బ్యాంకు నుండి అప్పు తీసుకొని ఇంటి ముందట కోళ్ల ఫారం వెలిసింది. అవ్వ ఇంటిని కోళ్ళ ఫారంని చూసుకోవడం. అవసరమైనప్పుడల్లా డాక్టరుతో కోళ్ళకి టీకా మందు లిప్పించడం, దాన పట్టుకు రావడం నాయన పని. రోజు పొద్దున్న లేచి షెడ్డులోకి అడుగుపెడితే ఒకదానేంబడి ఒకటి రెక్కలనూపుతూ ముద్దుగా బొద్దుగా తెల్లగా మెరిసిపోయే కోళ్ళని చూస్తూ సంబరపడిపోయే అవ్వ నాయనలకి ఎక్కడి నుండో ఎగిరొచ్చిన బర్డ్ ఫ్లూ రోగం ధాటికి కోళ్ళన్ని శవాలుగా కుప్పలుగా పడి వీళ్ళ ఆశలని కన్నీటి ధారలుగా మిగిల్చింది.
ఇద్దరక్క చెల్లెళ్ళు రెన్నెల్లు తిరక్కుండానే పన్నెండు వేల రూపాయిలు నాయన చేతిల పెట్టి
“ఏం జేస్తావో జెయ్ నాకు మనింట్ల లెట్రిన్ కట్టించాల్సిందే.. ” అని గట్టిగానే చెప్పింది.
దానికి నాయన నవ్వుతు…
“ఇంట్ల అమ్మ కూడా కూడబెట్టిన పైసలు మూడు వేలు ఉంటాయి బిడ్డ ఈ పైసల్తో కోళ్ళ ఫారంలకి పిల్లల్ని కొనుక్కొస్తా.. “
అని సముదాయిస్తున్న తండ్రిని చూసి అప్పటి వరకు ఆపుకున్న కసి కోపం అంత కూడా గట్టుకొని గట్టిగ అరిచి
“నీకు చాతనైతే కట్టించు లేకపోతే నేనే మేస్త్రిని పిలుసుకోస్తా.. “
అన్న తిన మాటలు విని ఖంగు తిన్నాడు అలాగే చూస్తుండగా కసి కోపం కన్నీల్లుగా మారి ఏడుస్తుంటే..
బిడ్డని ఏమయిందవ్వ అని తల్లి కళ్ళు తుడుస్తూ రొమ్మున చేర్చుకుంది. జరిగిన విషయం అంత తల్లికి చెప్తుంటే విన్న నాయన మనసు ఎట్లనో అయ్యింది. తన అసమర్ధత బిడ్డ కంట్లె కన్నీల్లై పారుతుంటే ఏమనుకున్నాడో ఏమో.. పెద్ద సైకిలేసుకొని అరగంటలో మేస్త్రిని తీసుకొచ్చి పాయకన బాత్రుంకు కొలతలు తీపించి లెక్కలు కట్టి పని మొదలు పెట్టిచ్చిండు.
మేడం మేడం.. ఒక్కసారిగా మళ్ళీ ఈ లోకం లోకొచ్చింది.
పని పూర్తయ్యింది మేడం.
డోర్ తీసి చూసుకుంది. వాష్ రూం అంతా కలకలాడుతోంది. షవర్, కమోడ్, గోడల మీద యురోపియన్ స్టైల్ ఆర్ట్ వర్క్ లైట్స్ మిర్రర్ అచ్చంగా బ్రౌచర్లో చూపినట్టుగానే ఉంది..
బావుంది. మిగతా పేమెంట్ అక్కడికక్కడే టాబ్ తీసి ఫోన్ బ్యాంకింగ్ తో మాడ్యులర్ హౌస్ ఐడియా డట్ కాం కంపెనీ ఎకౌంటుకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేసింది.
సరే మేడం ఇక మేము వెళ్తాం.
వెళ్ళగానే డోర్ క్లోజ్ చేసుకొని వెనక్కి తిరిగి చూసుకుంది.
తాననుకున్నట్టు గానే ఇల్లంతా తయారయ్యింది. అన్ని గదుల్ని టెక్చర్డ్ వాల్స్ ని తనివి తీరా తడిమి చూసుకుంది.
నిద్ర లేక చాల అలిసిపోయింది. ఒళ్ళంతా కాస్త నొప్పులు.
టవల్ తీసుకొని వాష్ రూం లో కెళ్ళింది. ప్రశాంతంగా షవర్ కింద సేద తీరడం తనకి అలవాటైన వ్యసనం.
నెమ్మదిగా షవర్ ఆన్ చేసింది నీళ్ళు రావట్లేదు. టాప్ విప్పింది అందులోనూ రావట్లేదు.
వెంటనే మైంటెనెన్స్ కి కాల్ చేసి రమేష్ త్రీ జీరో టూ ఫ్లాట్.
ఆ.. చెప్పండి మాడం.
వాష్ రూం లో వాటర్ రావట్లేదు. ఏంటో చూడు.
చూసేదేమి లేదు మాడం. ఎల్లుండి టాంకర్ ఒస్తది. అరగంట సేపు ఓదులుతాం మీరు రంబు లో పట్టుకోండి. అంటూ తాపీగా అవతలి నుండి కాల్ కట్..
చేసేదేమీ లేక టపి మని ఫోన్ నెలకి విసేరేసి,
వీల్ చైర్ లో వెనక్కి తల వాల్చి తిను..
నేల మీద పడి ఊగుతున్న రిసీవర్..
ఆన్ చేసే ఉన్న షవర్,
పక్క వాటా టీవీ లో పెద్ద శబ్దంతో
“మన హైదరాబాద్ భారత దేశంలో హ్యాపీగా బతకగలిగే సిటీగ గుర్తింపు పొందడం గర్వంగా ఉంది” అని మంత్రి మాటలు.