Home > జ్ఞాపకాల గొలుసు > పుట్నాలమ్మ

పుట్నాలమ్మ

ఈ రోజెందుకో 1 నెంబర్ మెట్రో బస్సు చాల సేపు రెతిఫైల్ స్టేషన్ లోనే గడిపింది.

కిటికీని నెమ్మదిగా తీసి బాగ్ ని ఒల్లో పెట్టుకొని కూర్చున్న.

“పల్లి బటాణి, పల్లి బటాణి” అనుకుంటూ ఓ ముసలావిడ. దాదాపు 80 కి పైన ఉంటుంది. ఇప్పటికి ఆ వయసులో పని చేసుకు బ్రతకాలనే తపన మెరుస్తున్న తన కళ్ళల్లో కనబడింది. 50 దాటితే చాలు మమ్మల్ని మా ఆలోచనల్ని ఎవరు కానట్లేధయ్య అంటూ వారి గోడు వెళ్ళబోసుకుంటూ కాలం గడుపుతున్న మా వీధి పెద్దలకు మరియు నాకు ఈ ముసలావిడ మంచి ఆదర్శం అనిపించింది.

 

ఎంతమ్మ..

రెండు రూపాయలకు చిన్న సీసడు (టానిక్ మూత), మూడు రూపాయలకు పెద్ద సీసడు (పిల్లలు ఆడుకునే చిన్న టీ కప్) బిడ్డ.

చెప్పు ఏ సీసడు కావలి.

చిన్న సీసడు బటానీలు ఇవ్వమ్మా అంటూ పది రూపయలిచ్చాను.

అయ్యో బోని నీదే బిడ్డ, చిల్లెర ఉంటె సూడు.

పర్లేధమ్మ ఉండనివ్వు.

అయ్యో వద్దు బిడ్డ నీ సొమ్ము నాకెందుకు.

ఇంకా మూడు సీసాలు ఇవ్వనా..

సరే ఇవ్వు.

పేపర్లో పోసి పొట్లం గట్టి చేతిలో బెట్టి, చిన్నగా ఊగుతూ, నెమ్మదిగా బొడ్డు సంచిలో పది రూపాయలను బెట్టుకొని, ఆకుపచ్చ రంగు చీర చెంగును సరిచేసుకుంటూ, పయిలం బిడ్డ అనుకుంటూ వెళ్ళింది.

కాసేపటికి ముందుకు కదిలిన బస్సుకి విరుద్ధంగా నా ఆలోచనలు వెనక్కి కదిలాయి.

**

తన పేరు నాకు ఇప్పటికి తెలియదు. కానీ మేము(పిల్లలమంతా) ఓ పుట్నాలమ్మ ఇటు రా మా అమ్మ పిలుస్తుంది. అంటూ పిలిచుకోచ్చేవాన్ని. రోజు కాకపోయినా వారానికోసారైన మా పుట్నలమ్మ మా గల్లికి వస్తుండేది. నాకు బాగా గుర్తు అప్పటికే తన వయసు అరవై ధాటి ఉంటుంది. ఎవరో తాను తెలియదు కాని తనకి మా ఇంటికి మంచి అనుబంధం. మా అమ్మంటే తనకి చాల ఇష్టం. ఎండన బడి వస్తున్న తనని నేను పిలువగానే ఎట్లున్నావ్ సరోజనవ్వ అనుకుంటూ ఇంట్లోకోచ్చేది. మా అమ్మ చేతి సహాయంతో బుట్ట కిందబెట్టేది. నన్ను పెద్ద చెంబులో నీళ్ళు తేమ్మనగానే. గబుక్కున వెళ్లి బింధలో ముంచి తీసుకొచ్చి ఇచ్చేవాన్ని.

 

“అవ్వో నా బిడ్డే సల్లంగుండు నాయన” అంటూ చెంబును చేతికి తీసుకొని. గడ గడ తాగేది.

“బడి లేదా నాయన”. “ఉంది ఒక్క పుటే. పోయ్యోచ్చిన”.

 

నా చూపు మాత్రం మా అమ్మ, పుట్నలమ్మ ముచ్చట్లలో కాకా, పుట్నాలు బటానీల బుట్ట మీదే ఉండేది. పెద్ద బుట్టలో ఒక సంచిలో పుట్నాలు, మరో సంచిలో బటానీలు, ఇంకో సంచిలో కర్రెంటు వైరునీ కాల్చిన తర్వాత బయటపడే రాగి, ఇత్తడి తీగలు, బొమ్మలు ఉండేవి. ఒక పక్కన సద్ది టిఫును, ఒక చిన్న తరాజు, సుతిలి తాడు తో వేలాడదీసిన చిన్న అయస్కాంతం. సాధారణంగ డబ్బుకు కాకుండా, రాగి ఇత్తడి తీగలను తీసుకొని, దోసెడుతో ఇచ్చేది.

 

నేను ఒక చిన్న గిన్నలో కొంచెం బెల్లం వేసుకొని పుట్నాలు పోసుకొని. ఇంటెనక వేప చెట్టుకింద నా గోనే సంచిని పరుచుకొని. పీటను తల కింద బెట్టుకొని. నిక్కరు సదురుకోని పడుకొని నా తల పక్కన పుట్నాల గిన్న పెట్టుకొని కొంచెం బెల్లం కొన్ని పుట్నాలను నోట్లో వేసుకొని, నెమ్మదిగా చప్పరిస్తూ, ఊరించుకుంటూ తింటూ, వేప కొమ్మలను, రాలుతున్న వేప పళ్ళను, దానికి ఆవల ఉన్న నీలాకాశం చూస్తూ, ఒక మంచి రాజభోగాన్ని అనుభావిన్చేవాన్ని.

 

మా బాపు ముందు గది లోకి రెండు వేల రూపాయలు గిరి గిరి కింద అప్పు తీసుకొచ్చి బండలేపించాడు. కొద్ది రోజులకి గిరి గిరి చిట్టి తీరగానే మల్లి అప్పుతీసుకొని కరెంటు పెట్టించాడు. నెమ్మిదిగా రాత్రిళ్ళు మా పడక ఇంటెనక చెట్టుకింద నుండి పంక(ఫ్యాన్) కిందికొచ్చింది. లైట్ వెలుతురున్నా కూడా, ఆ గదిలో వెన్నెల కనిపించేది కాదు.

 

ఒక్కో సారి పుట్నాలమ్మకి మా అమ్మ భోజనం పెడుతుండేది. అప్పుడప్పుడు జ్వరంగా ఉంటె తను మా ముందు గది పంక కింద నడుం వాల్చేది.

 

మా అమ్మ వాళ్ళ అమ్మ తన చిన్నప్పుడే కాలం చెల్లిందని. మా బాపమ్మనే తన తల్లిలా బావిస్తూ సేవలు చేసేది. మా బాపుని మా బాపు వాళ్ళ చెల్లేని(నాకు అత్తయ్య). పిల్లలు లేని మా బాపమ్మ,తాతయ్య వాళ్ళ తమ్ముడి దగ్గరనుండి దత్తత తీసుకున్నారు. ఆ రకంగా నాకు మా బాపు వాళ్ళ సొంత తల్లిదండ్రులు, పెంచుకున్న తల్లి దండ్రులు, ఇద్దరు బాపమ్మలు, ఇద్దరు తాతయ్యలు అంతే కాకుండా అమ్మ వాళ్ళ నాన్న ఆ తాతయ్య.

 

మా అమ్మ చదువుకోలేదు కాబట్టి తనకి ఓల్డ్ ఏజ్ హోమ్ ల గురించి తెలియదు. కేవలం ఆప్యాయత, అనురాగం తప్ప.

అందుకేనేమో తాతయ్యలు, బాపమ్మలు, మంచన పడితే విసుక్కోకుండా సేవలు చేసేది. చిత్రం ఏమిటంటే. అందరింట్లో అత్త కోడళ్ళ గొడవల గురించి వినపడేది కానీ, మా ఇంట్లో మా అమ్మతో ఎప్పుడు కృతజ్ఞత బావంగా ఉండేవారు. నా చిన్నప్పటినుండి. ఒకరి ఒకరి తర్వాత ఒకరు కల గర్బంలో కలుస్తుండడం, అప్పు తీసుకొచ్చి మరి కర్మ కాండలు చేపిస్తూ బాపు, వచ్చిన వాళ్ళందరిని అరుసుకుంటూ మా అమ్మ (అబ్బో మా చుట్టాల లిస్టు చెప్తే తరిగేది కాదు). నేను ఎందుకో వచ్చిన వాళ్ళతో పెద్దగ కలవలేక పోయేవాణ్ణి. నాకు మా ఇంట్లో ఎప్పుడు చావు డప్పు తప్ప వేరే శబ్దాలు వినపడలేదు. అందరు తాతయల్లు బాపమ్మలు దూరమయిన పది పన్నెండెండ్లకు గాని శుబకార్యం జరగలేదు మా ఇంట్లో.

 

అందుకే అనిపిస్తుంది ఆడవారికి, ఎంతో ఓర్పు, సహనం కావాలని, అవన్నీ మా అమ్మకి పుష్కలంగా ఉన్నాయి కాబట్టే ఇన్ని సేవలు చేసిన, తగోచ్చిన మా బాపు దెబ్బల తిప్పలు తనకి తప్పలేదు అన్ని బరించేది. నాకన్నా కొంచెం పొడుగున్న మా అన్న, ఏడుస్తూ మా అక్క, ఆపడానికి ఎంత ప్రయత్నించే వారో. ప్రతి రోజు రాత్రి బాపు వస్తున్నాడంటే గుండెలో దడ మొదలయ్యేది. ముసలోళ్ళు వాళ్ళు చెప్పిన పలితం లేకుండా పోయేది. తన అరుపులు మా గల్లీలో ఉన్న నా యిడు పిలగండ్లమందరికి వణుకే.

ఎంత గొడవ చేసిన కూడా ఒక్కసారికూడా బాపు మమ్మల్ని(నన్ను, అక్కయని, అన్నయ్యని) ఏమనలేదు. అదే మహా బాగ్యం అనుకునేది మా అమ్మ. ఈ రకంగా మా అమ్మ దేవుడు మమ్మల్ని చల్లగా చూడాలని అందరికి సేవ చేసేది.

 

అప్పుడుప్పడు పుట్నాలమ్మకి మా అమ్మ పాత చీర ఇస్తే, చీరను ప్రేమగా తాకుతూ. కంట నీరు పెట్టుకునేది. నువ్వు సల్లగుండాలి అవ్వ అంటూ దండం పెడుతుంటే. ఇదంతా అమ్మ కొంగు చాటున నుండి తొంగి చూస్తుండే వాణ్ని. అప్పుడనిపించేది, మనసులకి కావాల్సింది, డబ్బు కాదు ఒక మంచి మాట, చిన్న ఆప్యాయత, ప్రేమగా ఇచ్చే కాసిన్ని మంచినీళ్ళు. ఈ రకంగా మా అమ్మ దేవుడు మమ్మల్ని చల్లగా చూడాలని అందరికి సేవ చేసేది. ఆవును పట్టుకొని  ఇంటి ముందుకొచ్చే జంగాయన నుండి మొదలు పెడితే, కూరగాయలు అమ్ముకునే పెద్దమ్మ, చీరాల భద్రయ్య, వయసు పైపడి వంక కర్ర ఉతంతో పొద్దున్నే బన్ను రొట్టె తెచ్చే ఫతిమమ్మ, మెడలు పట్టుకుంటే సరి చేసే డబ్బా కదా అంటి, పెద్దలకు బియ్యం ఇచ్చినప్పుడు, మా విధి చివర్లో ఉన్న బాపనామే, పిరికెడు బియ్యం కోసం రోజు వచ్చే ఓ ముసలి తాత వరకు అందరు మా అమ్మ సేవకు ప్రతిఫలంగా మమ్మల్ని దీవించే వాళ్ళు. మా అమ్మ మాకు తెలియకుండానే మా మనస్సులో ఎన్నో విషయాలు నింపింది. అందుకేనేమో నాలో చదువుని, మనుషుల్ని నమ్మక. కేవలం మనసుల్ని నమ్మాలనే భావన నాటుకుంది. ఆ భావనే ఇప్పటికి నను ముందుకు నడిపిస్తుంటుంది.

 

ఆ రోజు పుట్నాలమ్మ తన ప్రేమను బటానీలు, పుట్నాలతో పెద్ద గిన్న నిండా నింపి ఇచ్చింది. గిన్న నిండా ఉన్న పుట్నాలు బాటనీలను చూడగానే నా మనసు ఎంత సంతోషించిందో మాటల్లో చెప్పలేను. అందుకేనేమో మా పుట్నాలమ్మ ఇప్పటికి నా మనసులో మేదులుతుంటుంది.

 

తెల్లారి ఆదివారం. దోసెడు నిండా ఒక పేపరులో పుట్నాలు, ఇంకో పేపర్లో బటానిలు కొంచెం బెల్లం జత చేసిపొట్లం కట్టుకొని, సంచిలో పెట్టుకొని, నేను సాబిర్ కొడుకు ఆరిఫ్, పాష భాయి కొడుకు అమ్జాద్, గుండం వాడ అబ్జల్, ఇర్షాద్, ఆరిఫ్ వాళ్ళ చిన్నమ్మ కొడుకు యాకుబ్ పాషా, కాకతీయ కలని రవి గాడు, మచిలిబాజార్ హరి, రాగాపురం అనిల్. అందరం కలిసి ముళ్ళ చెట్లతో నిండిన బాధ్రకాలి చెరువు గట్టు ని ధాటి, గుడిని ధాటి విశాలంగా ఉన్న ప్రదేశంలో అందరు క్రికెట్ ఆడుతుంటే, నేను మాత్రం దూరంగా ఉన్న చెరువును ఆస్వాదిస్తూ ఒంటరిగా నా మనసుకు నేనే ప్రశ్నలు వేస్తూ సమాధానం చెప్పుకుంటుండగా, అలసి పోయి ఒక్కొక్కరిగా వచ్చి నా పక్కన చేరే వాళ్ళు . అప్పుడు పొట్లాలు బయటికి తీసి అందరికి ఒక చేతిలో పుట్నాలు ఒక చేతిలో బటానీలు కొంచం బెల్లం పెట్టి. నేను కూడా ఒక్కొక్కటి నోట్లో వేసుకుంటూ మాటలు లేకుండా ఆస్వాదిస్తూ. దూరంగా పరుచుకొని ఉన్న చెరువుని గుట్టను, చల్లని గాలిని ఆస్వాదిస్తూ గంటల కొద్ది గడిపేవాళ్ళం.

 

కొందఱు మన జీవితాల్లో చెరగని ముద్రలు వేస్తారు.

నిజమే కొన్ని అనుబంధాలు తర్కానికి అందవు కేవలం మానవత్వం అనే సన్నని తీగతో మా పుట్నాలమ్మ నా మనసుని అల్లుకుంది.

 

**

 

“నారాయణగూడ” “నారాయణగూడ” కండక్టర్ పిలుపుతో మెలకువ వచ్చి జ్ఞాపకాల తీగను తెంపి దబుక్కున కిందికి దూకి టైం చూసుకొని, అరరే టైంతో పాటే నేను కూడా యంత్రికున్నని, ఓ మరమనిషినని గుర్తు తెచ్చుకొని ఆఫీసు కి పయనమయ్యాను.

  1. No comments yet.
  1. No trackbacks yet.

Leave a comment