Archive
మరుపు
పోటి ప్రపంచంలో మనిషిలా గుర్తించుకోతగ్గ చదువు గాని అనుభవం గాని నాకు లేవనే చెప్పాలి. రాసుకోవడమనే అంశం నా నిజ జీవితంలో ఎప్పుడు మొదలయ్యిందో పెద్దగ తెలీదు కాని అందరు ఊన్న ఎవరు లేని నాలోని ఒంటరితనాన్ని దిగమింగుకోవడం కోసమే కెమరా, పుస్తకం, నడిచిన తరగని తారు రోడ్డు, కుడి ఎడమల వైపు కనపడే సందోహాలు మరియు కంటికి ఇంపుగా కనిపించే ప్రకృతి ఇవే ఒక విధంగా నాకు గొప్ప ఆసరా..
++
ఇతరులందరికీ ఏవగింపు కలిగించే పరిస్థితుల నడుమన జీవితం మొదలై గడుస్తున్నప్పటికి చిత్రంగా యధ్రుచికంగా నాకు మాత్రం ప్రతీది అందంగా అర్ధవంతంగా ఎందుకు కనిపించేదో ఇప్పటికి నాకు అర్ధం కాదు.
++
మర్చిపోవడం అనేది నాకు పట్టిన ఒక పెద్ద దెయ్యం భహుశ దాన్ని పోగొట్టుకోడానికి నాకు నేను ఎంత ప్రయత్నం చేసినా.., పనిగట్టుకొని మా అమ్మ ఇంటికి దగ్గరలో ములుగు రోడ్ చౌరస్తా దగ్గరలో శుక్రారం శుక్రారం దర్గాకు తీసుకెళ్ళి తాయత్తు కట్టించి నెమలి కన్నుల చీపిరితో వెన్నులో చరిపించి ఊదు పొగ వేసినా…, దయ్యం సంగతి పక్కన పెడితే సాహీబు తంతు జరుపుతున్న ఆ ఐదు నిమిషాలు మాత్రం అగరొత్తుల, ధూపం నుండి, దర్గా గర్బంలో నింపేసిన మల్లెలు గులాబీల నుండి వీస్తున్న కమ్మని గుబాళింపు మత్తులో ఆనందంగా మునిగి తేలుతుండేవాన్ని..
++
మతి మరుపు
ఇక మతి మరుపు నను నిండా ముంచక ముందే దాన్ని నేను ముంచెయ్యలనె ఆరాటం లోనే ఉన్నదీ లేంది జరిగింది జరగంది చూసింది ఊహించింది కలగన్నది అది ఇది అని కాకుండా ఏదిపడితే అది పేజీల కొద్ది రాసుకోవడం అలవాటయ్యింది. ఆ అలవాటు రాను రాను నా నుండి ఓ రెండు పుస్తకాలని పుట్టిస్తుందని వాటి పుట్టుక అందరిని మెప్పిస్తుందని నన్ను నలుగురి ముందు నిలుచోబెడుతుందని ఎన్నడు నే ఊహించలేదు.
ఇప్పుడు ఆలోచిస్తుంటే న్యూనతలను అధిగమించాలనే ధోరణిలో ఈ కాలం నన్నెంతో దూరం నెట్టుకొచ్చింది ప్రపంచంతో నాకేం సంబంధం లేదంటూ ప్రపంచపు ప్రాపంచికానికి భయంతో, బాధతో, న్యూనతతో పారిపోతూ పరిగెట్టే నా మనసుకు ఇదే ప్రపంచంలో నాకంటూ ఒక ప్రపంచం ఏర్పడటం అంత యాదృచ్చికమే అంత మాయే ఇదంతా కాలం మహిమే.
++
నా మట్టుకు మతి మరుపుని అధిగమించానని నాకనిపించట్లేదు అందుకేనేమో చదివిన ఏ పుస్తకమైనా చుసిన ఏ దృశ్యమైన యిట్టె మాయమవుతోంది. అదే పుస్తకం అదే దృశ్యం మళ్ళీ చదివిన మళ్ళీ చూసిన మొదటిసారి కలిగిన అనుభూతుల గిలిగింతలే మళ్ళీ మళ్ళీ కలగడం నా మట్టుకు నాకో వరమే.. అందుకే కాబోలు ఎన్ని చోట్లకైనా ఎన్ని సార్లు వెళ్లిన మనసుకు ఎప్పుడు కొత్తే. ప్రదేశాలు, పుస్తకాలే కాదు మనసులతో కూడా ఇలాంటి అనుభూతే కలిసిన ప్రతి సారి తెలియని కొత్త ఉత్తేజం కొంగొత్త అలజడి..
అందుకే నేనంటాను పనిగట్టుకొని గుర్తపెట్టుకొని బట్టిపట్టుకొని ఏవో సాధించడం కన్నా ఏది రాని నాలాంటి అజ్ఞానికి సైతం ఈ లోకం చోటిచ్చి మనసును ఆనందపరుస్తోంది. మనసును అనుక్షణం ఆనందంగ ఉంచుకోడానికి మించిన ఇంకో స్వర్గం ఉంటుందని నేనకొను కాబట్టి నా వరకు నా మతి మరుపు మంచిదే.
మరక మంచిదే టైపు..
చీకటి.
చీకటి. వైషమ్యాల ఆవరణల్ని అమాంతం కప్పేసి కావలి కాస్తున్నట్టు.
ఎవరో అమావాస్య పేరుతో తనని దొంగలించినట్టు కానరాని చంద్రబింబం కల్పించిన స్వాతంత్రంతో పుంజుకున్న దీని అస్తిత్వం మరింత బలంగా కానొస్తోంది.
సుమారు రెండున్నర కావస్తోంది. అప్పటికే ఒకదాని మీద ఒకటి థర్మల్ సాక్సులు, ఉల్లెన్ సాక్సులు, మరో జత సాక్సులు దాని మీద ట్రెక్కింగ్ షూ, అప్పటికి కాని పాదాల్లో వణుకు తగ్గి కదలిక రాలేదు. కాళ్ళదే ఈ పరిస్థితి ఉంటె మిగతా శరీరం ఇంకేన్నింటిని కప్పేసుకుందో..
కెమెరాని లిల్లీపుట్ ట్రైపాడ్ కి చక్కగా బిగించి బల్బ్ మోడ్ లో పెట్టి స్లో షట్టర్ క్లిక్ నొక్కి కదులుతున్న సెకండ్ల లెక్క చూపిస్తున్న కెమెరా మోనిటర్ ని చూస్తున్నాను.
నక్షత్రాల కదలికల్ని, పాలపుంతని స్పష్టంగా బంధించాలంటే షట్టర్ స్పీడ్ తో పాటు నిద్ర లేని రాత్రిని, చీకటిని, కొంకర్లు తిప్పే చలిని యాదృచ్చికంగా ప్రేమించే గుణం కావాలి.. అవును ప్రేమించే గుణం ప్రేమించడం ఎంతైనా మామూలు విషయం కాదు. సర్దుబాట్లతో కూడిన ఇషాల్ని, కష్టాల్ని, కోరికల్ని, ఆనందాల్ని, సమీకరించినా చక్కని కూడలి. ఆ కూడల్లో ఓపిక, సహనం, క్షమగుణం, నిజాయితి మరియు వీటన్నింటికి మించి నమ్మకం ఉండాలి.
నమ్మకం ముందు మన మీద మనకి, తర్వాత ఎదురుగా కనిపించే ప్రపంచం మీద, మనుషులమీద, పరిసరాలమీద, పరిస్థితులమీద, సందర్భాల మీద…
ఇక మోసమా.. ఏది మోసం? మోసాన్ని సైతం అధిగమించగలగడం తపస్సే.. కాని మోస తీవ్రత మనం ఏర్పరుచుకున్న వ్యామోహల మీద ఆధారపడి ఉంటుంది. అందుకే మితి మీరిన ఇష్టాలు, బాంధవ్యాలు, ఆధారపడటాలు ఇవన్నీ కూడాను స్థాయిని బట్టి మోస తీవ్రతను, దుఖ్ఖ సాంద్రతని పెంచుతాయి. వీటన్నిటిని ఎరుకతో బాలన్స్ చేసుకోవడాన్నే బహుశా ఆత్మపరిజ్ఞానం అంటారేమో.
“రఘు సాప్ ధూద్ లిజియే..” అంటూ స్టాంజిన్ వేడి వేడిగా పాల కప్పు చేతికందించాడు. ఈ చోటుకు రావడం మూడోవసారి. మొదటి రెండు సార్లకన్నా ఈ సారి రావడానికి తేడా ఒక్కటే అది ఒంటరిగా నేనొక్కడినే రావడం. ముందు రెండు సార్లు రావడంతో ఇక అపరిచితానికి, భయానికి న్యూనతకి తావులేకపోవడం నాకో మంచి విషయం. అందుకేనేమో నడిచిన దారుల్నే మళ్ళి మళ్ళీ దర్శించుకుంటాను.
“స్టాంజిన్” ఇక్కడ విరివిగా వినపడే పేరు నన్ను మోసుకొచ్చిన డ్రైవర్ మరియు నాకు ఆశ్రయం ఇచ్చిన ఇంటి యజమాని పేరు కూడా స్టాంజిన్. తనకి ఉదయం అడిగినప్పుడే టీ, కాఫీ తాగను అని చెప్పా దానితో నేను చెప్పక ముందే నన్ను అడక్కుండానే పాలు కలుపుకొని తీసుకొస్తున్నాడు.
నాలాగా ఒక చోట ఎక్కువ రోజులు గడపాలనుకునే వారంతా కూడాను లాడ్జిలకి, హోటల్స్ కాకుండా హోమ్ స్టే లను ఆశ్రయిస్తారు. హోమ్ స్టే అనగా స్థానికంగా స్థిరపడిన గ్రామీణుల ఇళ్లు, పూరి గుడిసెలు, పాకలు, డేరాలు వివిధమైన స్థావరాలు. ఒక్కో చోటు ఒక్కో రుసుము రెండు వందల నుండి ఐదు వందలు విడిదికి. భోజనానికి రోజు మొత్తం కలిపి రెండు వందలు. చవకగా దొరికడం ఒక కారణమైతే, స్థానిక ప్రజలకి, వారి మనసులకి, జీవితాలకి, ఆహారపు అలవాట్లకి, సంప్రదయాలకి, నమ్మకాలకి, చరిత్రకి, కథలకి, దగ్గరవ్వడం ఒక గొప్ప అనుభూతిగా భావిస్తాను.. అలా అనుభూతి చెందాలని వచ్చినట్టనిపించింది తను కూడా. నిన్న ఈ చోటుకు చేరుకొని కార్లోనుండి దిగుతున్నప్పుడు పెద్ద బండరాళ్ళ మీద కూచోని డైరీలో రాసుకుంటున్న సురభి పఠాన్ ని కలిసినపుడు తనకి తాను బ్లాగర్ని మరియు ట్రవెలర్ అని క్లుప్తంగా తన పరిచయం చేసుకున్నప్పుడు.
స్టాంజిన్ నా పక్కనే గొంగళి కప్పుకొని లడాకి బాషలో ఏదో రాగం ఆలపిస్తున్నాడు. అది లీలగా నిశ్శబ్దంగా పారుతున్న ప్యాంగాంగ్ నది తీరాన నీటి తాకిడికి గులకరాళ్లలో కలిగే సవ్వళ్ళకు రేగిన శృతులు జత కలిసాయి.
మెరక్ గ్రామం మొత్తం కలిపితే కూడా వంద ఇల్లులు ఉండవేమో.. మంచు బాగా కురిసినపుడు కొన్ని నెలల వరకు కూడా రాకపోకలు ఉండవు. పూర్తిగా మంచుతో కప్పబడి వంద కిలోమీటర్ల ఈ ఉప్పు నీటి నది కూడా గడ్డకడుతుంది. నలబై కిలోమీటర్లు భారతంలో మిగిలిన అరవై కిలోమీటర్లు చైనాలో. చైనా అంటే గుర్తొచ్చింది. నేనున్న చోటుకి రెండు కిలోమీటర్లో చైనా బార్డర్. నా మూర్కత్వం కాకపోతే ఈ లెక్కలు, మనుషులు ఏర్పరుచుకున్న హద్దులు ప్రకృతికి తెలియవుగా..
ప్రకృతితో మమేకమవుదామన్న నాలాంటి వారికెవ్వరికి కూడా పరిధులతో, పరిమిథులతో సంబంధం లేకుండా బతకడానికి ఇష్టపడుతుంటారని నా నమ్మకం. ఆ నమ్మకం నేను చేసే ప్రయాణాల్లో చాల మనుసుల నుండి గ్రహించగలిగాను.
ఇరవై ఐదు నిమిషాల తర్వాత షట్టర్ రిలీజ్ చేసాను కెమెరా చేతులోకి తీసుకొని జేబులో కెమెరా సంబంధించిన మక్మల్ గుడ్డతో మంచు తడిని తుడిచి ఆత్రుతగా ఫోటో ఎలా వచ్చిందని చూసాను.
స్టార్ ట్రేయిల్ నక్షత్రాల గమనాన్ని గీతల రూపంలో బంధించడం ఈ బల్బ్ మోడ్ ప్రత్యేకత ఫోటో మాత్రం నేను ఊహించుకున్న దానికి కొంచెం భిన్నంగా వచ్చింది. అసంతృప్తి గాని సంతృప్తి గాని ఏ అనుభూతి లేదు. చెప్పా కదా మితి మీరిన కోరిక, నమ్మకం ఎప్పుడు ఇబ్బంది కలిగించేవే.
నా దృష్టిలో ఇబ్బంది గురిచేసే అంశాలనుండి మనసుని స్థిమిత పరుచుకునే దిశగా నన్ను నేను మలుచుకుంటున్నా..
“చలేంగే సాప్ బహుత్ దెర్ హోగయా..”
నిజమే మూడు దాటింది. ఈ సమయంలో వాతరవరణం మైనస్ డిగ్రీలోకి చేరుకొని నది పై పొర గడ్డ కట్టే సమయం. ఒక్కోసారి ఆక్సిజన్ దొరక్కపోవడం కూడా జరుగుతుంది. ఆల్టిట్యూడ్ తారతమ్య వాతావరణానికి అలవాటుపడనంత వరకు ఆరోగ్యరిత్యా చాల జాగ్రత్తలు తీసుకోవాలి.
వెంటనే గదికి చేరుకున్నాను. అప్పటికే సురభి పడుకుంది. తన పక్కన మంచంలో ఫ్రాన్స్ నుండి వచ్చిన విరిటో. ఇక నా మంచం కిటికీ దగ్గర ఉంటుంది. ఒక విధంగా వెడల్పాటి గదిలో మూడు మంచాలు గది మధ్యలో వేడి కుంపటి. నిండా కప్పుకొని ఉన్న నేను మంచం మీద మరింత నిండుగా రెండేసి గొంగళ్ళు కప్పుకున్నాను లాంతరుల తలపించే చిన్న సోలార్ లైట్‌ని స్విచ్ ఆఫ్ చేస్తూ..
స్టాంజిన్ కుంపటిలో బొగ్గుల్ని ఎగతోపుతుండడంతో మంటని రాజుకొని బొగ్గులు తమ శక్తి మేరా చీకట్లో దాక్కున్న చలిని చీల్చి చెండాడేందుకు ఎర్రని వేడి యుద్ధం ప్రకటించింది. ఆ యుద్ధం దాడికి చలి ఎప్పుడు పారిపోయిందో.. నా స్పృహని ఎప్పుడు నిద్రలోకి ఓంపుకున్నానో గుర్తులేదు..
**
Raghu Mandaati
#TravelMusings
#Amigoroadtrip
స్వేచ్చ – సౌకర్యం
డబుల్ బెడ్ ఫ్లాట్ లో పని గట్టు కొని దగ్గరుండి ఇంటీరియర్ అంతా ఆమెకు నచ్చినట్టు చూసుకుంటోంది. ఇంట్లో ప్రతి చోటు ఆచి తూచి మరి కలర్ కాంబినేషన్, అటాచ్డ్ బాత్రూం టాయిలెట్ ఐటమ్స్ అన్ని లగ్జరీగా మరియు మోడరన్వి ఉండేలా డిజైనర్‌తో వెంటపడి శాంపిల్ పిక్చర్స్ గంటల తరబడి చూసి ఆర్డర్ చేసింది. తనకంటూ అన్ని సమకూర్చుకోవాలనే ధోరణి కాలమే పనిగట్టుకొని నేర్పింది.
ఏడెనిమిది తరగతి నుండే ఎంత నిద్రొచ్చిన ఆమెను అవ్వ పొద్దున్నే లేపేది. లేవడం ఎంత చిరాకు విషయమో అప్పట్లో అర్ధం కాకపోయినా పదో తరగతికి వచ్చే సరికి పూర్తిగా అర్ధమైంది. ఎంత నిద్ర ఉన్న నాలుగున్నరకే లేచి గోళంలోంచి నీళ్ళని సర్వ నిండా ముంచుకొని ఓణి నెత్తి మీదేసుకొని ఇంటి ముందున్న లచ్చమ్మొల్లా ఎకరం శెలకలో వేసిన పత్తి పంట అంచు గట్టు మీదనుండి నలబై అయిదు రూపాయల పారగన్ స్లిప్పర్లతో రాగడి మట్టిని వెనక్కి నెట్టుతు నెట్టుతు శెలకలు పొలాలు ధాటి గుబురుగా పెరిగిన తుమ్మ ముళ్ళ పొదల్లని చేరుకొని ఎవరైనా చూస్తున్నారా అనే గాబరాతో భయం భయంగా కృత్యం తీర్చుకోవడం తనకి తనతో పాటు పల్లె ఆడవాల్లందరికీ నిత్యకృత్యం.
అలవి
సాధారణంగానే ఏ అంచనాలు లేకుండా ఏ బంధం మొదలవ్వదేమో. కాలానికెప్పుడు నన్ను తర్కించే పనే.. ఎందుకో మరి ఎవ్వరికి అర్ధంకకపోవడం అనే ముద్ర మంచిదే అయ్యింది.. అందుకే ఇప్పటికి నేనందరికీ దూరం.మనుషుల మధ్య ఒంటరిగా నడుస్తూ గడపడం నాకో అలవాటైన వ్యసనం. ఏంటో నాకు సంబంధం లేని మనుషులని వారి సహజమైన భావాల్ని దగ్గరినుండి చూసే అవకాశం ఉంటుందనే రద్దీగా ఉన్న చోటులో గడుపుతుంటాను. ఇక అలా గడపొచ్చు అనే ఉద్దేశంతోనే సంతకు చేరుకున్నా. సంతలో చుట్టూ జనాలతో ఇరుపక్కల చిన్న చిన్న షాపులతో కిక్కిరిసిపోయింది. జనాల మధ్య ప్రతి పది పదిహేను సెకన్లకి తళుక్కుమని మాయమవుతోంది తను. ఇక తనని చూసాక మొట్టమొదట మనసులో కలిగిన బావం తనని తనివితీరా చూడాలని. ఏంటో కళ్ళతో పాటే అడుగులు అందరిని తోసుకుంటూ తనని చేరుకున్నాయి. నా అడుగుల్లో వేగం తగ్గింది. ఇక తనకి నేను ఏ మాత్రం దూరం లో లేను. రెండే రెండు అడుగుల దూరం నుండి తన వెంట నడుస్తున్నాను. సాధారణంగ ఏ అమ్మాయిని కూడా ఇంత తపనతో వెంట పడింది లేదు.
బందు
రాజకీయలేందో, తెలంగానేందో, ఆంధ్రదేశామేందో నాకు తెలవదు కూలినాలి చేసు కుంటొన్ని నాకేం ఎర్క నాయన.
ఎవడెడ సత్తేంది, కొంపకు 200 రూపాలతో ఎల్తే గాని కూడు దొరకదు.
దిక్కుమాలిన బందోటొచ్చింది.
రెండు దినాల సంధి అడ్డ మీద మేస్త్రి కాడ్నే కూసున్నం.
ఈరిగాన్ని 500 ఇయ్యిర అని అడుగుతే
లెవ్వు పెద్నయన 200 ఉన్నాయి అని సేతిల బెట్టిండు.
సాయంత్రం అయితే బంధు లేదు గిన్దులేదు అని మోటార్ బండి మీది గిరి గిరి వాసులు కొచ్చేవోడికి
రెండు దినలసంది చిట్టి గట్టలే 100 ఆడే తన్నుక పోతాడు.
పెళ్ళాం ఏమంటుందో ఏమో,
పొద్దున్నే నర్సాక్కోల్లింట్ల కెళ్ళి పావు సేరు పప్పు పట్టుకొచ్చింది.
ఇయ్యాల గడిచింది.
బందని లింగడు గూడ కూరగాయల డబ్బా మూసిండు,
లచ్మి దగ్గరికి పోతే ఇదే సందునకొని దాని ఇష్టమున్నంత సేప్తది రెట్లు.
ఐన ఏంచేద్దాం పెళ్ళాం ఊరుకోదు, కడుపు కాలక మానదు.
ఉన్న వంద కూడా గీయల్నే ఐపోయే.
గీ బంధు రేపు కూడా గిట్లనే ఉంటె ఇగ పొద్దుగడిసినట్టే..
బంధం – బంధనమైతే..?!
నా మిత్రుడు ఒక అమ్మాయిని మూడేళ్ళ నుండి ప్రేమించి క్రితేడాది పెద్దలు లేకుండా పెళ్లి చేసుకున్నారు.
అందరికి తెలిసేలాగే కాపురం పెట్టుకున్నారు.
పర్వాలేదు నాలుగు చేతుల సంపాదన చెప్పుకోవడానికి వారికి సమయమోకటే తక్కువ కాని ఆర్ధికంగా ఎలాంటి ఆపదలు వచ్చే అవకాశం లేదనే చెప్పుకోవాలి. ఏమైనా అయితే ఇరువైపులనుండి ఆదుకోవడానికి పెద్ద మొత్తం లోనే ఆస్తిపరులైన ఇరువురి తల్లిదండ్రులు.
ఇక్కడి వరకు ఇక బాగానే ఉందనుకుంటుండగానే….
ఎప్పుడో గాని గుర్తుకురాని నన్ను ఉన్నపళాన రమ్మని ఫోన్ చేయడంతో ఇక వెళ్లక తప్పలేదు.
చినుకు చినుకు కలిసి గాలి వానయినట్టు. ప్రతి అనవసరమైన విషయాలన్నీ వారి అవసరమైనట్టు గులకరాళ్ళు వారికి కొండరాళ్ళ కనిపిస్తున్నట్టున్నాయి. అందుకే ఎక్కడలేని తూఫనంత వారివురి నడుమే.
ఇక ఇదే సందన్నట్టు “పోనీ లేరా ఇది కాకపోతే ఇంకొకతి దీనికన్నా మంచి పిల్లనే తీసుకొచ్చి పెళ్ళిచేస్తా వోదిలేయరా!” అని ఆడి అమ్మ ఆజ్యం పోసింది. ఇక వాళ్ళ అమ్మ ఏమైనా తక్కువ తిన్నదా “అబ్బో ఇగ నువ్వు చేస్తావు నేను చూడాలి. పోనిలేవ్వే నీకోసం పిలగాడు ఇప్పటికి రెడీ గ ఉన్నాడు నిన్ను చేసుకోవడానికి పదవే పదా…..” అంటూ వాళ్ళమ్మ పొగలో కిరసనయిలేసి సెగ పెట్టింది.
ఇక నువ్వెంత అంటే నువ్వెంత అనే కాడికొచ్చి రేపోమాపో బంధం పుటుక్కుమనేలా ఉంది.
చదివిస్తే ఉన్నమతి చెడినట్టు అనే మా అమ్మ నోట విరివిగా వినపడే సామెత గుర్తొచ్చింది. నిజమే చదువుతో మేధావి తనంతో పాటు బంధాలను భలపరుచుకోవాలనే విషయం ఎందుకు నేర్చుకోరో… అసలు నేర్పిస్తే కదా…..
ఏంటో బంధాలు ఇంత భలహీనమైనవా?
నాలుగు ముచ్చట్లు, రెండు షికార్లు, ఒక సినిమా, సందు దోరికేతే పార్టీలు, స్ట్రెస్ కి ఫీలయితే కాస్త ఉపశమనానికి, విషయానికి ఓ తోడు.
ఇంకాస్త దూరంగా ఆలోచిస్తే ప్రేమ ఆ తర్వత వీలైతే పెళ్లి లేకుంటే సహజీవనం. ఏదైతేనేమి అన్ని ఇన్ స్టంట్ వ్యవహారాలు ఇన్ స్టంట్ జీవితాలు. చదువు వల్ల ఉద్యగం వల్ల కాస్త ఇండి విజ్యువాలిటి పెరగడమే దీనంతటికి కారణమా? నా బతుకు నేను బతక గలను నా పరిధిలోకి నువ్వు నీ పరిధిలోకి నేను రాకుండా, నీ స్వతంత్రం నీది నా స్వతంత్రం నాది, అయిన నువ్వంటే ఇష్టం, సర్వస్వం, మనమెప్పుడు ఇలానే కలిసుందాం. సమస్య వొస్తే పరిష్కారించుకుందం.
కాని……… నా గమ్యాలు అవి, నా లక్ష్యాలు ఇవి. వీటికి నీకు అభ్యంతరం లేనంతవరకు మనం ఇలా కొనసాగుధం….
ఏంటో నవ్వొస్తుంది. పదాలకి అర్ధాలు మారుతుంటే..
ఎక్కడికేల్తున్నాయో మానవ సంబంధాలు, స్వచ్చమైన అనుబంధాలు, ఆప్యాయత అనురాగాలు, పాపం ఈ పదాలన్నీ చదువుకోవడానికి, వినడానికి, కథల్లో, కవితల్లో ఉపోయోగించుకోవడానికే మిగిలిపోయేలా ఉన్నాయి.
తప్పెవరిది అని అడిగితే ఓ….. పెద్ద పెద్ద మైకులేసుకొని తెగ లెక్చర్లు ఇవ్వడానికి లగేత్తుకొని వస్తారు.
హు.. మూలలే సరిగా లేనపుడు ఇప్పుడేదో వెలగబెడదాం అనుకోవడం కూడా బ్రమే.
ఏమి రఘు ఏమ్ మాట్లడట్లేదేంటి నీ ఫ్రెండు కదా అని గుర్రుమంటూ చూస్తూ వెటకారంగా గయ్యిమన్నంత లెవిల్లో మా వాడి అమ్మ అరిచేసరికి తేరుకున్నాను (సాధారణంగా ఆవిడని పెద్దమ్మ పెద్దమ్మ అని పిలుస్తుంట. వాడి తరువాత నను కొడుకుల చూసుకునేది. ఆమె అంత కోపిష్టెం కాదు గాని ఇక వీడు పెళ్లి చేసుకున్నప్పటి నుండి వీడితో పాటు నన్ను కూడా పురుగుల చూస్తున్నది. అందుకే అటువైపు వెళ్ళడమే తగ్గిపోయింది.) ఇక అరిచిన అరుపుకి విషయం నా వైపుకు మళ్ళింది అక్కడికి నేనేదో పొడిచేస్తాను అన్నట్టు.
బెదురు బెదురుగా పనమ్మాయి గ్లాసులో నీళ్ళు తెచ్చిస్తే తాగేస్తూ, నేను కిక్కురుమనలేదు. అనడానికి కూడా నా దగ్గర ఏమి లేదు కాబట్టి. ఏదో అలోచిస్తున్నోడిలా మొహం పెట్టి కూచున్న. కాసేపటి గొడవ తర్వత ఇక ఇది తెగేలా లేదని వాడ్ని బయటికి తీసుకొచ్చి కార్లో బయల్దేరాం..
విషయమంత పూర్తిగా విన్న..
ఇరువైపులా నుండి ఆలో చించాక అర్ధమైన విషయం ఏవిటంటే..
-వారు విడిపోవడానికి కారణం కలిసుండాలనే ప్రేమ లేక పోవడమే.
-అనుక్షణం పని ఒత్తిడి.
-ఎప్పుడు గమ్యాలపై ఆధారపడి, ఆలోచనలు లక్ష్యాలను గురిచేస్తు, కాలం ఇరువురి మధ్యన ఒక ప్రేమ బంధం ఉందనే విషయాన్నే అనిచివేసింది.
ఇక నేను తనను జాబు మాన్పించు. లేదా నువ్వు జాబు మానేయ్ అని సలహా ఇచ్చాను.
నా సలహాకి వెర్రిగా నవ్వుతు.
నేను జాబ్ మానేసి తన మీద ఆధారపడాల తనని జాబ్ మానేయ్ మనే ధైర్యం లేదు. తన జాబ్ విషయంలో జోక్యం చేసుకోవద్దని పెళ్ళికి ముందే కట్టుబడి ఉన్నాం అని.
మరి ఎం చేద్దాం అనుకుంటున్నావ్ రా…
ఎం లేదురా బ్రేక్ అప్ అంతే.
మరి ప్రేమ?
తనకే లేనపుడు ఇక నా ప్రేమతో పనేముంది.
తనేమంటుంది?
తను కూడా ఫిక్స్ అయ్యింది. స్టేట్స్ కి వెళ్ళాలని. నేను వద్దన్నాను. అది తనకు నచ్చలేదు. నేను కోరుకున్న కెరీర్ ఇది కాదని వాదిస్తుంది. పైగా ఆరేడు నెలలు కాదు ఏకంగా రెండు సంవత్సరాలు.
పోనీ నువ్ కూడా వెళ్ళు.
వెళ్ళడం నాకిష్టం లేదు రా..
ఇక నాదగ్గర మాటల్లేవు ప్రశ్నల్లేవు. కాసేపటి తరువాత కారు భయటికి దిగి వాడిని వెళ్ళమని మెల్లిగా నడుస్తూ ఆలోచనలు మళ్లీ మొదలయ్యాయి.
మనుషుల్ని సాశిస్తున్నది సమాజమా? జీవనశైలియ? ఆలోచన విధానాల? అభిప్రాయాల? ఎంచుకున్న లక్ష్యాల? చదివిన చదువా? కుటుంబమా? తల్లి దండ్రులా? ఏంటో…
ఒక దానితో ఒకటి ముడి పడి గందరగోళంలో ఇరుక్కొని కొట్టు మిట్టడడమే “ఒత్తిడా!!”
ఆ ఒత్తిడి కి కాస్త ఊరడింపే ఈ పరిచయాల? ఏమో… అవునో… కాదో…
ఎన్ని అనుకున్న ప్రతి దేహానికి ఓక కెమిస్ట్రీ ఉంది. రసాయనిక చర్య ఉందని ఏదేదో చెప్తారు. కాని మనసుందని అది మానసికంగా ఒకరి తోడు కోరుతుందని ఎవరికీ వారికి తెలిసిన. తెలిసే పరిచయాలు మొదలవుతాయి అది ఆకర్షణ అని అనుకునే తావు కూడా మనసుకు రాదూ.
అర్ధంలేని ఒత్తిడికి ఆ పరిచయాలు ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉక్కిరిబిక్కిరి చేయడంతో ఆ బంధం అప్పటికి అల ముడి పడుతుంది.
కాని… జీవితాంతం కలిసుండడానికి చివరికి ఎన్నో విషయాలు పరిగనలోకోస్తాయని, ఒకరంటే ఒకరికి ప్రేమలో మమేకమై, ఒకరికోసం ఒకరుగా, ఇరువురు ఒకటిగా అనే తత్వం కలగక పోవడానికి కారణమేంటి???
ఏమో ఇవన్ని ఆలోచిస్తుంటే అమ్మ చెప్పింది నిజమే అనిపిస్తుంది. ఉమ్మడి కుటుంబం లో కలిసుంటే అమ్మలక్కలు అదని ఇదని గొడవలోచ్చినా.. ఒకరికొకరు కలిసే ఉండి ఆలోచించుకొని సర్దుకు పోయే గుణం అలవడుతుంది.
అందరి ఆప్యాయతల నడుమ ఏదో ఒక క్షణంలో ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ మొదలవుతుంది.
పెళ్ళికి వయసులో తేడా ఉండాలి. పెళ్లి అయి నీ జీవితంలోకి అడుగుపెట్టిన తనని మచ్చిక చేసుకొని మనసు పెట్టి చూసుకునే గుణం నీకు రావాలి, నువ్వంటే గౌరవం తనకు రావాలి.
ఒకరిమీద ఒకరికి కచ్చితమైన, నమ్మకమైన ప్రేమ ఉంటె ఎన్ని గొడవలోచ్చిన ఎవరు విడదీయలేరు రా…
కట్టుబాటు తాడిమట్టలు అని పెద్దలు చెప్పిన ముచ్చట పెడ చెవిన పెడితే ఇగ ఇడాకులు ఇస్తారకులు అని అవ్వ అయ్యల ఇజ్జత్ తీస్తారు. మల్లోచ్చేది, వచ్చే టోడూ కూడా పెళ్ళాన్ని వోదిలేసినోడో మొగుణ్ణి వొదిలేసినదో గతి.
నిజమే… ప్రేమ పుట్టాలన్న బంధం కొనసాగాలన్న ఇరువురికి కావాల్సింది కచ్చితమైన నమ్మకం.
తను ప్రేమించిన వాడే సర్వస్వం అని ఆవిడా,
ఆవిడే నా లోకం ఆవిడే లేక పోతే నేను ఏమి కాను.
అనే అంతర్లీన ఆత్మీయ అనుభూతి కలగనంత వరకు ఏ సంబంధమైన – అది పెళ్ళి పేరుతో ముడి పడిన – ప్రేమ మత్తులో అల్లుకున్న అన్ని నీటిలో బుడగల లాంటివే.
ఒకరంటే ఒకరికి ఆత్మీయ భావన కలిగినపుడు, వయసుతో గాని, ప్రపంచంతో గాని, విషయాలతో గాని సంబంధం లేదు.
అలంటి అనుబంధానికి పెళ్లి అనే కట్టుబాటు తంతు కూడా అవసరం లేదనే నా అభిప్రాయం.
ఇక ఆత్మలు ఒకటయ్యాక విడిపోయే అవకాశమెక్కడుంటుంది. అనుక్షణం ఒకరికోసం ఒకరిగా తపిస్తుండగానే కాలం అల గడిచిపోతుంది.
బహుశా అలంటి ఆత్మీయ బంధాలు ఏర్పడాలంటే ఇద్దరు కలిసుండి ఒకరినొకరు అర్ధంచేసుకోవడానికి పెళ్లి అనే ముడితో కట్టేసి అవగాహన వచ్చేవరకు ఉమ్మడి కుటుంబాలనే వ్యవ్యహారం పనికొస్తుందని మా అమ్మ తత్వం. కావచ్చు..
నా మట్టుకైతే ప్రేమ అనే భావన నిజంగా మొదలైతే అది ఎన్నటికి ఆరిపోదు ఆరిపోతున్నదంటే వెలిగించాలని ఎంత ప్రయతించిన అది ఎవరో ఒకరి భావనని భలవంతంగా లొంగ దీసుకోవడమే అవుతుంది.
ప్రేమతో పెనవేసుకున్న బంధం గట్టిధయితే ఆ ప్రేమ బంధం ఎక్కడ యే పరిస్థితిలో, యే జీవనవిధానంలో ఉన్న ఉన్నంతలో త్రుప్తి పొందుతూ ఆనందంగా గడిపే ప్రయత్నం జరుగుతుంటుందని నా అభిప్రాయం.
ఏంటో ఆలోచనలన్నీ అర్ధం పర్ధం లేకుండా పారిపోతుంటే జేబులో మోగుతున్న సెల్లు రింగ్ టోన్ తో ఉన్నపలనా ఆగిపోయాయి. ఫోన్ తీసి చూస్తే తాక్షి….
ఎక్కడున్నావ్? ఇంతకి ఏమైనా తిన్నావా? ఎం చేస్తున్నావ్? బయట తిరగకు ఎండలు మండిపోతున్నాయి.. తొందరగా ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకో. ఇంకెన్ని రోజులు మహా అంటే వారంలో ఎగ్జామ్స్ అయిపోతాయి…………. అవతలి వైపునుండి తన మాటలు సాగుతూనే సూర్యాస్తమయం అవుతుండగా ఇంటిముఖం పట్టా…
Monday, April 9, 2012