటనే కాళ్ళు చేతులు కడుక్కొని సిద్ధం అయ్యా, నాతో పాటే మా అక్క అన్న, ఇక తిన్నాం చూడు మొదటి సారి నేను కూడా పెద్ద తిండిబోతుననే బిరుదుని నాకు నేనే ఇచ్చేసుకునేంత తిన్నాను. 

ఉడికిన ఒక్కో గింజ ని కసుక్కుమని కొరుకుతుంటే నేను అనుభవంచిన ఆనందం తెలియచేయడానికి అబ్బో తెలుగు పుస్తకాల్లోనే ఏ పధంకుడ సరిపోదు  పో..

ఇక సూడు పొద్దుకు మూడు పూటలు, వీలు కాకపోతే రోజుకు ఒకపూటైన చిక్కుడు కాయ తో వంటకం లేకపోతే నాకు ముద్ద తిగకపోయేది (లూసు మోషన్లు అయిన కూడా వోధల్లేదు నేను మారం చేసి మరి వండించుకునే వొన్ని) ఎందుకో తిన్న ప్రతి సారి ఓ కొత్త రుచి. వీడికి ఈ చిక్కుడు పిచ్చెంట్ర అని విసుక్కున్న కూడా వోధల్లేదు. కాయలు పండడం ఆగిపోయేంతవరకు  రోజు నాకు పండగే. 

 

ఇక గల్లిలల్ల ఉన్న వాళ్ళందరి కళ్ళు మన చిక్కుడు చేట్టుమీదనే అని అప్పుడప్పుడు జిష్టి తీస్తుండేది మా అమ్మ. ఆ చెట్ల ముందే మా నాన్న లొల్లి చేసేటోడు, ఆ చెట్ల కిందే, మా అమ్మ చిన్నమ్మ చాల సేపు ముచ్చట్లు పెట్టుకుంటుంటే అవ్వన్నీ ఇంటున్న నా మెదడులో ఓ సినిమాగ కనిపించేది. మా అమ్మ చిన్నమ్మకి చదువంటే తెలియదు కాని మమ్మల్ని చదవించడం ముఖ్యం అని మాత్రం భాగ తెలుసు. ఈ చెట్టూ నిడ కిందే మా ముగ్గురు తాతలు, ఇద్దరు బాపమ్మలు కళ్ళు  మూస్తే పడుకోబెట్టాం, ఈ చెట్టూ కిందే మేము మాతో పాటు మా చిన్నమ్మ ఇద్దరు కొడుకులు ఎన్నో ఆటలాడుకున్నం. ఎన్నో సంతోషాలని ఎన్నో బాధల్ని మాతో పాటు పంచుకున్నాయి.

 

మా అమ్మకి కాస్త దాన గుణం ఎక్కువే పిరికెడు బియ్యం కూడా దానం చేయలేని మేము ఇంటి ముందుకొచ్చిన వారిని ఉత్త చేతులతో పోనివ్వద్దని అడుక్కునే వారు ఎవరస్తే వారికి చిక్కుడు కాయలు తెంపి ఇచ్చేది ఓ నాలుగో ఐదో కాదు ఏకంగా జోకితే అవి కిలోకి తక్కువ కాకుండా.

ఇంటి సుట్టు పక్కన ఉన్నోల్లంత మా చెట్టూ కాయ గురించి తెగ చెప్పుకునేటోల్లు ఎవ్వరు చెప్పిన కూడా మా అమ్మ ఒక్క రూపాయి తీసుకొని కాయని ఎవరికీ అమ్మలేదు. మనం తిండి దానం చేస్తే మనకు తిండి దొరుకుతుంది అని తిండి లేక అలమటించి తను పస్తులు ఉండి మా కడుపులు నింపిన తనకి తిండి విలువ బాగా తెలుసు. అడుక్కునే వారు ఎవరొచ్చిన కనీసం వారంలో ఒకరిద్దరికైనా భోజనం పెడుతుండడం నాకు ఇప్పటికి గుర్తు. ఏమో హైదరాబాద్ కి వచ్చిన కొత్తలో డబ్బులు లేకుండా గడిపిన రోజులున్నాయి. కాని తిండి లేకుండా గడిపిన రోజు మాత్రం నాకు ఎదురుపడక  పోవడం మా అమ్మ చేసుకున్న పుణ్యం వల్ల నాకు కలిగిన అద్రుష్టం అని కచ్చితంగా చెప్పగలను.

మా అమ్మ చెప్తుండేది తిండి లేకుండా చావడానికి మించిన దరిద్రపు చావు ఇంకోటుండదు  అని. 

ఆ రకంగా మా అమ్మ మా చెట్టున పెరిగిన కాయలన్నీ మహీంద్ర షాపు కవరు సంచిలో (అప్పట్లో నేను చూసిన మొదటి పెద్ద కవరు సంచి అదే) కుక్కి మరి వీధిలో ఉండే  అంజమ్మోల్లకి, శ్రీనోల్లకి, సాంబరాజోల్లకి, మీనయ్యల్లోంటికి, అంకయ్యోల్లింటికి, వోదేలు వాళ్ళింటికి, బైరిశేట్టోల్లకి, బేబి వాళ్ళకి, మసూద్ వాళ్ళకి, ఇంకా మా దోస్తు  ఆరిఫోల్లకి నేను మా అన్న తీసుకోబోయి ఇచ్చేటోల్లం. ఇక మా అన్నైతే పెద్ద సైకిల్ వేసుకొని ఏకంగా మా చుట్టపోల్లందరికీ కూడా తీసుకుపోయేటోడు దీన్ని బట్టి ఊహించొచ్చు మా చెట్టుకు ఎన్ని కాయలో. ఆ కాయలన్నీ కేవలం మా అన్న చేతికందినంతవారకే, అందనివి ఇంకేన్నవుతాయో..

 

నాకు భలే చిత్రం అనిపిస్తుండే ఒక్క విత్తనం ఎంత మంది కడుపునింపుతుందో అని. 

అది చూసినప్పటి నుండి మొక్కలమీద గౌరవం చెట్ల మీద ప్రేమ పెరగడం మొదలయ్యింది. ఇక మా దోస్తులతో కలిసి ఎన్ని మొక్కలు నటినానో లెక్కే లేదు. 

 

రోజులు సంవత్సరాళ్ళు మాతో ముడి పడిన ఆ రెండు ప్రాణులు మా కుటుంబం లో సభ్యుల్ల మాకు అండదండనివ్వసాగాయి. అనుకోకుండా ఓ రోజు ఏమైందో ఏమో చిక్కుడు కొమ్మలు  ఎండి పోవడం మొదలయింది అస్సలు అర్ధం కాలేదు ఏమైందో అని. ఇగ మా అమ్మ పాట్లు చూడాలి శుబ్రం చేయడం కొత్త మట్టి ఎత్తుకొచ్చి పోయడం. అంజమ్మోల్ల అత్తకు పూనకం వొస్తే చేట్టుగురించి వాకబు చేయడం, కుంకుమ పసుపుతో దండం పెట్టడం ఇవ్వన్ని చూస్తుంటే నాకు కూడా గాబరా మొదలైంది. ఇక మా అన్న అయితే ఏకంగా చెట్ల డాక్టర్ నే సైకిల్ మీద కూర్చో బెట్టుకొస్తే చెట్టూ మొదల్లో రెండు ఇంజక్షన్లు ఇచ్చి బరోస ఇచ్చిన కూడా మా మనసు కుదురుగా లేదు. ఎవరు చెప్పారో ఏమో చెట్టుకు  రోగం వొచ్చినట్టుంది మొత్తం ఎండిపోకముందే మొదలు నరికేయమని. కాని మాకు ఆ ధైర్యమే రాలే.

 

కొద్ది రోజుల తర్వాత దాదాపు సగం ఎండి పోయి మిగిలిన అకులనుండి పురుగు రాలడం చూసి ఇక తప్పదన్నట్టుగా మాకు కట్టెలు కొట్టుకొచ్చే  ముసలాయన వొచ్చి కొడవలి తెచ్చి క్షణంలో మొదలు నరికేసి వేలిపోతుంటే నా గుండె నరికేసినంత బాధయ్యింది. ఆ గాయం నుండి తేరుకోవడానికి చాల రోజులే పట్టింది. 

కొద్ది రోజులకి ఎండిన చిక్కుడు కాయలు రాలి పడడం కనిపించింది. ఓ రెండు మూడు వారాలు బాపు అన్నయ్య ఇద్దరు దాదాపు వేప చెట్టూ చివరి కొమ్మ వరకు గట్టిగ ఊపడంతో ఎండిన చిక్కుడు కాయలన్నీ కింధపడుతుంటే నేను మా అక్క బస్తా సంచులో వేయడం. 

ఆ తర్వాత ఎండిన కాయలో నుండి గింజలని వేరు చేసి రెండు పెద్ద క్యాన్ల నిండా వాటిని దాచి వారానికోసారి ఆ చిక్కుడు గింజల కూరని తృప్తిగా ఆస్వాదించాం.

 

చిక్కుడు చెట్టూ మొదల్లో పెద్ద రంధ్రం కనపడడం అందులో ఓ పెద్ద ఎలుక వచ్చి వెళ్ళడం గమనించిన మా అన్న ఎలుక చిక్కుడు వేరుని తినడం వల్లే చిక్కుడు చెట్టూ చనిపోయిందని నిర్నయించేసుకొని ఇంట్లో ఉన్న ఎలుకలన్నిటిని వెంటాడి వేటాడి ఇత్తడి ఇత్తడి చేసాడు.

 

ఏంటో కొద్ది రోజులకి కూలడానికి సిద్ధమైన ఇల్లు, పెరిగిన అప్పులు మరో కొత్త అప్పులు చేయలేని స్తోమతతో ఇల్లు అమ్మకానికి పెట్టాం. నేను గడిపిన ఇల్లు దూరమవబోతున్న బాధ కన్నా నా వేప చెట్టుకి దూరమవుతున్నననే భాదే నాకు ఎక్కువైంది. 

ఎంత చేదుకయాలని పుట్టించిన ఆ చెట్టులో ఓ తీయని మనసుందని నాకోసం రాల్చిన నేను ఆస్వాదించిన ప్రతి వేప పండులోను నాకు అవగతమైంది. 

 

ఎందుకో భాధ, ఏ భాదైన తనకే చెప్పుకున్న.. ఈ భాధ ఎవరికీ చెప్పుకోవాలో కూడా తెలియలేదు పట్టేడంత దుక్కాన్ని పంటి బిగువున దాచుకోవడం నాకు అప్పటికే అలవాటయ్యింది. ఏంటో అది మా ఇంట్లో మేము గడపబోయే చివరి రోజు. మూలమీద వేరే ఇల్లు కిరాయికి తీసుకొని ఈ ఇంటిని వీరేశం దుకాణం వోళ్లకి అమ్మేసాము. 

ఆ రాత్రంతా నాకు నిద్ర రాలేదు ప్రతి గోడ, ప్రతి మూల మౌనంగా నను హత్తుకొని ఏడవడానికి సిద్ధంగా కనిపించాయి. 

తెల్లారి ఇంటివెనకాల భావిని తృప్తిగా చూసుకున్నాను. బొక్కేనతో   నీళ్ళు చేదుకొని త్రుప్తిగ స్నానం చేసి వేప చెట్టుకి అమ్మ పూజ చేస్తుంటే తన పక్కనే నిల్చొని దన్నం పెట్ట. 

“వేప చెట్టూ మరియు నేను” మా ఇరువురికే తెలుసు ఆ క్షణంలో మేము అనుభవిస్తున్న వేదన. ఓ మూగ వేదన నా మనసు తన మనసుకు దూరమవుతుందో లేక నా మనసే నాకు దూరం అవుతున్నదో తెలియట్లేదు. కంట నీరు బయట కక్కకుండా అదిమి పట్టుకున్న. 

నెమ్మదిగా కళ్ళు తెరిచిచూస్తే అమ్మ వేపచేట్టుని అమాతం వాటేసుకొని బోరుమని ఏడవడం కనిపించి ఇక నాక్కూడా  దుక్కం ఆగలేదు.  

నేను కూడా తనివి తీర నా యాప చెట్టుని వాటేసుకొని ఏడుస్తూ అలాగే ఉండి పోయా చాల సేపు…

 

ఏంటో ఈ అనుభంధం ఏదో విడదీయలేని ఓ ఆత్మీయ స్నేహం ఆ చెట్టులో దాగుందని నా నమ్మకం. భహుశ ఈ నమ్మకాలకే ఆత్మ దైవం అని పేరు పెట్టారు కాబోలు అని అనిపించింది. అదే గనక లేకపోతే ఎందుకు నా మనసు అల యధ్రుచికంగా ఆ రెండు చెట్లతో పెన వేసుకుపోయింది.

సైన్సు నా మనసులో కలిగే ఈ వింత భావానికి ఓ పిచ్చి పేరుని తగిలించి చేతులు దులుపోకోగాలదేమో గాని నాకు మరియు ఈ చెట్టూ మధ్యన ఎవరికీ కనిపించని ఓ ప్రేమ దాగుందని గుర్తించలేదు.

ఇదేం పిచ్చి అని కొందరు హేళన చేసిన పాపం మా పిచ్చి మనసులు అందరికి అర్ధమైతే ఎంతబవుండో. 

కనీసం కొందరికైనా ఈ పిచ్చి మనసు ఉండే ఉంటుంది అదే గనుక ఉండి ఉంటె ఈ మౌన ఆలంబనలు మరువలేనివి అని వారు కూడా నాతో ఎకిభావిస్తారు. 

అలాంటి మనసున్న వారందరు కూడా మొక్కలతో అనుభంధం పెంచుకుంటే జరిగే నష్టమేమి ఉండదు అని నా భలమైన నమ్మకం.

 మా చిక్కుడు చెట్టుకి మా వేప చెట్టుకి నా ఈ కథ అంకితం.

 

(నాకు దూరమైన చిక్కుడు చెట్టూ భాధ  మనసులోనుండి చేరిగిపోదేమో కాని. ప్రతి మూడునెల్లకో ఆర్నేల్లకో వెళ్ళినప్పుడు ఇప్పటికి మా పాత వీధిలోకి వెళ్తే అదే చిన్న గల్లి, మనుషులు మారారు, నాతో పెరిగిన పిలగండ్లకి పెల్లిలై పిల్ల పాపలతో కొత్త జీవితాలను మొదలు పెట్టారు. ఇళ్ళకు మెరుగులు దిద్ధికున్నాయి. అయిన అదే పచ్చని గల గల రావాలతో ఇప్పటికి అందరి కష్ట సుఖాలని పంచుకుంటూ మౌనంగా తనవంతు సాయం తను చేసుకుంటూ మారకుండా పదిలంగా మా యాప చెట్టూ కనిపించడం నాకు చాల ఆనందంగా ఉంటుంది.)

గడక రోజులు

December 6, 2012 Leave a comment

ఏంటో హైదరాబాద్ కి వొచ్చిన ఇన్నేళ్ళ తర్వాత మా రెండో వీధి చివరి గల్లి లో చిన్న హొటల్ ముందు తెల్ల గుడ్డ మీద రాసి ఉన్న నీలి అక్షరాలు “మొక్క జొన్న గడక ప్రతి శుక్రవారం” చూసి ఆశ్చర్య పోయాను. పిజ్జా బర్గర్లు, పాని పూరీలు, చాట్ మసాలాలకు అలవాటు పడిన మా కాలనీ జనాలకు అదేంటో కూడా తెలియక పోవడం పెద్దగా ఆశ్చర్యం కలిగించే విషయమేమీ కాకపోయినా దాని విలువ తెలిసినందరి మనసుల్ని అక్కడికి లాగేసినట్టుంది. పొద్దున్నుండే రిటైరు మాష్టరులందరు ముస్తాబై అక్కడే కూర్చున్నారు. నేను ఆఫీసు కి బయలుదేరుతుంటే..

 

బస్సు స్టాప్ వైపుకి నా నడక సాగుతున్న మనసు మాత్రం చిన్న నాటి గడక గిన్నేవైపుకు మళ్ళింది.

అవి మరి చిన్నప్పటి రోజులు. అంటే మా బాపమ్మ(నాయనమ్మ) బతికున్నప్పటి మాట మా పెంకుటింట్లో ముందు గదిలో మేముంటే వెనక గదిలో మా బాపమ్మ ఉండేది. ఆమె చలాకీగా తన పనులు తాను చేసుకున్న రోజులు చాల తక్కువగా చూసాను. నడుస్తుంటే జారి పడి తుంటి విరిగినప్పటి నుండి శ్వాస వోదిలేవరకు మంచాన పడి ఉంటె మా అమ్మే చూసుకుంది. దానికి తోడు ఆ రోజుల్లో ఆ రోజేంటి? ఏ రోజు కూడా తూలకుండ ఇంటికొచ్చిన రోజే లేదు మా బాపు. తను ఇచ్చే పది పరక రూపాయలతో ఇల్లు ఎలా నేట్టుకోచ్చేదో ఆలోచిస్తే ఇప్పటికి నాకు ఆశ్చర్యమే. కంట్రోల్ బియ్యం అయిపోయేంత వరకు అల్లం ఎల్లిపాయ కలిపి నూరిన కారంలో మిల్లులో పట్టుకొచ్చే పల్లి నూనె ను కలుపు కొని తింటూ రోజులు గడిచేవి. అవి అయిపోయకే  వీరేశం దుకాణం లో కాని  జెండా కాడి రాజన్న దుకాణంలో గాని ఓ కిలో బియ్యం తీసుకొచ్చుకుంటే  ఆ రోజు గడిచేది.

 

ఇక బాపు డబ్బులు ఇవ్వని రోజు అయితే రాజన్న దుకాణం కి కొంచెం ముందే ఎడం పక్కన ఉండే ఒంటికాలు కిష్టయ దుకాణం (ఒక ఆక్సిడెంట్ లో తన కాలు విరిగేసరికి అందరు అల పిలవడం మొదలయ్యింది అంతకు ముందు ఆయన్ని కంట్రోల్ కిష్టయ అనెటోల్లు అయన కంట్రోల్ షాపులోనే పనిచేసేవాడు.) లో కెళ్ళి ఓ కిలో నూకలు తెచ్చుకొనేటోల్లం.

 

మా అమ్మకి ఎవరు చెప్పారో ఏమో ఎల్లం బాజార్ (వరంగల్ బట్టల బజార్ కి తగ్గర్లో ఉండేది) కి నన్ను కూడా తోల్కబోయి ఓ దుకాణంలో నాలుగు కిలోలు మొక్కజొన్నలు, నాలుగు కిలోల పచ్చజొన్నలు పట్టుకోచ్చినం, ఎందుకు అమ్మ ఇవి అని అడిగితే రోజు గడక పోసుకుంధం అని చెప్తే అప్పటికి అదేదో కొత్తగా వినపడి కొత్త వంటకమై ఉంటుంది అనుకున్న అట్టా తీసుకోచ్చినమో లేదు అదే సాయంత్రం రాలచెట్టు కాడుండే  గిర్నికి నేను మా అక్క రెండు పెద్ద క్యాన్లలో వాటిని మోసుకు పోయి గడక పట్టించుకోని వొచ్చే సాము.

 

ఇక చీకటి పడుతుంటే ఒత్తి సరి చేసి చిమ్ని దీపంలో కిరోసినే పోసి వెలిగిస్తుంటే “పజ్జోన్నల గడక జేయకు పిలగాండ్లకు చేదు కొడతాది” అని మా బాపమ్మ చెప్తుంటే నాకు అర్ధం కాలేదు గాని మొక్క జొన్న గడక పెడుతున్న అని మా అమ్మ జెప్పింది (ఆ రెండింటికి తేడా ఏంటో కొద్ది రోజుల్లోనే తెలిసింది నాకు) ఇంటెనక కట్టెల పోయి దగ్గర ములుగురోడ్డులో మొన్న అంటే అంతకు మూడు రోజుల క్రితం పట్టుకొచ్చిన రెండు మడ్ల కట్టెలను పొద్దంత ఎండలో ఎండబెట్టింది అందులో నుండి ఓ నాలుగు కట్టెల్ని తీసుకొచ్చి పిడక మీద కొంచెం కిరోసిన్ పోసి వెలిగించి, మెల్లెగా పొయిలో పెట్టి ఆ చిన్న మంట మిధ ఒక్కొక్క కట్టే పేడులను పెడుతూ మెల్లగా  గొట్టం తో ఊదుతూ, కట్టెలకు మంట అందుకున్నాక మొక్కజొన్న గడకని కడిగి నీటితో నింపిన గిన్నెను మండుతున్న కట్టెల పొయ్యి మీద పెడుతుంటే, పేడతో అలుకు జల్లిన నేలపై నిక్కరు సర్దుకుంటూ కూసొని, చుట్టూ చీకటి వెలుగుతున్న పొయ్యి మంట వెలుతురు, మసగ్గా కనిపించే వెన్నల వెలుతురు, అప్పుడప్పుడు వీచే వేప చెట్టు గాలి మా అమ్మ పక్కనే మా అక్క కొంచే ఎడంగా చిన్న ఉప్పు డబ్బా, పోయి మీద నుండి గిన్న దింపడానికి సిద్ధం గున్న మసిగుడ్డ దానితో ఆడుకుంటూ నేను నా పక్కనే అయిపోయిన టానిక్ సీస లో కిరోసిన్ పోసి దాని మూతకి చిన్న రంధ్రం చేసి సన్నని గుడ్డ పీలిక మొదలుని వోత్తిగా చేసి మిగతా గుడ్డని సిసలోకి ముంచి మూత పెట్టి వెలిగించిన  చిన్న దీపం. ఇక నేను మండుతున్న నిప్పులవైపు, గిన్నేలో ఉడుకందుకుంటున్న గడకవైపు చూస్తూ అమ్మ అక్క ముచ్చట్లు పెట్టుకుంటుంటే వింటూ ఉండేవొన్ని, కాసేపటికి పప్పు దువ్వ వెనక భాగంతో గడక ఉండలు కట్టకుండా తిప్పుతుంటే తెల్లని పొగలు మెరుస్తూ వంకర్లు తింకర్లుగా గాల్లో కలిసిపోతుంటే అలాగే చూస్తుండేవొన్ని. 

 

ఆ గడక పూర్తోవుతుంటే కొంచెం ఉప్పు కలిపి మరి పలుచగా  కాకా మరి గట్టిగ కాక కొంచెం లూసు ఉండేలా చూసుకొని మసి గుడ్డతో దింపి పక్కన పెట్టి. చిటికెడు గడకని ఎడం చేత్తో తీసి గిన్నె చుట్టూ పోయి చుట్టూ తిప్పి పొయిలో వోదిలేది (సాధారణంగా ఏదైనా స్పెషల్ వంట చేస్తే అల దిష్టి తీస్తుంటుంది మా అమ్మ కాని అప్పుడు నాకు తెలియలేదు చాల రోజుల వరకు అదే మా రోజు వారి భోజనం అని).

 

ఇంటి ముందు వచ్చే పోయేటోళ్లని చూస్తూ కూర్చున్న మా అన్నని పిలిచి పైసలు చేతిల పెడుతూ పావుకిలో పెరుగు పట్టుకురమ్మని తోలింది, ఇక మా అన్నతో పాటే నేను మెల్లిగా నడుచుకుంటూ వీరారెడ్డి ధావకన కి  ఎదురుగా ఉండే ప్రకశోల్ల మార్వాడి దుకాణంలో పావుకిలో పెరుగు పొట్లం గడుతుంటే నా చూపులన్నీ గ్లాస్ అద్దం లోపల నుండి ఊరిస్తున్న మిక్ష్చర్, గులాబు జామున్ గిన్నె వైపే ఉండేది. పెరుగు కట్టడం అయింతర్వాత పైసలిచ్చి ఇగ మెల్లగా ఇంటికి చేరుకొనే సరికి ఇంటెనక బియ్యం బస్తా సంచులతో కుట్టిన తాయారు చేసిన పెద్ద సంచిని నేలమీద పరిచి ఓ చిన్న డబ్బాని బోర్లించి దానిపై రెండు దీపాలను పెట్టి, గడక గిన్నె, ఐదు పళ్ళాలు, మంచి నీళ్ళ చెంబులు, చిన్న జాడీలో పొద్దున నూరిన ఎల్లిపాయ కారం ముద్ద, పల్లి నూనె టిఫిను, అన్ని సిద్ధం చేసి పెట్టేది.

 

ఇక మేము రావడమే ఆలస్యం పెరుగు సంచి చేతిలో తీసుకుంటూ కల్జేతులు కడోక్కొని కూసొండ్లి అని చెప్తూ మా బాపమ్మకి పళ్ళెం సిద్ధం చేసి ఇంకో చేత మంచినీళ్ళ చెంబు పట్టుకెళ్ళి ఇచ్చే పనిలో ఉంటె మా అన్న బావి లో నుండి నీళ్ళు తోడి పెద్ద బకెట్ లో పోస్తుంటే లైబాయి సబ్బుతో కళ్ళు చేతులు కడుక్కొని పొడి తువల్లుతో శుబ్రంగా తుడుచుకొని సంచిలో కూచుంటే మా అన్నకి అక్కకి నాకు మూడు పళ్ళాలలో గడక పోసి నూనె కలిపినా కారం ముద్ద గడక పక్కనే వేసి ఇచ్చి తను కూడా ఇంకో పళ్ళెం సిద్ధం చేసుకొనేది.

 

చూపుడు వేలుతో కొంచెం తీసుకొని నాలుకకు అద్దుకున్న, పెద్దగా రుచించలేదు. ఇంకొచెం ఇంకొచెం అల తింటూ తింటుంటే కొద్దిగా రుచి మొదలయింది దానికి తోడు కారం అద్దుకుంటుంటే మరింత రుచి చేరుకుంది. ఒక దఫా పూర్తయ్యాక, మళ్లీ అన్ని పళ్ళాలలో గడక పోసి, పెరుగు మూట విప్పి గడ్డ పెరుగుని గిన్నెలో వేసి నీళ్ళు ఉప్పు కలిపి అందరికి కాస్త పలుచగా మజ్జిగ లాగ చేసి గంటె తో పోస్తుంటే నెమ్మదిగా జావా మాదిరి ఎలా చేసుకోవాలో అమ్మ చెప్తుంటే అలాగే కలుపుకొని తినడం రాక నేను పళ్ళెంతో ఆ జావా ని తాగుతుంటే గొంతులో నుండి కమ్మని రుచి గుండెలకు చేరేది. చాల కాలం తర్వాత జిహ్వ సంతృప్తి కలిగింది. పొట్ట నిండేలా గడకని ఆస్వాదించి.అన్ని సర్దుకొని ఇంటేనకాలే పక్కలేసుకొని నడుం వాల్చానో లేదు ఎప్పుడు నిద్రలోకి జారుకున్ననో గుర్తు కూడా లేదు.

 

సాధారణంగా మా బాపు పనికిబోయి రాత్రి ఎప్పుడో పన్నెండు ఒకటి గంటలకు వొస్తాడు. అప్పుడు నేను మంచి నిద్ర లో ఉంటాను. ఆ రాత్రి వొచ్చి తిని పడుకునే వరకు మా అమ్మకు ధడే ఇక గొడవ కొంచెం ఎక్కువైతే మా అన్న లేచి మా అమ్మని కొట్టకుండా చూసే టోడట. నేను పడుకోవడానికి ముందు వస్తే ఆ దడ నాకు కూడా పట్టుకునేది. గడక చేసిన రోజు మా బాపు తాగోచ్చిన యే లొల్లి పెట్టుకోకుండా తిని పడుకున్నాందుకు అమ్మ మనసు కాస్త కుదుట పడిందంట.

ఇక అప్పటి నుండి మొదలు వారం రోజులు మూడు పూటలా గడకే. ఇక మొక్క జొన్న గడక మత్తులో ఉన్న నాకు అది అయిపోయిందని  పచ్చ జొన్న గడక వండిందని తెలిసింది. అది అల తిన్నానో లేదు నోరంతా ఒకటే చేదు, అస్సలు తిన బుద్ధి కాలేదు, అప్పుడు గాని అర్ధం కాలేదు బాపమ్మ ఎందుకు వద్దని అందో. నేను తప్ప అందరు తినే వారు. ఎంత ఇష్టం పెంచుకుంధామన్న ఎందుకో చేదు గడక అస్సలు తినలేక పోయా. ఇక నా ఏడుపు తట్టుకోలేక కిష్టయ్య దుకాణంలో నూకలు తెచ్చేది.

ఇంకో వారం ఎల్లం బాజార్ కెళ్తే మొక్క జొన్నలే తీసుకో అవ్వోద్దని ముందే బెదిరిచ్చాను మా అమ్మని. ఆమె నవ్వుతు సరే సరే. అంది.

 

కొద్ది రోజులకి మా అమ్మ వెయ్యి రూపాయల చిట్టి తీసుకొని ఇంట్లో కూరగాయల దుకాణం మొదలు పెట్టింది. పొద్దునే ఐదు గంటలకు లేచి వెళ్లి వరంగల్ మార్కెట్ నుండి కురగాయాలు తీసుకొచ్చి. మా ఇంటి ముందు గద్దెల మీద ముందు గది లో రోజు పది పదకొండు వరకు అన్ని అమ్ముడపోయేవి. ఇక కూరగాయాల దుకాణం మొదలైనప్పటి నుండి గడకతో పాటు రోజుకో రకం కూరతో పళ్ళెం నిండేది. ఏం చేసిన పెరుగుతో కలుపుకొని తాగాడమంటే నాకు భలే ఇష్టం.

 

ఒక రోజు స్కూల్ లో కాయగూరలు పౌష్టిక ఆహరం గురించి పాటం చెపుతూ మధ్యలో టీచర్ అడిగింది. మీకు ఇష్టమైన వంటకలేంటి అని. అందరు వాళ్ళకి నచ్చిన వంటకాలు చెప్పారు. నేను టక్కున లేచి అన్నం, పప్పుచారు, గడక, పెరుగు అని చెప్పా అంతే మా క్లాసు పిలగండ్లంత వింతగా చూసారు, ఆ టీచర్ నా నోట గడక మాట వినగానే అదేదో అశుద్ధం తినే వాడిలా ఒక్క సారి మొహం అంత వికారంగా చేసుకుంటూ గడక పేరుగా… అని దీర్గం తీస్తూ మరి వెకిలిగా నవ్వే సరికి క్లాస్ మొత్తం గొల్లున నవ్వింది. అంతే నాలో నేను కుంచించుకుంటూ తల నేలకేసుకొని బెంచిలో కూర్చొన్న. ఎందుకల నవ్విందో అర్ధమే కాలేదు. ఒక్క సారిగా అందరు నన్ను వెలివేసినట్టుగా పిచ్చి పిచ్చి ఊహలతో స్కూల్ ఐపోయింది. తిన్నగా ఇంటికొచ్చి అమ్మకి ఈ విషయం చెప్పల వద్ద అమ్మతో ఇలాంటి విషయాలు చెప్పాలంటే కాస్త భయం ఎందుకంటే విషయానికి ముందు నాకు వొచ్చేది ఏడుపే, ఏడుపు ఆపుకొని చెప్పలేను కాబట్టి, ఇంటికెళ్ళగానే, మెల్లెగా అమ్మ వొళ్ళో తల పెట్టుకొని, అమ్మ మనం గడక ఎందుకు తింటున్నాం అని నెమ్మదిగా అడిగా  నా ప్రశ్నకు “మనం ఆరోగ్యంగా ఉండాలని నీకు చదువు మంచిగా రావాలని మనకు దేవుడు ఇది ఇచ్చాడు.”  అని తడి కళ్ళు కొంగుతో వొత్తుకుంటూ చెప్తుంటే నాకు దుక్కం ఆగలేదు. దగ్గరకు వాటేసుకుంటుంటే  వెచ్చని అమ్మ వొడిలో నా ప్రశ్నలన్నిటికీ  సమాధానం దొరికింది. ఇక టీచర్ విషయం చెప్పాల్సిన అవసరం లేదనిపించింది.

 

ఆ రోజు రాత్రి కలలో టీచర్ కొరడాతో వెంట బడడం ఆమె వెనకాలా నా క్లాసు పిలకాయలంత గడక గడక అంటూ అరుస్తూ కేకలు పెడుతుంటే వారిని తప్పించుకుంటూ నేనొక్కడినే పరుగులు పెట్టడం. అదేదో దేశం లో తప్పు చేస్తే రాళ్ళతో కొట్టి తరిమినట్టు నేను గడక తినడం పాపంగా నను వెంటాడుతున్నట్టు భయంకరమైన కలొచ్చింది. ఒళ్ళు జలదరించి నిద్ర మధ్యలోనే ఉలిక్కి పడి లేచాను. నా మిధ చేయి వేసి పడుకున్న అమ్మ ఒక్క సారిగా మేలుకొని ఏమైంది అంటూ నా ఒళ్ళు చూసింది “జ్వరం”. వెంటనే జిందా తిలిస్మాత్ రెండు చుక్కలు చెంచాలో కొన్ని నీళ్ళతో కలిపి తాగించి చాతికి ముక్కుకి గొంతుకి కూడా రాసి జోకుడుతుంటే నిద్రలోకి జారుకున్న. పొద్దుటికి  జిందా తిలిస్మాత్ దెబ్బతో జ్వరం గిరం అన్ని బలాదూరు (జిందా తిలిస్మాత్ తో మా ఇంటికున్న అనుభంధం గురించి చెప్తే అది పెద్ద నవలే అవుతుంది.)

 

పొద్దున్నస్కూల్ కి రెడీ అయి అమ్మ కలిపి ఇచ్చిన గడక చూడగానే టీచర్ గుర్తొచ్చింది. టీచర్ మీద కసి తో నాలుగు ముద్దలు ఎక్కువగానే తిన్నాను.

 

రోజులు గడుస్తున్న కొద్ది పరిస్థితుల్లో కొంచెం మార్పు వచ్చి తెల్ల రేషన్ కార్డున్నోల్లందరి దగ్గరా రెండ్రుపయాల కంట్రోల్ బియ్యం ఏడెనిమిది రూపాయలకు పట్టు రావడం తో  గడక జాగా లో అన్నం వండుకోవడం మొదలయ్యింది.

 

ఏంటో రోజులుతో పాటు మార్పుకు గురైన జీవితాలు వాటి తో పాటే పరిస్థితులు ఎంతగా మారిన పెరుగు కలుపుకొని తాగిన ఆ గడక రోజులు ఆ రుచులు  ఇంకా గుండెను వదలలేదు.

ఎలాగైనా ఈ సాయంత్రం ఈ రోజుని ఆ నాటి గడక రుచితో ఆస్వాదించాలి అనుకుంటూ ఆఫీసు లోకి అడుగుపెట్టాను.

తెల్ల బూట్లు

December 6, 2012 Leave a comment

 

సాఫీగా సాగుతున్న నా స్కూల్ ప్రయాణంలో ఆ గంబీరమైన రోజు రానే వచ్చింది.

“పిల్లలు ప్రతి శుక్రవారం వైట్ డ్రెస్, వైట్ షూస్ వేసుకొని రావాలి. మీ పేరెంట్స్ కి చెప్పి వెంటనే కుట్టించుకోండి. సరేనా.. “

“సరే.. టీచర్” అని నేను కూడా వంత పాడాను అందరు పిలగాండ్లతో…

 

ఇదే విషయం అమ్మకు చెప్పాను. “తెల్ల బట్టలా..” అని వెలితిగా చూసింది.

ఆ.. అవును తెల్ల బట్టలే.. వేసుకెల్లకపోతే పనిశుమెంటట..

చెప్పిన ఐదారు వారాలకు గాని కుట్టించలేదు. నాకు మా అక్కకి.

అప్పటి దాక శుక్రవారం వొస్తుందంటేనే ఎదోల అనిపించేది.

తెల్ల బట్టలైతే వేసుకొన్నాను. కాని తెల్ల బూట్లు మాత్రం రాలేదు.

 

ఒక సారి మాములుగా నిల్చోబెడితే మరో సారి గోడ కుర్చీ వేయించేవొళ్ళు. అప్పటి వరకు ఎప్పుడు పనిష్మెంటు అంటే ఎరుగని నాకు నా పరిధిలో లేని బూట్ల విషయం కోసం వేయల్సోచ్చింది.

 

అమ్మ కి అంతకు ముందే చెప్పాను, తెల్ల బూట్లు కావాలని. ఒక సారి చెప్పాను కదా, మళ్ళీ మళ్ళీ చెప్పడమెందుకని చెప్పలేదు.

గోడ కుర్చీ విషయం అమ్మ కి తెలిస్తే తను తట్టుకోలేదు అందుకే ఇది కూడా చెప్పలేదు.

తెల్ల బూట్ల కోసం అందరు చూస్తుండగా దుఖ్ఖం దిగమింగుకొని తప్పు చేసినోడిలా తల కిందికేసుకొని గోడ కుర్చీ వేసేవోన్ని.

అప్పట్లో నాకు అర్ధం కాని విషయం నా పక్కన కూసునే వోల్లందరికీ వచ్చినట్టు నాకెందుకు రాలేదా ఈ తెల్ల బూట్లు అని.

 

సాధారణంగా శుక్రవారమంటే నాకు ఇష్టం. మా పాత స్కూల్ (ఏడో తరగతిలో స్కూల్ని మచిలిబజార్ నుండి ఉజిలిబెస్ కి మార్చినారు. ఇది ఐదో తరగతి నాటి మాట) ఎదురుగా కూలిపోయిన గోడలు ముళ్ళ చెట్లు దాని వెనకాల కాలి స్థలం అది మాబోటి పిలగాండ్లకి ఆటస్థలం. మట్టి గోడల పక్కనే మసీదు ఉండేది. ప్రతి శుక్రవారం మధ్యానం పూట నమాజు కోసమనే గల్లిలల్ల ఉన్న ముస్లీములంత లాల్చి పైజాములు వేసుకొని వొచ్చేటోల్లు. మొదటి అంతస్తులో మా క్లాసు. ప్రతి శుక్రవారం నమాజు, మైకు గొట్టం నుండి పెద్దగ వినపడేది. కిటికీ లోనుండి తొంగి చూస్తూ నమాజుకోచ్చిన జనాలని, దూరంగా ఉన్న గుట్టలని, కొంచెం వంగి చూస్తే రెండు చెట్ల గుట్ట (పెద్దవిగ ఉండడంతో ఆ పేరొచ్చింది. ఆ చెట్ల గురించి చాల కథలు కథలుగా చెప్పుకునే వారు), దానికి అనుకోని ఉన్న ఓ పెద్ద రాయి, వినాయకుడిని పెట్టె చోటు, అన్ని చూస్తూ ప్రశాంతంగ  వీస్తున్న గాలి సవ్వళ్ళను ఆస్వాదిస్తున్న నాకు.  రఘు వైట్ షూస్ వేసుకురాలేద అనడంతో చటుక్కున మెలకువ వచ్చి మల్లి దడ మొదలయింది. ఈ బూట్ల గొడవ తగిలిన కాడి నుంచి మనసు మనసులోనే లేదు. అనుకుంటూ, లేదు టీచర్ వేసుకురాలేదు. అని చెప్పాను, ఇంకేవరెవరు వేసుకు రాలేదు. అందరు వచ్చి గుంజీలు తీయండి. అని చెప్పడం తో నాకు తోడుగా మూడు డబ్బాల కాడి హరి, శంకర్ వచ్చాడు.

తల ఇరవై గుంజీలు తీసి, నాలో నేను కుంచించుకు పోతు గబుక్కున వచ్చి నా జాగా లో కూర్చున్న.

 

బెల్లు మోగడంతో పరుగుపరుగున అందరితో బాటు పుస్తకాల మూటని బుజాలకేసుకొని నిక్కరు సరి చేసుకుంటూ గబా గబా మెట్లు దిగి కింది కొచ్చి అక్కయ కోసం చూస్తూ నిల్చున్న..

కళ్ళలో నీళ్ళు తెచ్చుకుందేమో ఎదోల ఉంది. ఏమి మాట్లాడలేదు. ఇద్దరం కలిసి ఇంటి ముఖం పట్టాం. ఇంట్లో అడుగు పెట్టాకా గాని నోరుతేరవలేదు అక్కయ.  ఉన్నపలానా ఏడుపందుకుంది. వైట్ షూస్ వేసుకురలేదని టీచర్ కొట్టిందని.

 

ఈ ఆదివారం చౌరస్తాకి బోయి కొందాం ఊరుకో అని చెప్పడం తో ఊరుకుంది. అక్కయతో పాటు నాక్కూడా కొనిస్తుంధిగా మళ్లీ నేనేడవడం ఎందుకు అనుకున్నాను.

 

తెల్లారితే శనివారం. ఆదివారం గురించి, చౌరస్తా గురించి, ఆలోచిస్తూ ఒక్క పూట గడిచిపోయింది. ఎందుకో నాకు ఊహ తెలిసినప్పటి నుండి హన్మకొండ  చౌరస్తా అంటే ఎక్కడలేని అభిమానం నాకు, కొత్త బట్టలకి, కొత్త పుస్తకాలకు, మా చిన్నమ్మని బస్సు ఎక్కించేందుకు, స్టౌ బర్నాల్ రిపేరుకు, పళ్ళు కొనుక్కోవడానికి, గాజులు, వంట గిన్నెలు, ఇలా రకా రకాల కోసం చౌరస్తాకి మా అమ్మ నన్ను తోలుకుబోయేది.

 

ఎప్పుడైనా చౌరస్తాకు బోతున్నాం అని చెప్తే చాలు, మొఖం కడుక్కోచ్చుకొని చిన్నగా గుండ్రటి డబ్బాలో ఉన్న పౌడర్ని దూది పువ్వుతో మొఖానికి  రాసుకొని తయారయ్యేటోన్ని.

 

అనుకున్నట్టుగానే ఆదివారం వచ్చింది. మొన్న మొదలయిన నా సంబరం, ఈ రోజుకి పెరుగుతూ పెరుగుతూ నాలుగింతలు ఎక్కువైంది. ఈ రోజు కొనే బూట్లని వేసుకెల్లడానికి  శుక్రవారం ఎప్పుడేప్పుడువొస్తుంద అనేకాడికి చేరుకుంది నా సంబరం.  

 

ఎప్పటి లాగే రోడ్డుకిరువైపు జరుగుతున్న, కనిపిస్తున్న దృశ్యాలను చూస్తూ, ఏవేవో ఆలోచిస్తూ, అమ్మ వేలుని గట్టిగ పట్టుకొని నిక్కరు సర్దుకుంటూ మూతి ముక్కు తుడుచుకుంటూ, నడుచుకుంటూ, ఇరవై నిమిషాలకు గాని చేరుకోలేదు చౌరస్తాకి.

 

ఎప్పుడు వెళ్ళే గడ్డం మూసలయన ఉండే చెప్పుల షాపుకి వెళ్ళాం. నా ముప్పై రూపాయల పారగన్ చెప్పులు, నా నల్ల బూట్లు వాటికి కట్టుకొనే దారాలు సాక్సులు  గీడనే కొనుక్కున్నాం.

 

ముందు అక్కయ్య కోసమని చుపెడుతున్నాడు. చూస్తున్న కొద్ది ఎప్పుడెప్పుడు నాకు చూపిస్తాడ అని, నా చెప్పులు పక్కన విప్పి కాలి కాళ్ళతో నిల్చుని చూస్తున్న. అన్ని చూసిన  కాసేపటికి ఒకటి సెలెక్టు చేసుకుంది అక్కయ.

 

ఇక నావంతుగ వెళ్లి పొట్టి బల్లపై కూర్చున్న అన్ని చూపిస్తున్నాడు. ఒకటి వేసుకున్నాను. ఆ మంచిగున్నాయ్ చాలు. అని చెప్పి, డబ్బల బెట్టి కవర్లో పెట్టి ఇవ్వు అని చెప్పి లేచాను.

 

ఎత్తు పట్టీల చెప్పుల వైపు చూస్తూ అక్క, నా సంబరం లో నేను,  బెరమాడడంలో అమ్మ.

 

నాకు ఏమి వినిపించలేదు ఆ బేరాలు, కాని చివరకి ఒకటి మాత్రం చక్కగా వినపడింది. “ఆ చిన్న బూట్లు తీసేయ్ ఇప్పుడు డబ్బులు లెవ్వు” అని అమ్మ అనడం.

 

అప్పటి వరకు ఉన్న సంతోషమంత చప్పున ఆగిపోయింది. ఎం జరిగిందో తెలియదు. ఎలా జరిగిందో తెలియదు. కాని నన్ను మురిపిస్తూ ఊరించిన తెల్ల బూట్లు నాకు సొంతం కాలేదని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది.

ఒక్క సారిగా అన్ని గుర్తొస్తున్నాయి.

వెక్కిరిస్తూ గుంజీలు తీయమంటున్న టీచర్, ఒరిగి కూర్చున్న గోడ కుర్చీ, అదే బయంతో దడ పుట్టించే శుక్రవారం.

ఎప్పుడొస్తుంద అనే ఎదురుచూపులు -క్షణంలోనే అయ్యో మళ్లీ వస్తుందా.. అనేస్తాయికి నేట్టుకున్నాయి నా ఆలోచనలు.

 

వేలాడదీసిన  తెల్ల బూట్లు నన్ను చూసి వెకిలిగా నవ్వుతున్నాయి.

ఏంటో చిన్నప్పటినుండి “సరోజనమ్మ పిల్లలు చూడు తల్లి చెప్పినట్టుఇంటరు” అని వాడ వాడ మొత్తం కలిసి ఇచ్చిన బిరుదుని మోసుకుంటూ ఉన్న నాకు అది గుర్తుకురావడంతో ఎక్కడ ఆ బిరుదుని పొడగోట్టుకుంటానో  అని, అమ్మ మా టీచర్ కొడుతది నాక్కూడా కావలి తెల్ల బూట్లు అని నోరు తెరిచి అడగలేక పోయా..

ఆయినా తనకి తెలియదా నాక్కూడా కొనాలని, డబ్బులు సరిపోలేదు అని నాకు నేను  సర్దిపుచ్చుకుంటున్న కూడా,

లోలోపల దుఖ్ఖం తన్నుకుంటూ వస్తుంది.

వస్తున్న దుఖ్ఖంని దిగ మింగుకుంటూ బారంగా పడుతున్నాయి నా అడుగులు.

అమ్మ బుధరకిస్తూ ఏమోమో చెప్తుంది కాని ఒక్కటి కూడా వినపడట్లేదు.

 

అన్ని గల్లిలూ మూల మలుపులు తిరుగుతూ లక్కాకుల పద్మారావు దుకాణంకు ఆనుకొని ఉన్న ముసలవ్వ డబ్బా కిరాణంలో బెల్లంతో చేసిన ప్యాలాల ముద్దలు ఓ ఆరు కొని ఒకటి నాచేతి కిచ్చి మిగతావి దస్తి (కచ్చిఫు) లో మూట కట్టి, నడుచుకుంటూ వెళ్తుంటే, అరచేతిలో నిండిన ప్యాలాల ముద్ద కొరికాను, ఎందుకో రుచించలేదు, క్షణనికొకసారైన వోద్దన్న బయటికోస్తున్నాయి కన్నీళ్ళు.గబా గబా తుడుచుకుంటూ వెళ్ళాను. దుప్పటి ముసుగులో కన్నీళ్ళతో యుద్ధం చేస్తూ ఎప్పుడు నిద్రలోకి జారుకున్ననో తెలియలేదు.

 

మళ్ళీ శుక్రవారం రానే వచ్చింది. ఆ రోజు అర చేతిని తిప్పి మట్టెల మీద రూలు కర్రతో రెండు దెబ్బలు వేసింది టీచర్. ఉన్నపలానా బయటపడ్డాయి దిగామింగుకున్న కన్నీల్లన్ని. ఎవరికి ఎలా చెప్పాలో తెలియని పరిస్థితికి సమాధానంగ కన్నేల్లె మిగిలాయి. ఇదే అవకాశంగ బావించి ఉన్న దుక్కన్నంత బయటికి కక్కాను. కక్కిన తర్వాత కాని మనసు కుదుట పడలేదు. ఈ సంగటన తర్వాత దుక్కన్ని దిగామింగుకోవాల్సిన పరిస్థితి మళ్లీ ఎదురవుతుందేమోనని  ఇప్పటి వరకు దేని పైన ఆశ పెట్టుకోలేదు. 

అదే రోజు సాయంత్రం మా పిలగాండ్లంధరిని ఆటలాడించడానికి కాలి అట స్థలానికి తీసుకెళ్ళారు, తెల్ల బూట్లు లేని మమ్మల్ని వొదిలేసి.

సాధారణంగానే నేను ఆటలకి దూరం, ఆరోజుతో నాకు ఆటలంటేనే విరక్తి కలిగింది.

 

ఇంటికొచ్చాను దేని గురించి కూడా అమ్మకు చెప్పలేదు. అనాసక్తిగానే అన్ని పూర్తి చేసుకున్నాను. అక్కయ అన్నయతో పాటే బైరిశెట్టి సమ్మయ్య వాళ్ళింటికి టీవీ లో వచ్చే చిత్రలహరి చూడడానికి వెళ్ళాను. అది కూడా నచ్చక పోవడంతో ఇంటికొచ్చాను. త్వరగా ఇంటికి తాగొచ్చిన బాపుతో భయంతో గడపలేక గ్లాసుడు మంచినీళ్ళు తాగి మళ్లీ టీవీ కాడికెళ్ళ. చిత్రలహరి అయిపోయినాక ఇంటికెళ్ళేసరికి బాపు పడుకున్నాడు.

పుస్తకాల సంచిని ముందేసుకొని చూచి రాతలు పూర్తి చేసుకుంటుండగా గుర్తొచ్చింది. వారం క్రితం స్కూల్లో అడిగిన ప్రశ్న “పిల్లలు ప్రతి మనిషికి ఒక లక్ష్యం అంటూ ఉండాలి. మీరు మీ మీ లక్ష్యలేంటి” అని అడిగిన ప్రశ్నకు ఎవరికి తోచ్చినట్టు వారు డాక్టర్, లాయర్, పోలీసు అని చెప్తుంటే నేను మాత్రం ఇంకా ఏమి అనుకోలేదని చెప్పా. అది గుర్తొచ్చి అప్పుడు నిర్ణయించుకున్నాను “నా జీవిత లక్ష్యం తెల్ల బూట్లు కొనుక్కోవడమని”. ఎక్కడ మరిచిపోతనోనని చూచి రాత నోట్ బుక్ లో రాసుకొని భద్రపరుచుకున్న ఆ లక్ష్యాన్ని ఆ బుక్కుని.

 

మా అమ్మ స్కూలుకొచ్చి ఫీసు కట్టినప్పుడు ప్రిన్సుపాల్ మాడంతో  ఎం మాట్లదిందో ఏమో అప్పటినుండి ఏ టీచర్ కూడా తెల్ల బూట్ల గురించి అడగలేదు. స్కూల్ చదువు పూర్తయేంతవరకు కూడా తెల్ల బూట్లు కొనుక్కున్న దాకలాలు లేవు.

 

**

 

మొన్నీ మధ్య ఆ  చిన్న నాటి చూచి రాత బుక్ తీసి చూసా.

బుక్ చివర్లో “తెల్ల బూట్లు కొనుక్కోవడమే నా జీవిత లక్ష్యం” అని రాసుకున్న మాటలు, ఇప్పుడు నవ్వు తెప్పించాయి.

 

ఆ తెల్ల బూట్లతో జీవితంలో చాల నేర్చుకున్నాను.

-దేని పై ఆశలు పెంచుకోకపోవడం,

-ఒకరిస్తారు అని ఎదురుచూడకుండా కష్టపడి సంపాదించుకోవడం.

-ఏదైనా ఉచితంగా దొరికితే, అంతే విలువైనదేదో నా నుండి దూరమైంధనో లేక  దూరం కబోతున్నధానో అని నిర్ణయించుకోవడం.

-కోరుకున్న ప్రతీది తప్పక తీరుతుందనే ధైర్యం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే నేర్చుకున్న..

 

సంపాదించడం మొదలు పెట్టిన తర్వాత గడిచిన ఇన్నేళ్ళలో ఎన్నో తెల్ల బూట్లను నా కాళ్ళతో కసితో తోక్కేసిన, మొదటి సారి తొడిగినా ఆ తెల్ల బూట్లు కాసేపు మదిలో వేలాడి వెక్కిరించాయి.

శ్యామల

December 6, 2012 Leave a comment

రఘు రఘు

వెనక్కి తిరిగి చూసాను, ఎవరో అర్ధం కాలేదు.

క్షణకాలం కష్ట పడిన చివరికి తన ఉంగరాల జుట్టు, చెవి దుద్దులని చూసి గుర్తుపట్టాను.

చాల కాలం, దాదాపు పదేళ్ళు దాటింది అనుకుంట మళ్ళి కనిపించింది శ్యామల.

పదేళ్ళలో జరిగిన మార్పంతా  తన ఒంట్లో కనిపిస్తుంది.

బక్క పలుచగా, ఏమాత్రం కళ లేకుండా మారింది తన రూపం. చాల దీన స్థితి అలుముకుంది తన కట్టుబట్టల్లో.

కుడి చేయి వేలు పట్టుకొని వెంట్రుకలు సరి చేసుకుంటూ లంగా ఓని లో ఏడేళ్ళ పాప, చిముడుముక్కును తుడుచుకుంటూ ఎడం చేయి చంకలో నాలుగేళ్ల పాప తో నాకు ఇలా  దర్శనం ఇస్తుందని ఎన్నడు ఊహించలేదు.

నను చూడగానే విప్పారిన కళ్ళతో, సంతోషపు నవ్వుతో ఎలా ఉన్నావ్ రఘు? చాల రోజులయ్యింది.

చాల సన్న బడినట్టున్నావ్. వెంటనే నువ్ కూడా చాల మారవు అన్నాను.

కాసేపాగి మళ్లీ ధర్మేంద్ర ఎలా ఉన్నాడు.

పర్లేదు.

దుబాయిలోన? ఇక్కడ?

ఇప్పుడు ఇక్కడే ఉంటున్నాం.

కాసేపటికి మళ్లీ చొరవ తీసుకొని అంత క్షేమమే కదా అన్నాను.

చూస్తున్నావ్ కదా ఇలా ఉన్నాను.

ఏమని చెప్పను అంతా  మారిపోయింది రఘు,

నాకు సర్వస్వం తానే అనుకున్న ధర్మకి అనుక్షణం నేను లోకువయ్యాను, అని చెపుతూ కర్చిపు తో  కళ్ళు తుడుచుకుంది.

పిల్లల్ని చూసుకుంటూ బ్రతకడం తప్ప నాకు ఈ లోకంలో పెద్దగ బ్రతికి సాధించేది ఏమి లేదు రఘు. అని చెప్తూ భుజంపై గోర్లతో రక్కిన గాయాన్ని కొంగు తో కప్పుకుంటు తల కిందికేసుకుంది.

నా కళ్ళు తన ఒంటిపై ఉన్నకొన్ని మానుతున్న, కొత్తగా చేరిన గాయాలపై ఉన్నాయి. నాకు వినపడేలాగా ఇంకా ఏదేదో చెప్పింది కాని నాకు వినపడలేదు.

తనని ఎక్కువ సేపు అలా చూడలేక మళ్లీ కలుస్తానని చెప్పి అక్కడినుండి ముందుకు కదిలిన, నా కళ్ళు మాత్రం తన గాయల్లోనే నిలిచాయి

.

వడి వడిగ నా అడుగులు రేతిఫైల్  38x  38ex  బస్సులు నిలిచెచోటుకు సాగుతున్నాయి. చూపులు మాత్రం తన గాయాల మాటున దాగిన నిజమైన శ్యామల కోసం వెతక సాగాయి.

 

**

ప్రతి రోజు పట్టు లంగా, ఒత్తుగా పొడుగ్గా ఉండే రింగుల జుట్టుని సగానికి విడతీసి రెండు జడలని పాయలుగా అల్లుకొని మడిచి మాచింగ్ రిబ్బన్లను కట్టుకొని ఒకరోజు కనకాంబరం, మరో రోజు మల్లెపూలు, ఇంకో రోజు చిన్న చామంతులు, గులాబీ లు, మందార, బోడ్డుమల్లె, సెంటుమల్లె ఇలా ఏ రోజు కూడా తలలో పూలు లేకుండా కనిపించేది కాదు.

నుదుట టిక్లీ దానికింద రెండు బొమ్మల మధ్య చిన్నగా కుంకుమ, నుదురు మధ్యన అడ్డంగా చిన్న తెల్ల బొట్టు, కను రెప్పల నిండుగా చిక్కని కాటుక, చెవులకు దుద్దులు, ఒక్కోసారి ఊగుతూ ఉండే చిన్న కమ్మ బుట్టాలు చూపు తిప్పుకోలేని సుందర లావణ్యం తన రూపం, పేరు శ్యామలే కాని రంగు ఎరుపే. ఇంగ్లీష్ మీడియం లో చదువుతున్నననే  గర్వం తన నానమ్మ చెప్పే మాటలతో తెచ్చుకుంది. మీసాల నరిసింహులు గారి ఒక్కగానొక్క కూతురు. ఎప్పుడు డాబు దర్పం చూపిస్తుండే వారు. దాదాపుగా పువ్వుల్లో పెరిగిందనే చెప్పుకోవాలి. తాతా గారి సంగీత కౌశల్యం శ్యామలని  లక్ష్మి గారి ఎదురుగా సంగీత పీటమీద కూర్చోబెట్టింది. అందరితో ఎలా ఉండేదో ఏమో తెలియదు కాని, తను, నేను, శ్రావణి, హరీష్ మేమంతా కలిసుండేవాళ్ళం. 

 

ఓ రోజు హరీష్ అరేయ్ రఘు శ్యామలని పెళ్లి చేసుకోవాలనుంది రా.

తనకి చెప్పావా, 

చెప్పే ధైర్యం నాకు లేదు రా,

అని చెప్పడం తో తెలిసింది వాడికి ప్రేమించడం తప్ప ఇంకేం తెలియదని.

 

నేను మరికొందరు ఇచ్చిన ధైర్యంతో ఓ రోజు భద్రకాళి గుళ్ళో ధైర్యం చేసి చెప్పాడు. ఎంత ప్రేమగా చెప్పాడో అంతకు వ్యతిరేకంగా సమాధానం వచ్చింది.

నువ్వంటే నాకు ఇష్టం లేదు హరీష్, నువ్వు నాకు సూట్ అవుతావ? సారి హరీష్ నాకు ధర్మ అంటే ఇష్టం. తను దుబాయి కి వెళ్లి కొన్ని రోజులకు నన్ను తీసుకెళ్తడంట.

నువ్వు కనీసం హైదరాబాద్ కూడా వెళ్ళలేవు. నన్నెలా చూసుకుంటావు.

ఇలాంటి బాధ పెట్టె మాటలతో భాధ పెట్టి, నిన్ను భాధ పెట్టినందుకు ఐ యాం సారి అని చెప్తూ వెళ్లిపోయింది.

 

పాపం నాకు ఆ క్షణంలో తప్పు ఎవరిదో నిర్ణయించలేక పోయింది నా మనసు.

 

ధర్మ వెళ్ళిన రెండేండ్లకు కాని తిరిగి రాలేదు. రెండేండ్ల వరకు హరీష్ శ్యామల కోసం తనను తాను మార్చుకొని తనకోసం తనకు తెలియకుండా ఎన్నో చేసాడు  తన జ్ఞాపకాల తోడు తో.

 

చిన్న నాటి చూచి రాతల కానుండి, వాడి పోయిన పువ్వుల వరకు,

ఊడిపోయిన పక్క పిన్ను కానుండి, వెంట్రుకల వరకు బద్రంగా దాచుకునే వాడు, సినిమాల్లోలాగా.

 

నేను ఎన్నో సార్లు చెప్పి చూసాను వినలేదు. రెండేళ్ళ తర్వాత మళ్లీ తనపై ప్రేమను చంపుకోలేక అడిగాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని.

 

వద్దు హరీష్ ధర్మ నెల రోజుల్లో వస్తున్నాడు. ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోవాలని.

 

నేను చదువుకోవడానికి లండన్ వెళ్తున్నాను. నువ్వోప్పుకుంటే మా ఇంట్లో వాళ్ళతో వచ్చి మీ నాన్న ని ఒప్పిస్తాను నిన్ను కూడా నాతో పాటు తీసుకెళ్తాను.

చాల మౌనం తర్వాత

వద్దు హరీష్, ఇప్పటికి నా మనసులో ధర్మ నే ఉన్నాడు.

 

తన తో మౌనంగా గడిపిన జ్ఞాపకాలను మూట గట్టుకొని హరీష్ లండన్ కెళ్తే,

ఏదో సాధించానన్న గర్వం తో వచ్చి వాలాడు ధర్మ దుబాయి నుండి.

 

హాయ్ రా ధర్మ ఎలా ఉందిర దుబాయ్?

దుబాయ్ కేంధిర మామ మస్తుగుంది. గీడేముంది సున్నా ఆడైతే మస్తు డబ్బులు. అని చెప్తున్నా వాడిని చూస్తే బహుశ మనసెందుకో వీడు చాల మారిపోయాడు అని చెప్పింది. ప్రతి మాటలో డబ్బు తప్ప ఇంకేం కనిపించలేదు.

 

కాంట్రాక్టు ఐపోయింది మామ పెళ్లి చేసుకొని మళ్లీ వెళ్దామని వచ్చాన్ర.

శ్యామలకి నువ్వంటే ఇష్టం రా, ఎందుకు ఇష్టం ఉండదు. ఎంతైనా దుబాయి లో ఉంటున్న కదా. పెళ్లి చేసుకుంట వీలైతే తీసుకెళ్త.

 

వీలైతే తీసుకెళ్త అనే మాటల్లోనే తెలిసిపోయింది శ్యామల మీద ప్రేమ ఎంత ఉందో.

చూడ్డానికి మంచి అందాగాడు, పొడువు కు తగ్గ శరీరం, బయటికి కనిపించే అందం మనసులో లేక పోవడంతో ఇప్పటికి వాడంటే నాకు సదాబిప్రాయం లేదు.

 

బక్క పలుచగా దొడ్డు కల్లద్ధాలుండే హరీష్ ని శ్యామలే కాదు ఏ అమ్మాయి ఎందుకు ఇష్టపడదో నాకు అర్ధమైంది. అలా అని అందరు ఆడవాళ్లు శ్యామలలాగ ఉంటారని కూడా చెప్పలేను.

 

ఒకానొక రోజు ధర్మ శ్యామల ఇంటికెళ్ళి పెళ్లి విషయం ధైర్యంగానే అడిగాడు. కుల పట్టింపులతో ఛి కొట్టాడు. ఏమనిపించిందో ఏమో. అంతే కోపంతో మరుసటి రోజు భద్రకాళి గుడి లో సమావేశం నేను ధర్మ, శ్యామల మరో కొందరు మిత్రులు,

 

మేము లేచిపోయి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నం. అని చెప్పాడు ధర్మ.

ఈ నిర్ణయం ప్రేమతో తీసుకున్నాడ లేక ఎమోషనల్ గ తీసుకున్నాడో నాకు అర్ధం కాలేదు.

ఇప్పుడు లేచి వెళ్లి పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదని చెప్పడానికి ప్రయత్నించలేక పోయా..

తనే సర్వస్వం అనుకుని బ్రతుకుతున్న శ్యామల కళ్ళల్లో తెలియని ఆనందం నా సలహాని చంపేసింది.

 

ధర్మాని ఒంటరిగా కలిసి అడిగాను నిజంగా నీకు తానంటే ఇష్టమేనా అని

ఇష్టమే మామ పెళ్లి చేసుకుంటాం. పెళ్ళైన మూడు నెలలకి నేను దుబాయ్ కెల్తాను  వెళ్ళిన మరో రెండు నెలలకి తనని కూడా తీసుకెళ్తాను.

 

ఓ వారం తర్వాత శ్రావణి చెప్పే వరకు కూడా నాకు తెలియలేదు వారిద్దరు లేచి పోయి పెళ్లి చేసుకున్నారని. ఈ విషయం విని ఆశ్చర్యపోయాను. ఎం జరిగిందో ఎలా జరిగిందో నాకు కూడా తెలియక పోవడం నిజంగా ఆశ్చర్యమే.

 

**

దాదాపు మళ్లీ పదేళ్ళ తర్వాత తనని ఇలా చూస్తాననుకోలేదు.

నాకు వినపడేలా చెప్పిన మాటలని ఇప్పుడు మెల్లిగా వినపడసాగాయి.

గుళ్ళో పెళ్లి చేసుకొని హైదరాబాద్ లో వాళ్ళ పిన్ని వాళ్ళింట్లో ఉంచి తను దుబాయ్ కి వెళ్ళాడు,

రెండు నెలలు కాదు గాధ సంవత్సరం తర్వాత తిరిగి వచ్చేసాడు.

 

ఉన్న డబ్బులతో బిజినెస్ బిజినెస్ అని తిరుగుతుండగా శ్యామల తల్లి చనిపోయింది, తను పోవడమే ఆలస్యంగా వారి నాన్న మరో పెళ్లి చేసుకున్నాడు.

ధర్మ కలలకు విరుద్దంగా శ్యామల నాన్న కాని వీడి ఇంట్లో కాని ఎలాంటి ఆదరణ లేదు. ఎంత గొప్ప దుబాయ్ కరెన్సీ ఐన సమయమొస్తే కరగక మానదని చాల త్వరగానే తెలుసుకున్నట్టున్నాడు. ఎం లాభం అప్పటికే ఓ పాపా. పాపా వచ్చిన సంతోషంతో డబుల్ బెడ్రూం నుండి రెండు గదుల రూముకి ప్రమోషన్ తెచ్చుకున్నాడు. పెరుగుతున్న పాపకు సాక్ష్యం గ ఇరువురి మధ్య ప్రేమ అనే పదానికి అర్ధం తెలియకుండా గడపడం మొదలయ్యింది.

 

ఊహించని మార్పులకు గురైన ధర్మ తన మనసుతో యుద్ధం చేస్తూ తన అసహనాన్ని ప్రదర్శించే స్వాతంత్రం కేవలం శ్యామల దగ్గరే దొరికినట్టుంది. పాపం స్వాతంత్రం పేరుతో వ్యక్తపరిచిన తన భావాలు గాయాల రూపాన కంటికి ఇంపుగా కనపడసాగాయి శ్యామల ఒంటిపై.

 

పాపం తాను గీసుకున్న వృత్తానికి మంటలు అంటుకొని బయటికి రాలేక కాలిపోతు శ్యామల మరో బిడ్డకి జన్మనిచ్చింది.

 

అదే వృత్తంలో తనతో తో పాటు తన పిల్లలు. ఇక పిల్లలతో పాటు తను కాలిపోతు దీనంగా గడపడం తప్ప ఏమి చేయలేకపోతు, అగ్నికి ఆజ్యం పోస్తూ వీలుదోరికినప్పుడల్లో కొత్త గాయాలని పరిచయం చేస్తూ ధర్మ.

 

ఇక చివరికి ఈ సున్నయే గతి అన్నట్టు ఏదో కూల్ డ్రింక్ కంపనీలో ఓ నాలుగు వేల జీతానికి పనిచేస్తూ ఖర్చులకు తగ్గట్టుగా రెండు రూముల గదిని ఒక్క రూముకి కుధించుకొని కంపెనీ కి దగ్గరలో నే ఉంటున్నారు.

 

ఇరవైనాలుగేల్లలోనే జీవితమంతా అనుభవించిన శ్యామల జీవితం ఇక ముందైన సాఫీగా గడిచేలాగా దీవించమని భగవంతున్ని కోరుతూ ఇంటికి చేరుకున్నాను..

పంద్రా ఆగస్టు – జెండా పండగ

December 6, 2012 Leave a comment

ఇగో పంద్రా ఆగస్టు వస్తోంది.

ఈ క్లాసు మొత్తం చమ్కీలతో చమ్కాయించాలి.

మస్తుగా ఎంజాయ్ చేయాలి అని లియాకత్ అలీ చెప్పడంతో.

ఏడు, ఎనమిది, తొమ్మిది తరగతోల్లమంత తల ఐదు రుపాయలేసుకుంటే చౌరస్తా బుక్ స్టాల్ లో రంగు రంగు కయీతాలు మేరుపు చమ్కీల కవర్లు మస్తు వస్తాయి అని మా క్లాస్ రవి గాడు చెప్పడంతో అందరం ఊ కొట్టాం. మా స్కూల్ లో మా క్లాసు లో కొంచెం నాకు మంచి పేరే ఉంది. డెకరేషన్ పనులు ఇంకా ఆ రోజు ప్రోగ్రాములు గట్రా నాకు అప్పచేప్పటోల్లు. ఇక మా రవిగాడికి పెద్ద సైకిల్ ఉండేది.

స్కూల్ మొత్తం లో మా పిలగాడ్లంత ఆడి బుజలకాడికి ఉండేటోల్లం అందుకే పొడుగు రవిగాడు అని పిలిచేటోల్లం. అప్పటికి నాకు సైకిల్ తొక్కటం రాదూ అది వాడికొచ్చు అందుకే నాకు తోడుగా డెకరేషన్ సామాను తేవడానికి మా ప్రిన్సిపాల్ మాడం పంపించేది.

ఇగ మా క్లాసు లో కూడేసుకున్న పైసల్తో మేము చౌరస్తాలో రవి బుక్ స్టాల్ అనే షాపులో అన్ని పట్టుకోచ్చేటోల్లం.

మా స్కూల్ టీచర్ లు చెప్తూ ఉంటె  మా క్లాస్సులల్ల ఉండే ఆడోల్లంత పింకు రంగు కయీతలని చిన్న చిన్న గ కత్తిరించుకోని మల్లె పూల దండలాగ కాయితాల దండల్ని అల్లే వాళ్ళు అదంతా రెండు రోజులు కూచుంటే గాని అన్ని క్లాసు రూముల్లోకి సరి పడ దండలు తయారయేవి.

ఇక మేము పిలగండ్లమంత పెళ్ళిలకు అతికించే రంగు రంగు కాగితాలను కత్తిరించి క్లాస్లో అతికించే పనుల్లో ఉండేవోల్లం. ఇగ పోటిలుపడి ఎవలి క్లాస్సు వాళ్ళే అందంగా తీర్చి దిద్దే వాళ్ళం.

 

సంత్సరానికి రెండు సార్ల పనికొచ్చే కర్ర బొంగు వెనక క్లాసు పై రేకుల మీద ఉండేది. దాన్ని రవి గాడు అమ్జాద్ తీసేవోల్లు. నేను ఆరిఫ్ మూడు రంగుల కయీతలని బొంగు చుట్టూ అతికించడానికి కత్తర్లతో అందంగా కత్తి రించటోల్లం.  మా ఆయ గిన్నెలో వేడి వేడి లయ్యి పిండి పట్టుకొచ్చేది. చిన్న బకిట్లో నీళ్ళు తీసుకొచ్చి కర్ర బొంగుని శుబ్రంగా కడిగి లయ్యి పిండిని పూస్తుంటే వెంటనే కత్తిరించుకోని పెట్టుకొన్న కాషాయం, తెలుపు పచ్చ, రంగు కయీతలని, అందంగా అతికించేవోల్లం.

వారం ముందునుండే అబ్బో ఎంత హడావిడి చిన్న తరగతులలో ఉండే ఇంగ్లీష్ మీడియం పిల్లలంతా దేశ భక్తి పాటలు, డాన్సులు ప్రకటిస్ చేసేవోల్లు.

 

హిందీ టీచర్ నాతోని పట్టుబట్టి హిందీలో ఉపన్యాసం ప్రాక్టిసు చేపించేది. బహుషా క్లాసు లో ఫస్టనో లేక హిందీ బాగా మాట్లాడడం అనో తెలియదు కాని మాట్లాడాలని పట్టుబట్టేది.

ఏందో రెంద్రోజులసంది మస్తు ప్రాక్టీసు చేసుకునేవొన్ని ఇగ రేపనంగా ప్రిన్సిపాల్ గారు పిలిచి రేపు నీ ఉపన్యాసం తెలుగులో ఇమ్మనేది. హిందీ టీచర్ కి అదే విషయం చెప్పటంతో సరే అని తెలుగులో ప్రాక్టిస్ చేయమనేది. 

 

ఎవలవలివో పెద్ద పెద్ద పేర్లు త్యాగాలు, స్వాతంత్ర్యం, బ్రిటిషు, భారతదేశం, యుద్ధం, డేట్ లు, అర్ధరాత్రి స్వాతంత్ర్యం, నేటి బాలలే రేపటి పౌరులు, ఇంకేందేందో ఉండేది ఆ ఉపన్యాసం లో. తెల్లారితే జెండా పండగ.

 

రాత్రంతా చదువుకొనే వొన్ని.

అవే ఆలోచనలు ఉపన్యాసం లో ఉన్న కథలో ఒక్కో వ్యక్తి ఒక్కో రకంగా తమ వంతుగా తాము దేశ స్వాతంత్ర్యం కోసం పాటు పడడం.

ఎవరెలా కష్టపడిన చివరికి దేశ స్వాతంత్రమే ప్రధాన సూత్రంగ పాటుపడడం నాకు చాల ఆశ్చర్యానికి గురిచేసింది.

 

ఒకరు మౌనంగా సత్యాగ్రహం చేస్తే,

ఇంకొకరు ఎదురు తిరిగి నినాదం చేసారు,

మరొకరు సైన్యాన్ని కూడగట్టుకొని సమ ఉజ్జిలుగా ఎదురుతిరగడం,

ఏవిధంగా మనల్ని కొల్లగోడుతున్నారో అదేవిధంగా మనం వాళ్ళని కొల్లగోడుధమని ఇంకొకరు.

ఎవరు ఏ రకంగ పోరాడిన చివరికి దేశం కోసమే కదా అని నన్ను నేను సర్దిపుచ్చుకునే వొన్ని.

ఇదంతా గతం నాకు ఊహ తెలిసినప్పటి నుండి ప్రతి పంద్రా ఆగస్టులో విన్న మాటలే విన్న చరిత్రలే కావచ్చు కాని ఇప్పుడెం చేయాలి.

 

ఒక్క రోజు నిల్చున్న జెండా కర్ర మళ్ళి ఐదునెల్ల దాక రేకుల మీదే నడుం వాల్చుతుంది. 

సూర్యకిరణలకు  చమక్కుమని మెరిసే రంగులతో రెప రెప లాడిన త్రివర్ణ పతాకం ఇస్త్రి చేసుకొని మడత పెట్టుకొని బీరువా అర లో సేద తీరుతుంది.

అప్పుడప్పుడు  టీవీ లో క్రికెట్ ఆటలో ఇండియా గెలిచినప్పుడు, మా గల్లి పెద్ద పెద్దోళ్ళంత పట్టుకొని తిరగే టప్పుడు కనిపించేది ఆ జెండా.

నా చిన్ననాడు చాల కాలం వరకు స్వతంత్రం అనే పేరుకు అర్ధం మూడు రంగుల జెండా అని మాత్రమే నాకు తెలుసు.

ఆ జెండా ఎగరడానికి “స్వతంత్రం, గణతంత్రం” అనే రెండు పండుగాలోచ్చాయ్ అని మాత్రమే తెలుసు.

 

పరి పరి విధాలతో బుర్ర వేడిక్కి ఎన్నో ప్రశ్నలకు సమాధాన పరుచోకోలేక దుప్పటి కప్పుకొని పడుకోంటుంటే అమ్మ నా స్కూల్ డ్రెస్సు నీలం తెలుపు చిన్న చిన్న అడ్డం నిలువు గీతలు గల బుషోటు, నీలం రంగు పైంటు,  పైన కింద నీలం మధ్యలో తెలుపు తో అడ్డగీతలున్న నడుం బెల్టు, బ్లాకు సాక్సులతో బూట్లు, అన్ని ఓ పక్కన సర్ది పెట్టేది.

 

పొద్దున్న ఆరు గంటల ప్రాంతాన, నను నిద్ర లేపేది అమ్మ.

పల్లుతోముకొని వొచ్చి ఉపన్యాసం పేపర్ను ముందేసుకొని అక్షరం పోల్లుబోగుండా తెగ బట్టి పట్టేవొన్ని.

ఏమో నేను యధ్రుచికంగా నా మనసుకి అర్ధంకాని చాల విషయాలు బట్టి పట్టక తప్పకపోయేది.

చుట్టూ కరతాళ ధ్వనులు మోగిన ఉపన్యాసం ఇవ్వడంలో ఆనందం ఏ రోజు నాకు కలగలేదు. ఎందుకో మరి నా మనసుకు నా ఆలోచనలను బయటపెట్టే స్వాతంత్ర్యం అప్పటికి నాకు రాకపోవడం వాళ్ళ ఏమో. ఈ సారైనా సాధ్యమవుతుందో అనుకుంటే ఈ సారి కూడా బట్టి పట్టక తప్పలేదు.

 

కట్టెల పొయ్యి మీద నీళ్ళు కాగినాయి లే స్నానం చేయిపో. అని అమ్మ చెప్పడం తో  కాగుతున్న నా ఆలోచనను ఆర్పేసి, ఉపన్యాసం కాగితాన్ని నా ప్రశ్నలని సంచిలో చరిత్ర పుస్తకంలోకి నెట్టి, ఇంటెనక బాయి కాడ బకిట్లో వేడి వేడి నీళ్ళ గిన్నలో వేపాకులు బకిట్లో పడనీకుండా పోసి గోరువెచ్చగా మారే వారకు కొన్ని చల్లనిల్లను జత చేసి, పెద్ద లైఫ్బాయ్ సబ్బు సిద్ధం చేసేది. పెద్ద చెంబుతో గబా గబా పోసుకుంటూ ఒళ్ళంతా వేప వాసన, ఈ ఆకులూ ఎందుకేస్తావ్ అని అడిగితే ఒంటికి మంచిది అని అమ్మ చెప్తుండేది. చేదువసనకు విరుధంగా సబ్బు వాసనా మత్తుగా తోచేది. స్నానం పూర్తవగానే సూర్యునికి దన్నం పెట్టుకొని, వేప చెట్టుకి దన్నం పెట్టుకొని ఒళ్ళు తుడుచుకొని.

బనీను నిక్కరు వేసుకొని ఆరున్నర ప్రాంతాన,  పైంటును అంగిని ఒక చేతిలో పట్టుకొని అమ్మ ఇచ్చిన రెండు రూపాయలని నిక్కరు జేబులో పెట్టుకొని రెండ్రుపాయలు బయటికి రాకుండా జేబులో చెయ్యి పెట్టుకొని కుండి కాడినుండి వీరేశం దుకాణం దాటుకుంటూ  గుండం వాడ రాజన్న దుకాణం పక్క గల్లిలో చాకలోల్లింటికి ఇస్త్రి చేపించుకోనేందుకు పోయేటోన్ని. అందరకి గీయల్నే గుర్తొస్తది, కాసేపుండు సేసిస్త అని కసురుకుంటోడు. జెల్దిజెయ్ స్కూల్ కు పోవాలి అని అదిరించే వొన్ని. అందరకి జేల్దే, చేస్తున్న గదా జరా సైసు అనేవాడు. కాస్త బయటికొచ్చి అన్ని గల్లిలని చూసేవాన్ని ఇక ఈ రోజు తప్ప ఇంకో రోజు ఇవి కనపడోద్దు అని కరెంటు స్థంబాలను, ఇండ్లను ఆసరాగా తీసుకొంటూ మొత్తం  జెండాలను అతికించిన తోరణాలు దట్టంగా నింపేవాళ్ళు.

 

మెల్లిగా ఇస్త్రి బట్టలను తీసుకొని ఇంటికేల్తుంటే జెండా తోరణాలు నాకు ఆహ్వానం పలుకుతున్నట్టు అనిపించేవి. కుండి కాడ ఆశమ్మ వాళ్ళ ఇంటిదగ్గర మూడు బాటలకాడ జెండా ఎత్తేవోల్లు, ఆడికి పెద్ద పెద్ద వొళ్ళు వచ్చేవోల్లు కొద్ది రోజుల తర్వాత ఓ పార్టీ కి సంబంధించిన జెండా మన జెండా ఎగిరేసే తుప్పు పట్టిన ఇనుప బొంగు  పక్కనే దానికన్నా  మూడు మూరల మరింత పొడుగుతో అమర్చిన కొత్త బొంగులో వారి జండాని అమర్చి చాల కాలం వరకు ఎగేరేసారు. అది చూసిన ప్రతి సారి. నా త్రివర్ణ పథకానికి రెండు రోజులే స్వతంత్రం మరి ఈ జెండా కి ప్రతి రోజు స్వతంత్రమా అనే నా ప్రశ్నకు నవ్వును సమాధానంగా ఇచ్చారు. ఆ ఏర్పాట్లను చూస్తూ ఇంటికేల్లెవాన్ని. త్వరగా బట్టలు వేసుకొని అంగిని పైంటు లోకి తోస్తూ బెల్టు పెట్టుకొని అమ్మ ధగ్గరకేల్లగానే, పారాచూట్ కొబ్బరినునే తలకు రాసి ఎడం పక్కన పాపిడ తీసి నున్నగా దువ్వి కొంచెం పౌడర్ ని మెత్తని బూరు పువ్వుతో మోకానికి అద్ది, చిన్న కుంకుమ బొట్టుని పెడుతూ ఈ రోజు జెండా పండగ, బొట్టు తుడుచుకోకు, బట్టలు మాపుకోకు, జెండా వందనం ఐపోగానే ఓ పక్కనుండి జాగ్రత్తగ రా సరేనా! ఊ.. అని అంటూ సాక్సులు తొడుక్కొని బూట్లని పాలిష్ కి బదులు కొంచెం కొబ్బరి నునేను మసిగుడ్డ కు అద్ది మొత్తం రాసేవాన్ని నల్లగా నిగనిగలాడుతున్న బూట్లను చూస్తూ ఆనందపడుతూ దారాలను కట్టుకుంటోన్ని. తెల్ల కడ్చిపుని చేతిలోకి తీసుకొంటూ స్వాతంత్ర్యం వచ్చిన నా బుజాలను నిటారుగా చేసుకొని నా పుస్తకాల సంచి వంక వెర్రిగా చూస్తుంటే ఆ సంచి నా వంక కోపంగా చూచేది.  స్వేచ్చగా గుండెలనిండా గాలులను పీల్చుకుంటూ స్కూల్ వైపుకు నా అడుగులు వేసేవి. కుండి కాడ మూలమలుపు తిర్గుతుంటే గుండు పిన్ను సహాయంతో చిన్న కగేతపు జెండాని నా అంగి జేబుకి పెట్టె వారు, అన్న అన్న అబ్బ ఇంకో జెండా ఇవ్వవా. ఎందుకు చిన్న? నా బుక్కులో పెట్టుకుంట ప్లీజ్ ప్లీజ్ అనగానే నవ్వుతూ రెండు జెండాలను చేతిలో పెట్టేవోడు, జాగ్రతగా అంగి జేబులో పెట్టుకోనేవాన్ని. గుండెను అదుముకున్న నా స్వాతంత్రపు జెండాని పదే పదే చూస్తూ మురుసిపోతు స్కూల్ కి చేరుకుంటోన్ని.

 

పెద్ద పెద్ద పాటకలున్న గేటుకు కుడి బాగాన ఒక్కరు పట్టే విధంగా చిన్న గేటు ఉండేది. లోపలి అడుగు పెట్టగానే నిజమైన ఆనందపు వాకిలి చేరుకున్నాన అని తలపించేది అందంగా ముస్తాబైన మా స్కుల్ని చూస్తుంటే.

 

అందరం పిల్లలం ఒకరి వెనక ఒకరం కొన్ని వరుసలుగా నిల్చోనేవాళ్ళం నేను రవి గాడు ఇంకా ఆరిఫ్ గాడు ముగ్గురం ప్రిన్సిపాల్ మాడంకు చేరువలో నిల్చోనేవాళ్ళం మాకు ఏమైనా పనులు పురమయిస్తారో అని. అన్నట్టుగానే మాకు పనులు తగిలేవి గాంధీ, నెహ్రు, భగత్ సింగ్, సుబాష్ చంద్ర బోస్ పటాలను శుబ్రం చేసి జెండా కర్ర కింద ఎత్తు తక్కువగా ఉండే వెడల్పు బల్లపై జాగ్రత్త గ అమర్చేవాళ్ళం. టేచర్లు మాకు సహాయం చేద్దాం అని వచ్చేవారు కాని మేము వారిని రాకని చెప్పి పూర్తి చేసేవాళ్ళం. మా ప్రిన్సిపాల్ గారు, పటాల్లో ఉన్న వారికి కుంకుమ దిద్ది కళ్ళు మూసుకొని దండం పెడుతుండగా పిల్లలమంతా అలాగే చేసేవాళ్ళము. రెండు కొబ్బరికాయలను కొట్టి పక్కన పెట్టి మెల్లిగా తాడు సహాయంతో కొన్ని పూలు రంగు రంగు కాగితాలను మూటగా కట్టి ఉంచిన జెండాను కర్ర చివరివరకు చేర్చి, మరో తాడుతో ముడి విప్పడం తో ఒక్కసారిగా రంగు రంగు కాగితాలు జెండా నుండి స్వేచ్చగా బయటకు రాగానే పిల్లలమంతా చేతులలో ఉన్న చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్నరంగు రంగు కాగితాలను బలంగా జెండా వైపుకు విసిరేవాళ్ళు, అమ్జాద్ వాళ్ళ ఇంట్లో నుండి తీసుకొచ్చిన ఐదారు పావురాలను కూడా జెండా వైపుకి వోదిలేవారు, ఆగని కరతాళ ధ్వనులతో జరుతున్న సన్నివేశమంతా కన్నులపండగల తోచేది. ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవహించేది. తలలన్ని తలెత్తుకొని జెండా వైపుకు చూస్తూ సెల్యూట్ చేస్తూ జనగణమన గీతాన్ని అలపించేవాళ్ళం.

 

ఆ తర్వాత ప్రిన్సిపాల్ గారి ప్రసంగంతో మొదలయి టీచర్ల వరకు రాగానే కొద్ది కొద్ది గ వణుకు మొదలయ్యేది నాకు, ఇది ఇప్పటిది కాదు ప్రతి సారి జరిగేదే, గుండె వేగం పెరిగేది. ఆ సమయంలో పిలిచేవారు రఘు అని. గుండెలనిండా శ్వాస తీసుకుంటూ ఎదురుగా ఉన్న పిల్లల వైపు చూస్తూ జెండా కర్రకి కొంచెం పక్కగా ప్రిన్సిపాల్, టీచర్ల ముందు నిల్చొని నా ప్రసంగాన్ని మొదలు పెట్టి పూర్తి చేసే సమయానికి నా కళ్ళు మూతలు పడి ఎవరో నన్ను బలంగా కిందికి అనగాతోక్కుతున్నట్టు భయంతో వణుకుతూ తల కిందికి జారుకునేది. నాకు తెలియకుండానే ప్రసంగం పూర్తయిందని తెలిసేది చప్పట్లు మోగుతుంటే. హమ్మయ్య పెద్ద గండం గడిచింది. అనుకుంటూ తల పైకెత్తి నవ్వుతూ మళ్ళి నా స్థానం లోకి వచ్చేవాన్ని. అందరి ప్రసంగాలు పూర్తయ్యాక, అప్పుడు పట్టుకోచ్చేది ఆయ, ప్యాకింగ్ చేసిన పొట్లాలు. ఇక అందరు కళ్ళు ఆ పోట్లలపైనే.

 

మేడం ఒక్కొక్కరిగా ఇస్తుంటే ముందు చిన్నతరగతి పిల్లలంతా రెండు చేతులతో తీసుకొని నెమ్మది లోపలి వెళ్ళేవాళ్ళు. అల అందరం పొట్లల్ని తీసుకొని మా క్లాస్లోకి వెళ్ళేవాళ్ళం నా కడ్చిపులో ఆ పొట్లాన్ని దాచుకొని జేబులో పెట్టుకొని. ఇక అందరం వెనక క్లాస్ ముందు వెడల్పుగా ఉన్న అరుగు మీద పిల్లలంతా వేషాలు వేసుకొని నాటకాలు, పాటలు, డాన్సు లు వేస్తుంటే. నా ఆలోచనలు మాత్రం రెపరెపలాడే జెండా వెనక దాగిన మరో ప్రపంచం వైపుకు పరుగులు తీసేవి. సమాధాన పరుచుకోలేని ఎన్నో ప్రశ్నలను మదిని తొలుస్తూ, స్వతంత్రం అంటే ఏమిటో అర్ధం కోసం వెతుకుతూ, నేను పుట్టిన గడ్డ పై మమకారం పెంచుకోవడమేనా దేశ భక్తి, ఆటలో గెలిస్తే జెండా పట్టుకొని వీధిల  మీద తిరగాడమేనా దేశభక్తి.

 

భానిస నుండి విముక్తి, ఇప్పుడు ఏవరికీ భానిసలుగా ఉన్నాము. 

గాంధీ మహాత్ములు, ఎందరో మహానుభావులు నాకు తెచ్చిపెట్టిన స్వతంత్రం ఇదేనా,

దేశాన్ని వొదిలి పారిపోయి దేశం కోసం ఏదైనా సాధిస్తున్నమా అంటూ ఇక్కడి తెలివినంత పొరుగు దేశాల్లో ధారపోస్తున్నరన్న ఆవేదనని గొత్తు చించుకొని అరుస్తున్న పెద్దవాళ్ళకి, ఇక్కడే ఉన్న వాళ్ళు దాసోహం అంటూ ఎంత మంది పొరుగు దేశపు కంపెనీల్లో పనిచేస్తున్నారో కనిపించడం లేదేమో.

 

ఇప్పటికి నేను భానిసనే, నా ఆలోచనలన్నిటిని పణంగా పెట్టి ఓ మల్టీ నేషనల్ కంపెనీ (పొరుగు దేశపు) లో పని చేస్తున్నాను కేవలం నాకోసం.

నా కోసం మాత్రమే పనిచేసుకుంటున్నాను.

మరోసారి మనం బావుపడితే దేశం బావుపడుతుందంటున్నారు.

ఏమో దేశం కోసం పాటుపడని “నా” అభివృద్ధి తో దేశం ఏరకంగా వెలిగిపోయిందో నాకు తెలియదు కాని.

ఒక రకంగా వెలిగిపోతుంది  అక్రమ సంపాదనతో, బిధరికంతో, ఎన్నో రకాల లేమితో ఎప్పుడు కుంటుతున్న నా భారతం వెలిగిపోతుంది.

 

గాంధీ సత్యాగ్రహం పాపం స్కూల్ పుస్తకాలకి అంకితమైనది.

యువత ఆలోచనలు పొంతన లేని సొంత అబివృద్దికి, విందుల వినోదాలకి, ఉరుకుల పరుగుల జీవితానికి, గమ్యం లేని లక్ష్యాలకి, ఎటు తోచని ఆలోచనలకి, ఒత్తిడికి, స్వాతంత్రం పేరుతో పబ్బుల్లో విచ్చలవిడితనానికి అంకితమైనది.

బాగా చదువుకున్నోల్లు  రెండు పదులు దాటగానే పొరుగు కంపెనీల పుణ్యమా అని ఎక్కడిలేని సంపాదనతో స్వాతంత్రం అనే ఆయుధంతో ఉల్లాసంగా విలాసవంతమైన జీవితం గడుపుతుంటే,

నెహ్రు విసిరినా పావురాయి రెక్కని ఈ జాగా నాది ఆ జాగా వాళ్ళది అని తెగ నరుకుతుంటే రక్తం మడుగులో కొట్టుకుంటోంది.

సుబాషు తాయారు చేసిన సైన్యం తాను ఎన్నడు ఊహించలేదేమో తన దేశపు రేపటి పౌరులని ఎదిరించాడానికే మిగిలిందని.

మీసం మేలేసిన భగత్ సింగ్ రౌశ్యం నా వీధి బాలుని ఆకలి తీర్చలేకపోయిందానే నిజం తనకు ఎవరు చెప్తారు.

 

ఎవరేక్కడికి పోతే నాకేంటి అనుకోని ఎవరికి నచ్చినట్టు వారు జీవించడమే స్వాతంత్ర్యం అనుకుంటున్నాన నేను. నిజమే కావచ్చు

అందుకేనేమో పాపం కరుణకి అర్ధం చెప్పిన మథర్ తెరిసా ఎంత వేదనకి గురైతే తప్ప కరుణలేని మనసుల లోకంలోకి మళ్ళి నను పుట్టించకు ప్రభువా అని తన డైరీలో ఎందుకు రాసుకుంటుంది.

 

ప్రక్టికాల్ గ ఉంటూ, ఎం జరిగిన పట్టనట్టు చూసి కూడా మనకెందుకులే అనుకోని అన్ని చంపుకొని చేతులు కట్టేసుకొని,

నా నా నా నా అనే సొంత అభివృద్ధికోసం బానిసనై  నా మనసు చేసే అగచాట్లలో,

నా దేశం కోసమే నేను అనే భావన ఎప్పుడు నాకు గుర్తోస్తుందో.

ఎప్పుడు నిజమైన స్వాతంత్ర్యం నా బానిస మనసుకి  వస్తుందో.

ఎప్పుడూ ఎగరుతుందో కిందకి దిగని జెండా  నా మనసులో  ఏమో…

 

నిజాలు తెలియని, తెలుకున్న, తెలుసుకోనట్టు, నన్ను నేను మబ్యాపెట్టుకుంటూ కల్లోలపు మధనం, నా మనసులో అప్పటి నుండి ఇప్పటికి కొనసాగుతూనే ఉంది

 

ఒరేయ్ ఎం చేస్తున్నావ్ రా ఐపోయింది. ఇగ పోదాం పద అనడంతో  ఒక్కసారిగా పెద్ద ఆలోచనల సంద్రానికి అడ్డుకట్ట వేసి అతి చిన్న నా అనే భావనలోకి వొచ్చి. ఆ అయిపోయిందా అనుకుంటూ మెల్లిగా లేచి ఒకరివేనకల ఒకరం నెమ్మదిగా బయటికొస్తూ ఒక్క సారి వెనక్కి చూసుకున్న రెపరెపలాడే నా జెండాని, ఎందుకంటే మరో ఐదునెల్ల దాక మళ్ళి కనపడదుగా ఆ దృశ్యం.

 

ఇంటికి రాగానే ప్లేటులో పొట్లం విప్పి లడ్డు బూంది, నాలుగు బిస్కట్లు, రెండు చాక్లెట్లు, దారిలో వస్తుంటే కుండికాడ పంచి పెట్టిన రెండు అరటి పళ్ళ ముక్కలు, అర్వన్నం, కొబ్బరి ముక్కలు కూడా అదే పళ్ళెం లో పెట్టి ఇంట్లో అందరికి ఇచ్చేవాన్ని నా లాగే మా అక్కయ అన్నయ కూడా..

 

మెల్లిగా అంగి విప్పుతుంటే జాగ్రత్త గ గుండు పిన్ను తీసి జేబుకు పెట్టిన, జేబులో ఉన్న జెండాలని రాజన్న దుకాణంలో మొన్ననే  కొన్న కొత్త రూల్ నోట్ బుక్కుని బయటికి తీసి మధ్యలో కాగితపు జెండాలని బద్రపరచి ముక్కుకి దగ్గరగా పెట్టి కొత్త బూక్కు సువాసనని గట్టిగ పీల్చి. వచ్చే గణతంత్ర దినోత్సపు ఆలోచనలను బూక్కుతో జత చేసి సంచిలో పెట్టుకునే వాణ్ని.

ఒరేయ్ ఆరిఫ్ రంజాన్ ముబారక్ రా..

December 6, 2012 Leave a comment

భయటికేల్లి ఉమ్ము మింగకుండా తుపుక్కున ఊంచి వచ్చి.

ఒరేయ్ ఇస్కూలు అయినాక మనం మసీదుకు పోదాం. ఇయాల సాయంత్రం “రోజా పొద్దు ఇడిచినక”  మాకు తెలిసినోల్లు ఇఫ్తార్ విందు ఇస్తున్నారు. అని నా దోస్తు ఆరిఫ్ చెప్పడంతో.

విందా.. అరేయ్ నేను గూడ వస్తా.

 

సాధారణంగా అరటి పళ్ళు, ఇంట్లో ఎవలికైన జ్వరం వస్తే తప్ప కనిపించని దానిమ్మ కాయ, అప్పుడప్పుడు దొడ్డు సేమియా(అదే బంబినో) పాయసం.

మా వాడలో, గుండం గల్లిల్లో, అంత ముస్లిములే, మా గల్లిలో ఉన్న ముసలోల్లంత తుర్క వాడ అనేటోలు. మా ఇస్కులు దోస్తులంత ముస్లిం అని పిలువాలి అని మారం సేయడంతో నేను మాత్రం ముస్లిమోళ్ళ గల్లి అని పిలిచేవోన్ని. రంజాన్ పండగోస్తున్దంటే సాలు రకరకాల పళ్ళు, పళ్ళ రసాలు, కజ్జురాలు, మిటాయిలు, ఖీర్ పాయసం, హాలాల్ చేసిన మాంసం, దం బిర్యాని, పుల్క, రుమాల్, తందూరి, నాన్సు రొట్టెలు. ఎక్కడ లేని తిడంత గాన్నే గా ఇఫ్తార్ విందులల్ల ఉండేది. ఎందుకో మాంసం తినకపోయేటోన్ని. కాని నా శక్తి మేర పళ్ళు, రసాలు, కజ్జురాలు, పాయసం ఫుల్లుగా తీసుకొని పొట్టి నేక్కర్లేసుకున్న మేము  పెద్దోల్లలాగా ముందు నా పొట్టను పంపిస్తూ వెనకాల నేను నడిచేవొన్ని.

 

రంజాన్ పండగ రోజైతే చెప్పనక్కర్లేదు, మా గల్లి మొత్తం అత్తర్ గుభాలింపే. నన్ను కలుసుకోవడానికి మా దోస్తులంత దగ్గరున్న వాళ్ళు అబ్జల్, ఇర్షాద్, నయీం, నౌషాద్, లియాకత్ అలీ నడుచుకుంటూ, చాన్దూరం ఉన్నవాళ్ళు  సైకల్లెసుకొని, టిఫిను డబ్బాల్లో ఖీర్ పాయసం పట్టుకోచ్చేవోల్లు, ఇంటెదురుగా ఉన్న బేబీ వాళ్ళు, మసూదు వాళ్ళు ఇంకా మా అన్న దోస్తులు అంత పాయసం ఇచ్చేటోల్లు.  అందరికన్నా ఆరిఫ్ వొళ్ళ అమ్మ చేసే కద్దు ఖీర్ పాయసం, పోనీ ఖీర్ పాయసం, ఇంకా నెయ్యితో చేసిన స్వీట్లు అంటే మస్తు ఇష్టం అందుకేనేమో పెద్ద పెద్ద గిన్నెలో పట్టుకొచ్చేవాడు మా ఇంట్లోలందరి కోసం.

 

నేను ఆరిఫ్ ఎంత మంచి దోస్తులమంటే నా చిన్ననాటి సగం దినాలు వాడి ఇంట్లోనే గడిచినాయి. వాళ్ళింట్లో నేను మా ఇంట్లో వాడు కుటుంబ సబ్యులమైనాము. వాళ్ళ నాన్న సాబిర్ పాషా వ్యవసాయశాకలో గోవర్నమెంటు జాబు. ఇద్దరక్కలు వీడొక్కడు. ఏందో మాకు ఊహోచ్చేసరికే ఆ ఇద్దరక్కలకి పెళ్లిలయినాయి.

 

జుబ్బాలు, కుర్తాలు, లాల్చి పైజాములు, తెల్లని టోపీలు, కొందరు చమ్కీల తో రంగు రంగు అల్లికలున్న బుషోట్లు. కర్రు కర్రు మని శబ్దం చేసే తోలు చెప్పులతో యెడ సూశిన ఒక్కల్నోకలు గలేల్ను కలుపుకుంటూ కౌగిలించుకోనేవోల్లు. నాకడికోచ్చిన మా దోస్తులనంధరిని గలే మిల్ అనుకోని కౌగిలించోకొని రంజాన్ ముబారాక్ అనుకుంటోల్లము.

 

ఇక మా క్లాస్ లో ఉన్న అడవోల్లు  కూడా వాళ్ళ ఇంటికి పిలిచేటోల్లు. మచిలిబాజార్ లో ఉండే రానా, గుండం వాడలో ఉండే సాజియ, రాజియ, ఫాతిమా ఇంకా చాలా ఇళ్ళకి వెళ్ళేవాళ్ళం రంజాన్ ముబారక్ చెప్పడానికి. వాళ్ళు పెట్టె ఖీర్ పాయసం స్వీట్లు ఆరగించడానికి. ఎందుకో ఎప్పుడు బుర్కాల్లో దిగేసున్న ముఖాలకి ఆ రోజు స్వాతంత్రం వచ్చేది, రంగు రంగు హైదరాబాద్ పరికినిలు, మెరుపు తీగల చున్నిలతో ముంబాయ్ నుండి తెచ్చుకున్న మొహలాయి చీరలు, దుబాయి అత్తర్లు, అబ్బో ఎన్నడు లేని సంబరమంత ఆరోజు వాళ్ళల్లో కనిపించేది. ఫాతిమా తాను వేసుకున్న రంగు రంగు మెరుపు అద్దపు గాజులని కిటికీ నుండి వచ్చే వెలుతురు దగ్గర పెట్టి గాజుల అద్దాలలో పడుతున్న కిరణాలకి తళుక్కుమని గోడపై మెరుస్తున్న రంగుల నీడలను చూస్తూ మురిసిపోతూ మా పెద్దన్న చార్మినార్ కాడినుండి తెచ్చిండు అని గర్వంగా చెప్తుండేది. అప్పట్లో చార్మినార్ ని చూడాలనేది మా దోస్తులందరి అతి పెద్ద కోరిక. అందుకేనేమో మొదటిసారి హైదరాబాద్ కొచ్చినప్పుడు పొద్దటినుండి సాయంత్రం వరకు చార్మినార్ వాకిల్లోనే తెగ తిరిగాం నేను ఆరిఫ్.

 

ఫాతిమా వాళ్ళ ఇంట్లో మొత్తం ఎనమిది మంది అన్నలు, ఆరుగురు అక్క చెల్లెళ్ళు. చాలా పెద్ద కుటుంబం ఇమేధీ పదోకొండో నెంబర్ చిత్రం మా స్కూల్లో కూడా అమెది రోల్ నెంబర్ పదోకొండే తను పుట్టిన తేది కూడా నవంబర్ పదోకొండు ఇలా చాలా విషయాల్లో తనతో పదోకొండో  నెంబర్ ముడి పడింది. ఆ తర్వాత కాలం లో నఫీజ్ సుల్తాన నాకు మంచి దోస్తు వాళ్ళ ఇద్దరు చెల్లెళ్ళతో కలిసి మాకు రంజాన్ ముబారక్ చెప్పేది. 

 

కాలం తో పాటు నేను కూడా హైదరాబాద్ వాలిన ఇక్కడ కూడా నాతో పెనవేసుకున్న స్నేహాలు ఎన్నో సుల్తాన్ బాజార్ అలీ, చార్మినార్ అక్బర్, ఫయాజ్ హాష్మి, రఫిక్ దిల్సుఖ్ నగర్ జాహిద్, అబిడ్స్ మొహమ్మద్ ముజాహిద్, జుబ్బ సురయ బేగం, దూరదర్శన్ ఫాతిమా, హకీం పెట్ నాజియ టైమ్స్ అఫ్ ఇండియా హుస్సేన్ ఇలా చెప్పుకుంటే పోతే పర్వాలేదు ఈ రంజాన్ కూడా నన్ను ఆనంద పరచాడానికే వచ్చిందా అని అనిపిస్తుంది.

 

ఒరేయ్ నమాజు టైం ఆయ్యింధిర అనడంతో  సైకిల్ బొంగు మీద నేను కుర్చొంటే చిన్న పైడిల్ని భలంగా తొక్కడం తో ఒక్క పరుగున ఉజిలిబేసు మసీదును అందుకునేవాళ్ళం నేను ఆరిఫ్. ఏంటో నాతో పాటు వాడు గుడికొచ్చిన, వాడితో పాటు నేను మసీదుకేల్లిన యధ్రుచికంగానే పిలుస్తున్నది భగవంతున్నే అని అపుడు మా మనసులకి తెలియక పోయిన మా ఇరువురి మతాలు వేరనే భావన ఎవరు మాకు నూరిపోయనందుకు చాల సంతోషంగ ఉంది ఇప్పటికిను.

 

అల్లాహు అక్బర్ – అల్లాహు అక్బర్ అష్ హదు – అల్లా ఇలాహ్ అంటూ మొదలై అల్లాహు అఖ్బార్ లా ఇలాహ్ – ఇల్లల్లాహ్ అంటూ పూర్తయేది.

మెల్లిగా బయటికొచ్చి సైకిల్ లేసుకొని హన్మకొండ చౌరస్తా, నయీంనగర్ వెనకనుండి గల్లిలన్ని తిరుగుతూ తిరుగుతూ మళ్లీ కాకతీయ కాలనికి అటు నుండి అలంకార్ టాకీస్ దాటుతూ భద్ర కాలి చెరువు దగ్గర కాసేపు కూచొని, మెల్లిగా కదులుతూ దుదేకులోల్ల రఫీ, అనిల్ ని కలిసి, మూలా మలుపు తిరుగుతూ అమ్జాద్ వాళ్ళింటికి వెళ్లి ఆ తర్వాత ఆరిఫ్ వాళ్ళ ఇంటికి తీసుకేల్లెవోడు. విందు ను పూర్తి చేసుకొని, ముచ్చట్లు పెట్టుకొనే సరికి రాత్రి అయ్యేది.  మెల్లిగా ఇంటికొచ్చి రాత్రి బోజనాలయ్యాక చిమ్ని దీపం వెలుతురిని తగ్గించి ఓ మూలాన పెట్టి నేను పడుకుంటూ ఏమేమి చేసామో ఏమేం తిన్నానో ఆత్రంగా చెప్తుంటే గుడ్డి వెలుతురులో అమ్మ తువ్వాలతో నాకు గాలి విసురుతూ ఆశ్చర్యంగా  వింటూ ఉండేది. 

 

దాదాపుగా ఇన్నేళ్ళలో యే రంజాన్ కి మేమిద్దరం కలవుకుండా ఉండేవాళ్ళం కాదు. మొదటి సారి కలవలేక పోతున్నందుకు మనసుకు ఇప్పడు తెలుస్తుంది గలేల్ను కలుపుకొంటూ కౌగిలించుకోవడాల విలువా..

“అరేయ్ దిల్ తుజ్సే గలే మిలనేకే లీయే తరస్ రహ రే అని తడారిన గొంతుతో చెప్పి ఫోన్ పెట్టేసాడు దుబాయి నుండి ఆరిఫ్”

మొదటి సారి చిత్రంగ ఉంది మా ఇరువురి మనసుల కోరిక ఒకటే అవడం.

 

ఇప్పుడు మా ఇద్దరిని కాస్త దూరం చేసిందని గర్వపడుతున్న పిచ్చి కాలానికి తెలియదు పాపం, మేమిద్దరం అనుక్షణం ఇరువురి మనస్సులో కలిసే ఉన్నాం  అని.

 

చిన్ననాటి జ్ఞాపకాల్లో కత్తిరించుకోని పెట్టుకొన్న కవితొకటి గుర్తొచ్చింది.

 

దోస్తీ హొతి నహి భూల్ జానే కే లియే,

దోస్త్ మిల్తే నహి బిఖర్ జానే కే లియే,

దోస్తీ కార్కే ఖుష్ రహోగే ఇత్నా,

కి వక్త్ మిలేగా ని ఆన్సు బహానే కే లియే.

 

ఎలాగు నా మనసు మాట వాడికి వినిపిస్తుందని నాకు తెలుసు అందుకే

“ఒరేయ్ ఆరిఫ్ రంజాన్ ముబారక్ రా..”

పుట్నాలమ్మ

December 6, 2012 Leave a comment

ఈ రోజెందుకో 1 నెంబర్ మెట్రో బస్సు చాల సేపు రెతిఫైల్ స్టేషన్ లోనే గడిపింది.

కిటికీని నెమ్మదిగా తీసి బాగ్ ని ఒల్లో పెట్టుకొని కూర్చున్న.

“పల్లి బటాణి, పల్లి బటాణి” అనుకుంటూ ఓ ముసలావిడ. దాదాపు 80 కి పైన ఉంటుంది. ఇప్పటికి ఆ వయసులో పని చేసుకు బ్రతకాలనే తపన మెరుస్తున్న తన కళ్ళల్లో కనబడింది. 50 దాటితే చాలు మమ్మల్ని మా ఆలోచనల్ని ఎవరు కానట్లేధయ్య అంటూ వారి గోడు వెళ్ళబోసుకుంటూ కాలం గడుపుతున్న మా వీధి పెద్దలకు మరియు నాకు ఈ ముసలావిడ మంచి ఆదర్శం అనిపించింది.

 

ఎంతమ్మ..

రెండు రూపాయలకు చిన్న సీసడు (టానిక్ మూత), మూడు రూపాయలకు పెద్ద సీసడు (పిల్లలు ఆడుకునే చిన్న టీ కప్) బిడ్డ.

చెప్పు ఏ సీసడు కావలి.

చిన్న సీసడు బటానీలు ఇవ్వమ్మా అంటూ పది రూపయలిచ్చాను.

అయ్యో బోని నీదే బిడ్డ, చిల్లెర ఉంటె సూడు.

పర్లేధమ్మ ఉండనివ్వు.

అయ్యో వద్దు బిడ్డ నీ సొమ్ము నాకెందుకు.

ఇంకా మూడు సీసాలు ఇవ్వనా..

సరే ఇవ్వు.

పేపర్లో పోసి పొట్లం గట్టి చేతిలో బెట్టి, చిన్నగా ఊగుతూ, నెమ్మదిగా బొడ్డు సంచిలో పది రూపాయలను బెట్టుకొని, ఆకుపచ్చ రంగు చీర చెంగును సరిచేసుకుంటూ, పయిలం బిడ్డ అనుకుంటూ వెళ్ళింది.

కాసేపటికి ముందుకు కదిలిన బస్సుకి విరుద్ధంగా నా ఆలోచనలు వెనక్కి కదిలాయి.

**

తన పేరు నాకు ఇప్పటికి తెలియదు. కానీ మేము(పిల్లలమంతా) ఓ పుట్నాలమ్మ ఇటు రా మా అమ్మ పిలుస్తుంది. అంటూ పిలిచుకోచ్చేవాన్ని. రోజు కాకపోయినా వారానికోసారైన మా పుట్నలమ్మ మా గల్లికి వస్తుండేది. నాకు బాగా గుర్తు అప్పటికే తన వయసు అరవై ధాటి ఉంటుంది. ఎవరో తాను తెలియదు కాని తనకి మా ఇంటికి మంచి అనుబంధం. మా అమ్మంటే తనకి చాల ఇష్టం. ఎండన బడి వస్తున్న తనని నేను పిలువగానే ఎట్లున్నావ్ సరోజనవ్వ అనుకుంటూ ఇంట్లోకోచ్చేది. మా అమ్మ చేతి సహాయంతో బుట్ట కిందబెట్టేది. నన్ను పెద్ద చెంబులో నీళ్ళు తేమ్మనగానే. గబుక్కున వెళ్లి బింధలో ముంచి తీసుకొచ్చి ఇచ్చేవాన్ని.

 

“అవ్వో నా బిడ్డే సల్లంగుండు నాయన” అంటూ చెంబును చేతికి తీసుకొని. గడ గడ తాగేది.

“బడి లేదా నాయన”. “ఉంది ఒక్క పుటే. పోయ్యోచ్చిన”.

 

నా చూపు మాత్రం మా అమ్మ, పుట్నలమ్మ ముచ్చట్లలో కాకా, పుట్నాలు బటానీల బుట్ట మీదే ఉండేది. పెద్ద బుట్టలో ఒక సంచిలో పుట్నాలు, మరో సంచిలో బటానీలు, ఇంకో సంచిలో కర్రెంటు వైరునీ కాల్చిన తర్వాత బయటపడే రాగి, ఇత్తడి తీగలు, బొమ్మలు ఉండేవి. ఒక పక్కన సద్ది టిఫును, ఒక చిన్న తరాజు, సుతిలి తాడు తో వేలాడదీసిన చిన్న అయస్కాంతం. సాధారణంగ డబ్బుకు కాకుండా, రాగి ఇత్తడి తీగలను తీసుకొని, దోసెడుతో ఇచ్చేది.

 

నేను ఒక చిన్న గిన్నలో కొంచెం బెల్లం వేసుకొని పుట్నాలు పోసుకొని. ఇంటెనక వేప చెట్టుకింద నా గోనే సంచిని పరుచుకొని. పీటను తల కింద బెట్టుకొని. నిక్కరు సదురుకోని పడుకొని నా తల పక్కన పుట్నాల గిన్న పెట్టుకొని కొంచెం బెల్లం కొన్ని పుట్నాలను నోట్లో వేసుకొని, నెమ్మదిగా చప్పరిస్తూ, ఊరించుకుంటూ తింటూ, వేప కొమ్మలను, రాలుతున్న వేప పళ్ళను, దానికి ఆవల ఉన్న నీలాకాశం చూస్తూ, ఒక మంచి రాజభోగాన్ని అనుభావిన్చేవాన్ని.

 

మా బాపు ముందు గది లోకి రెండు వేల రూపాయలు గిరి గిరి కింద అప్పు తీసుకొచ్చి బండలేపించాడు. కొద్ది రోజులకి గిరి గిరి చిట్టి తీరగానే మల్లి అప్పుతీసుకొని కరెంటు పెట్టించాడు. నెమ్మిదిగా రాత్రిళ్ళు మా పడక ఇంటెనక చెట్టుకింద నుండి పంక(ఫ్యాన్) కిందికొచ్చింది. లైట్ వెలుతురున్నా కూడా, ఆ గదిలో వెన్నెల కనిపించేది కాదు.

 

ఒక్కో సారి పుట్నాలమ్మకి మా అమ్మ భోజనం పెడుతుండేది. అప్పుడప్పుడు జ్వరంగా ఉంటె తను మా ముందు గది పంక కింద నడుం వాల్చేది.

 

మా అమ్మ వాళ్ళ అమ్మ తన చిన్నప్పుడే కాలం చెల్లిందని. మా బాపమ్మనే తన తల్లిలా బావిస్తూ సేవలు చేసేది. మా బాపుని మా బాపు వాళ్ళ చెల్లేని(నాకు అత్తయ్య). పిల్లలు లేని మా బాపమ్మ,తాతయ్య వాళ్ళ తమ్ముడి దగ్గరనుండి దత్తత తీసుకున్నారు. ఆ రకంగా నాకు మా బాపు వాళ్ళ సొంత తల్లిదండ్రులు, పెంచుకున్న తల్లి దండ్రులు, ఇద్దరు బాపమ్మలు, ఇద్దరు తాతయ్యలు అంతే కాకుండా అమ్మ వాళ్ళ నాన్న ఆ తాతయ్య.

 

మా అమ్మ చదువుకోలేదు కాబట్టి తనకి ఓల్డ్ ఏజ్ హోమ్ ల గురించి తెలియదు. కేవలం ఆప్యాయత, అనురాగం తప్ప.

అందుకేనేమో తాతయ్యలు, బాపమ్మలు, మంచన పడితే విసుక్కోకుండా సేవలు చేసేది. చిత్రం ఏమిటంటే. అందరింట్లో అత్త కోడళ్ళ గొడవల గురించి వినపడేది కానీ, మా ఇంట్లో మా అమ్మతో ఎప్పుడు కృతజ్ఞత బావంగా ఉండేవారు. నా చిన్నప్పటినుండి. ఒకరి ఒకరి తర్వాత ఒకరు కల గర్బంలో కలుస్తుండడం, అప్పు తీసుకొచ్చి మరి కర్మ కాండలు చేపిస్తూ బాపు, వచ్చిన వాళ్ళందరిని అరుసుకుంటూ మా అమ్మ (అబ్బో మా చుట్టాల లిస్టు చెప్తే తరిగేది కాదు). నేను ఎందుకో వచ్చిన వాళ్ళతో పెద్దగ కలవలేక పోయేవాణ్ణి. నాకు మా ఇంట్లో ఎప్పుడు చావు డప్పు తప్ప వేరే శబ్దాలు వినపడలేదు. అందరు తాతయల్లు బాపమ్మలు దూరమయిన పది పన్నెండెండ్లకు గాని శుబకార్యం జరగలేదు మా ఇంట్లో.

 

అందుకే అనిపిస్తుంది ఆడవారికి, ఎంతో ఓర్పు, సహనం కావాలని, అవన్నీ మా అమ్మకి పుష్కలంగా ఉన్నాయి కాబట్టే ఇన్ని సేవలు చేసిన, తగోచ్చిన మా బాపు దెబ్బల తిప్పలు తనకి తప్పలేదు అన్ని బరించేది. నాకన్నా కొంచెం పొడుగున్న మా అన్న, ఏడుస్తూ మా అక్క, ఆపడానికి ఎంత ప్రయత్నించే వారో. ప్రతి రోజు రాత్రి బాపు వస్తున్నాడంటే గుండెలో దడ మొదలయ్యేది. ముసలోళ్ళు వాళ్ళు చెప్పిన పలితం లేకుండా పోయేది. తన అరుపులు మా గల్లీలో ఉన్న నా యిడు పిలగండ్లమందరికి వణుకే.

ఎంత గొడవ చేసిన కూడా ఒక్కసారికూడా బాపు మమ్మల్ని(నన్ను, అక్కయని, అన్నయ్యని) ఏమనలేదు. అదే మహా బాగ్యం అనుకునేది మా అమ్మ. ఈ రకంగా మా అమ్మ దేవుడు మమ్మల్ని చల్లగా చూడాలని అందరికి సేవ చేసేది.

 

అప్పుడుప్పడు పుట్నాలమ్మకి మా అమ్మ పాత చీర ఇస్తే, చీరను ప్రేమగా తాకుతూ. కంట నీరు పెట్టుకునేది. నువ్వు సల్లగుండాలి అవ్వ అంటూ దండం పెడుతుంటే. ఇదంతా అమ్మ కొంగు చాటున నుండి తొంగి చూస్తుండే వాణ్ని. అప్పుడనిపించేది, మనసులకి కావాల్సింది, డబ్బు కాదు ఒక మంచి మాట, చిన్న ఆప్యాయత, ప్రేమగా ఇచ్చే కాసిన్ని మంచినీళ్ళు. ఈ రకంగా మా అమ్మ దేవుడు మమ్మల్ని చల్లగా చూడాలని అందరికి సేవ చేసేది. ఆవును పట్టుకొని  ఇంటి ముందుకొచ్చే జంగాయన నుండి మొదలు పెడితే, కూరగాయలు అమ్ముకునే పెద్దమ్మ, చీరాల భద్రయ్య, వయసు పైపడి వంక కర్ర ఉతంతో పొద్దున్నే బన్ను రొట్టె తెచ్చే ఫతిమమ్మ, మెడలు పట్టుకుంటే సరి చేసే డబ్బా కదా అంటి, పెద్దలకు బియ్యం ఇచ్చినప్పుడు, మా విధి చివర్లో ఉన్న బాపనామే, పిరికెడు బియ్యం కోసం రోజు వచ్చే ఓ ముసలి తాత వరకు అందరు మా అమ్మ సేవకు ప్రతిఫలంగా మమ్మల్ని దీవించే వాళ్ళు. మా అమ్మ మాకు తెలియకుండానే మా మనస్సులో ఎన్నో విషయాలు నింపింది. అందుకేనేమో నాలో చదువుని, మనుషుల్ని నమ్మక. కేవలం మనసుల్ని నమ్మాలనే భావన నాటుకుంది. ఆ భావనే ఇప్పటికి నను ముందుకు నడిపిస్తుంటుంది.

 

ఆ రోజు పుట్నాలమ్మ తన ప్రేమను బటానీలు, పుట్నాలతో పెద్ద గిన్న నిండా నింపి ఇచ్చింది. గిన్న నిండా ఉన్న పుట్నాలు బాటనీలను చూడగానే నా మనసు ఎంత సంతోషించిందో మాటల్లో చెప్పలేను. అందుకేనేమో మా పుట్నాలమ్మ ఇప్పటికి నా మనసులో మేదులుతుంటుంది.

 

తెల్లారి ఆదివారం. దోసెడు నిండా ఒక పేపరులో పుట్నాలు, ఇంకో పేపర్లో బటానిలు కొంచెం బెల్లం జత చేసిపొట్లం కట్టుకొని, సంచిలో పెట్టుకొని, నేను సాబిర్ కొడుకు ఆరిఫ్, పాష భాయి కొడుకు అమ్జాద్, గుండం వాడ అబ్జల్, ఇర్షాద్, ఆరిఫ్ వాళ్ళ చిన్నమ్మ కొడుకు యాకుబ్ పాషా, కాకతీయ కలని రవి గాడు, మచిలిబాజార్ హరి, రాగాపురం అనిల్. అందరం కలిసి ముళ్ళ చెట్లతో నిండిన బాధ్రకాలి చెరువు గట్టు ని ధాటి, గుడిని ధాటి విశాలంగా ఉన్న ప్రదేశంలో అందరు క్రికెట్ ఆడుతుంటే, నేను మాత్రం దూరంగా ఉన్న చెరువును ఆస్వాదిస్తూ ఒంటరిగా నా మనసుకు నేనే ప్రశ్నలు వేస్తూ సమాధానం చెప్పుకుంటుండగా, అలసి పోయి ఒక్కొక్కరిగా వచ్చి నా పక్కన చేరే వాళ్ళు . అప్పుడు పొట్లాలు బయటికి తీసి అందరికి ఒక చేతిలో పుట్నాలు ఒక చేతిలో బటానీలు కొంచం బెల్లం పెట్టి. నేను కూడా ఒక్కొక్కటి నోట్లో వేసుకుంటూ మాటలు లేకుండా ఆస్వాదిస్తూ. దూరంగా పరుచుకొని ఉన్న చెరువుని గుట్టను, చల్లని గాలిని ఆస్వాదిస్తూ గంటల కొద్ది గడిపేవాళ్ళం.

 

కొందఱు మన జీవితాల్లో చెరగని ముద్రలు వేస్తారు.

నిజమే కొన్ని అనుబంధాలు తర్కానికి అందవు కేవలం మానవత్వం అనే సన్నని తీగతో మా పుట్నాలమ్మ నా మనసుని అల్లుకుంది.

 

**

 

“నారాయణగూడ” “నారాయణగూడ” కండక్టర్ పిలుపుతో మెలకువ వచ్చి జ్ఞాపకాల తీగను తెంపి దబుక్కున కిందికి దూకి టైం చూసుకొని, అరరే టైంతో పాటే నేను కూడా యంత్రికున్నని, ఓ మరమనిషినని గుర్తు తెచ్చుకొని ఆఫీసు కి పయనమయ్యాను.

ఆరుద్ర

December 6, 2012 Leave a comment

మళ్ళీ చాల కాలం తర్వాత జయతి అక్కయ  గారి ఫోటో ఆల్బం లో చూసాను ఆరుద్రని. అచ్చమైన ఎరుపువర్ణం లో ఉన్న ఆరుద్రని చూసి చాల కాలమైంది. దాదాపు పదేండ్లు కావస్తుంది.

వేసవి సెలవులు అనే పధం వినపడితే చాలు చిన్నమ్మ వాళ్ళ ఇళ్లు గుర్తొచ్చేది. కొత్తకొండ, ధర్మారం కరీంనగర్ జిల్లాలో ఉండేది వారి ఇళ్లు.  ఎండాకాలమే కాదు వర్షాకాలం శీతకాలల్లో కూడా నాలుగైదు రోజులు వెళ్లి గడిపెవాల్లము.

 

అప్పట్లో ఇప్పటి లాగ ఆటోలు లేవు హన్మకొండ బస్సు స్టాండ్ లో బాపు, అమ్మ, అన్నయ, అక్కయ, నేను అందరం కలిసి ములకనూరు బస్సు ఎక్కేవాళ్ళం.

అక్కడ మొదలైన బస్సు మెల్లిగా కదులుతూ పెట్రోల్ పంప్, నయీం నగర్, కాకతీయ విశ్వవిద్యాలయం దాటిన తర్వాతే వేగం పుంజుకునేది. ఆ కాలంలో బస్సు కిటికే నాకో పెద్ద ఇంటర్నెట్ ఎండకాలమైతే Windows XP వానకలమైతే Windows  Vista ఇక ఆ బస్సు కిటికిలోంచి  ప్రపంచాన్ని చూడడమే తరువాయి దూరంగ కనిపించే కొండలు, వేగంగ వెనక్కి పరిగెత్తే చెట్లు, ఒక గ్రాఫ్ లో గీతల్లాగా పైకి కిందికి ఊగిసలడుతున్నట్టు తోచే కరెంటు స్థంబాల వైర్లు, మధ్యలో కనిపిస్తున్న ప్రతి వారికి చెయ్యి ఊపుతూ టాటా చెపుతూ సాగే ప్రయాణంతో ఒక గంటలో ములుకనూరు చేరేవాళ్ళం. చుట్టూ పక్కన ఉన్న గ్రామాలన్నిటికీ అదే టౌను.

 

అక్కడినుండి కొత్తకొండ బస్సు ఎక్కి చుట్టూ ఉన్న సుందర లావణ్యాన్ని చూస్తుండగా చల్లని ఈదురు గాలులకు దీటుగా బస్సు దూసుకుపోతుంటే వెచ్చటి అమ్మ ఒళ్ళో కూర్చొని కిటికీ నుండి చూడగా దూరంగా మంచుతో కప్పబడిన కొండలు ఏదో గ్రామంలో ప్రయనిస్తున్నట్టు కాకా ఊటీ కొడైకెనాల్ కు వెళ్తున్న అనుభూతి కలిగేది(ఇప్పటికిను), మెల్లిగా చినుకులు పడుతుండగా పడిశం పడుతుందని అమ్మ కిటికీ మూసేది. నీటి తుంపర్లతో మసగ్గా మారిన కిటికీ  నుండి చూడగా కనిపించే కొండలు వాటిని కప్పుకొని ఉన్న మంచు పొగలు, జోరుగు కురుస్తున్న వర్షం, ఈదురు గాలులకు వంగి పోతున్న చెట్లు, ముద్దైన పంటపొలాలు, అన్ని కూడా, ఓ చిత్రకారుడు గీసిన వర్ణ చిత్రం లాగ తోచేది. అప్పుడప్పుడు తలుక్కున మెరిసే ఆవులు, పొలం చివర్లో గట్టుపైన కట్టుకున్న గుడిసెలు, తడుస్తూ పరుగులు పెడుతూ పొలం బాయిల కాడ నా ఈడు పిల్లలు, మరి వెలుతురుగా కాకా మరి చీకటిగా కాకా మసక వెలుతురులో, అధ్బుతమైన ప్రకృతి అందాలు ఒక్క మాటలో చెప్పాలంటే ఒక వంద మంది చిత్రకారుల వర్ణ చిత్రాలతో ఏర్పాటు చేసిన అతి పెద్ద సహజ గేలరీ ని చూస్తున్న అనుబూతి ఓ బస్సు కిటికీ ద్వారా కలిగేది.

 

మెల్లిగ వర్షం తగ్గే సమయానికి కొత్తకొండ కి చేరుకునే వాళ్ళం. ఇక అక్కడినుండి ధర్మారం గ్రామంలోకి వెళ్ళాలంటే ఎర్ర మట్టి రోడ్డు పై నాలుగు కిలోమీటర్లు నడవాల్సిందే. ఇక తడిచి ముద్దైన నేల బాటపై బురద చిల్లకుండ స్లిప్పర్లను బొటన వేలుతో గట్టిగ పట్టుకొని, అన్నయ చూపుడు వేలును ఆసరాగా తీసుకొని  నెమ్మదిగ అడుగులు వేస్తూ వెళ్ళేవాళ్ళం.  ఇక నేను మాత్రం కుడి వైపుకు ఉన్న పెద్ద పెద్ద కొండలని, గుట్టల చివరని, తల పైకెత్తి చూస్తుంటే, అక్కడికి చేరుకుంటే ఆకాశాన్ని అందుకోవడమే అని అన్నయ చెప్తూ ఉంటె వింటూ నడిచేవాన్ని, ఎడమ వైపు నేల కనపడకుండా పచ్చని పొలాలు, చిన్న చెరువు, చెరువు మొత్తం ఓ frame  లాగ ఆకాశం మేఘాలు ఆ frame  లో బంది అయి కనులకు ఇంపుగా తోచేది.

 

ధోతి పైకెత్తుకొని, తలకు రుమాలు చుట్టుకొని, చలి బెట్టకుండా గొంగడి కప్పుకొని, చేతి కర్ర పట్టుకొని, ఆహే ఆహే అంటూ పాతిక గొర్రెలను తోలుకుంటూ ఎదురొచ్చే తాత, పెద్ద సైకిల్ పై గోనే సంచుల మూటలతో లుంగీలు కట్టుకొని ఎదురొచ్చే మధ్యవయసు యువకులు, కూలి పనులకి పోతున్న ఆడవాళ్ళు, ఒక్కొక్కటి ఎదురు పడుతుండగా చూస్తూ వెళ్ళేవాళ్ళం. ఆ నాలుగు కిలోమీటర్ల ప్రయాణంలో కొండలపైనుండి పరుగులు పెడుతున్న కొండెంగా కోతులు, ఎలుగుబంట్లు, పరుగులు పెట్టె కుందేళ్ళు (చిత్రం అవ్వన్నీ ఇప్పుడు డబ్బులు పెట్టి “జూ” కి వెళ్తే తప్ప చూడని పరిస్థితి), బతుకమ్మ పండగలో ఉపోయోగించే, తంగేడ పూలు, సీత  జడ పూలు, ఇంకా నాకు పేర్లు తెలియని అందమైన పూలు, నిలువెత్తు జమవాయిలు చెట్లు, మామిడి, జామ, కంకి, వరి, పత్తి, ప్రొద్దు తిరుగుడు పూల తోటలు. అన్ని కూడా నన్ను సాధారముగా ఆహ్వానం పలికేవి, నా మనసు ఎన్నో అవతారలేత్తేది నాలో బిన్న భావాలూ ఒక కవిగా, శాస్త్రవేత్తగా, చిత్రకారునిగా, విశ్లేషకుడిగా, దర్శకుడిగా, ఫోటోగ్రాఫర్ గ, సృష్టి రహస్యాన్ని చేధించాలనే ఓ యోగి ల , జీవిత పరమార్ధం ఈ ప్రకృతిలోనే దాగుందని నమ్మే ఓ సాధువుల ఇలా  చెప్పుకుంటూ పోతే ఎన్నో అవతారాలెత్తిధి.

మనసుని చూపుని నాకు సాధ్యమయెంత  వరకు ఓ వల లాగ విసిరి ఆ ప్రకృతి దృశ్యాన్ని మొత్తం గుండెల్లో పదిలంగా దాచుకొని మనస్పూర్తిగా ఆనందించే వాణ్ని.

 

నాలుగు కిలోమీటర్ల ప్రయాణం తర్వాత ధర్మారం లోకి చేరుకునేవాళ్ళం. ఆ గ్రామం లో మొదటి ఇల్లు మా చిన్నమ్మ వాళ్ళదే. మూడు గదులు గల చిన్న పెంకుటిల్లు ముందు కూర్చోవడానికి గద్దె(అరుగు), నీడకోసం వేసిన పందిరి దానికి అల్లుకొని పెరుగుతున్న బటాణి పూల చెట్టు, మూడు గదులు కూడా ఎర్రమన్నుతో అలికి ముగ్గులు పెట్టి ఎప్పుడు శుబ్రంగ ఉంచుతుంది చిన్నమ్మ(శుబ్రత విషయంలో మా చిన్నమ్మ తీసుకొనే జాగ్రత్తలు అంత ఇంత కాదు). ఇంటి వెనకాల విశాలమైన ప్రదేశం మధ్యలో అతి పెద్ద చింత చెట్టు ఆ ఇంటి మొత్తాన్ని ఓ గొడుగుల తన కౌగిల్లోకి తీసుకొని కాపాడుతున్నట్టు ఉంటుంది. ఓ మూలన దాదాపు ఏడెనిమిది బొప్పాయీ చెట్లు, రెండు జామ చెట్లు, నిమ్మ చెట్టు, కాయగూరల మొక్కలు, కనకాంబరం, సీత జడ పూల మొక్కలు, ఇంకా కంద మొక్కలు, పాలకూర, బచ్చలి, చిక్కుడు మొక్కలు ఉండేవి. ఎప్పుడు ఇంట్లో కుటుంబ సబ్యుల్లా మెదిలే చిట్టి పిల్లి కూనలు(రెండు ముద్దల పెరుగన్నం పెడితే తినేసి ఇంట్లో ఓ మూలాన సేద తీరేవి), కోడి పుంజులు, పదికి పైన కోళ్ళు.

 

అప్పట్లో సైకిల్ అద్దెకిచ్చే షాపు నడిపించేవాడు బాబాయ్, గ్రామం లో అందరికిను మాట సాయం, చేత సాయం చేస్తూ ఏదైనా గొడవలు సమస్యలు గ్రామం ప్రజల్లో కలిగితే న్యాయ నిర్ణేత (పెద్దమనిషి) గ వ్యవహరించేవాడు.

 

ఇంట్లోకి చేరుకోగానే చిక్కటి మజ్జిగ తాగి చింత చెట్టు కింద ఎవరికీ నచ్చిన చోట వారు చాపలు పరుచుకొని సేద తీరుతుంటే, చింత చెట్టు కాడా మట్టి పోయ్యిలోనే వంటలన్నీ కూడా దానికి అనుకోని పక్కనే రోలు రోకలి(రోకలి తో ఉన్న అనుబంధం అంత ఇంత కాదు), ఇక నేను బయటికొచ్చి, ఎదురుగా ఉన్న రెండెకరాల పొలంలోకి వెళ్ళే వాణ్ని వెళ్లిన ప్రతిసారి రకరక ల పంటలు పత్తి, మొక్క జొన్న, కంది, ప్రొదు తిరుగుడు, బాబ్బెర్లు పండించేవారు నాకు మాత్రం ప్రొద్దు తిరుగుడు, కంది, బాబ్బెర్ల పంటలంటే  మరి ఇష్టం. ఆ పొలం లో ఎంత సేపు గడిపిన తక్కువే అనిపిస్తుంటుంది. ఆ పొలం ధాటి మట్టి దారిని ధాటి వేరే పొలం గట్ట్లపైనుండి నడుస్తూ వెళితే కనిపిస్తుంది పెద్ద ఊడల మర్రి చెట్టు, అక్కడ ఊడలు చేత పట్టి ఊయల ఊగే ప్రయత్నం చేసే వాణ్ని, ఆ మర్రి చెట్టు మొదల్లో కనిపించేవి ప్రదేశమంత మహారాజుల్ల మహారానిల్ల  పాలిస్తున్నట్టుగ ఆరుద్ర పురుగుల గుంపు, చాల సార్లు చేతిలోకి తీసుకొనే ప్రయత్నం చేశాను కాని ధైర్యం చాలలేదు. ఎత్తు వంపులను ఎక్కుతూ థిగుతూ, ఒక దాని వెంబడి ఒక్కొక్కటి రైలు బోగిల్ల వెళ్తుండడం భలే ముచ్చటేసేది. ఆ గ్రామం లో గడిపిన రోజుల్లో ప్రతి రోజు ఆరుద్ర పురుగుల రాజ్యానికి వెళ్లి వచ్చేవాడిని. ఆరుద్ర రాజ్యాన్ని అనుకొనే పెద్ద నల్ల చీమల రాజ్యం, దానికి కొంచెం దూరం లో ఉన్న పిచ్చి మొక్కలను ఆసరాగా తీసుకొని జీవనం సాగిస్తున్న బంగారు పురుగులు, అలా కొంచెం తల పైకెత్తి చూస్తే కనిపించే తేనె తెట్ట ల మహేలు, ఒక వందకు పైగా సంగీతాలు వాయించే పిచుకలు వాటి గూళ్ళు, అప్పుడప్పుడు వినిపించే కోయిల స్వరం, ఊడల మధ్యలనుండి సింధూరం పూసుకొని సిగ్గుతో తలదించుకొని అస్తమిస్తున్న సూర్య బింబం, గాలి విచినప్పుడల్లా పసుపువర్నంలోకి మారి రాలుతున్న ఆకులు, ఇలా ఓ అధ్బుత సుందర లోకం లోకి అతిధిగా వచ్చిన  నా మనసుకు ప్రతిరోజు సేవ చేసేది ఆ ప్రాంతం అంత. ఇదే తంతు ప్రతి రోజు ఒక్కోరోజు ఉదయాన్నే వేల్లెవాన్ని ఒక జేబులో వేయించిన పల్లీలు, మరో జేబులో, వేయించిన శనగలు, చేతిలో మొక్కజొన్న పాలేలు, అలా తినుకుంటూ అక్కడికి చేరుకొనే వాణ్ని, అపుడే ఉదయిస్తున్న సూర్యుని కిరణాలూ, పంట పొలాలపై ప్రతి చిన్న ఆకును కూడా వదలకుండా పడేది. జివ్వుమని తగిలిన సూర్యకిరణం ప్రతి ఆకును మేలుకోల్పేది. ఆకూపై సేదతీరుతున్న చిన్న చిన్న నీటి బిందువులు పై పడుతున్న సూర్యకిరణం తో ఉత్తేజితమై వజ్రపు రంగులోకి రూపాంతరం చెందేది. అదంతా గమనిస్తున్న నేను నా మనసు కెమరాలో బంధించుకునే వాణ్ని. హమ్మయ్య లేగండ్రా  అనుకుంటూ ఆరుద్ర పురుగులు బయటికోచ్చేవి తమ రాజ్యంలో  ఉన్న మిగతా పురుగులతో ఆ సమయంలో వాటి రంగు మరింత తేజోమయమై ఉండేధి.

 

కొంత కాలం తర్వాత నా జేబులోకి డిజిటల్ కెమరా వచ్చి చేరాక ఆ ఆరుద్ర కోసం నాలుగు రోజులు వెతికాను. ఈ అతిధి మీద కోపం పెంచుకున్నాయేమో లేక మరే కారణమో కాని కాలంతో పాటు జరిగిన మార్పులతో మర్రి చెట్టు, ఆ ఆరుద్రలు, పక్షుల గూళ్ళు, కాలంలోనే మాయమయ్యాయి. ఏమో ఏదో తెలియని అనుబంధం ప్రక్రుతితోనో లేక బావాలతోనో, లేక నాలోనే దాగిన నాతోనో ఏమో ఎవరికీ చెప్పుకోలేని ఓ వింత వేదనకి గురయ్యాను అవి కనపడక పోవడంతో. చెప్పాలంటే ఆ గ్రామం లో నేను చుసిన ప్రతి అంగుళం కూడా నా మనసు వాటికి మాత్రమే తెలిసే బంధం ఏర్పరుచుకున్నది. ఒక్కో చోటు ఒక్కో పుస్తకమై మనసు లైబ్రేరి లో దుమ్ముపట్టకుండా పదిలంగా దాచుకున్న.

 

పదిహేను సంవత్సరాల్లోనే అభివృద్ధి పేరుతో మనుషుల మధ్యన జరుగుతున్న మార్పులు ఆ గ్రామాన్ని కూడా చుట్టుముట్టాయి. ఇది కొత్తేం కాదు నేను ఊహించిందే అయిన జంతు సంరక్షణ పేరుతో కనిపించిన ప్రతి మూగ జీవిని లాక్కెళ్ళి పోయారు, కొన్ని వందల నెమల్లు, కొండెంగ కోతులు, కుందేళ్ళు, ఎలుగుబంట్లు, ఒకటి రెండు చిరుతలు, వందల్లో వింత వింత పాములు. ఇలా చెప్పుకుంటూ పోతే తమ తమ రాజ్యాలని కొల్లోగోట్టిన మహానుభావులము మన మానవులమే అని చెప్పుకోవడంలో ఏమాత్రం సిగ్గుగా లేదు.

 

ఆ గ్రామా ప్రజలందరికీ రాజకీయ గుర్తింపు లబించింది. ఇక రాజీకయ అనుబవగ్నులకి ప్రజలంతా ఉపయోగ పడడం మొదలయింది. పంటలను తగ్గించి, కొల్ల ఫారాలు( పెద్ద  మొత్తం లో వచ్చిన నష్టం ఏ ప్రబుత్వం బరించలేక పోవడం తో వారి నెత్తినే భారం వేసుకొని రైతన్నల మేడలు వంగి పోవడం జరిగింది), పొగాకు బిడిలా సెగ ప్రతి పాలిచ్చే మహిళను కూడా పనిలోకి దింపింది. చైతన్యం పేరుతో గ్రామా దేవతల పండుగలు, ఎడ్లబండ్లపై కొత్తకొండ జాతరను దర్శించుకోవడాలు, ఇంట్లో కుల దేవత పూజలు, అన్ని మాయమవుతున్నాయి, ఇప్పుడు నాలుగు కిలోమీటర్లు నడిచే ఓపిక, సమయం ఎవరికీ లేదు ప్రతివారు చేతిలో వాచీ చూసుకొని టైం లేదు మరీ చాల బిజీ, ఆటో లు మొదలయ్యాయి బస్సులు కరువయ్యాయి, నా కిటికీ గేలరీ మూతపడింది. 

 

పిల్లల చేసే అల్లరికి ప్రకృతి మాత మౌనంగ కొంగు అడ్డుపెట్టుకొని బాధ పడడం కళ్లారా కనిపించింది. అయిన ఏదో ఆశ, ఏదో అలజడి, ఒక కొత్త అనుబవం, ఒక కొత్త కోరిక ఎప్పుడు నా మనసును ఆ గ్రామా ప్రకృతి దేవత తన వైపుకు లాగుతుంటుంది. ఇప్పటికేమి మించిపోయింది ఏమి లేదని గ్రామా బ్యాంకు సహాయంతో వ్యవసాయశాక   అధికారులు, వేప మందు పరిచయం చేసారు. మంచి పనులు చేయడానికి గ్రామా పెద్దలు ముందుకు రావడం కూడా ఆరోగ్యకరమైన విషయమే.

 

గ్రామానికేల్లి చాల రోజులయ్యింది. కొత్తగ  తీసుకొన్న ప్రొఫెషనల్ కేమరకి ఇంకా ఆ గ్రామాన్ని పరిచయం చేయలేదు. మరో నాలుగు రోజులు వెళ్లి గడపాల్సిందే.

మెల్లిగ నెమరువేసుకున్న పుస్తకాన్ని మనసు లైబ్రేరి లో బద్రంగా పెట్టుకొని. అందమైన ఆలోచనల నుండి బయటపడి మల్లి రణగొణ ధ్వనులతో యుద్ధం సాగిస్తూ సికింద్రాబాద్ రేతిఫైల్ బస్సు స్టాప్ లోనుండి ఒకటో నెంబర్ బస్సెక్కి ఆఫీసు కి పయనం..

జీవితం – ఒక రైలు ప్రయాణం

December 6, 2012 Leave a comment

హలో ఎలా ఉన్నారు అన్నయ అని పలకరించింది శ్రావ్య.

చాల రోజుల తర్వాత విన్న గొంతు తో మనసులో సంతోషం ఒక్కసారిగా పొంగుకొచ్చింది.

కులాసా కబుర్ల తర్వాత ఫోన్ అరుణ్ అందుకున్నాడు.

ఏరా మామ ఎలా ఉన్నావు రా అంటూ మొదలు పెట్టిన మాటలు ౩౦నిమషాలకి గాని పూర్తవలేదు.

ఫోన్ పెట్టేసి పక్కకు తల వాల్చి…

అరుణ్ శ్రావ్య లే కాళ్ళ ముందు మెదిలారు.

జీవితం అనే రైలు ప్రయాణం లో ఎన్నెన్నో మలుపులు కొత్త పరిచయాలు, కొత్త వ్యక్తులు, కొత్త మధురనుబుతులు కొందరు దగ్గర ఉన్న పట్టించుకోము. దూరంగా ఉంటె తట్టుకోలేము. కానీ అరుణ్ శ్రావ్య వీరు మాత్రం ఎక్కడున్నా నా మనసులో ఎప్పుడు మెదులుతూనే ఉంటారు.

2004 కాజిపేట లో కృష్ణ  ఎక్స్ ప్రెస్ ఎక్కినా రెండు నిమిషాలకి కదిలింది. లక్కీగ కిటికీ పక్క సీటు కాలిగా ఉండడంతో వెళ్లి కూర్చున్న మెల్లిగా బాగ్ లో నుండి బుచ్చిబాబు చివరికి మిగిలేది బుక్ తీసి చదవడం మొదలు పెట్టాను. ఒక పేజి చదివిన తర్వాత ఎదురుగా ఉన్న వ్యక్తి చదువుతున్నా పుస్తకం పై కన్ను పడింది “కలలో జారిన కన్నీరు” అది కూడా బుచ్చి బాబు గారిదే.

నా పేరు రఘు అంటూ పరిచయం చేసుకున్నాను. తను అరుణ్ అంటూ చేయి చాచాడు. షేక్ హ్యాండ్ ఇచ్చుకొని. మాటల్లో దిగాము. మూడు గంటల ప్రయాణం తర్వాత సికింద్రాబాద్ చేరుకున్నాం. మూడు గంటల ప్రయాణం లో చాల అర్ధమైపోయాము. ఎంతగా అంటే ఎప్పటి నుండో పరిచయం ఉన్నట్టుగ.

చాల కలం తర్వాత నాలుగు రోజుల కాలి సమయం దొరికింది కదా అని హైదరాబాద్ లో ఉన్న పెన్ ఫ్రెండ్ పీటర్ ని కలిసి ఒక నాలుగు రోజులు గడుపుదామని బయలుదేరాను. మధ్యలో ఇలా అరుణ్ పరిచయం.

అప్పుడు మొదలైన మా పరిచయం ఎన్నో మార్పులు చేర్పులు ఇరువురి జీవితాల్లో జరుగుతూ ఉన్న మా స్నేహం మాత్రం కొనసాగుతూనే ఉంది.

అరుణ్ కి పాలిటిక్స్ అంటే మమకారం CM  కావాలని కలలుకంటుండె వాడు. వాడు, వాడి ఆలోచనలు ఎప్పుడు బడుగు బలహీన వర్గాల చేయుతకై పాటు పడే సంఘాలతో పల్లెల్లో రసాయనాల వాడకాన్ని నిర్ములించి వేపతో తాయారు చేసిన పురుగుల మందు పై అవగాహనా కలిగించేందుకు వ్యవసాయ శాక అధికారులతో గ్రామాల్ని పర్యటించేవాడు. సమస్యని ఎత్తి చూపడం తగ్గించి, దానిని ఎలా అధిగమించాలి అని ఆలోచిస్తూ తన వంతు సాయం చేయడానికి ఎప్పుడు సిద్దంగ ఉండే వాడు.

వాడికి ఉన్న రాజకీయ అనుభవం అవగాహనా వాడు రాస్తున్న ఆర్టికల్స్ లో ప్రస్పుటంగ కనిపించేవి. నువ్వు కనుక CM  అయితే ముందు ఎం చేస్తావురా అని అడిగితే. మద్యం, సిగరెట్టు, గుట్క లు అమ్మే షాపుల్ని ఒక్కసారిగా పెకిలించేసి రాష్ట్రంలో ఎక్కడ కూడా మద్యం, సారాయి, లాంటి మత్తు పదార్ధాల్ని, లేకుండా చేస్తాను. అని చెప్తూ ఉంటె పక్కనున్న మేమంతా గొల్లున నవ్వేవాళ్ళం. దానికి వాడు ఏ మాత్రం చిన్న బుచ్చుకోకుండా, ఈ మాత్రం కూడా చేయలేని వాడు CM  అయ్యే బదులు అడుక్కుతినడం మేలు. అనే వాక్యంతో మా నోర్లు మూసే వాడు.  వాడి ఆలోచనలు కేవలం ఆలోచనలతో పరిమితమయ్యేవి కావు. ప్రతిది కూడా చాల పకడ్బందిగా సమస్యని ఏ విధంగా పరిష్కరించాలో ఎవరిని కలిస్తే త్వరగా పని పూర్తవుతుందో వారిని కలిసే వాడు.

తండ్రి లేడు తల్లి మాత్రం ఉంది వీడొక్కడే కొడుకు. ఊర్లో పొలం, పాలేర్ల (పని వాళ్ళు) తో సాగు చేపిస్తుండేది తల్లి. వీడి దూకుడు చూసి వీడి మామయ్య తన కూతుర్ని ఇవ్వనన్నాడు. అరుణ్ ఇంకా వాడి ఫ్రెండ్స్ తో కలిసి గ్రామాల్లో నిరక్షరస్యతో నిర్మూలన పేరుతో నాటకాలు వేయిస్తూ. కలెక్టర్, గ్రామా పెద్దల సహకారంతో మారుమూల పల్లెల్లో మరుగుదొడ్లు కట్టించడం, ఏదైనా ఒక గ్రామాన్ని తీసుకొని వ్యవసాయ శాక అధికారి సహాయంతో  రోడ్డు కిరువైపులా వేప మరియు పళ్ళ మొక్కలని విద్యార్థులతో నాటించడం. అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి.  ఆ కార్యక్రమాలకి నన్ను కూడా లాక్కొని పోయేవాడు.

తనని చూసినప్పుడల్లా నేనెందుకు నా ఆలోచనలని చేతల్లో పెట్టలేకపోతున్న అని ఆలోచించేవాన్ని.

ఒక వ్యక్తి ఆలోచనకు ఎంత బలం ఉంటుందో. తనని చూస్తే తెలుస్తుంది.

వాడితో గడిపింతసేపు రాజకీయాలు, సేవ కార్యక్రమాలే కాదు, మా వయసుకు తగ్గట్టు సినిమాలు, బైక్ షికార్లు, సంగీతం, కొత్త అనువాద పుస్తకాలు, గుళ్ళు, జగన్నాధ రథ యాత్రలు, గణపతి ఉత్సవాలు, సికింద్రాబాద్ మహంకాళీ, ఓరుగల్లు సమక్క సారలమ్మ జాతరలు, హొలి సందళ్ళు, పండగలలో ప్రతి పల్లెల్లో రక రకాల విందు బోజనాల పిండి వంటల రుచులు, పల్లె సువాసనలు పీలుస్తూ ఎడ్ల బండ్లపై ప్రయాణాలు, పొలం గట్లపై నడకలు, మోకాళ్ళ పైకి పాయింటుని మలుచుకొని బురదలో పరుగులు, మా ఇంటి వెనకాల గుట్ట పై రాళ్ల తో ఆటలు, ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్లపై బెల్ పూరి, పావ్ బాజీ, కంకులు, పిచు మిటాయి, టపాసులు, కేకు తో న్యూ ఇయర్ సంబరాలు, ఒకటేంటి ఎన్నో ఎన్నెన్నో…

ఎయిడ్స్ అవగాహనా సదస్సు కై ఓ స్వచ్చంద సంస్థ నిర్వహించిన కార్యక్రమం లో బాగంగా కొందరు నృత్యకారులు తమ నృత్య ప్రదర్శన ఇచ్చారు. దానికి అరుణ్ తో కలిసి నేను వెళ్ళడం జరిగింది. ప్రదర్శన తర్వాత డాన్సు కంపోస్ చేసిన డాన్సు మాస్టర్ నాలుగు పదులు నిండిన ఓ మాతృ మూర్తి లలిత దేవి గారిని కలిసి అభినందించాము. ఆ పరిచయం తర్వాత వివిధ కార్యక్రమాల్లో తరచు కలవడం తన దగ్గర శాస్త్రీయ నృత్యం నేర్చుకుంటున్న శ్రావ్య తో పరిచయం చాల త్వరగా జరిగింది.

పరిచయమైనా కొద్ది రోజులకి అరుణ్ శ్రావ్య చాల దగ్గరయ్యారు. అన్నయ అన్నయ అంటూ ఆప్యాయంగా పలకరించేది ఎప్పుడైనా లలిత దేవి గారింటికెళ్తే  తప్పక కనిపిస్తుండేది. ఒక రోజు అరుణ్ నాతో శ్రావ్యని ప్రేమిస్తున్నాను అని చెప్పాడు. విషయం చెప్పడానికి ధైర్యం చాలట్లేదని చెప్పాడు. నేను వీడు చెప్పిందే ఆలస్యంగా వెంటనే శ్రావ్య తో విషయం చెప్పను తను చాల కూల్ గ ఇది జరగని పని అన్నయ అని చెప్పింది. ఎంతైనా టైం పడుతుంది కదా అని అనుకోని పర్లేదు ఒకసారి ఆలోచించుకోండి అని చెప్పాను.

అరుణ్ కి వ్యవసాయ శాకలో చిన్న ఉద్యోగం దొరికింది. అదే రోజు ధైర్యం తెచ్చుకొని తన ప్రేమ విషయాన్నీ చెప్పాడు శ్రావ్యతో.

తను అవుననలేదు కాదనలేదు గంట సేపు మౌనం తర్వాత తల కొంచెం ఎత్తి శ్రావ్య తన జీవితంలో ప్రతి నిర్ణయం లలిత దేవి గారికి తెలియకుండా తీసుకోలేను. నువ్వోక్కసారి తనకి ఈ విషయం చెప్పు అని చెప్పి గుడి గంటలు మోగుతుండగా సికింద్రాబాద్ గణపతి టెంపుల్ లో నుండి ఓని సరి చేసుకుంటూ వెళ్లి పోయింది.

రణ గోణా ధ్వనులతో ఎవరికీ ఎవరు కానట్టుగ పరుగు లాంటి నడకలతో మమ్మల్ని డీకొంటున్న జనాలను చీల్చుకుంటూ నడుస్తూ విషయం నాతో చెప్పాడు.  నాకు అప్పుడు అర్ధం కాలేదు ఒక గురువికి, శిష్యురాలికి, ఈవిడకి, ఆవిడకి గల సంబంధం ఏంటో..  మళ్లీ చెప్పడం మొదలు పెట్టాడు. లలిత దేవి గారే తన బాగోగులు చూసుకుంటుందని తల్లి తండ్రి లేని శ్రావ్యకి అండగా ఉంది. ఆ క్షణం ఒక్కసారిగా నా కంటికి లలిత దేవి గారు నిజమైన మాత్రుముర్తి లాగ కనిపించారు.

మంచి సమయం చూసుకొని నేను అరుణ్ లలిత దేవి గారిని కలిసాము. కొంతసేపటి తర్వాత అరుణ్ చెప్పడం మొదలు పెట్టాడు. నేను శ్రావ్య పెళ్లి చేసుకోవాలను కుంటున్నాను అని దానికి సమాధానం గా రఘు నేను అరుణ్ తో పర్సనల్ గ మాట్లాడాలి అని చెప్పడం తో ఆరు బయట లాన్ లో మొలిచిన పచ్చ గడ్డిని చూస్తూ పైన వేలాడదీసిన పంజరం లో ని రెండు పిచ్చుకలని చూస్తూ ఆ పక్కనే ఉన్న డాన్సు క్లాసు రూము లో సాగరసంగమం సినిమాలోని బాలకనకమయ చేల సుధాకర అని వినిపిస్తున్న పాటని ప్రాక్టీసు చేస్తున్న చిన్నారులను చూస్తూ నిల్చుండి పోయాను..

ఒక గంట తర్వాత బయటికి వడి వడి గ వస్తున్న అరుణ్ చూసి కంగారు పడ్డాను.

ఏమైందిరా అని అడిగాను.

ఏమి చెప్పలేదు. కాసేపు మౌనంగా క్లాసు రూము బయట అరుగుపై కూర్చొని కాలి వేళ్ళతో గడ్డిని తెంపుతూ ఆలోచనలో బడ్డాడు. మెల్లిగా మాట్లాడడం మొదలు పెడుతూ. నేను ఆ అమ్మాయిని నిజంగా ప్రేమిస్తున్ననురా ఎవరు ఏమైనా అనుకోని తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్న… అని అన్నాడు దానికి నేను లలిత దేవి గారు ఏమన్నారు. అని అడిగాను.

చాల సేపు మౌనంగ ఉండి తనకు కూడా ఇష్టమే అని చెప్పాడు.

నేను సంతోషించి మరి ఇంకేం శ్రావ్యతో ఈ విషయం చెప్పు అని అన్నాను.

క్లాసు రూము లో ఉన్న శ్రావ్య ని బయటికి రమ్మంటూ సైగ చేసి.

నేను లలిత దేవి గారి తో మాట్లాడను. అంటూ శ్రావ్య చేతిని తన చేతి లోకి తీసుకొని మెల్లిగా లలిత దేవి గారి దగ్గరికి తీసుకెళ్ళాడు వారి వెంటే నేను.

ఒక్క సారిగా మమ్మల్ని ఆశిర్వదించండి అంటూ లలిత దేవి గారి కాళ్ళపై  ఇద్దరు మోకరిల్లారు.

ఛ ఛ ఇదేంటయ్య లేవండర అంటూ వారిద్దరిని అక్కున చేర్చుకుంది. ఆ రోజు లలిత దేవి గారి కళ్ళల్లో ఆనందం తో కూడిన అశ్రువులను నేను చూడకుండా తన కళ్ళజోడు ఆపలేకపోయింది.

నేను ఒప్పుకుంటే సరిపోదు మీ వాళ్ళు కూడా ఒప్పుకోవాలి ముందు ఆ పనిలో ఉండండి అని చెప్పింది. అంతే కాకా పెళ్లి శ్రావ్య నర్సింగ్ కోర్సు పూర్తవగానే చేద్దాం అంది.

ఇక వీరి ఆనందాలకి అవధుల్లేవు.

ఒక విధంగా అరుణ్ నాకన్నా పెద్దవాడైన ఎప్పుడు మేము మామ మామ అంటూ పిలుచుకునే వాళ్ళం.

ఆ రోజు తర్వాత మళ్లీ నాకు చాల రోజులకు కలిసాడు.

ఉద్యోగం బానే ఉంది అన్నాడు. మెల్లిగా తన స్థావరాన్ని హైదరాబాద్ కు మార్చుకున్నాడు. నేను హైదరాబాద్ లోనే ఉన్నాను ఇక అరుణ్ శ్రావ్య తరుచు కలుసుకోవడాలు.

ఫ్రెండ్స్ అందరం కలిసి పిక్నిక్ లు ప్లాన్ చేయడం. పోలియో చుక్కల కార్యక్రమాలకి శ్రావ్యతో పాటు అందరం వెళ్ళడం. హాస్పిటల్స్ కి, రక్త దాన శిబిరాలకి, ప్రతిదానికి అందరం కట్ట గట్టుకొని వెళ్ళేవాళ్ళం.

డాన్సు ప్రోగ్రాం ఇస్తున్నది తెలిస్తే చాలు అందరం కలిసి మరి వెళ్ళేవాళ్ళం.

కొన్ని రోజులు కలిసాక అరుణ్ తన తల్లి ని ఒప్పించి అరుణ్ ఫ్రండ్స్ శ్రావ్య ఫ్రెండ్స్ లలిత దేవి గారు వారి భర్త నారాయణ మూర్తి మరియు మరికొంత మంది సమక్షం లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఎవరు లేని వాళ్ళలాగా ఇలా పెళ్ళిచేసుకోవడం తనకు ఇబ్బంది కలిగించినదేమో తన కొడుకు బాధపడుతాడని పక్కకొచ్చి కొంగుతో కళ్ళు తుడుచుకుంది అరుణ్ తల్లి.

నేను ఊహించలేదు తన పెళ్లి ఇంత త్వరగా జరుగుతుందని. ఆ మరుసటి రోజు నేను లలిత దేవి గారు, నారాయణ మూర్తి గారు, ఇంకా కొంత మంది మిత్రులతో తిరుపతికి ప్రయాణమై అక్కడ దండలు మార్చుకొని స్వామి వారి ఆశీర్వాదం తీసుకున్నారు.

అందరికి చాల సంతోషమేసింది చూడ చక్కని జంట అంటూ లలిత దేవిగారు మెచ్చుకున్నారు.

పెళ్ళైన కొద్ది రోజులకి శ్రావ్య కి ఓ ప్రబుత్వ ఆసుపత్రి లో హెడ్ నర్స్ గ జాబు వచ్చిందని అది కర్ణాటక లో హున్సూర్ కి దగ్గర ఓక గ్రామం లో అక్కడే తెలిసిన వారి అనాధ ఆశ్రమం ఉండడం తను జాబు చేస్తాననడం తో అరుణ్ శ్రావ్య ఇద్దరు అక్కడికి వెళ్ళడం జరిగింది.

వెళ్ళిన కొద్ధిరోజులకి అరుణ్ శుభా వార్త చెప్పాడు తను తండ్రి కబోతున్నట్టు. శ్రావ్య కూడా మాట్లాడి అన్నయ నువ్వు మామయ్య అవుతున్నావ్ అంటూ ఎంతో సంతోషం తో తన మాటల్లోనే తన ఆనందం చూడగలిగాను.

మరో పది రోజులు గడిచాక అరుణ్ కాల్ చేసి నేను హైదరాబాద్ కి వస్తున్నాను నిన్ను కలవాలి అని.

అన్నట్టుగానే వచ్చాడు.

తన గురించి వెయిట్ చేస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నేను.

కాసేపటి తర్వాత చేరుకున్న అరుణ్ చూసి సంతోషంతో వెళ్లి

ఏరా మామ ఎంత కాలానికి అంటూ బుజం తడుతూ బయటికి నడిచాం.

అల నడుస్తూ బయటికొచ్చినా మేము ఎప్పుడు నడిచే ట్యాంక్ బండ్ వైపుకి వెళ్ళాం.

అంత బావుంది. కానీ వాడిలో మునిపటి చలాకి తనం కనపడలేదు.

మెల్లిగా నడుస్తున్నాం.

ఏమైంది రా అని అడిగాను.

ఒక బల్ల కుర్చీ పై కూర్చొని ఎదురుగా ఉన్న బుద్ధ విగ్రహాన్ని చూస్తూ.

చాల సేపటి మౌనం తర్వాత “మాకు ఎయిడ్స్ రా” అని పిడుగులాంటి వార్త చెప్పాడు.

ఒక్క క్షణం నాకు పిచ్చెక్కి పోయింది. కళ్ళముందు సుడులు తిరిగిన గతమంతా, ఆనందమంత ఎవరో లాక్కొని పోయి నల్లని చీకట్లు కమ్ముకున్నట్టుగ ఎదురుగా ఉన్న బుద్దుడీ లాగే మౌనమైంది నా మనసు.

ఈ విషయం శ్రావ్యకి తెలుసా అని అడిగాను. చెప్పాను అని బదులిచ్చాడు. లలిత దేవి గారికి తెలియదు తనని కలవడానికే వచ్చాను అని చెప్పాడు. ఏం జరిగిందో ఎలా జరిగిందో అని అర తీయడానికి అది సమయం కాదని తెలిసి ఏమి అడగలేదు. ఇద్దరం కలిసి లలిత దేవి గారింటికి వెళ్ళాం. విషయం చెప్పడం తో ఒక్కసారిగా దుఖం కట్టలుతేచ్చుకొని బోరున విలపంచిడం మొదలు పెట్టడంతో అరుణ్ కూడా ఆపుకోలేక పోయాడు.  ఎలా ఓదార్చాలో నాకు తెలియలేదు.

మరుసటి రోజు ప్రయాణమయ్యాడు. తనతో పాటే లలిత దేవి గారు కూడా.

లలిత దేవి గారు తిరిగొచ్చిన తర్వాత ఒకో రోజు వీలు చూసుకొని వెళ్ళాను. కళ్ళద్దాలు సరిచేసుకుంటూ కుర్చోమంటూ చైర్ చూపించింది.  ఏం జరిగిందండి అని అడిగాను.

తను బాధతో చెప్పడం మొదలు పెట్టింది.

వ్యబిచారాన్ని వృత్తిగా ఎంచుకొని జీవనం సాగిస్తున్న ఓ మహిళ కూతురే ఈ శ్రావ్య. తన తో పాటే వేశ్యా వృత్తి లో కొనగించెందుకు ప్రయత్నించింది. తనని ఒక చోటుకి పంపిస్తుండగా పోలీసు లు పట్టుకొని నా మిత్రురాలు నడిపిస్తున్న స్వచ్చంద అనాధ ఆశ్రమానికి తీసుకొచ్చారు. అక్కడి నుండి తనని నేను తీసుకొచ్చి నేనే పెంచుకుంటున్న.

అరుణ్ వచ్చి అడిగినప్పుడు ఇదంతా తనకి చెప్పాను. అన్ని తెలుసుకొని కూడా తనని పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చాడు.

నిజమే అన్ని తెలిసి కూడా పెళ్లి కి సిద్ధమైన మిత్రుడు నాకు మిత్రుడైనందుకు నాకు గర్వంగా ఉంది.

నాకు నోట మాట రాలేదు, అరుణ్ కి కాల్ చేశాను పుట్టబోయే పాపకి ఎలాంటి హాని జరక్కుండా చూసుకోమంటూ సలహా ఇచ్చాను.

డాక్టర్స్ మరియు కొంత మంది పెద్దవారు చెప్పిన సూచనలు పాటిస్తూ కొద్ది కొద్దిగా మానసికంగ బలాన్ని పుంజుకుంటున్న ఆ జంటను పది కాలాల పాటు చల్లగా చూడామణి భగవంతున్ని కోరుతున్నాను. ఎంత అవగాహనా సదస్సులు పెట్టి ఎయిడ్స్ పై అవగాహనా ఇచ్చిన వీరికే ఎయిడ్స్ ఉందన్న నిజం బాధ పెట్టకుంట ఉంటుందా..

నిజమే నా దోస్తు CM  కాలేదు కానీ నాకు మాత్రం అంత కన్నా ఎక్కువే.

ఏ కష్టం లేకుండా హాయిగా గడుపుతూ ఐదు నెల్ల క్రితం చక్కని చుక్క కి జన్మనిచ్చింది శ్రావ్య.. పాపా పేరు హారిక అని పెట్టుకున్నారు.

లలిత దేవి గారిని కలవడానికి ఆగష్టు లో వస్తున్నారని చెప్పారు.

ప్రపంచాన్ని మరిచి తాము నిర్మించుకున్న సౌధంలో అనుక్షణం ఆనందంగా గడుపుతూ అరుణ్ శ్రావ్య .

నా పెళ్లి కి రాలేక పోయిన ఈ సారి అందరం కలవబోతున్నాం అనే సంతోషం లో నేను..